మధు యాష్కిని ఓటమి భయం పట్టుకుంది!
posted on Apr 12, 2014 @ 2:32PM
నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ మధు యాష్కికి ఓటమి భయం పట్టుకున్నట్టుంది. ఈ స్థానం నుంచి యాష్కికి పోటీగా తెరాస అధినేత కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెరాస వారితో, టీ కాంగ్రెస్ నేతలతో పోటీపడి మరీ సీమాంధ్రుల మీద నోరు పారేసుకున్న యాష్కి తనకు మరోసారి గెలుపు ఖాయమని నమ్ముతూ వచ్చారు.
కవిత కూడా తనమీద పోటీ చేయదని మొన్నటి వరకూ భావిస్తూ వచ్చిన మధు యాష్కి తాను అనుకున్నట్టు జరగకపోవడంతో షాకయ్యారు. మొదట్లో తన గెలుపు మీద బీరాలు పలికినప్పటికీ రోజులు గడుస్తున్నకొద్దీ ఆయనలో ఓటమి భయం పెరిగిపోతూ వుంది. కవితకు మహిళల ఓట్లు మొత్తం టర్న్ అయ్యే అవకాశం వుంది. అది తన ఓటమికి దారి తీయొచ్చన్న అనుమానం ఆయనలో కలుగుతోంది. ఈ భయాలు, అనుమానాలతో ఆయన మాట్లాడుతున్న మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
తనను ఓడించడానికి కేసీఆర్, కేవీపీ రామచంద్రరావు కుమ్మక్కయ్యారని విచిత్రమైన ఆరోపణలు ఆయన చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒక్కటై తనమీద కవితని నిలబెట్టాలని డిసైడ్ చేశారట. మధు యాష్కి వ్యవహారశైలి చూస్తున్న కాంగీయులు ఆయన మీద జాలి పడుతున్నారు. ఎన్నికల ముందే తన ఓటమిని తానే డిసైడ్ చేసుకున్నట్టు మాట్లాడుతున్న ఆయనని ఆ దేవుడే కాపాడాలని అనుకుంటున్నారు. ఓడిపోయిన తర్వాత చేయాల్సిన ఆరోపణలు ఇప్పుడే మధుయాష్కి చేస్తున్నారని అంటున్నారు.