ప్రభుత్వానికి ఆగస్టులో సంక్షోభం: రోజా
posted on Apr 21, 2011 @ 11:25AM
హైదరాబాద్: ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వంలో సంక్షోభం తప్పదని సినీ నటి, రాజకీయ నాయకురాలు రోజా ఓ టీవీ ఛానల్ ముఖాముఖి కార్యక్రమంలో హెచ్చరించారు. ఉప ఎన్నికలలో జగన్, విజయమ్మ బంపర్ ఆధిక్యంతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీ జగన్ ఎమ్మెల్యేలను సామ, ధాన, బేధ, దండోపాయాలతో తన వద్దకు రప్పించుకోవాలని అనుకుంటోందని, అయితే ఎమ్మెల్యేలు అన్నింటికీ సిద్ధమయ్యే జగన్ వెంట నడుస్తున్నారని చెప్పారు. జగన్ గెలుపు ఖాయమని తెలిసినప్పటికీ కాంగ్రెసు మంత్రులను కడపలో మోహరించిందని చెప్పారు. ఓట్ల ద్వారా కాంగ్రెసుకు బుద్ధి చెప్పడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ వర్గ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే ముందు కాంగ్రెసు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి వైయస్ ఫోటో లేకుండా సోనియా ఫోటోతో గెలవాలని సవాల్ విసిరారు. కాంగ్రెసు అవసరానికి అనుగుణంగా ప్లేటు ఫిరాయిస్తుందని ఆరోపించారు. కాంగ్రెసు పార్టీ మాటల్లో, చేతల్లో నైతికత లేదన్నారు. రాజకీయ అక్కసుతోనే జగన్‌ను విమర్శిస్తున్నారని అన్నారు. తనకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి లేదని అయితే పార్టీ ఆదేశిస్తే తప్పదన్నారు.
ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కడప ఉప ఎన్నికలలో ప్రచారం చేయడం వల్ల కాంగ్రెసు పార్టీ కంటే జగన్ కే ఎక్కువ లాభిస్తుందని రోజా చెప్పారు. కాంగ్రెసును విమర్శించి 18 సీట్లు గెలుచున్న చిరంజీవి ఇప్పుడు అదే కాంగ్రెసుకు ప్రచారం చేయడాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, దానిపై చిరంజీవిని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెసు, పిఆర్పీ అవకాశవాదంలో కలిసిపోయిన విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. కాగా, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాసుకు రెండు సార్లు ఓడిపోయినా బుద్ది రాలేదని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేత రెహ్మాన్ విమర్శించారు. నిజామాబాద్‌లో ముస్లింలు డిఎస్‌ను రెండుసార్లు ఓడించారని అన్నారు. అయినా డిఎస్‌కు బుద్ది రాకపోవడం శోచనీయం అన్నారు. జగన్‌కు, ముస్లింలకు మధ్య విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలని చూస్తే కాంగ్రెసు పార్టీకి మరోసారి పరాభవం తప్పదని హెచ్చరించారు. కాగా ఇటీవల పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ జగన్నాటకం వెనుక బిజెపి హస్తం ఉందని, రాష్ట్రంలో జగన్‌ను అడ్డు పెట్టుకొని అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తుందని చెప్పిన విషయం తెలిసిందే.