English | Telugu
మహిళ ఆత్మహత్య.. 'పుష్ప-2' వాయిదా?
Updated : Dec 7, 2023
పుష్ప రెండో భాగంగా రానున్న 'పుష్ప: ది రూల్' సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆ తేదీకి విడుదలవుతుందా అనే అనుమానం కలుగుతోంది. దానికి కారణం ఓ మహిళ ఆత్మహత్య కేసులో పుష్ప నటుడు జగదీష్ అరెస్ట్ కావడం.
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడు కేశవ పాత్రలో జగదీష్ నటించాడు. బన్నీ పాత్రకి సమానంగా, నిడివి ఎక్కువగల పాత్ర కావడంతో ఒక్క సినిమాతోనే జగదీష్ కి ఎంతో పేరు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ టాలెంటెడ్ యాక్టర్.. ఓ మహిళ ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయ్యాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుష్ప నటుడు జగదీష్ కి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉండేది. అయితే జగదీష్ తనని కాదని మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో.. ఆ మహిళ అతన్ని పక్కన పెట్టింది. ఈ క్రమంలో ఆమెకి మరో యువకుడు పరిచయమయ్యాడు. ఆ యువకుడితో మహిళ సన్నిహితంగా ఉన్న సమయంలో సీక్రెట్ గా ఫొటోలు తీసిన జగదీష్.. ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. ఆ వేధింపులు తట్టుకోలేక మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు జగదీష్ ని అదుపులోకి తీసుకున్నారు.
జగదీష్ అరెస్ట్ కారణంగా 'పుష్ప-2' షూటింగ్ ఆలస్యమయ్యే అవకాశముంది. ఎందుకంటే అతను అరెస్ట్ అయింది చిన్న కేసులో కాదు. బెయిల్ రావడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టొచ్చు. అదే ఇప్పుడు పుష్ప టీంకి తలనొప్పిగా మారొచ్చు. పుష్పలో జగదీష్ ది చిన్న పాత్ర కాదు. ఎప్పుడూ హీరో వెన్నంటే ఉండే పాత్ర. కీలక సన్నివేశాలలో జగదీష్ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. మెజారిటీ సన్నివేశాల్లో అతను కనిపిస్తాడు. అలాంటిది జగదీష్ జైలులో ఉంటే షూటింగ్ కి దాదాపు బ్రేక్ పడినట్లే. ఒకవేళ కొద్దిరోజుల తర్వాత అతను బెయిల్ మీద విడుదలైనా.. అప్పటికి ఇతర ముఖ్య నటీనటుల డేట్స్ అందుబాటులో ఉంటాయా అనేది సందేహం. ఎందుకంటే ఈ మూవీలో ఎందరో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. వారు పుష్ప-2 తో పాటు పలు సినిమాలు అంగీకరించి ఉన్నారు. ఇప్పుడు జగదీష్ అరెస్ట్ కారణంగా పుష్ప-2 కోసం వారు ఇచ్చిన డేట్స్ వేస్ట్ అవుతాయి. తరువాత ఇతర సినిమాల డేట్స్ తో క్లాష్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ గందరగోళం నడుమ పుష్ప-2 షూటింగ్ బాగా ఆలస్యమైతే.. ఆగస్టు 15 కి విడుదల కావడం అనుమానమే.