కరీంనగర్‌లో సోనియాగాంధీ కళ్ళు తిరగాలి

      బుధవారం సాయంత్రం కరీంనగర్‌లో జరగబోతున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగసభలో సోనియాగాంధీకి కళ్ళు తిరిగేలా చేయాలని టీ కాంగ్రెస్ నాయకులు గట్టి పట్టుదల మీద వున్నట్టు సమాచారం. సోనియా కళ్ళు తిరగడం అంటే, సభకు హాజరైన జనాన్ని చూసి సోనియాగాంధీ ఆశ్చర్యపోవడంతోపాటు ఆనందించాలన్నది టీ కాంగ్రెస్ నాయకుల అసలు ఉద్దేశం.   ఢిల్లీలో కూర్చున్న సోనియా తాను అడ్డదారిలో తెలంగాణ ఇచ్చేయడం వల్ల తెలంగాణ ప్రాంత ప్రజలు తనను దేవతలా భావిస్తున్నారని భావిస్తున్నారు. అలాంటి సోనియాగాంధీ తన బహిరంగ సభలో జనం తక్కువగా కనిపిస్తే హర్టయి, టీ కాంగ్రెస్ నేతలకు క్లాసు పీకే అవకాశం వుంది కాబట్టి టీ కాంగ్రెస్ నాయకులు  సభ నిండుగా వుండేలా సకల చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. కరీంనగర్ పరిసర ప్రాంతాల నుంచి భారీగా జనసమీకరణ చేయాలని నిర్ణయించిన టీ కాంగ్రెస్ నేతలు దానికోసం ఎవరి వంతు కృషి వారు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి మాత్రమే కాకుండా, కరీంనగర్‌కి సమీపంలో వున్న ఇతర తెలంగాణ జిల్లాల నుంచి కూడా జనాన్ని భారీగా సమీకరించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.  

పొట్లూరి ప్రసాద్‌ని ఓదార్చిన పవన్ కళ్యాణ్

      కర్నాటకలో ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకుని హైదరాబాద్‌కి వచ్చిన పవన్ కళ్యాణ్‌తో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి తెలుగుదేశం టిక్కెట్ ఆశించి భంగపడిన పొట్లూరి ప్రసాద్ సమావేశమయ్యారు. టిక్కెట్ వచ్చినట్టే వచ్చి మిస్ కావడం పట్ల పొట్లూరి ప్రసాద్ పవన్ కళ్యాణ్ దగ్గర తన ఆవేదనని వ్యక్తం చేయగా, పవన్ కళ్యాణ్ అతని ఓదార్చినట్టు తెలుస్తోంది. ఈ టిక్కెట్ విషయంలో చంద్రబాబు తన చాణక్య నీతిని ప్రదర్శించారని, తాను ఎవరికి టిక్కెట్ ఇవ్వదలుచుకున్నారో అతనికే ఇచ్చారని పొట్లూరి ప్రసాద్ పవన్‌తో అనగా, మనకీ అవకాశం వస్తుందని, అప్పుడు మన పవర్ చూపిద్దాం అని పవన్ అన్నట్టు సమాచారం. నామినేషన్లకు ఇంకా సమయం వుంది కాబట్టి చివరి నిమిషం వరకూ ఆశలు కోల్పోవద్దని పవన్ కళ్యాణ్ పొట్లూరి ప్రసాద్‌కి చెప్పినట్టు తెలుస్తోంది.

హిందూపురంలో బాలకృష్ణ నామినేషన్

      నటుడు, టిడిపి నేత నందమూరి బాలకృష్ణ ఈరోజు హిందూపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టాలన్నబాలకృష్ణ చిరకాల కోరిక ఈరోజు హిందూపూర్ నుండి నామినేషన్ వేయడంతో నెరవేరింది. హిందూపురంలో సుగూర ఆంజనేయ స్వామి దేవాలయంలో బాలయ్య కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్ళి నామినేషన్ దాఖలు చేశారు. బాలకృష్ణను చూసేందుకు హిందూపురంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో హిందూపురం రోడ్లు జనసంద్రమయ్యాయి. అభిమానులు, కార్యకర్తలు రోడ్ల మీదే కాకుండా బిల్డింగులు, చెట్లపైకి ఎక్కి బాలయ్యకు అభివాదం చేస్తూ... పూల వర్షం కూరిపించారు.

ఎన్నికల ప్రచారం: కేసీఆర్ నోరు కుట్టేస్తారా?

      తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ నోటిని కుట్టేయడానికి ఎన్నికల సంఘం ఆలోచిస్తోందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవకాశాలున్నాయన్న సంకేతాలు వస్తున్నాయి. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా ప్రాంతీయ విద్వేషాలు రగిలేలా మాట్లాడ్డం, అలా మాట్లాడ్డం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం అలవాటైపోయింది.   ఆ అలవాటును ఆయన  ఈ ఎన్నికల సందర్భంగా కూడా కొనసాగిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కేసీఆర్ నాలుగైదు సందర్భాలలో మీడియాతో మాట్లాడినప్పుడు, బహిరంగసభలో తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. సీమాంధ్రులకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. తెలంగాణలో ఓట్లు దండుకోవడానికే కేసీఆర్ ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. అయితే కేసీఆర్ ధోరణిని తెలంగాణ టీడీపీ వ్యతిరేకిస్తోంది. ఎన్నికలు పూర్తయ్యేవరకూ కేసీఆర్ బహిరంగ సభల్లో మాట్లాకుండా నిషేధించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి విజ్ఞప్తి చేసింది. కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రాంతీయ విద్వేషాలు తలెత్తేలా మాట్లాడుతున్నారని ఫిర్యాదు చేసింది. సోమవారం రోజున నల్గొండలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడిన తీరును టీ టీడీపి ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ నోటికి తాళం వేయాలని ఎన్నికల కమిషనర్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.

కరీంనగర్‌ లో సోనియా ఏం చెబుతారో

      రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తొలిసారిగా తెలంగాణాలో అడుగుపెట్టనున్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైన తరువాత సోనియా బహిరంగంగా ఎక్కడా మాట్లాడలేదు. అయితే ఈ రోజు కరీంనగర్‌ లో తెలంగాణ గురుంచి తొలిసారిగా మాట్లాడుతుండడంతో, ఆమె ఏం మాట్లాడుతారోనన్న ఆసక్తి అటు కాంగ్రెస్ నేతల్లోను ఇటు ప్రతిపక్ష నేతల్లోను నెలకొంది. తెలంగాణ ఏర్పాటుతో పాటు భవిష్యత్‌లో తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కూడా సోనియాగాంధీతో ఇక్కడ నుంచి ప్రకటన చేయించే దిశగా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సభకు కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు లక్షా 50 వేల మందిని సమీకరించాలనే లక్ష్యం పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 40 వేల వరకు జనసమీకరణ జరపాలని చూస్తున్నారు. సోనియా గాంధీ ప్రత్యేక హెలికాప్టర్ లో కరీంనగర్ రానున్నారు.4 నుంచి 4:30 వరకూ సభలో పాల్గొంటారు.

నేడే బాలకృష్ణ నామినేషన్

  ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టాలన్నబాలకృష్ణ చిరకాల కోరిక ఈరోజు హిందూపూర్ నుండి నామినేషన్ వేయడంతో నెరవేరనుంది. ఆయన ఈరోజు తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుండి విమానంలో బెంగుళూరు వెళ్లి అక్కడి నుండి రోడ్డు మార్గాన్న హిందూపురం చేరుకొంటారు. మధ్యాహ్నం 11.30గంటలకు నామినేషన్ వేస్తారు. బాలకృష్ణ మొట్ట మొదటిసారిగా హిందూపురం నుండే ఎన్నికలలో పోటీ చేస్తున్నందున అక్కడ తెలుగు తమ్ముళ్ళు చాలా ఉతాషంగా ఉన్నారు. బాలకృష్ణను భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో చాలా అట్టహాసంగా ఊరేగింపుతో వెళ్లి నామినేషన్ వేయించేందుకు స్థానిక నేతలు, కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. నామినేషన్ వేసిన తరువాత బాలకృష్ణ హిండుపురంలో పార్టీ శ్రేనులని, అభిమానులతో సమావేశం అవుతారు.

ప్రియాంక తప్పతాగుతుంది: సుబ్రహ్మణ్యస్వామి

      తన వ్యాఖ్యలతో ఎప్పుడూ సంచలనం సృష్టిస్తూ వుండే సుబ్రహ్మణ్యస్వామి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక మీద సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక, ఆమె భర్త తప్పతాగి తిరుగుతూ వుంటారని, వారణాసిలో ప్రియాంక కనుక పోటీ చేస్తే అక్కడి జనం పచ్చి తాగుబోతు అయిన ఆమెని తరిమికొట్టేవారని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ప్రియాంక వారణాసి నుంచి పోటీ చేయకుండా అడ్డుకుని ఆమె కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంచి పని చేశారని, ఆమె అక్కడ నుంచి పోటీచేస్తే అవమానాల పాలై వుండేదని అన్నారు. తప్పతాగి తిరిగే వారిగా ప్రియాంకకి, ఆమె భర్తకి ఇప్పడికే చాలా చెడ్డ పేరు వచ్చేసిందని సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యానించారు. సుబ్రహ్యణ్య స్వామి ప్రియాంక మీద చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ఆగ్రహం రగిల్చింది.

టీడీపీ మీద పగబట్టిన పవన్ కళ్యాణ్?

      విజయవాడ ఎంపీ టిక్కెట్‌ని తన స్నేహితుడు పొట్లూరి ప్రసాద్‌కి ఇస్తానని చెప్పి, చివరికి హేండ్ ఇచ్చిన టీడీపీ మీద, ఆ పార్టీ అధినేత చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ పగబట్టినట్టున్నాడు. అందుకే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రంగంలో వున్న మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయబోతున్నాడు.   ఈ నియోజకవర్గం నుంచి పోటీలో వున్న లోక్‌సత్తా అభ్యర్థి జయప్రకాష్ నారాయణకి అనుకూలంగా తాను ప్రచారం చేయబోతున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించడం పవన్ మనసులో వున్న ‘పగ’కి అద్దం పడుతోంది. మల్కాజ్‌గిరి నుంచి తొలుత తాను పోటీ చేయాలని పవన్ భావించాడట. అయితే జయప్రకాష్ నారాయణ అక్కడి నుంచి పోటీ చేస్తున్నట్టు తెలియడంతో పవన్ కళ్యాణ్ తన పోటీ ఆలోచనని మానుకున్నాడట. ఇప్పుడు జేపీ గెలుపు కోసం ప్రచారం కూడా చేయబోతున్నాడట. మల్కాజ్‌గిరిలో జేపీకి ప్రచారం చేస్తే అది ఎన్డీయేకి, బీజేపీకి, తెలుగుదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేసినట్టే అవుతుంది. రాష్ట్రంలో ఒకవైపు బీజేపీ – టీడీపీ  కూటమిని గెలిపించాలని ప్రచారం చేస్తూనే, మరోవైపు మల్కాజ్‌గిరిలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలంటూ ప్రచారం చేస్తానని పవన్ ప్రకటించడం ఏంటో అర్థంకాక బీజేపీ, టీడీపీ వర్గాలు జుట్టు పీక్కుంటున్నాయి. ‘గబ్బర్ సింగ్’ సినిమాలో చెప్పినట్టు పవన్ కళ్యాణ్‌కి కొంచెం కాదు.. చాలా తిక్కుందని.. దానికి అసలు లెక్కేలేదని అనుకుంటున్నారు.

కేశినేని ఇక పండగ చేసుకోవచ్చా?

  ఈసారి ఒక్క సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీలో తప్ప మిగిలిన అన్ని పార్టీలలో అభ్యర్ధులకు టికెట్స్ టెన్షన్ తప్పలేదు. రెండేళ్ళ క్రితమే విజయవాడ నుండి లోక్ సభకు పోటీ చేసేందుకు కేశినేని నానికి చంద్రబాబు హామీ ఇచ్చినప్పటికీ, చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ పొట్లూరి వర ప్రసాద్ టికెట్ ఇమ్మని పట్టుబట్టడంతో కేశినేనికి కూడా చివరి నిమిషం వరకు టెన్షన్ తప్పలేదు. కానీ, ఆయన పట్టిన పట్టు విడవకుండా గట్టిగా నిలబడటంతో చివరికి ఆయనకే చంద్రబాబు టికెట్ ఖరారు చేసి బీ-ఫారం కూడా అందజేసారు. దీనితో ఒక అధ్యాయం ముగిసింది. అయితే ఇల్లలకగానే పండగ కాదన్నట్లు, ఇక బలమయిన వైకాపా అభ్యర్ది కోనేరు ప్రసాదుని ఎన్నికలలో డ్డీ కొని ఓడించాల్సి ఉంటుంది. అప్పుడే పండగయినా!

పొట్లూరి ప్రసాద్ పోటీ చేస్తే తప్పేంటి? పవన్ కళ్యాణ్ ప్రశ్న!

  విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పొట్లూరి ప్రసాద్ పోటీ చేస్తే తప్పేంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కి సన్నిహితుడైన పొట్లూరి ప్రసాద్ విజయవాడ నుంచి తెలుగుదేశం ఎంపీ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్కామ్స్ లో వున్న పొట్లూరి ప్రసాద్ ఎన్నికలలో పోటీ చేయడమేంటి? దానికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడమేంటన్న ప్రశ్నలు వినిపించాయి. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. పొట్లూరి ప్రసాద్ తన మిత్రుడే తప్ప తాను పొట్లూరి ప్రసాద్‌కి విజయవాడ ఎంపీ టిక్కెట్ కోసం రికమండ్ చేయలేదని చెప్పారు. అలాగే పొట్లూరి ప్రసాద్‌కి సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చిందని, లక్షల కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్న జగన్ ఎన్నికలలో పోటీచేయగా లేని తప్పు సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చిన పొట్లూరి ప్రసాద్ పోటీ చేస్తే తప్పేమిటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

గుంటలో పడ్డ మాగుంట?

      కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి బుధవారం ఉదయం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశాధినేత చంద్రబాబు నాయుడు మాగుంటకు పసుపు కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా మాగుంట చంద్రబాబుని పొగిడితే, చంద్రబాబు మాగుంటని మునగ చెట్టెకించారు. అయితే మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలుగుదేశం పార్టీలోకి చేరడం ఆయన సన్నిహితులకు ఎంతమాత్రం ఇష్టం లేనట్టు తెలుస్తోంది.   తెలుగుదేశం పార్టీలో చేరడం అంటే మాగుంట తెలిసీ తెలిసీ గుంటలో పడ్డట్టేనని వారు భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవలి కాలంలో ఏ సంస్థ సర్వే నిర్వహించినా సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ స్థానాన్ని గెలుస్తుందని ఫలితాలు వచ్చాయని,  ఆ ఒక్క ఎంపీ ఎవరో కాదు.. మాగుంట శ్రీనివాసులురెడ్డేనని వారు భావిస్తున్నారు. ఎలాగూ గెలిచే అవకాశం వున్న మాగుంట ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరడం వల్ల తన ఇండివిడ్యువాలిటీని కోల్పోయే ప్రమాదం వుందని, అలాగే చంద్రబాబు నియంతృత్వాన్ని కూడా భరించాల్సి రావొచ్చునని భయపడుతున్నారు.  పార్టీ మారేదేదో తెలుగుదేశంలోకి కాకుండా భారతీయ జనతాపార్టీలోకి మారి వుంటే బాగుందేదని వారు భావిస్తున్నారు.

జూ.యన్టీఆర్ పై తెదేపాలో అప్రకటిత నిషేధం ఉందా?

  చంద్రబాబు నాయుడు ఈసారి పార్టీ ప్రచారం కోసం జూ.యన్టీఆర్ ని ఆహ్వానించకపోయినా కనీసం అతని గురించి సానుకూలంగా కూడా మాట్లాడలేదు. నారా లోకేష్ కూడా ‘అతను వస్తే రావచ్చునన్నట్లు’ మాట్లాడారే తప్ప రమ్మని పిలవలేదు. ఇక బాలకృష్ణ సంగతి సరేసరి! జూ.యన్టీఆర్ అనే ఒక వ్యక్తి ఉన్నడనే సంగతి కూడా ఆయనకు గుర్తులేనట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీలో ఈ ముగ్గురు ప్రముఖుల అనాసక్తి చూసిన మిగిలిన నేతలు కూడా ఎక్కడా కూడా అసలు జూ.యన్టీఆర్ ప్రసక్తి రాకుండా జాగ్రత్తపడుతున్నారు. కానీ, ప్రజల తరపున అడిగేందుకు మీడియా ఉండనే ఉంది.   మొన్న వల్లభనేని వంశీకి గన్నవరం టికెట్ ఖాయం అయిన సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతున్నపుడు, “మీకు జూ.యన్టీఆర్ చాల మంచి స్నేహితుడు కదా! ఆయనను మీరయినా గన్నవరంలో ప్రచారానికి ఆహ్వానిస్తారా?” అని హటాత్తుగా మీడియా వాళ్ళు ప్రశ్నించేసరికి ఆయన కొంచెం ఇబ్బందిపడ్డారు. అయితే మళ్ళీ తేరుకొని “రాజకీయాలు వేరు వ్యక్తిగత విషయాలు వేరు. ఈ విషయంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే తగిన నిర్ణయం తీసుకొంటారు” అని జవాబిచ్చారు.   ఇది చూస్తే పార్టీలో జూ.యన్టీఆర్ పై ఎంతగా అప్రకటితమయిన నిషేధం ఉందో స్పష్టమవుతోంది. పార్టీ నుండి ఏమీ ఆశించకుండా, కోట్లు వచ్చే తన సినిమాలను కూడా పక్కనబెట్టి పార్టీకి ప్రచారం చేసిన జూ.యన్టీఆర్ వంటి పార్టీ విధేయుడిని పార్టీకి దూరంగా పెట్టడం వలన అతనికేమీ నష్టం ఉండబోదు. కాకపోతే అతనిని వేరే పార్టీ వాళ్ళు ఆకర్షించి తమవైపు తిప్పుకొంటే, అప్పుడు తెదేపానే తీరికగా చింతించవలసి ఉంటుంది.

ప్రియాంకా.. గీత దాటొద్దు: వరుణ్‌ హెచ్చరిక!

      నా తమ్ముడు వరుణ్ గాంధీ తప్పుడు దారిలో నడుస్తున్నాడని, అతనిని దారిలో పెట్టాల్సిన అవసరం వుందని ప్రియాంక చేసిన కామెంట్లు అటు తిరిగి, ఇటు తిరిగి ఆమె మెడకే చుట్టుకుంటున్నాయి. ప్రియాంక ఎక్కువగా మాట్లాడుతోందని, అలా మాట్లాడితే మర్యాదగా వుండదని వరుణ్ గాంధీ తల్లి మేనకాగాంధీ ఇప్పటికే ప్రియాంకని హెచ్చరించింది. ఇప్పుడు వరుణ్ గాంధీ కూడా ప్రియాంక మీద మాటల దాడి చేశాడు. ప్రియాంక అనుకుంటున్నట్టు, ప్రచారం చేస్తున్నట్టు తానెప్పుడూ తప్పు దారిలో నడవటం గానీ, గీత దాటడం కానీ చేయలేదని అయితే ప్రియాంక తనమీద కామెంట్లు చేయడం ద్వారా గీత దాటిందని అన్నాడు. ప్రియాంక గీత దాటకుండా వుంటే బాగుండేదని కౌంటర్ ఇచ్చాడు. తన విషయంలో మరోసారి గీతదాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించాడు.

జగన్ మీద లోకేష్ డైరెక్ట్ ఎటాక్!

      వైకాపా అధినేత జగన్ తెలుగుదేశాధినేత చంద్రబాబు మీద విమర్శలు చేస్తుంటే, జగన్ మీద చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ మాటలతో డైరెక్ట్ ఎటాక్ చేస్తున్నాడు. జగన్ దోచుకున్న లక్ష కోట్ల రూపాయలను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కక్కిస్తామని నారా లోకేష్ చెప్పాడు. ఆ కక్కించిన డబ్బు ఏం చేస్తావు నాయనా అని అడిగితే, రైతుల రుణాల మాఫీకి ఆ డబ్బు సరిపోతుందని సమాధానమిచ్చాడు. జగన్ తాను అధికారంలోకి వచ్చాక ఈ ఫైలు మీద సంతకం చేస్తా.. ఆ ఫైలు మీద సంతకం చేస్తానని చెబుతున్నాడని, అయితే కేవలం నాలుగు సంతకాలతోనే ప్రజల సొమ్మంతా దోచుకునే తెలివిగల వ్యక్తి జగన్ అని నారా లోకేష్ విమర్శించాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 40 ఏళ్ళ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు కావాలి? లేక 16 నెలలు జైలులో వున్న జగన్ కావాలా అని లోకేష్ ఓటర్లని ప్రశ్నిస్తున్నాడు.

హిందూపురం నుంచి బాలకృష్ణ: ఏడవలేక నవ్వుతున్న సిట్టింగ్

      నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వుండటం ఆయన అభిమానులలో, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ ఉత్సాహభరితమైన వాతావరణంలో గురువారం నాడు బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేబోతున్నారు. అంతటా ఉత్సాహంగానే వున్నారు. అందరూ హాయిగా నవ్వుతున్నారు. హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ కూడా అందరితోపాటు నవ్వుతున్నారు.   బాలకృష్ణ కోసం తన సీటు త్యాగం చేయడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని నవ్వుతూ చెబుతున్నారు. కానీ ఆ నవ్వు వెనుక బోలెడంత ఏడుపు వుందని, ఆయన ఏడవలేకే నవ్వుతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈసారి తెలుగుదేశం సీమాంధ్రలో పవర్లోకి వస్తే తనకి మంత్రిపదవి దక్కుతుందని ఇంతకాలం ఆశించిన ఆయన తన స్థానం నుంచి బాలకృష్ణ పోటీ చేయడానికి అంగీకరించడంతో నిరాశకు గురయ్యారు. అయితే తన నిరాశను బయటపెట్టే సాహసాన్ని కూడా ఆయన చేయలేకపోతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు మంత్రి పదవి లేదు, ఎమ్మెల్యే పదవి కూడా వుండదు. నియోజకవర్గంలోని మిగతా కార్యకర్తల తరహాలోనే తాను కూడా బాలకృష్ణ వెంట తిరిగే కార్యకర్తలా వుండిపోవాల్సి వస్తుందన్న ఆవేదన అబ్దుల్ ఘనీలో ఘనీభవించి వుందని తెలుస్తోంది.

దేశమంతటా పవన్ కళ్యాణ్ ప్రచారం?

      బీజేపీకి చేరువైన పవన్ కళ్యాణ్ మొదట ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి అంగీకరించాడు. ఆ తర్వాత తన ప్రచార సేవలను విస్తరించి కర్నాటకలో కూడా మంగళవారం నాడు ప్రచారం చేయడానికి అంగీకరించాడు. పవన్ కళ్యాణ్ కర్నాటకలో మాత్రమే కాకుండా, దేశంలో తెలుగువారు ఉన్న ఏ రాష్ట్రంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కర్నాటకలోని కోలార్‌లో పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో తానే బయటపెట్టాడు. మోడీకి ప్రచారం చేయడానికి ఒక్క కర్నాటక మాత్రమే కాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ప్రచారం చేయడానికి సిద్ధంగా వున్నానని పవన్ ప్రకటించాడు. మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడకి వెళ్ళాన్నా, ప్రచారం చేయమన్నా తాను సిద్ధంగా వుంటానని పవన్ ప్రకటించాడు. పవన్ ఇలా ప్రకటించడం బీజేపీ నాయకులకు సంతోషాన్ని కలిగిస్తోంది.

కర్ణాటక ప్రచారం: పవర్ తగ్గిన పవన్ ప్రసంగం!

      కర్నాటకలోని మూడు ప్రాంతాలలో బుధవారం నాడు పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమాలు భారతీయ జనతాపార్టీ ఏర్పాటు చేసింది. పవన్ కళ్యాణ్ మొదట కోలార్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన రెండు సభలలో పవన్ కళ్యాణ్ ఎంతో దూకుడుగా మాట్లాడారు. కర్నాటకలో కూడా అదే తరహా దూకుడుని, పవర్ని ప్రదర్శిస్తారని అందరూ అనుకున్నారు. అయితే పవన కళ్యాణ్ అలాంటి పవర్‌తో కూడిన ప్రసంగం చేయకుండా, ఆగి ఆగి, ఆచితూచి, మెల్లమెల్లగా ప్రసంగించాడు. ఈ తరహా ప్రసంగాన్ని ఆయన నుంచి ఊహించని ప్రజలు, బీజేపీ నాయకులు తెల్లబోయారు. పవన్ సుదీర్ఘంగా ప్రసంగించినప్పటికీ ఆ ప్రసంగం ఉత్తేజభరితంగా లేకపోవడం నిరాశని కలిగించిందని కొందరు అంటున్నారు. కోలార్ సభ తర్వాత బీజేపీ వర్గాలు పవన్‌ని కలిసి మిగిలిన రెండు సభల్లో మాంచి పవరున్న ప్రసంగం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం.