English | Telugu

‘రాజా సాబ్’ సెన్సార్ పూర్త‌యింది.. ఫ్యాన్స్‌లో టెన్ష‌న్ మొద‌లైంది!


- ప్ర‌భాస్‌, మారుతి రిస్క్ చేస్తున్నారా?
- ఫ్యాన్స్ టెన్ష‌న్ వెనుక రీజ‌న్ ఏంటి?
- రాజాసాబ్ సంక్రాంతి విన్న‌ర్ అవుతాడా?


పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ సినిమా రిలీజ్ అయి ఏడాదిన్న‌ర కావ‌స్తోంది. ఇప్ప‌టికే చేతి నిండా సినిమాల‌తో బిజీగా ఉన్న ప్ర‌భాస్‌.. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానున్న ‘ది రాజా సాబ్’ ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని ఎంట‌ర్‌టైన్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌భాస్ చేయ‌ని ఓ కొత్త జోన‌ర్‌లో సినిమాను రూపొందించి ప్రేక్ష‌కుల‌కు ఒక కొత్త అనుభూతిని పంచేందుకు డైరెక్ట‌ర్ మారుతి రెడీ అయిపోయారు. ఈ ఏడాదిలోనే రిలీజ్ అవ్వాల్సిన రాజాసాబ్ వ‌చ్చే ఏడాది థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతోంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయ‌ని తెలుస్తోంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యుఎ స‌ర్టిఫికెట్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. అంతేకాదు, ఈ సినిమా ర‌న్‌టైమ్ కూడా రివీల్ అయిపోయింది. ఈ సినిమా నిడివి 183 నిమిషాలుగా ఉంది. అంటే 3 గంట‌ల 3 నిమిషాలు. ఈమ‌ధ్య‌కాలంలో కొన్ని సినిమాల ర‌న్‌టైమ్ ఇంతే ఉంటోంది. ప్ర‌భాస్ చేస్తున్న‌ది కొత్త జోన‌ర్ అయిన‌ప్ప‌టికీ మూడు గంట‌ల‌పాటు ప్రేక్ష‌కులు భ‌రించ‌డం క‌ష్ట‌మేన‌ని అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎంత మంచి సినిమా అయినా ర‌న్‌టైమ్ ఎక్కువ‌గా ఉంటే ప్రేక్ష‌కులు ఇబ్బంది ప‌డే అవ‌కాశం ఉంటుంది. ఇది చాలా సినిమాల విష‌యంలో రుజువైంది కూడా.

త‌మ అభిమాన హీరో సినిమా సంక్రాంతికి పండ‌గ సంద‌డి చేయ‌బోతోంద‌ని అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ర‌న్‌టైమ్ వారిని బాగా టెన్ష‌న్ పెడుతోంద‌ని తెలుస్తోంది. అయితే కంటెంట్ బ‌లంగా ఉంటే ర‌న్‌టైమ్ పెద్ద స‌మ‌స్య కాద‌నేది కొంద‌రి అభిప్రాయం. ఏది ఏమైనా ర‌న్‌టైమ్ విష‌యంలో ప్ర‌భాస్‌, మారుతి రిస్క్ చేస్తున్నార‌ని మ‌రికొంద‌రి వాద‌న‌.

రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డ‌డంతో రాజాసాబ్‌కి సంబంధించిన ప్ర‌మోష‌న్స్ కూడా ఊపందుకున్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ట్రైల‌ర్‌కు, పాట‌లకు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. తెలుగు, త‌మిళ్‌, మ‌లయాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను డిసెంబ‌ర్ 27న హైద‌రాబాద్‌లో భారీ లెవ‌ల్‌లో చేయ‌బోతున్నారు. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దికుమార్ హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, ఐవివై ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌లు భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.