రజనీకాంత్ మద్దతుతో మారనున్న సమీకరణాలు
posted on Apr 12, 2014 @ 9:17PM
తమిళనాడులో ఏదో ఒక స్థానిక పార్టీ అండ లేకపోయినట్లయితే ఎంత పెద్ద జాతీయపార్టీనయినా తమిళ తంబిలు ఆదరించరు. కానీ, తమిళనాడులో రెండు ప్రధాన ద్రవిడ పార్టీలయిన డీయంకే, అన్నాడీయంకేలు ఈసారి ఎన్నికలలో తిరుగులేని మెజార్టీతో గెలిచి రాష్ట్రంలో, కేంద్రంలో కూడా చక్రం తిప్పాలని భావిస్తుండటంతో కాంగ్రెస్, బీజేపీలతో పొత్తులకు అంగీకరించలేదు. అందువల్ల ఆ రెండు పార్టీలు రాష్ట్రంలో మిగిలిన చిన్నా చితకా పార్టీలను ఆశ్రయించక తప్పలేదు. కానీ వాటితో పొత్తుల వలన లాభం కంటే అధికారం చేపట్టిన తరువాత వారి గొంతెమ్మ కోరికలన్నిటినీ తీర్చలేక తలనొప్పులే అధికంగా ఉంటాయని ఇదివరకు చాలాసార్లే రుజువయింది. అందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఆన్వేషిస్తున్న బీజేపీ తమిళనాట సినీ హీరోలకు ప్రజలలో విపరీతమయిన ఆదరణ ఉన్న సంగతి గ్రహించి తెలివిగా పావులు కదిపింది.
సినీ తారలతో, రాజకీయ నాయకులతో మంచి పరిచయాలున్న తుగ్లక్ పత్రిక సంపాదకుడు, పాత్రికేయుడు, నటుడు అయిన చో రామస్వామి ద్వారా సూపర్ స్టార్ రజనీకాంత్ ని బీజేపీ మద్దతు ఇమ్మని కోరారు. ఊహించని విధంగా రజనీకాంత్ నరేంద్ర మోడీకి మద్దతు తెలుపుతున్నట్లు వెంటనే ప్రకటించడమే కాకుండా రేపు నరేంద్ర మోడీని స్వయంగా కలిసేందుకు బయలుదేరుతున్నారు.
రజనీకాంత్ కి తమిళనాట లక్షలాది అభిమానులున్నారు. అదేవిధంగా ఆంధ్ర, కర్నాటక, కేరళలో కూడా చాలా మంది అభిమానులున్నారు. ఆయన స్వయంగా బీజేపీ ప్రచారంలో పాల్గొనకపోయినా, తాను బీజేపీకి మద్దతు ఇస్తున్నాని చెపితే ఆయన అభిమానులు కూడా బీజేపీకే ఓట్లు వేసే అవకాశం ఉంది. ఇది తమిళనాడులో రెండు ప్రధాన ద్రవిడ పార్టీలయిన డీయంకే, అన్నాడీయంకేలకు మింగుడుపడని విషయమే. అది వారి విజయావకాశాల మీద కూడా పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే అలాగని ఆ రెండు పార్టీలు రజనీకాంత్ ని వేలెత్తి చూపే దుస్సాహసం చేయలేవు. ఇప్పుడు వాటి పరిస్థితి కుడితిలో పడిన ఎలుకల్లా తయారయిందని చెప్పవచ్చును. ఈ ఊపులో బీజేపీ మరి కొంతమంది సినీ తారలను పార్టీకి మద్దతు ఇచ్చేలా ప్రోత్సహిస్తే ఇక ఆ రెండు పార్టీలు తమ అతిశయం చంపుకొని కాంగ్రెస్, బీజేపీలను ఆశ్రయించక తప్పదేమో!