విజయవాడలో లగడపాటి పోటీ?

      రాష్ట్రం విడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయబోనని ప్రకటించిన విజయవాడ సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఇప్పటి వరకూ తన ప్రతిజ్ఞకే కట్టుబడి వున్నారు. రాజకీయాల నుంచి తప్పుకున్నానని ప్రకటించినప్పటికీ కిరణ్ కుమార్ నాయకత్వంలోని జై సమైక్యాంధ్ర పార్టీలో లగడపాటి చురుకైన పాత్ర నిర్వహిస్తున్నారు.   తాజాగా లగడపాటి విజయవాడ స్థానం నుంచి  పోటీ చేయాలని ఆయనపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. సీమాంధ్రలో జై సమైక్యాంధ్ర పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా వుంది. అసెంబ్లీ స్థానాల నుంచి కొంతమంది అభ్యర్థులు గెలిచే అవకాశం వున్నప్పటికీ పార్లమెంట్ స్థానాల నుంచి గెలిచే సత్తా వున్న వ్యక్తులు ఆ పార్టీకి కొరవడ్డారు. ఆ సత్తా వున్న ఒకే ఒక వ్యక్తి లగడపాటి రాజగోపాల్ అస్త్రసన్యాసం చేసి పోటీకి దూరంగా వున్నారు. మరోవైపు విజయవాడలోని లగడపాటి అనుకూల వర్గం కూడా లగడపాటి మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో వున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో వాళ్ళు ఎప్పటి నుంచో లగడపాటి మీద ఒత్తిడి తెస్తున్నప్పటికీ లగడపాటి సానుకూలంగా స్పందించనట్టు సమాచారం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో విజయవాడ పార్లమెంటు సీటుకు సంబంధించిన వివాదం ముదిరిపోవడంతో అక్కడ ఆ పార్టీ విజయావకాశాలు సన్నగిల్లాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి లగడపాటి సునాయాసంగా గెలిచే అవకాశాలున్నాయని జై సమైక్యాంధ్ర పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే సీమాంధ్రలో కీలకమైన పార్లమెంట్ స్థానాన్ని జేసీపీ గెలుచుకున్నట్టయితే పార్టీ ప్రతిష్ట పెరిగే అవకాశం వుందని అనుకుంటున్నారు. లగడపాటి  తన ఒట్టును గట్టుమీద పెట్టి విజయవాడ నుంచి పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. లగడపాటి తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని కోరుతున్నారు. లగడపాటి కూడా విజయవాడ నుంచి మళ్ళీ పోటీ చేయడానికి సానుకూలంగానే వున్నారని జేసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.

తెదేపా సీమాంధ్ర అభ్యర్ధుల జాబితా

  తెలుగు దేశం పార్టీ తన సీమాంధ్ర అభ్యర్థుల మూడో జాబితాను కూడా ఈరోజు ఉదయం విడుదల చేసింది. అందులో 3 లోక్‌సభ మరియు 32 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. టీడీపీ లోక్‌సభ అభ్యర్ధులు అనకాపల్లి - అవంతి శ్రీనివాస్ కాకినాడ - తోట నర్సింహం అమలాపురం - పి.రవీంద్రబాబు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు హిందూపురం - బాలకృష్ణ, భీమిలి - గంటా శ్రీనివాసరావు, కర్నూలు - టీజీ వెంకటేశ్, పాణ్యం - ఏరాసు ప్రతాప్‌రెడ్డి, పాతపట్నం - శత్రుచర్ల విజయరామరాజు, నంద్యాల - శిల్పామోహన్‌రెడ్డి, అవనిగడ్డ-మండలి బుద్ధ ప్రసాద్, విజయవాడ సెంట్రల్-బీ.ఉమామహేశ్వర రావు, ఆచంట-పితాని సత్యనారాయణ, సత్తెనపల్లి-కోడెల శివ ప్రసాద్,   పలాస - జీ.యన్.యన్. శివాజీ,  శ్రీకాకుళం - లక్ష్మీదేవి, నర్సన్నపేట -బీ. రమణమూర్తి,  పార్వతీపురం - చిరంజీవులు, గజపతినగరం - కేఏ నాయుడు, విశాఖ సౌత్ - వాసుపల్లి గణేష్, గాజువాక - పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి - పిలా గోవింద్, యలమంచిలి - పంచకర్ల రమేష్‌బాబు   పాయకరావుపేట - అనిత, రాజంపేట - మల్లికార్జునరెడ్డి, నందికొట్కూరు - లబ్బి వెంకటస్వామి, ఆళ్లగడ్డ - గంగుల ప్రభాకర్‌రెడ్డి, శ్రీశైలం - శిల్పా చక్రపాణి రెడ్డి, డోన్ - కేఈ ప్రతాప్, పత్తికొండ - కేఈ కృష్ణమూర్తి, మడకశిర - ఎం వీరన్న,  రైల్వే కోడూరు - వెంకటసుబ్బయ్య, కాకినాడ సిటీ-వీ.వెంకటేశ్వర రావు( కొండబాబు), బాపట్ల-అన్నం సతీష్, గుంటూరు (పశ్చిమం)-మాడుగుల వేణుగోపాల్ రెడ్డి

కేశినేని నానికి చంద్రబాబు టిక్కెటిస్తారా..!

      విజయవాడ టిడిపి పార్లమెంట్ సీటుపై ఉత్కంఠ నెలకొంది. విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేది తానేనని ధీమాగా వున్న కేశినేని నానికి చివరి నిమిషంలో పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్ పేరు తెరపైకి రావడంతో ఆ వర్గంలో కలవరం మొదలైంది. విజయవాడ లోక్‌సభ సీటును తనకే కేటాయిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇవ్వకపోయినా తాను విజయవాడ నుంచే పోటీ చేస్తానని కేశినేని నాని స్పష్టం చేశారు. టీడీపీ సభ్యుడే కాని పొట్లూరికి ఏ విధంగా టికెట్ కేటాయిస్తారని ప్రశ్నించారు. పవన్‌కల్యాణే పీవీపీకి టికెట్ ఇవ్వాలని చంద్రబాబును పట్టుబడుతున్నారని వస్తున్న వార్తలను.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఖండించాలని నాని కోరారు. పైసా డబ్బులు లేని వాళ్లకు కూడా అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించిన చంద్రబాబు, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగరని తప్పకుండా తనకే లోక్ సభ టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు చంద్రబాబును కలిసేందుకు కేశినేని నాని ఈ రోజు ఉదయం ఆయన నివాసానికి వెళ్లారు. అయితే చంద్రబాబు అందుబాటులో లేకపోవటంతో నాని వెనుదిరిగారు. ఓ గంట తర్వాత నాని బాబును కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సీమాంధ్ర కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా

  లోక్ సభ అభ్యర్ధులు: శ్రీకాకుళం - కిల్లి కృపారాణి, విజయనగరం - బొత్స ఝాన్సీ, అరకు - కిషోర్ చంద్రదేవ్, ఒంగోలు - దర్శి పవన్ కుమార్, నర్సాపురం - కనుమూరి బాపిరాజు, అమలాపురం - బుచ్చి మహేశ్వర రావు, ఏలూరు - నాగేశ్వర రావు, గుంటూరు - షేక్ వహీద్, బాపట్ల - పనబాక లక్ష్మి, తిరుపతి – చింతామోహన్, కాకినాడ - పల్లం రాజు, అమలాపురం - బుచ్చిమహేశ్వర రావు, రాజమండ్రి - కందుల దుర్గేష్, విజయవాడ - దేవినేని అవినాష్, నెల్లూరు - వాకాటి నారాయణ రెడ్డి, రాజంపేట – సాయిప్రతాప్, హిందూపురం - చిన వెంకట్రాముడు, నంద్యాల – బి.వై రామయ్య, కర్నూలు - కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, నరసరావుపేట - కాసు కృష్ణా రెడ్డి. శాసన సభ అభ్యర్ధులు: నూజివీడు - చిన్నం రామకోటయ్య, గుడివాడ - అట్లూరి సుబ్బారావు, పామర్రు - డి.వై.దాస్‌, విజయవాడ వెస్ట్ - వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ సెంట్రల్‌ - మల్లాది విష్ణువర్థన్‌రావు, విజయవాడ ఈస్ట్ - దేవినేని రాజశేఖర్‌, మైలవరం - ఆప్పసాని సందీప్‌, నందిగామ - బోడపాటి బాబూరావు, జగ్గయ్యపేట - వేముల నాగేశ్వరరావు.   పెదకూరపాడు - పక్కల సూరిబాబు, తాడికొండ - చల్లగాలి కిషోర్‌, మంగళగిరి - కాండ్రు కమల, పొన్నూరు - తేళ్ల వెంకటేష్‌ యాదవ్, వేమూరు - రేవెండ్ల భరత్‌బాబు,రేపల్లె - మోపిదేవి శ్రీనివాసరావు, అమలాపురం - జంగా గౌతమ్‌, రాజోలు - సరెళ్ల విజయ ప్రసాద్‌, గన్నవరం - పాముల రాజేశ్వరీ దేవి, కొత్తపేట - ఆకుల రామకృష్ణ, మండపేట - కామన ప్రభాకరరావు   రాజానగరం - అంకం నాగేశ్వరరావు, రాజమండ్రి రూరల్ - శ్రీమతి రాయుడు రాజవెల్లి, జగ్గంపేట - తోట సూర్యనారాయణ మూర్తి, గుంటూరు ఈస్ట్ - ఎస్‌కే మస్తాన్ వలీ, చిలకలూరిపేట - ఎం. హనుమంతరావు, నరసరావుపేట - కాసు మహేష్‌రెడ్డి,సత్తెనపల్లి - యెర్రం వెంకటేశ్వరరెడ్డి,వినుకొండ - ఎం. మల్లిఖార్జునరావు,గురజాల - ఆనం సంజీవ్‌రెడ్డి   మాచర్ల - రాంశెట్టి నరేంద్ర బాబు,దర్శి - కోట పోతుల జ్వాలారావు,పర్చూరు - మోదుగుల కృష్ణారెడ్డి,అద్దంకి - గాలం లక్ష్మీయాదవ్, తెనాలి - నాదెండ్ల మనోహర్‌, బాపట్ల - సి.హెచ్. నారాయణరెడ్డి, ప్రత్తిపాడు - కొరివి వినయ్‌కుమార్, గుంటూరు వెస్ట్ - కన్నా లక్ష్మీనారాయణ, చీరాల - మెండు నిశాంత్‌ మార్కాపురం - ఏలూరి రామచంద్రారెడ్డి, సంతనూతలపాడు - నూతల తిరుమల రావు   ఒంగోలు - యెద్దు శశికాంత్‌ భూషణ్‌, కందుకూరు - వెంకట్రావ్ యాదవ్‌, కొండేపి - జి.రాజ్‌విమల్‌, రంపచోడవరం - కేవీవీ సత్యనారాయణ రెడ్డి,నిడదవోలు - కామిశెట్టి వెంకట సత్యనారాయణ, ఆచంట - ఇందుగపల్లి రామానుజ రావు,పాలకొల్లు - బాల నాగేశ్వరరావు,నరసాపురం – నాగతులసీరావు,భీమవరం - యెర్లగడ్డ రాము, ఉండి - గాడిరాజు లచ్చిరాజు   తాడేపల్లిగూడెం - దేవతి పద్మావతి,దెందులూరు - మాగంటి వీరేంద్ర ప్రసాద్‌,ఏలూరు - వెంకట పద్మరాజు, గోపాలపురం - కాంతవల్లి కృష్ణవేణి,పోలవరం - కంగల పోసిరత్నం,తిరువూరు - రాజీవ్‌ రత్న ప్రసాద్,గిద్దలూరు - కందుల గౌతమ్‌రెడ్డి,కనిగిరి - ముక్కు ఉగ్రనరసింహారెడ్డి,కోవూరు - జి.వెంకటరమణ   నెల్లూరు సిటీ - ఏసీ సుబ్బారెడ్డి, నెల్లూరు రూరల్‌- ఆనం విజయకుమార్‌రెడ్డి,సర్వేపల్లి - కె.పట్టాభిరామయ్య, గూడూరు - పనబాక కృష్ణయ్య,సూళ్లూరుపేట - డి.మధుసూదనరావు, వెంకటగిరి - ఎన్‌.రామ్‌కుమార్‌రెడ్డి, బద్వేల్ - జె.కమల్ ప్రభాస్‌,రాజంపేట - గాజుల భాస్కర్‌,కడప - మహ్మద్‌ అష్రాఫ్‌,రాయచోటి - షేక్ ఫజ్లే ఇల్లా   పులివెందుల - రాజగోపాల్‌రెడ్డి,ఆళ్లగడ్డ - టి.ఎ.నరసింహారావు,శ్రీశైలం – షబానా,నందికొట్కూరు - చెరుకూరి అశోకరత్నం,కర్నూలు - అహ్మద్ అలీఖాన్,నంద్యాల - జూపల్లి రాకేష్‌రెడ్డి, బనగానపల్లి - పేర రామసుబ్బారెడ్డి,.డోన్ - ఎల్‌.లక్ష్మీరెడ్డి,పత్తికొండ - కె.లక్ష్మీనారాయణరెడ్డి,కోడుమూరు - పి.మురళీకృష్ణ, ఆదోని - మనియర్ యూనిస్‌.

జూయన్టీఆర్ ని అందుకే దూరం పెడుతున్నారా?

  ఈసారి జూ.యన్టీఆర్, ఆయన తండ్రి హరికృష్ణ ఇద్దరినీ కూడా చంద్రబాబు పూర్తిగా పక్కనపెట్టేసినట్లేనని నారా లోకేష్ తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఆయన కృష్ణా జిల్లాలో మొదలుపెట్టిన యువ ప్రభంజనం యాత్రలో మీడియాతో మాట్లాడుతూ “బాలకృష్ణతో సహా మేమేవరినీ ప్రత్యేకంగా ఆహ్వానించలేదు. కానీ అందరూ కూడా పార్టీని తమదిగా భావించి తామంతట తామే స్వయంగా వచ్చి పార్టీ ప్రచారంలో పాల్గొంటున్నారు. అందువల్ల జూ.యన్టీఆర్ ని పార్టీ ప్రచారంలో పాల్గొనమని ప్రత్యేకంగా ఆహ్వానించనవసరం లేదని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.   నాలుగు రోజుల క్రితం చంద్రబాబు కూడా ఇంచుమించు ఇదేవిధంగా మాట్లాడారు. ఇప్పుడు ఆయన కొడుకు నారా లోకేష్ అదే విధంగా చెప్పడం గమనిస్తే వారిరువురికి కూడా ఈసారి ఎన్నికల ప్రచారానికి జూ.యన్టీఆర్ ని ఆహ్వానించే ఆలోచనలేదని స్పష్టమవుతోంది. అయితే అందుకు చాలా బలమయిన ఉందనిపిస్తోంది.   హరికృష్ణ తన కొడుకు జూ.యన్టీఆర్ ని తేదేపాలో ముందుకు తీసుకువెళ్లాలని ప్రయత్నించినప్పుడు, చంద్రబాబు నాయుడు తన వియ్యంకుడు బాలకృష్ణ సహకారంతో తన కొడుకు నారా లోకేష్ ని తన రాజకీయ వారసుడిగా, తేదేపాకు భావి అధినేతగా ఎదిగేందుకు చాలా గట్టి ప్రయత్నాలే చేసిన సంగతి అందరికీ తెలిసిందే. జూ.యన్టీఆర్ కి తన సినీరంగంపై తప్ప పార్టీ రాజకీయాలపై ప్రత్యేక ఆసక్తి ఏమీ లేకపోయినప్పటికీ, గత ఎన్నికలలో తాత స్వర్గీయ యన్టీఆర్ ను మరిపించేలా అలవోకగా సాగిన అతని వాగ్ధాటి, వేష బాషలు, ప్రచారశైలీ అన్నీ కూడా అతనే స్వర్గీయ యన్టీఆర్ కు నిజమయిన వారసుడు అని ప్రజలు, పార్టీ కార్యకర్తలు కూడా భావించేలా చేసింది.   బహుశః అప్పటి నుండే చంద్రబాబు క్రమంగా, ఆయన భాషలో చెప్పాలంటే ఒక పద్ధతి ప్రకారం జూ.యన్టీఆర్ ని దూరం పెడుతూ వచ్చేరు. ఆ తరువాత వారి మధ్య వైకాపా ఫ్లెక్సీ బ్యానర్లతో అడ్డుగా పరదాలు కట్టడంతో, హరికృష్ణ, జూ.యన్టీఆర్ క్రమంగా తేదేపాకు దూరమయ్యారు. అది జూ.యన్టీఆర్ సినీ జీవితంపై కూడా విపరీతమయిన ప్రభావం చూపడంతో ఆ దూరం మరింత పెరుగుతూ వచ్చింది. అయితే కాగల కార్యం గందర్వులే తీర్చారన్నట్లుగా, జూ.యన్టీఆర్ తనంతట తానే పార్టీకి దూరం అయినప్పుడు మళ్ళీ అతనిని ఇప్పుడు పార్టీ ప్రచారం కోసం ఆహ్వానించడమెందుకు, మరుగున పడిన పార్టీ వారసత్వ సమస్యని కెలుక్కోవడమెందుకనే ఉద్దేశ్యంతోనే బహుశః వారిరువురూ ఆవిధంగా మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

వైకాపాలోకి సూపర్ సోదరుడు

  సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్, ఆయన తల్లి మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి ఇటీవలే తెదేపా తీర్ధం స్వీకరించిన సంగతి అందరికీ తెలిసిందే. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు కూడా తెదేపాలో చేరేందుకు సిద్దమయ్యారు. కానీ ఆయనకు టికెట్ విషయంలో చంద్రబాబు ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరిపోయారు. ఒకే కుటుంబం సభ్యులు ఇలా వేర్వేరు పార్టీలలో చేరడం కొత్తేమీ కాకపోయినా, బద్ద శతృవులయిన ఈ రెండు పార్టీలలో వారి కుటుంబ సభ్యులు చెరో వైపు చేరినందున విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోక తప్పనిసరి పరిస్థితి ఎదురయిన్నట్లయితే, అది వారి కుటుంబానికి అంత గౌరవంగా ఉండబోదని చెప్పవచ్చును.

త్వరలో కాంగ్రెస్ నేతల రిటర్న్ జర్నీ?

  ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ నుండి గుంపులు గుంపులుగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిపడిన కాంగ్రెస్ నేతలకు చంద్రబాబు షాక్ ఇస్తున్నారు. వారిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయనతో బాటు వచ్చిన నలుగురు విశాఖ కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా ఉన్నారు. ఇంతవరకు వెలువరిచిన రెండు జాబితాలలో వారెవరి పేర్లు కనబడకపోవడంతో అందరిలో ఆందోళన మొదలయింది. ఇంకేముంది.. అందరూ అసమ్మతి గంట కొట్టేందుకు శ్రీనివాసరావు ఇంటిలో సమావేశమయిపోయారు.   వారిలో అవంతీ శ్రీనివాస్, కన్నబాబు తమకు టికెట్స్ దొరక్కపోతే పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసేందుకు సిద్దమని చెపుతుంటే, గాజువాక యం.యల్యే. వెంకట్రామయ్య తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిపోయెందుకు చిరంజీవి, బొత్స సత్యనారాయణలతో అప్పుడే చర్చలు కూడా ఆరంబించేసారు. సీమాంద్రాలో పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోవడంతో ఎన్నికలలో పోటీ చేసేందుకు అభ్యర్ధులు లేక దిక్కులు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆయనకు మళ్ళీ గాజువాక నుండి టికెట్ ఇచ్చేందుకు అంగీకరించినట్లు తాజా సమాచారం.   అయితే చిరంజీవి అనుంగు సహచరుడు గంటా శ్రీనివాసరావు మాత్రం తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్దంగాలేరు. చంద్రబాబు తనని ఎక్కడి నుండి పోటీ చేయమన్నా అభ్యంతరం చెప్పకుండా పోటీ చేస్తానని, ఒకవేళ టికెట్ ఇవ్వకున్నా కూడా తెదేపానే అంటి పెట్టుకొని ఉంటూ పార్టీ నిలబెట్టిన అభ్యర్ధుల విజయానికి కృషి చేస్తానని చంద్రబాబుకి వినబడేలా బిగ్గరగా చెపుతున్నారు. గంటా శ్రీనివాసరావు ప్రదర్శిస్తున్న ఈ లౌక్యాన్ని చూసి చంద్రబాబు ఐస్ అయిపోయి టికెట్ ఇస్తారో లేదో నేడో రేపో తేలిపోతుంది.   అయితే ఇదంతా చూస్తుంటే చంద్రబాబు రాష్ట్ర విభజన వ్యవహారంతో తనను తన పార్టీని ఘోరంగా దెబ్బతీయాలని చూసిన కాంగ్రెస్ పార్టీపై ప్రతీకారం తీర్చుకోనేందుకే ఆ పార్టీ నేతలని తెదేపాలోకి ఆకర్షించారా? అందుకే నామినేషన్లకు గడువు ముగిసేవరకు వారి టికెట్స్ వ్యవహారం ఎటూ తేల్చకుండా నాన్చుతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆయన ప్రకటించిన రెండు జాబితాలలో కలిపి కేవలం నలుగురైదుగురు కాంగ్రెస్ నేతలకు మాత్రమె టికెట్స్ వచ్చాయి. కానీ, కాంగ్రెస్ నుండి తెదేపాలోకి వచ్చిన వారి సంఖ్యా దాదాపు రెండు డజన్ల పైనే ఉన్నారు. మరి వారందరికీ కూడా చంద్రబాబు ఆఖరి నిమిషంలో హ్యాండివ్వబోతున్నారా?అనే సంగతి కూడా నేడో రేపో తుది జాబితా వెలువడగానే తేలిపోతుంది. అది కూడా తేలిపోతే కాంగ్రెస్ నేతలందరూ ‘ద్వారములు తెరిచియే ఉంచిన కాంగ్రెస్ గూటికి’ బిరబిరా పరుగులు తీస్తారేమో!   ఈలోగా కాస్త ముందు చూపు ఉన్న కన్నబాబు, అవంతీ శ్రీనివాస్ వంటి నేతలు స్వతంత్ర అభ్యర్ధులుగా నామినేషన్లు వేసి జాగ్రత్తపడుదామని భావిస్తుంటే, అంత రిస్కు తీసుకోవడం ఇష్టంలేని వెంట్రామయ్య వంటి నేతలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొనే ప్రయత్నంలో తమకు టికెట్ రాదని గ్రహించగానే కాంగ్రెస్ గూటికి తిరిగి పయనమయిపోతున్నారు. ఇంతకీ వీరందరిలో ఎవరు తెలివయిన వారు? కాంగ్రెస్ నేతలకి పసుపు కండువాలు కప్పి వారికి షేక్ హ్యాండిస్తున్న చంద్రబాబా? లేక అవకాశవాదులయిన కాంగ్రెస్ నేతలా?              

పెరటి మొక్క వైద్యానికి పనికి రాదన్నట్లు

  పెరటి మొక్క వైద్యానికి పనికిరాదనే ఒక సామెత అక్షరాల చిరంజీవికి సరిపోతుంది. ఆయన తన మెగా చరిష్మాతో సీమాంద్రాలో కాంగ్రెస్ పార్టీని ఒడ్డున పడేస్తాడని ఆశతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకి ఎన్నికల ప్రచారకమిటీ చైర్మన్ గా కీలక బాధ్యతలు అప్పగించింది. అవసరమయితే ఆయనను ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా పంపి ప్రచారం చేయించుకోవాలనుకొంది. అయితే ఆయన సీమాంద్రా ప్రజలనే ఆకట్టుకోలేనప్పుడు ఇతర రాష్ట్రాలలో మాత్రం ఏమి సాధిస్తారని అందరూ పెదవి విరుస్తున్నారు. పొరుగు రాష్ట్రాల సంగతి తరువాత చూసుకోవచ్చును, కనీసం నేటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగానే ఉన్న తెలంగాణాకు ఆయనను పంపి ప్రచారం చేయించుకొనే దైర్యం చేయలేకపోతోంది కాంగ్రెస్ పార్టీ.   ప్రస్తుతం టీ-కాంగ్రెస్ లో ప్రజాకర్షణగల సరయిన నేతలెవరూ లేకపోవడంతో, వారందరూ కలిసి కూడా ఒక్క కేసీఆర్ని గట్టిగా డ్డీ కొనలేక ఆపసోపాలు పడుతున్నారు. వారిని ఎదుర్కోవడానికి డిల్లీ నుండి జైరామ్ రమేష్ స్వయంగా రావలసి వచ్చిందంటే టీ-కాంగ్రెస్ పరిస్థితి అర్ధమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణాను వ్యతిరేఖించిన చిరంజీవిని ప్రచారానికి ఆహ్వానిస్తే అది కొరివితో తలగోక్కునట్లే అవుతుందని కాంగ్రెస్ నేతలకు తెలుసు. అందుకే సరయిన ప్రజాకర్షక నేతలు ఎవరూ లేకపోయినప్పటికీ టీ-కాంగ్రెస్ నేతలు అలాగే ఎలాగో నెట్టుకొస్తున్నారు తప్ప తమ పెరట్లోనే ఉన్న చిరంజీవి గురించి ఎన్నడూ ఆలోచించలేదు.

తిక్కుంది కానీ దానికో లెక్క లేదు

  నా కొంచెం తిక్కుంది..కానీ దానికో లెక్కుంది…అని పవన్ కళ్యాణ్  డైలాగ్ చాలా పాపులర్ అయింది.సరిగ్గా ఎన్నికల ముందు పార్టీ పెట్టి రాజకీయాలలో ప్రవేశించిన ఆయన “తూచ్...ఇప్పుడు పోటీ చేయబోవడం లేదు. అందువల్ల జనాలూ..మీకు నచ్చినోళ్ళకే ఓట్లేసేసుకోండి!” అని వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించేసారు. విజయవాడ టికెట్ కోసం అన్ని పార్టీల గడపలు ఎక్కిదిగిన పొట్లూరి వరప్రసాద్, అందు కోసం బోలెడంత డబ్బు ఖర్చు చేసి పవన్ కళ్యాణ్ చేత జనసేన లాంచింగ్ చేయించగలిగారు కానీ ఆయన చేత ఎన్నికలలో పోటీ చేయించ లేకపోయారు. అయితే గజ్జి ఉన్నవాడికి అలా గోక్కొంటూ ఉంటేనే చాలా సుఖంగా ఉంటుందిట. అలాగే విజయవాడ నుండి లోక్ సభకు పోటీ చేయాలని తహతహలాడిపోతున్న పొట్లూరికి ఏదో విధంగా అక్కడి నుండి ఓసారి పోటీ చేసి మళ్ళీ చేతులు కాల్చుకొంటేనే కానీ ఆ దురద తీరేట్లు లేదు. అందుకే ఆయన టికెట్ కోసం పవన్ వెంటబడ్డారు. కానీ వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించేసిన తరువాత మళ్ళీ రంగ ప్రవేశం చేసి, తన అభ్యర్ధిని పోటీలో దింపి ఓడిపోతే ఉన్న పరువు కూడా పోయే ప్రమాదం ఉంది గనుక, తను (కోడ్ బాషలో) మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన తెదేపాకు ఎన్నికల సందర్భంగా ఒక మెగా బంపర్ ఆఫర్ ఇచ్చారు. పొట్లూరికి ఒక టికెట్ ఇస్తే వన్ ప్లస్ వన్ ఆఫర్ క్రింద తెదేపా-బీజేపీ రెండు పార్టీలకు ఫ్రీగా ప్రచారం చేసిపెడతానని టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చారు.   ఆ రెండు పార్టీలు పొత్తులయితే పెట్టుకోగలిగాయి కానీ నేటికీ సీట్ల సర్దుబాటు చేసుకోలేక తలలు పట్టుకొని కూర్చొన్నాయి. ఉన్న ఐదు రోజుల పుణ్యకాలంలో అప్పుడే ఒకరోజు గడిచిపోయింది కానీ వైజాగ్, విజయవాడ సీట్ల బేరం మాత్రం ఎంతకీ ఒక కొలిక్కి రావడం లేదు. ఆ రెండు సీట్లు కోసం ఆ రెండు పార్టీలు సిగపట్లు పడుతుంటే మధ్యలో పొట్లూరికి టికెట్ అంటూ పవన్ కూడా వారితో జాయిన్ అయ్యారు. తమ వాళ్ళని కాదని పొట్లూరికి టికెట్ కట్టబెడితే ఇక ఆ రెండు పార్టీలలో ముసలం పుడుతుంది. ఇవ్వకపోతే పవన్ ‘జై జనసేన’ అంటూ పొట్లూరిని పోటీలో నిలబెడితే అదొక పెద్ద సమస్య అవుతుంది.   రాష్ట్ర, దేశ, ప్రపంచ రాజకీయాల గురించి చిన్నపుడు నుండే సుదీర్గ పరిశోధన చేసి, ప్రపంచంలో ఉన్న అన్ని ఇజాలను మిక్సీ గ్రైండర్ లో వేసి రుబ్బి మరో కొత్త ఇజం కనిపెట్టిన పవన్ కళ్యాణ్, విజయవాడ టికెట్ కోసం ఆ రెండు పార్టీల కుస్తీ పట్ల గురించి తెలుసుకోలేకపోవడం విచిత్రమే. అయినా ఆయన స్వంత కుంపటిని వంటింట్లో దాచుకొని, పొరుగింటి పిన్నిగారి కుంపటి మీద గారెలు, పరమాన్నం వండుకోవాలనుకోవడం విడ్డూరంగానే ఉంది కదా! నిజమే.. అతనికి తిక్కయితే ఉంది గాని దానికో లెక్క మాత్రం లేదని జనాలు కూడా ముసిముసి నవ్వులు నవ్వుకొంటున్నారు.

రజనీకాంత్ మద్దతుతో మారనున్న సమీకరణాలు

  తమిళనాడులో ఏదో ఒక స్థానిక పార్టీ అండ లేకపోయినట్లయితే ఎంత పెద్ద జాతీయపార్టీనయినా తమిళ తంబిలు ఆదరించరు. కానీ, తమిళనాడులో రెండు ప్రధాన ద్రవిడ పార్టీలయిన డీయంకే, అన్నాడీయంకేలు ఈసారి ఎన్నికలలో తిరుగులేని మెజార్టీతో గెలిచి రాష్ట్రంలో, కేంద్రంలో కూడా చక్రం తిప్పాలని భావిస్తుండటంతో కాంగ్రెస్, బీజేపీలతో పొత్తులకు అంగీకరించలేదు. అందువల్ల ఆ రెండు పార్టీలు రాష్ట్రంలో మిగిలిన చిన్నా చితకా పార్టీలను ఆశ్రయించక తప్పలేదు. కానీ వాటితో పొత్తుల వలన లాభం కంటే అధికారం చేపట్టిన తరువాత వారి గొంతెమ్మ కోరికలన్నిటినీ తీర్చలేక తలనొప్పులే అధికంగా ఉంటాయని ఇదివరకు చాలాసార్లే రుజువయింది. అందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఆన్వేషిస్తున్న బీజేపీ తమిళనాట సినీ హీరోలకు ప్రజలలో విపరీతమయిన ఆదరణ ఉన్న సంగతి గ్రహించి తెలివిగా పావులు కదిపింది.   సినీ తారలతో, రాజకీయ నాయకులతో మంచి పరిచయాలున్న తుగ్లక్ పత్రిక సంపాదకుడు, పాత్రికేయుడు, నటుడు అయిన చో రామస్వామి ద్వారా సూపర్ స్టార్ రజనీకాంత్ ని బీజేపీ మద్దతు ఇమ్మని కోరారు. ఊహించని విధంగా రజనీకాంత్ నరేంద్ర మోడీకి మద్దతు తెలుపుతున్నట్లు వెంటనే ప్రకటించడమే కాకుండా రేపు నరేంద్ర మోడీని స్వయంగా కలిసేందుకు బయలుదేరుతున్నారు.   రజనీకాంత్ కి తమిళనాట లక్షలాది అభిమానులున్నారు. అదేవిధంగా ఆంధ్ర, కర్నాటక, కేరళలో కూడా చాలా మంది అభిమానులున్నారు. ఆయన స్వయంగా బీజేపీ ప్రచారంలో పాల్గొనకపోయినా, తాను బీజేపీకి మద్దతు ఇస్తున్నాని చెపితే ఆయన అభిమానులు కూడా బీజేపీకే ఓట్లు వేసే అవకాశం ఉంది. ఇది తమిళనాడులో రెండు ప్రధాన ద్రవిడ పార్టీలయిన డీయంకే, అన్నాడీయంకేలకు మింగుడుపడని విషయమే. అది వారి విజయావకాశాల మీద కూడా పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే అలాగని ఆ రెండు పార్టీలు రజనీకాంత్ ని వేలెత్తి చూపే దుస్సాహసం చేయలేవు. ఇప్పుడు వాటి పరిస్థితి కుడితిలో పడిన ఎలుకల్లా తయారయిందని చెప్పవచ్చును. ఈ ఊపులో బీజేపీ మరి కొంతమంది సినీ తారలను పార్టీకి మద్దతు ఇచ్చేలా ప్రోత్సహిస్తే ఇక ఆ రెండు పార్టీలు తమ అతిశయం చంపుకొని కాంగ్రెస్, బీజేపీలను ఆశ్రయించక తప్పదేమో!

మోడీకి రజనీకాంత్ మద్దతు

        రాజకీయ రంగంలో మరో సంచలనం ఆవిష్కృతమైంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ బీజేపీకి మద్దతు ప్రకటించాడు. ఇప్పుడు మరో స్టార్ కూడా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నాడు. ఆ స్టార్ మరెవరో కాదు.. స్టార్లకే స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ మోడీకి మద్దతు పలకనున విషయం తమిళనాడు రాజకీయాలతోపాటు దేశ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. రజనీకాంత్ మోడీకి మద్దతు పలుకుతారన్న విషయాన్ని రజనీకాంత్ సన్నిహితుడు చో రామస్వామి వెల్లడించారు. ఆదివారం ఉదయం చెన్నైలోని రజనీకాంత్ నివాసానికి మోడీ వెళ్ళి రజనీని కలిసే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.ఈ అంశంపై చెన్నైలో ముందుగానే పోస్టర్లు వెలిశాయి.    

ఈ కత్తుల పొత్తుల మతలబేoది

  నిజామాబాద్ నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న తెరాస అభ్యర్ధి కవిత తన ప్రచారం ప్రారంభిస్తూ బీజేపీకి ఓటేస్తే అది సీమాంధ్రుడయిన చంద్రబాబుకి వేసినట్లే అనే ఒక సిద్ధాంతం ప్రతిపాదించారు. కానీ అదే నియోజక వర్గం నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధి ఎండల లక్ష్మీనారాయణ ఆమె కనిపెట్టిన సిద్ధాంతాన్నే తెరాసకు కూడా వర్తింపజేస్తూ, తెరాసకు ఓటేస్తే అది కాంగ్రెస్ కు వేసినట్లేనని ప్రచారం మొదలుపెట్టారు. బీజేపీ-తెదేపాలు పొత్తులు పెట్టుకొన్నాయి గనుక అవి ఎన్నికలలో గెలిస్తే అధికారం కూడా పంచుకోవచ్చును. గనుక ఆమె ఆవిధంగా ఆరోపణలు చేసి ఉండవచ్చును.   కానీ, తెరాస కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోకపోయినా కూడా ఎన్నికల తరువాత పరిస్థితులను బట్టి ఆ పార్టీకి మద్దతు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అంటే వారి మధ్య కూడా ఒక రహస్య అవగాహన ఉందని స్పష్టమవుతోంది. అయితే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్, తెరాస పార్టీలు రెండూ బద్ద శత్రువులులా ఒకదానిపై మరొకటి కత్తులు దూసుకొంటూ ప్రజలను మభ్యపెడుతున్నాయి. ఇప్పుడు ఆ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నపటికీ ఎన్నికల తరువాత వారు ఒకరికొకరు సహకరించుకోవడం ఖాయం. ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకి పూర్తి మెజార్టీ సాధించే అవకాశం లేదు. ఒకవేళ అది ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయిన మద్దతు కూడగట్టగలిగితే, అప్పుడు తెరాస తప్పకుండా దానికే మద్దతు ఇస్తుంది. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల్లో తెరాస చెప్పుకొంటున్నట్లు దానికి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశాలు లేవు గనుక ప్రభుత్వ ఏర్పాటుకి కాంగ్రెస్ మద్దతు తీసుకోక తప్పదు. కనుక తెరాసకు ఓటేస్తే కాంగ్రెస్ ఓటేసినట్లేనని బీజేపీ అభ్యర్ధి చేస్తున్న వాదన సమంజసమేనని చెప్పవచ్చును.   మరి ఎన్నికల తరువాత కలిసి పనిచేసే ఉద్దేశ్యం ఉన్నపుడు, కేసీఆర్ దురాశకు పోకుండా కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకొని ఉండి ఉంటే, ఓట్లు చీలకుండా ఉండేవి. కాంగ్రెస్-తెరాస కూటమికి మరిన్ని ఓట్లు పడేవి. కానీ అలా చేయకుండా ఈ ముసుగులో గుద్దులాటలు దేనికో ప్రజలను మభ్యపెట్టడం దేనికో వారే చెప్పాలి.

హిందూపురం నుంచి బాలయ్య పోటీ..రాణించగలడా?

      నందమూరి బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈనెల 16వ తేదీన బాలకృష్ణ నామినేషన్ వేయడానికి సన్నాహాలు కూడా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో నలుగుతున్న ఒకే ఒక ప్రశ్న ‘‘బాలకృష్ణ పాలిటిక్స్ లో రాణించగలడా?’’. బాలకృష్ణ స్వతహాగా తన తండ్రి మాదిరిగానే ఆవేశపరుడు. జీవితంలో ఎప్పుడైనా ఆవేశాన్ని ప్రదర్శించిన సందర్భాలే తప్ప రాజకీయాలు నడిపిన దాఖాలు లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి రాజకీయాలలో ఎంతవరకు రాణించగలడన్న సందేహాలు కలుగుతున్నాయి.   అలాగే సినిమా రంగంలో పొగడ్తలు అందుకుంటూ పెరిగిన బాలకృష్ణ రాజకీయ రంగంలో మీదపడే విమర్శలను తట్టుకోగలరా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. తన ‘కప్ ఆఫ్ టీ’ కాని విషయంలోకి బాలకృష్ణ అత్యుత్యాహంతో ఎంటరవుతున్నాడా అన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. రాజకీయాలు నడపటంలో సిద్ధహస్తుడైన తెలుగుదేశాధినేత చంద్రబాబునాయుడు కూడా ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అలాంటి వాతావరణంలోకి బాలకృష్ణ వచ్చి ఎలా నిలదొక్కుకుంటాడని జనం అనుకుంటున్నారు. అదీ కూడా చంద్రబాబు వద్దన్నా వినకుండా బాలకృష్ణ ఎన్నికలలో పోటీ చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనితోపాటు ఆయన రాజకీయాల కోసం తన సినిమా కెరీర్‌ని పణంగాపెడుతున్నారన్న ఆందోళన కొంతమంది అభిమానులలో వుంది. చాలాకాలం తర్వాత బాలకృష్ణకి ‘లెజెండ్’ రూపంలో భారీ విజయ అందింది. ఈ ఉత్సాహంలో కెరీర్‌లో మరింత ముందుకు వెళ్ళే అవకాశాలున్నాయి. వాటిని కాదనుకుని రాజకీయాల్లోకి దిగితే అది బాలకృష్ణ కెరీర్ మీదే ప్రభావం చూపించే ప్రమాదం వుందని భయపడుతున్నారు. ఎవరు ఎన్ని అనుకున్నా బాలకృష్ణ రాజకీయాల్లో రాణించడగలడా లేదా అనే విషయం అతి కొద్దికాలంలోనే తేలిపోనుంది.  

గుల్జార్‌కి ఫాల్కే పురస్కారం

      ప్రముఖ హిందీ సినిమా పాటల రచయిత, దర్శకుడు గుల్జార్‌కి భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. కవిగా, అనువాదకుడిగా, సినీ గీత రచయితగా, దర్శకుడిగా పలు రంగాలలో విశేష కృషి చేసిన గుల్జార్ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి అన్నివిధాలా అర్హుడు. 1936, ఆగష్టు 18న ప్రస్తుత పాకిస్తాన్ భూభాగంలోని దినాలో సిక్కు కుటుంబంలో గుల్జార్ జన్మించారు. దేశ విభజన తరువాత ఆయన కుటుంబం ఢిల్లీకి వలస వచ్చింది.   గుల్జార్ అసలుపేరు సంపూర్ణసింగ్. హిందీ, ఉర్దూ, పంజాబీ భాషలలో రచనలు చేసి పేరు సంపాదించిన గుల్జార్ 2004 లో భారత ప్రభుత్వపు పద్మభూషణ్ అవార్డును, 2002లో సాహిత్య అకాడమీ అవార్డును పొందగా ఇటీవల ప్రపంచ సినీ రంగంలో ప్రఖ్యాతమైన ఆస్కార్ అవార్డును బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో పొందినాడు. ఇప్పుడు ఆయన కీర్తి కిరీటంలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా చేరింది. గుల్జార్‌ని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు ఎంపిక చేయడం పట్ల భారతీయ సినిమా రంగంలో హర్షం వ్యక్తమవుతోంది.

రాహుల్ గాంధీ నామినేషన్: 500 కిలోల పూలు!

      కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం నాడు అమేథీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో, అత్యంత విలాసంగా నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. మిగతావన్నీ అలా వుంచితే, ఈ కార్యక్రమం కోసం 5 వందల కిలోల పూలు కొనుగోలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఆయన మీద చల్లడంతోపాటు రాహుల్ గాంధీ ఎంతదూరం నడిస్తే అంతదూరం పూలమీదే నడిచే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ఏర్పాట్లన్నీ చూసి స్థానికులు చిరాకుపడుతున్నారు. ఇలాంటి బిల్డప్పులు అవసరమా అని అనుకుంటున్నారు.

మధు యాష్కిని ఓటమి భయం పట్టుకుంది!

      నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ మధు యాష్కికి ఓటమి భయం పట్టుకున్నట్టుంది. ఈ స్థానం నుంచి యాష్కికి పోటీగా తెరాస అధినేత కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెరాస వారితో, టీ కాంగ్రెస్ నేతలతో పోటీపడి మరీ సీమాంధ్రుల మీద నోరు పారేసుకున్న యాష్కి తనకు మరోసారి గెలుపు ఖాయమని నమ్ముతూ వచ్చారు.   కవిత కూడా తనమీద పోటీ చేయదని మొన్నటి వరకూ భావిస్తూ వచ్చిన మధు యాష్కి తాను అనుకున్నట్టు జరగకపోవడంతో షాకయ్యారు. మొదట్లో తన గెలుపు మీద బీరాలు పలికినప్పటికీ రోజులు గడుస్తున్నకొద్దీ ఆయనలో ఓటమి భయం పెరిగిపోతూ వుంది. కవితకు మహిళల ఓట్లు మొత్తం టర్న్ అయ్యే అవకాశం వుంది. అది తన ఓటమికి దారి తీయొచ్చన్న అనుమానం ఆయనలో కలుగుతోంది. ఈ భయాలు, అనుమానాలతో ఆయన మాట్లాడుతున్న మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. తనను ఓడించడానికి కేసీఆర్, కేవీపీ రామచంద్రరావు కుమ్మక్కయ్యారని విచిత్రమైన ఆరోపణలు ఆయన చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒక్కటై తనమీద కవితని నిలబెట్టాలని డిసైడ్ చేశారట. మధు యాష్కి వ్యవహారశైలి చూస్తున్న కాంగీయులు ఆయన మీద జాలి పడుతున్నారు. ఎన్నికల ముందే తన ఓటమిని తానే డిసైడ్ చేసుకున్నట్టు మాట్లాడుతున్న ఆయనని ఆ దేవుడే కాపాడాలని అనుకుంటున్నారు. ఓడిపోయిన తర్వాత చేయాల్సిన ఆరోపణలు ఇప్పుడే మధుయాష్కి చేస్తున్నారని అంటున్నారు.

చంద్రబాబు కోటరీ కొంప ముంచుతుందా?

      చంద్రబాబు నాయుడు చుట్టూ వున్న కోటరీ ఈసారీ ఆయన కొంప ముంచేలా వుందన్న ఆందోళన తెలుగుదేశం పార్టీలో వ్యక్తమవుతోంది. చంద్రబాబు తన చుట్టూ వుండే వారి విషయంలో గత రెండు ఎన్నికల సందర్భంలో ఎలాంటి పొరపాట్లు చేశారో, ఈ ఎన్నికల సమయంలో కూడా అలాంటి పొరపాట్లే చేస్తున్నారని వారు అంటున్నారు.   ప్రస్తుతం చంద్రబాబు చుట్టూ వున్నవారు చంద్రబాబుకి సరైన గైడెన్స్ ఇవ్వడం లేదన్న ఆరోపణలు వున్నాయి. అలాగే వారు చంద్రబాబుని తప్పుదారిలో నడిపిస్తున్నారన్న ఆవేదన కూడా పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం  చంద్రబాబుకు రైట్ హ్యాండ్‌గా వున్న ఒక నాయకుడి విషయంలో పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీని నమ్ముకుని, పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి, ఎన్నో త్యాగాలు చేసిన వారు పార్టీకి దూరమవ్వడానికి ఆ వ్యక్తి కారణమవుతున్నారని అంటున్నారు. గతంలో తెలంగాణలో టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే టీడీపీకి మేలు జరుగుతుందని చంద్రబాబుకు బ్రెయిన్ వాష్ చేసి ఒప్పించిన సదరు వ్యక్తి ఆ నిర్ణయం ద్వారా తెలుగుదేశం పార్టీకి చాలా నష్టం కలిగించారు. ఇప్పుడు అదే వ్యక్తి చంద్రబాబు వెంటే వుంటూ ఆయన్ని తప్పుదోవలో నడిపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీమాంధ్రలోని చాలా స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అంతగా బలం లేని అభ్యర్థులను నిలబెట్టడానికి ఆ వ్యక్తే కారణమని కార్యకర్తలు విమర్శిస్తున్నారు. సదరు వ్యక్తితోపాటు చంద్రబాబు చుట్టూ వున్న మరికొందరు వ్యక్తులు కూడా ఆయనకి రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారని అంటున్నారు. ఈ కోటరీ ఈసారి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కొంప ముంచేస్తుందేమోనన్న భయాందోళలను కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.  

16న బాలయ్య నామినేషన్

  హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి బాలకృష్ణ పోటీ చేయడం కన్ఫర్మ్ కావడంతో బాలకృష్ణ అభిమానులలో, హిందూపురం తెలుగుదేశం కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు ఉరకలు వేస్తున్నాయి. నందమూరి తారక రామారావు పోటీచేసి విజయాలు సాధించిన స్థానం నుంచి ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ పోటీ చేయడం తమకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. స్థానిక ప్రజలు కూడా బాలకృష్ణ పోటీ పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. ఈనెల 16వ తేదీన బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించడానికి అప్పుడే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఆరోజు రాష్ట్రవ్యాప్తంగా వున్న అనేకమంది బాలకృష్ణ అభిమానులు ఆ కార్యక్రమానికి తరలి వెళ్ళనున్నారని తెలుస్తోంది.

హిందూపురం నుంచి బాలయ్య పోటీ!

      అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బాలకృష్ణ పోటీ చేయడానికి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. హిందూపురం స్థానం నుంచి పోటీ చేస్తానని బాలకృష్ణ గతంలోనే ప్రకటించారు. అయితే ప్రస్తుతం వున్న రాజకీయ పరిస్థితుల్లో బాలకృష్ణ పోటీ చేయకపోవడమే ఉత్తమమని చంద్రబాబు సూచించినప్పటికీ బాలకృష్ణ పోటీ చేయడానికే నిర్ణయించుకున్నారు. ఒకవైపు హిందూపురం తెలుగుదేశం కార్యకర్తలు కూడా బాలకృష్ణ పోటీ చేయడానికి అనుమతి ఇవ్వాలని చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. శనివారం ఉదయం బాలకృష్ణ తనను మరోసారి కలిసి పోటీ మీద ఆసక్తి కనబరచడంతో చంద్రబాబుకు ఇష్టం లేనప్పటికీ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేయడానికి చంద్రబాబు అంగీకరించారన్న వార్తలు రావడంతో హిందూపురం నియోజకవర్గం టీడీపీ కార్యకర్తల్లో, బాలకృష్ణ అభిమానుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి.