విజయవాడలో లగడపాటి పోటీ?
posted on Apr 14, 2014 @ 12:21PM
రాష్ట్రం విడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయబోనని ప్రకటించిన విజయవాడ సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఇప్పటి వరకూ తన ప్రతిజ్ఞకే కట్టుబడి వున్నారు. రాజకీయాల నుంచి తప్పుకున్నానని ప్రకటించినప్పటికీ కిరణ్ కుమార్ నాయకత్వంలోని జై సమైక్యాంధ్ర పార్టీలో లగడపాటి చురుకైన పాత్ర నిర్వహిస్తున్నారు.
తాజాగా లగడపాటి విజయవాడ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయనపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. సీమాంధ్రలో జై సమైక్యాంధ్ర పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా వుంది. అసెంబ్లీ స్థానాల నుంచి కొంతమంది అభ్యర్థులు గెలిచే అవకాశం వున్నప్పటికీ పార్లమెంట్ స్థానాల నుంచి గెలిచే సత్తా వున్న వ్యక్తులు ఆ పార్టీకి కొరవడ్డారు. ఆ సత్తా వున్న ఒకే ఒక వ్యక్తి లగడపాటి రాజగోపాల్ అస్త్రసన్యాసం చేసి పోటీకి దూరంగా వున్నారు.
మరోవైపు విజయవాడలోని లగడపాటి అనుకూల వర్గం కూడా లగడపాటి మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో వున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో వాళ్ళు ఎప్పటి నుంచో లగడపాటి మీద ఒత్తిడి తెస్తున్నప్పటికీ లగడపాటి సానుకూలంగా స్పందించనట్టు సమాచారం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో విజయవాడ పార్లమెంటు సీటుకు సంబంధించిన వివాదం ముదిరిపోవడంతో అక్కడ ఆ పార్టీ విజయావకాశాలు సన్నగిల్లాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి లగడపాటి సునాయాసంగా గెలిచే అవకాశాలున్నాయని జై సమైక్యాంధ్ర పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
అలాగే సీమాంధ్రలో కీలకమైన పార్లమెంట్ స్థానాన్ని జేసీపీ గెలుచుకున్నట్టయితే పార్టీ ప్రతిష్ట పెరిగే అవకాశం వుందని అనుకుంటున్నారు. లగడపాటి తన ఒట్టును గట్టుమీద పెట్టి విజయవాడ నుంచి పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. లగడపాటి తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని కోరుతున్నారు. లగడపాటి కూడా విజయవాడ నుంచి మళ్ళీ పోటీ చేయడానికి సానుకూలంగానే వున్నారని జేసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.