గుల్జార్‌కి ఫాల్కే పురస్కారం
posted on Apr 12, 2014 @ 4:20PM
ప్రముఖ హిందీ సినిమా పాటల రచయిత, దర్శకుడు గుల్జార్‌కి భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. కవిగా, అనువాదకుడిగా, సినీ గీత రచయితగా, దర్శకుడిగా పలు రంగాలలో విశేష కృషి చేసిన గుల్జార్ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి అన్నివిధాలా అర్హుడు. 1936, ఆగష్టు 18న ప్రస్తుత పాకిస్తాన్ భూభాగంలోని దినాలో సిక్కు కుటుంబంలో గుల్జార్ జన్మించారు. దేశ విభజన తరువాత ఆయన కుటుంబం ఢిల్లీకి వలస వచ్చింది.
గుల్జార్ అసలుపేరు సంపూర్ణసింగ్. హిందీ, ఉర్దూ, పంజాబీ భాషలలో రచనలు చేసి పేరు సంపాదించిన గుల్జార్ 2004 లో భారత ప్రభుత్వపు పద్మభూషణ్ అవార్డును, 2002లో సాహిత్య అకాడమీ అవార్డును పొందగా ఇటీవల ప్రపంచ సినీ రంగంలో ప్రఖ్యాతమైన ఆస్కార్ అవార్డును బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో పొందినాడు. ఇప్పుడు ఆయన కీర్తి కిరీటంలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా చేరింది. గుల్జార్‌ని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు ఎంపిక చేయడం పట్ల భారతీయ సినిమా రంగంలో హర్షం వ్యక్తమవుతోంది.