Read more!

English | Telugu

బాలయ్యతో ప్రశాంత్ వర్మ సూపర్ హీరో ఫిల్మ్!

తక్కువ సినిమాలతోనే దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. టాలీవుడ్ సినీ చరిత్రలోనే మొదటిసారి సినిమాటిక్ యూనివర్స్ కి తెరదీశాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఎనిమిది సూపర్ హీరో ఫిల్మ్ లు రానున్నాయి. ఇప్పటికే 'హనుమాన్' షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే రెండో సినిమాగా 'అధీర'ను ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాటిక్ యూనివర్స్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా భాగమయ్యే అవకాశముంది.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా ఉంటుందని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' షో ప్రోమోలను ప్రశాంత్ డైరెక్ట్ చేశాడు. ఆ ప్రోమోలలో బాలయ్యను ప్రశాంత్ ప్రజెంట్ చేసిన తీరుకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ప్రశాంత్ దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తే బాగుంటుందని ఎప్పటినుంచో పలువులు అభిమానులు కోరుతున్నారు. తాజాగా ప్రశాంత్ సైతం బాలయ్యతో తాను సినిమా చేయనున్నట్లు తెలిపాడు. రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రశాంత్ మాట్లాడుతూ.. బాలకృష్ణ గారికి స్టోరీ లైన్ చెప్పగా, ఆయనకు చాలా నచ్చిందని.. ఆయన ఎప్పుడంటే అప్పుడు ప్రాజెక్ట్ మొదలవుతుందని చెప్పాడు. అలాగే తాను సుమారు వంద మంది టీంతో కలిసి రాబోయే పదేళ్ళ లో ఒక పెద్ద ఫ్రాంచైజ్ క్రియేట్ చేయడంపై దృష్టి పెట్టానని, దాదాపు 8 సూపర్ హీరో ఫిలిమ్స్ వస్తాయని తెలిపాడు. ప్రశాంత్ మాటలను బట్టి చూస్తుంటే, ఆయన బాలకృష్ణతో కూడా సూపర్ హీరో ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. అదే నిజమైతే ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు.