ఈ కత్తుల పొత్తుల మతలబేoది
posted on Apr 12, 2014 @ 5:45PM
నిజామాబాద్ నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న తెరాస అభ్యర్ధి కవిత తన ప్రచారం ప్రారంభిస్తూ బీజేపీకి ఓటేస్తే అది సీమాంధ్రుడయిన చంద్రబాబుకి వేసినట్లే అనే ఒక సిద్ధాంతం ప్రతిపాదించారు. కానీ అదే నియోజక వర్గం నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధి ఎండల లక్ష్మీనారాయణ ఆమె కనిపెట్టిన సిద్ధాంతాన్నే తెరాసకు కూడా వర్తింపజేస్తూ, తెరాసకు ఓటేస్తే అది కాంగ్రెస్ కు వేసినట్లేనని ప్రచారం మొదలుపెట్టారు. బీజేపీ-తెదేపాలు పొత్తులు పెట్టుకొన్నాయి గనుక అవి ఎన్నికలలో గెలిస్తే అధికారం కూడా పంచుకోవచ్చును. గనుక ఆమె ఆవిధంగా ఆరోపణలు చేసి ఉండవచ్చును.
కానీ, తెరాస కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోకపోయినా కూడా ఎన్నికల తరువాత పరిస్థితులను బట్టి ఆ పార్టీకి మద్దతు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అంటే వారి మధ్య కూడా ఒక రహస్య అవగాహన ఉందని స్పష్టమవుతోంది. అయితే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్, తెరాస పార్టీలు రెండూ బద్ద శత్రువులులా ఒకదానిపై మరొకటి కత్తులు దూసుకొంటూ ప్రజలను మభ్యపెడుతున్నాయి. ఇప్పుడు ఆ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నపటికీ ఎన్నికల తరువాత వారు ఒకరికొకరు సహకరించుకోవడం ఖాయం. ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకి పూర్తి మెజార్టీ సాధించే అవకాశం లేదు. ఒకవేళ అది ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయిన మద్దతు కూడగట్టగలిగితే, అప్పుడు తెరాస తప్పకుండా దానికే మద్దతు ఇస్తుంది. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల్లో తెరాస చెప్పుకొంటున్నట్లు దానికి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశాలు లేవు గనుక ప్రభుత్వ ఏర్పాటుకి కాంగ్రెస్ మద్దతు తీసుకోక తప్పదు. కనుక తెరాసకు ఓటేస్తే కాంగ్రెస్ ఓటేసినట్లేనని బీజేపీ అభ్యర్ధి చేస్తున్న వాదన సమంజసమేనని చెప్పవచ్చును.
మరి ఎన్నికల తరువాత కలిసి పనిచేసే ఉద్దేశ్యం ఉన్నపుడు, కేసీఆర్ దురాశకు పోకుండా కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకొని ఉండి ఉంటే, ఓట్లు చీలకుండా ఉండేవి. కాంగ్రెస్-తెరాస కూటమికి మరిన్ని ఓట్లు పడేవి. కానీ అలా చేయకుండా ఈ ముసుగులో గుద్దులాటలు దేనికో ప్రజలను మభ్యపెట్టడం దేనికో వారే చెప్పాలి.