టీఆర్ఎస్ ప్రచారం: అల్లు అర్జున్‌కి కేసీఆర్ నో?

      టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్‌కి పిల్లనిచ్చిన మామ శేఖర్‌రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకుని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అల్లు వారి వియ్యంకుడు టీఆర్ఎస్‌లో చేరినప్పటి నుంచీ అల్లు అర్జున్ మామగారికి ప్రచారం చేస్తాడా చేయడా... అల్లు అర్జున్ ముగ్గురు మామయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, శేఖర్‌రెడ్డి మధ్యలో ఇరుక్కుపోయాడు.   ఇప్పుడేం చేస్తాడో అనే చర్చలు, ఊహాగానాలు గత రెండు రోజులుగా జరుగుతున్నాయి. అల్లు అర్జున్ కూడా ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేయాలా వద్దా అనే డైలమాలో వున్నట్టు తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్‌కి అంత శ్రమ అవసరం లేకుండా, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అల్లు అర్జున్ ప్రచారం అవసరం లేదని శేఖర్‌రెడ్డికి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. సీమాంధ్రుడి చేత ప్రచారం చేయించుకుని ఇబ్రహీంపట్నం సీటు గెలవాల్సినంత ఖర్మ టీఆర్ఎస్‌కి పట్టలేదని కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు అల్లు అర్జున్ ప్రచారం డైలమాని కేసీఆరే తీర్చేశాడు.

చేసిన మేలు మరచే చంద్రబాబు: జయప్రద కామెంట్!

      తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు మేలు చేసిన వారిని మరచిపోయే వ్యక్తి అని ప్రముఖ సినీ నటి, లోక్‌సభ సభ్యురాలు జయప్రద వ్యాఖ్యానించారు. ఒక టీవీ ఛానెల్‌కి ఇచ్చి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చంద్రబాబు మీద విమర్శలు కురిపించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు తాను ఎన్నో త్యాగాలు చేసి ఎన్టీఆర్ వెంట నడిచానని, పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చిన తర్వాత తాను చేసిన త్యాగాలన్నిటికీ గుర్తింపు లేకుండా పోయిందని ఆమె బాధపడ్డారు. చంద్రబాబు రెండోసారి అధికారంలోకి వచ్చాక తనకు సాయం చేసిన వారిని మరచిపోవడం అలవాటుగా పెట్టుకున్నారని ఆమె విమర్శించారు. ఎన్టీఆర్ హయాంలో టీడీపీలో వున్న విలువలు ఇప్పుడు లేవని జయప్రద అన్నారు.

అమెరికాలో దారుణం: ఉన్మాది @ విద్యార్థి!

      అమెరికాలోని విద్యావిధానం కారణంగా విద్యార్థులు స్ట్రెస్‌కి గురై దారుణాలకు ఒడిగడుతున్నారో లేక అక్కడి పెంపకమే దారుణంగా వుందో గానీ, విద్యాలయాల్లో దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తోటి విద్యార్థుల మీద దాడులు, దారుణ హత్యలు చేస్తున్న సైకోల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఇప్పుడు మరో సైకో ఉదంతం వెలుగులోకి వచ్చింది. పెన్సిల్వేనియా రాస్ట్రంలోని మరీస్ విల్లే ప్రాంతంలోని ఓ విద్యాలయంలో ఒక విద్యార్థి దారుణంగా బిహేవ్ చేశాడు. చేతిలో కత్తి పట్టుకుని విద్యాలయంలో వీరవిహారం చేశాడు. తమలో ఒకడిగా వున్న విద్యార్థి సడెన్‌గా ఉన్మాదిలా మారి కత్తితో దాడి చేయడంతో విద్యార్థులందరూ చెల్లాచెదురైపోయారు. పారిపోతున్నవారిని కూడా వదలకుండా సదరు ఉన్మాది వాళ్ళని కసితీరా పొడిచి గాయపరిచాడు. మొత్తం ఇరవై మందిని దారుణంగా పొడిచిన ఉన్మాదిని ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. టైమ్ బాగుండి ఉన్మాద విద్యార్థి చేతిలో గాయపడిన వారెవరికీ ప్రాణాపాయం లేదు.

తప్పులెన్ను వారు..

  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్నఒక ఎన్నికల ప్రచార సభలో బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ తను అధికారంలోకి రావడానికి దేశాన్ని చీల్చేందుకు కూడా వెనుకాడడని తీవ్రంగా విమర్శించారు. రాహుల్ అన్నట్లు మోడీ అటువంటి ప్రయత్నాలు ఇంత వరకు చేయకపోయినా, తన తల్లి సోనియా గాంధీ తనను ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చీల్చిన సంగతి ఆయనకు బాగానే తెలుసు. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు అన్నట్లు ఆ సంగతి మరిచి, మోడీని విమర్శించడం చూస్తే, నిత్యం నీతి సూక్తులు వల్లించే యువరాజావారికి కూడా కాంగ్రెస్ నీళ్ళు బాగానే ఒంటబట్టాయని అర్ధమవుతోంది.

3వ దశ ఎన్నికలు షురూ

  ఈరోజు 11 రాష్ర్టాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలలో మూడో విడత సార్వత్రిక ఎన్నికలకు ఓటింగ్ మొదలయింది. మొత్తం 92 నియోజకవర్గాల్లో 11 కోట్ల మందికి పైగా ఓటర్లు ఈరోజు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు.   మధ్యప్రదేశ్‌లో-9, ఛత్తీస్‌గఢ్‌-1, మహారాష్ట్ర-10, హర్యానా-10, లక్షద్వీప్‌-1, కేరళ- 20, అండమాన్ నికోబార్ దీవులు-1, జమ్ముకాశ్మీర్‌-1, ఢిల్లీ-7, ఉత్తరప్రదేశ్‌-10, బీహార్‌-6, జార్ఖండ్‌-5, ఒడిశా-10 నియోజక వర్గాలలో పోటీ చేస్తున్న మొత్తం 1419 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ రోజు తేలనుంది.   మళ్ళీ ఈనెల 12న జరిగే నాలుగవ దశ ఎన్నికలలో మూడు రాష్ట్రాలలో 5 నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈనెల 17,24, మరియు 30తేదీలలో జరిగే 5,6,7 దశ ఎన్నికలలో 13 రాష్ట్రాలలో మొత్తం 338 నియోజక వర్గాలలో ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 30వ తేదీన తెలంగాణాలో, మే7న ఆంధ్రలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల ఫలితాలు మే16న వెలువడుతాయి.

ప్రజాసేవ కోసం తపిస్తున్న రాజకీయ కోటీశ్వరులు

  మన రాజకీయ నేతలలో చాలా మందికి వ్యాపారాలు, కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలున్నాయని అనడరికీ తెలుసు. అందువల్ల వారు ప్రజలకి సేవ చేయడం మాటెలా ఉన్నా, వారి రాజకీయాలు, అధికారం, పరపతి అన్నీ కూడా తమ వ్యాపారాలను కాపాడుకొంటూ వాటిని మరింత వృద్ధి చేసుకోవడానికి మాత్రం తప్పక సద్వినియోగం చేసుకొంటారని అందరికీ తెలుసు. ఒక మధ్య తరగతి గృహస్తు తన పిల్లల చదువులకో, పెళ్ళిళ్ళకోసం డబ్బు పోగేసేందుకు ఒక జీవిత కాలం శ్రమించవలసి వస్తే, మన రాజకీయ నాయకుల ఆస్తులు మాత్రం పది తరాలు కూర్చొని తిన్నా కూడా తరగనంతగా ప్రతీ ఐదేళ్ళకీ రెండు మూడింతలుగా పెరిగి వందల కోట్లకు చేరుకొంటోంది. ఈ గొప్ప సౌలభ్యం ఉన్నందునే వారందరూ ‘ప్రజాసేవ’ చేసేందుకు ఇంతగా పోటీలు పడుతున్నారు.   ఇక తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తన ఫారం హౌస్ లో సాగు చేస్తున్నవ్యవసాయం ద్వారా ఏడాదికి ఒక్కో ఎకరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నాని స్వయంగా చెప్పినప్పటికీ, ఆయన తన నామినేషన్ ఫారంలో మాత్రం తన మొత్తం ఆస్తి కేవలం రూ.14.94 కోట్లు మాత్రమే చూపారు. తన భార్య పేరిట రూ. 21 లక్షలు విలువైన చరాస్తులతో బాటు మొత్తం రూ.7,87,53,620 అప్పులు కూడా ఉన్నాయని తెలిపారు. 2012-13లో తన ఆదాయం రూ. 6,59,684లుగా చూపిన కేసీఆర్ 2013-14లో రూ. 8,67,830 ఆర్జించినట్లు ఆదాయ పన్నుల రిటర్న్‌లో పేర్కొన్నారు. కారు గుర్తు గల తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కి, ఆయన భార్యకి కూడా తిరిగేందుకు స్వంత కారు కూడా లేదుట!   ఇక ఆయన కొడుకు కేటీఆర్ తండ్రి కంటే రెండాకులు ఎక్కువే చదివారు. తన పేరిట, తన భార్యా పిల్లల పేరిట మొత్తం రూ.5.09 కోట్ల చరాస్తులు, రూ.2.86 కోట్ల స్థిరాస్తులున్నట్లు చెపుతూనే తండ్రి వద్దనుండి రూ.40 లక్షల అప్పు తీసుకున్నట్లు పేర్కొన్నారు. గత ఎన్నికలకీ, ఈసారి ఎన్నికలకీ మధ్య తమ ఆస్తి కేవలం రూ.80లక్షల చిల్లర మాత్రమే పెరిగిందని, అదేవిధంగా రూ. 2 కోట్ల అప్పులు కూడా ఉన్నాయని ఎఫిడవిట్లో పేర్కొన్నారు.   ఇక దళితులకి రాజ్యాధికారం కావాలని కోరుకొంటున్న దళిత కాంగ్రెస్ నేత-వివేక్ తనకు, తన భార్యకు కలిపి మొత్తం రూ. 205.27కోట్ల స్థిరాస్తులు, రూ. 60.28 కోట్ల చరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. అంటే వారి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.292.98 కోట్లు మాత్రమేనన్నమాట. అయితే అంత ఆస్తి ఉన్నప్పటికీ వారికీ అప్పులు తీసుకోక తప్పలేదుట. తమ దంపతులు ఇద్దరికీ కలిపి రూ.12.31 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో దళితకోటాలో టికెట్ సంపాదించుకొన్న ఈయన కరీంనగర్ జిల్లా పెద్దపల్లి లోకస్‌భ స్థానానికి పోటీ చేస్తున్నారు.   ఇక తెలుగుదేశం పార్టీకి చెందిన (ప్రముఖ కాంట్రాక్టరు) నామా నాగేశ్వరరావు ఖమ్మం లోక్‌సభకు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన తమ కుటుంబ సభ్యులందరి స్థిర, చరాస్తులు కలిపి మొత్తం రూ. 338 కోట్ల ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆయనకీ కూడా అప్పుల బాధ తప్పలేదు. తమకు రూ.21కోట్ల అప్పులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.   మానవసేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. మరి ప్రజాసేవలో తరిస్తున్న ఈ రాజకీయ నేతలందరికీ ఆ పుణ్యం ఊరకే పోదు. అందువల్లనే ధనలక్ష్మి వారి ఇళ్ళనే అంటిపెట్టుకొని ఉండిపోయింది. ఆ సంగతి తెలియని వెర్రి జనాలు ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి గుళ్ళు గోపురాలు తిరుగుతూ పోగేసుకొన్న పదిరూపాయలు పెట్టి ఆమెకు కొబ్బరి కాయలు కొట్టి, చివరికి ఆ చిప్పలు మాత్రమే మిగుల్చుకొంటున్నారు.

అక్కడ 23 శాతం మంది నేరచరితులే!

   రాజకీయాల్లో నేరగాళ్ళు పోటీ చేయడం మామూలు విషయమైపోయింది. జార్ఖండ్ స్టేట్‌లో అయితే అది సర్వ సాధారణం. ఎందుకంటే, ఈ ఎన్నికలలో జార్ఖండ్ ఎన్నికల బరిలో వున్నవాళ్ళలో 16 శాతం మంది అభ్యర్థుల మీద కేసులు వున్నాయట. అలాగే మొత్తం అభ్యర్థులలో 23 శాతం మందికి నేర చరిత్ర వుందట. నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థలు జరిపిన పరిశీలన, పరిశోధనలో ఈ విషయాలు బయటపడ్డాయి. సదరు అభ్యర్థుల మీద వున్న కేసులు చిన్నా చితకా కేసులు కావు. హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు, అత్యాచార యత్నాల్లాంటి గట్టి కేసులో వీళ్ళ మీద వున్నాయట. నేర చరిత్ర, కేసులు వున్నవారి లిస్టు పరిశీలిస్తే నేర చరిత్రలో కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ఒకరితో ఒకరు పోటీపడేలా క్రిమినల్ కేసులలో వున్నారు. నేర చరిత్రుల విషయంలో జార్ఖండ్ తర్వాతి స్థానాల్లో బీహార్, మహారాష్ట్ర నిలిచాయి. జమ్మూ కాశ్మీర్, మణిపూర్‌లలో పోటీ చేస్తున్న అభ్యర్థులలో ఒక్కరు కూడా నేరచరితులు లేకపోవడం విశేషం.

షోయబ్ మాలిక్‌తో సుఖసంసారం: సానియా

      పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ని పెళ్ళి చేసుకున్న ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ఆ తర్వాత అతనితో విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయారన్న వార్తలు వచ్చాయి. చాలాకాలంగా సానియా మిర్జా పుట్టింట్లోనే సెటిలవ్వడంతో ఇద్దరి సంసారం చట్టుబండలు అయిపోయినట్టే అని అందరూ డిసైడ్ అయ్యారు. అయితే అలాంటిదేమీ జరగలేదని సానియా మిర్జా వివరణ ఇచ్చింది. భర్తతో కలసి సరదాగా గడపటానికి సానియా సియల్‌కోట్‌కి వచ్చిన సోనియా అక్కడ వివరణ ఇచ్చింది. మేమిద్దరం అన్యోన్యంగా సంసారం చేసుకుంటున్నామని, క్రీడాకారులుగా ఇద్దరం కెరీర్‌లో బిజీగా వుండటం వల్లే తాను హైదరాబాద్‌లో కొంతకాలంగా వుంటున్నానని సానియా వివరణ ఇచ్చింది. తమది ఎంతో అన్యోన్యంగా వుండే దాంపత్యమని చెప్పింది.

సహారా సుబ్రతోరాయ్: చిప్పకూడే గతి!

      జనాల చెవ్లులో క్యాలీఫ్లవర్లు పెట్టి లక్షల కోట్ల రూపాయలు మింగేసిన సహారా సంస్థ అధినేత సుబ్రతోరాయ్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో వున్నాడు. ఆయన్ని తీహార్ జైల్ నుంచి గృహ నిర్బంధంలోకి మార్చాలని ఆయన లాయర్ రామ్ జెఠ్మలానీ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. సహారా సంస్థకి వున్న అప్పులు తీర్చాలంటే ఆస్తులు అమ్మాలి. ఆస్తులు అమ్మాలంటే వాటిని కొనుగోలు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి చూపిస్తున్న వారితో చర్చలు జరపాలి. ఆ చర్చలు తీహార్ జైల్లో జరిపే అవకాశం లేదు. వాటిని సుబ్రతోరాయ్ తన ఇంట్లో జరపాల్సి వుంటుంది. అందువల్ల సుబ్రతోరాయ్‌ని తీహార్ జైల్లోంచి గృహ నిర్బంధంలోకి పంపించాలని రామ్ జెఠ్మలానీ కోర్టుకు విన్నవించారు. అయితే న్యాయస్థానం అందుకు అంగీకరిచంలేదు. తాము సుబ్రతోరాయ్‌కి శిక్ష విధించలేదని, జ్యుడీషియల్ కస్టడీలో మాత్రమే ఉంచాం కాబట్టి గృహ నిర్బంధం చేసే అవకాశం లేదని కోర్టు చెప్పింది. దాంతో సుబ్రతోరాయ్‌కి తీహార్ జైల్లో చిప్పకూడే గతి అని డిసైడ్ అయిపోయింది.

ఎన్నికల ప్రచారం : పంపు కొట్టిన హేమమాలిని

      మధుర పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతాపార్టీ నుంచి పోటీ చేస్తున్న నటి హేమమాలిని ప్రచారంలో మిగతా పార్టీల అభ్యర్థుల కంటే ముందున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటిస్తూ హామీలు గుప్పిస్తున్నారు. ప్రజల్లో మమేకమైపోతు మార్కులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. బుగ్గలు తారు రోడ్డు మాదిరిగా స్మూత్‌గా వుంటాయని లాలూ ప్రసాద్ యాదవ్ చేత ప్రశంసలు పొందిన ఈ అందాల ఆంటీ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా డొంక రోడ్లలో నడుస్తూ శ్రమిస్తున్నారు. కెంట్ శుద్ధ్ పానీ అంటూ ఫిల్టర్ వాటర్‌కి ప్రచారం చేసే హేమమాలిని ఓ గ్రామంలో బోలెడంత కష్టపడి చేతి పంపు కొట్టింది. అక్కడితో ఆగకుండా సదరు పంపులోంచి వచ్చిన నీటిని కూడా తాగింది. హేమమాలిని లాంటి నటి తమ ఊరికి వచ్చి పంపు కొట్టి, అందులో నీటిని తాగటం చూసి అక్కడి ఓటర్లు మురిసిపోయారట.

ఫేస్‌బుక్‌ : రెండో స్థానంలో ఇండియా

      ఫేస్‌బుక్‌లో భారతీయ ఖాతాదారుల సంఖ్య పదికోట్లకు చేరుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్ వినియోగించే దేశాలలో ఇండియా రెండో స్థానానికి చేరుకుంది. మొదటి స్థానంలో అమెరికా వుంది. అమెరికాలో 15 కోట్లమంది ఫేస్‌బుక్ ఖాతాలు కలిగి వున్నారు. ఈమధ్య కాలంలో ఇండియాలో సెల్‌ఫోన్‌లో ఫేస్‌బుక్‌ని వినియోగించే వారి సంఖ్య భారీ స్థాయిలో పెరగడంతో వినియోగదారుల సంఖ్య కూడా పెరిగిందని ఫేస్‌బుక్ వర్గాలు చెబుతున్నాయి. మరో సంవత్సరంలో ఇండియాలో ఫేస్‌బుక్ వినియోగదారుల సంఖ్య అమెరికా వినియోగదారులను మించిపోయే అవకాశం వుందని ఫేస్‌బుక్ వర్గాలు భావిస్తున్నాయి.

ఆలె నరేంద్ర కన్నుమూత : బీజేపీలో విషాదం

  భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు ఆలె నరేంద్ర (68) బుధవారం మరణించారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో వున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నరేంద్ర మరణించారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన ఆలె నరేంద్రని ఆయన అభిమానులు, నియోజకవర్గ ప్రజలు ‘టైగర్’ అని పిలుచుకుంటారు. నరేంద్ర ఆర్ ఎస్ ఎస్ లో చురుకైన కార్యకర్తగా పనిచేశారు. చాలాకాలం బీజేపీ నాయకుడిగా కొనసాగిన ఆయన ఆ తర్వాత తెలంగాణను కోరుకుంటూ ఒక రాజకీయ వేదికను ప్రారంభించారు. ఆ తర్వాత కేసీఆర్‌తో కలసి టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన నరేంద్ర కేసీఆర్‌తో విభేదాలు రావడంతో టీఆర్ఎస్ నుంచి బయటకి వెళ్ళిపోయి, తిరిగి భారతీయ జనతాపార్టీలో చేరారు. నరేంద్ర మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీజేపీలో విషాదకర వాతావరణం ఏర్పడింది.

బాలకృష్ణ పోటీపై అనుమానాలు!

      తాను హిందూపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్టు కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఆల్రెడీ ప్రకటించారు. ‘లెజెండ్’ విజయ యాత్ర సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. విజయ యాత్ర ముగించుకున్న తర్వాత బావ (చంద్రబాబు)తో మాట్లాడి రంగంలోకి దిగుతానని బాలకృష్ణ చెప్పారు. అయితే ఈసారి ఎన్నికలలో పోటీచేయాలన్న ఉత్సాహం బాలకృష్ణలో అయితే కనిపిస్తోంది గానీ, ఈ విషయంలో చంద్రబాబుకు అంత ఆసక్తి వున్నట్టు కనిపించడం లేదు.   సీమాంధ్ర తెలుగుదేశం అభ్యర్థుల మొదటి లిస్టు విడుదల సందర్భంగా బాలకృష్ణ పోటీ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చంద్రబాబులో ముఖంలో బాలకృష్ణ పోటీ చేయడం మీద ఆసక్తి ఉన్నట్టు కనిపించలేదు. బాలకృష్ణ పోటీ చేసే విషయంలో ఆయనతో మాట్లాడతానని చంద్రబాబు చెప్పారు. అలాగే బాలకృష్ణ ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది చర్చించి నిర్ణయిస్తామని అన్నారు. ఒకవైపు బాలకృష్ణ హిందూపూర్ నుంచి పోటీ చేస్తానని చెబితే, చంద్రబాబు ఇంకా చర్చించాలని అనడం వెనుక ఏదో అంతరార్థం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలకృష్ణ పోటీ చేయకపోవడమే మంచిదని చంద్రబాబు భావిస్తున్నారా అనే సందేహం కలుగుతోంది.

దిక్కుతోచని దాసోజు శ్రవణ్!

      టీఆర్ఎస్ పార్టీ తనకు ఎన్నికలలో టిక్కెట్ ఇచ్చేస్తుంది. తాను గెలిచేస్తానని కలలు కన్న టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు దాసోజు శ్రవణ్‌కి పార్టీ మొండిచెయ్యి ఇచ్చింది. శ్రవణ్ అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఏ దశలోనూ పరిగణనలోకి తీసుకోలేదు. కనీసం శ్రవణ్ పేరును ప్రతిపాదించి, బలపరిచేవారు కూడా లేకపోవడంతో శ్రవణ్‌కి టిక్కెట్ గల్లంతయింది. ప్రజారాజ్యం పార్టీలో వున్నప్పుడు టిక్కెట్ ఆశించి భంగపడిన శ్రవణ్‌కి ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి భంగపాటు ఎదురైంది. తెలంగాణ ఉద్యమకాలంలో టీవీ ఛానెళ్ళలో సీమాంధ్రుల కడుపు మండే మాటలు అనడం, వితండవాదం చేయడం లాంటి పనుల్లో బిజీగా వున్న శ్రవణ్ తానేదో రాజకీయంగా ఎదిగిపోయానని కలలు కన్నాడు. ఇప్పుడు టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో దిక్కుతోచని స్థితిలో వున్నాడు. దీనికితోడు దర్శకుడు తేజను బెదిరించిన కేసు వచ్చి నెత్తిన పడింది. అంతేలే.. చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవ అని ఊరకే అనలేదు.

ఆర్.కృష్ణయ్యపై దాడి : పార్టీలోవారి పనే!

      వెనుకబడిన కులాల సంఘం అధ్యక్షుడు, ఎల్.బి.నగర్ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి అర్.కృష్ణయ్యపై తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు దాడి చేశారు. ఎల్.బి.నగర్ నియోజకవర్గం స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన కృష్ణయ్యపై స్థానిక తెలుగుదేశం కార్యకర్తలే దాడిచేసినట్టు తెలుస్తోంది. ఎప్పటి నుంచో నియోజకవర్గంలో పార్టీకి సేవ చేస్తున్న వారికి టిక్కెట్ ఇవ్వకుండా, కొత్తగా టీడీపీలో చేరిక కృష్ణయ్యకి టిక్కెట్ ఇచ్చారన్న అక్కసుతోనే ఈ దాడి జరిగినట్టు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి కాబోయే సీఎం అని ప్రచారంలో వున్న ఆర్.కృష్ణయ్యకి తన నియోజకవర్గంలో వున్న కార్యకర్తల మద్దతు కూడా లేకపోవడం బ్యాడ్ లక్. తెలుగుదేశం కార్యకర్తలు జరిపిన దాడిలో కృష్ణయ్య కారు అద్దాలు పగిలాయని, కృష్ణయ్యకి కూడా స్వల్ప గాయాలైనట్టు సమాచారం.

జగన్, కిరణ్ రెడ్డిల తెలంగాణ బాట దేనికొరకు?

  ఇంతకాలంగా కిరణ్, జగన్ ఇద్దరూ కూడా సమైక్యాంధ్ర చాంపియన్లుగా ఎదిగేందుకు, రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ చేసిన ఉత్తుత్తి వాదనలు, పోరాటాల గురించి అందరికీ తెలిసిందే. వారిరువురూ కూడా సీమాంధ్రపై పూర్తి పట్టు సాధించాలనే ప్రయత్నంలో చేసిన వాదనల వల్ల అక్కడ ఏమీ బావుకోకపోయినా, తెలంగాణాలో అడుగుపెట్టలేని పరిస్థితి కల్పించుకొన్నారు. వారి వాదనలలో, ఆచరణలో నిజాయితీ లోపించిందని సీమాంధ్ర ప్రజలు భావిస్తుంటే, వారిరువురూ తెలంగాణాకు శత్రువులని తెలంగాణా ప్రజలు నమ్ముతున్నారు. కానీ వారిరువురిలో జగన్మోహన్ రెడ్డికి తండ్రి మరణం తాలూకు సానుభూతి అదనపు అర్హతగా ఉంది గనుక వైకాపాకు నేటికీ సీమాంధ్రలో మంచి పట్టు ఉంది. కానీ అదేమీలేని కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి మాత్రం రెంటికీ చెడిన రేవడిలా మారింది. ఆయన స్థాపించిన పార్టీకి నేతలు లేక, ఆయన సీమాంద్రాలో నిర్వహించే రోడ్ షోలకు జనాలు లేక అవస్థలు పడుతున్నారు.   ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లు సీమాంద్రాలో పరువు పోగొట్టుకొన్న కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు తెలంగాణాలో కూడా తన అభ్యర్ధులను పోటీకి దింపడం చాలా నవ్వు తెప్పిస్తుంది. కానీ అంత వ్యతిరేఖత ఉందని తెలిసి ఉన్నపటికీ, కిరణ్ కుమార్ రెడ్డి ‘జై సమైక్యాంధ్ర’ అంటూ తన అభ్యర్ధులను తెలంగాణలో పోటీకి దింపడం దుస్సాహసమే అని చెప్పవచ్చును. కానీ సాహసం చేస్తున్నారంటే అందుకు ఎన్నికలలో పోటీ కంటే ఇంకా పెద్ద లక్ష్యమే ఉందని అనుమానించవలసి వస్తుంది.   కిరణ్ నేటికీ కాంగ్రెస్ అధిష్టానం వీర విదేయుడేనని చెప్పక తప్పదు. కనుక అయన తన అధిష్టానం సూచించిన ప్రకారమే తెలంగాణాలో కూడా తన అభ్యర్ధులను బరిలోకి దింపి ఉండవచ్చును. జైసపా పేరుతో అభ్యర్ధులను రంగంలో దింపడం ద్వారా అయన సాదించగలిగేవి రెండే రెండు కనిపిస్తున్నాయి. అక్కడ కూడా ఓట్లలో ఎంతో కొంత చీలిక తేవడం లేదా అక్కడ ప్రజలలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టి సీమాంధ్ర వ్యతిరేఖతను మరింత పెంచి పోషించి తద్వారా తెచ్చి గట్టిగా తెలంగాణావాదం చేస్తున్న కాంగ్రెస్, తెరాసలకు పరోక్షంగా లబ్ది కలిగించడం.   అదేవిధంగా తెలంగాణాను వ్యతిరేఖించిన జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ ఇప్పుడు అదే తెలంగాణాలో పోటీ చేయాలనుకోవడం చాల ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశః అతను కూడా అవే కారణాలతో తన అభ్యర్ధులను బరిలోకి దింపుతున్నారేమో అనే అనుమానాలున్నాయి. అతనికి తెలంగాణాలో ఎంత వ్యతిరేఖత ఉన్నపటికీ నేటికీ కొన్ని జిల్లాలలో ఎంతో కొంత పట్టు ఉంది గనుకనే అంతమంది అభ్యర్ధులను రంగంలో దింపేరనుకొన్నా, వారు ఓట్లను చీల్చడానికే తప్ప వైకాపాని గెలిపించే అవకాశాలు లేవనే చెప్పవచ్చును.   అతనితో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకొన్న కాంగ్రెస్ అధిష్టానం, బహుశః తన శతృవులయిన తెదేపా-బీజేపీలను దెబ్బతీసేందుకే అతనితో ఈ వ్యూహం అమలు చేయిస్తోందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఏమయినప్పటికీ ‘ఊరక రారు మహాత్ములన్నట్లు’ ఈ ఇద్దరు తెలంగాణా వ్యతిరేఖులు ఊరకనే తెలంగాణాలో అడుగుపెట్టడం లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చును.