బిసి మంత్రిత్వశాఖ ఏర్పాటుకు దేశం కృషి
posted on Jul 30, 2012 @ 11:14AM
ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ బిసిలకు ఇస్తున్న వరాలజల్లు ముగియకుండానే కొత్త అంశం ఆ పార్టీ జాబితాలోకి చేరింది. కేంద్రస్థాయిలో బిసి మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తే బిసిలకు సంబంధించిన పలుఅంశాలపై రాష్ట్రప్రభుత్వ భారం తగ్గుతుందని ఆ పార్టీ ఓ అంచనాకు వచ్చింది. అందుకే ఈ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు నిర్ణయించుకుంది. తమ పార్టీ ఎంపీలను ఈ మంత్రిత్వశాఖ ఏర్పాటుకు సహకరించాలని తెలుగుదేశం కోరుతోంది.
దేశంలో బిసి జనాభా అత్యథికంగా ఉన్నందునే తమ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని టిడిపి పార్లమెంటరీపార్టీ నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకూ కేంద్రస్థాయిలో బిసి సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు తీసుకోనందున తాము ఈ మేరకు కృషి చేస్తున్నామని ఆయన వివరించారు. అంతేకాకుండా బిసి సంక్షేమమంత్రిత్వశాఖ ఏర్పాటు వల్ల దేశంలో బిసిల అభివృద్థి సాథ్యమవుతుందని విశదీకరించారు. ప్రత్యేకించి తమ పార్టీ ప్రకటించిన బిసి డిక్లరేషన్‌లో కూడా ఈ సంక్షేమం మంత్రిత్వశాఖ అంశాన్ని జోడిస్తున్నామని తెలిపారు. తమ పార్టీ అథినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన మద్దతు వల్లే ఇది సాధ్యమవుతోందన్నారు.
అయితే వచ్చే పార్లమెంటరీ సమావేశాల్లో ఈ అంశంపై పోరాడుతామని నామా హెచ్చరించారు. పూర్తిస్థాయిలో శాఖ ఏర్పాటు చేసేంతవరకూ తమ పార్టీ ఎంపీలు సహకరిస్తారని ఆయన ఆశిస్తున్నారు. అందుకే తమకు మద్దతు ఇవ్వాలని ఇతర పార్టీల్లోని బిసి సంక్షేమ ఆసక్తి ఉన్న నేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు.బిసిలకు సరైన స్థాయి కల్పిస్తే వారు బాగా రాణిస్తారని తెలుగుదేశం పార్టీ అథినేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడుతున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ అదిలాబాద్ నాయకులతో మాట్లాడుతూ తాము బిసి డిక్లేరేషన్ చేసినది మొదలుకుని ఇంకా భవిష్యత్తులోనూ బిసిలకు ఆదరణ ఇస్తూనే ఉంటామన్నారు. రాష్ట్రంలో కీలకమైనస్థానాల్లో బిసిలు ఉంటే తమకు సమన్యాయం సాధించినట్లు అనుభూతి మిగులుతుందన్నారు.