కామన్వెల్త్ స్కామ్ : శిల్పాశెట్టికి 71 లక్షలు

      కామన్ వెల్త్ స్కామ్ ఇంకా మలుపులు తిరుగుతూనే ఉంది. ఈ గేమ్స్ ముగిసి రెండేళ్లు గడిచిపోయినా… ఈ స్కామ్ సూత్రధారులు, లబ్ధిదారుల లిస్టు ఇంకా పెరుగుతూనే ఉంది. కామన్ వెల్త్ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి శిల్పకు కేవలం అఫిషియల్ గానే కాకుండా, అనఫిషియల్ గా కూడా సొమ్ము చెల్లింపులు జరిగాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఢిల్లీ కోర్టు బయటపెట్టింది. మరి గేమ్స్ కు సంబంధించిన కార్యక్రమాల్లోడాన్సులూ గట్రా చేసినందుకు శిల్పకు అఫిషియల్ గా సొమ్ములు అందజేయగా… స్కామ్ లో భాగస్వామ్యులపైన ఇద్దరు నిందితులు ఆమెకు 71 లక్షల రూపాయలు చెల్లించారని కోర్టు తెలిపింది. మరి ఈ అనధికార చెల్లింపు ఎందుకు జరిగాయో తేలాల్సి ఉంది!   కామన్‌వెల్త్‌ క్రీడల(సీడబ్ల్యూజీ) నిర్వహణ కమిటీ బహిష్కృత అధ్యక్షుడు సురేశ్‌ కల్మాడీ, మరో 9 మందిపై కోర్టులో విచారణకు రంగం సిద్ధమైంది. కామన్‌వెల్త్‌ క్రీడల నిర్వహణలో వీరు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో గరిష్ఠంగా జీవితఖైదు శిక్షపడే అవకాశం గల కుట్ర, దొంగ సంతకం తదితర ఆరోపణలపై ఢిల్లీ కోర్టు సోమవారం కల్మాడీ, ఒలింపిక్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి లలిత్‌ భానోత్‌ సహా 9 మంది నిందితులపై అభియోగాలు నమోదు చేసింది.  

చంద్రబాబు వల్లభనేని వంశీని పక్కన పెట్టేసారా?

    కొత్తనీరు వచ్చి పాత నీటిని బయటకి పంపినట్లే పార్టీలోకి కొత్త నాయకులు రాగానే పాతవారు పనికి రాకుండాపోతారు. అంతకాలంగా వారు పార్టీకి చేసిన సేవలకన్నా, వారి వల్లజరిగిన తప్పులే ఎక్కువగా కనిపించడం మొదలవుతుంది. ఇక అప్పుడు, వారికి తప్పని పరిస్థితుల్లో పార్టీనివీడి బయటకి వెళ్ళక తప్పదు. వివిధ పార్టీలలో ఉన్న రాజకీయ నాయకులకు ఈ అనుభవం ఎప్పడు ఒకప్పుడు ఎదురవుతూనే ఉంటుంది.   ఇక విషయానికి వస్తే, ఒకనాడు దేవినేని నెహ్రు తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు. అయితే, ఆ తరువాత వచ్చిన కొందరు నాయకులు ఆయనని పార్టీ నుండి బయటకి సాగనంపే వరకు విశ్రాంతి తీసుకోలేదు. మళ్ళీ కొద్ది కాలం క్రితం, నందమూరి వీరాభిమాని కొడాలి నానికి అటువంటి అనుభవమే ఎదురయింది. దానితో అయన కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళక తప్పలేదు.   ఇప్పుడు తాజాగా వల్లభనేని వంశీ వంతు వచ్చినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు కృష్ణా జిల్లాలో పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుండీ చాలా చురుకుగా పనిచేసిన ఆయనను, ప్రస్తుతం కేసినేని నాని వర్గం పక్కకు తప్పించి చంద్రబాబు పాదయాత్రను తన అదుపులోకి తీసుకొంది. అయినప్పటికీ, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం తనను పట్టించుకోకపోవడంతో, వంశీ క్రమంగా ఆయన పాదయాత్రలో కనిపించడం మానేశారు. ఒకవేళ, తెలుగు దేశం పార్టీ ఆయనతో అదే విధంగా వ్యహరిస్తే, ఆయన కూడా కొడాలినాని వలెనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అదే జరిగితే, ఒక కొత్త నాయకుడు రాగానే పాతవారిని పులిహోరలో కరివేపాకులా తీసి పక్కన పడేస్తారనే అపవాదు చంద్రబాబు నిజం చేసినవారవుతారు.

సాక్షి పేపర్ కి సుప్రీంకోర్ట్ అక్షింతలు

        ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. 'ప్రజా ప్రయోజనం' పేరిట వ్యాజ్యం వేసిన ఇద్దరు పిటిషనర్లకు చెరో రూ.50 వేలు జరిమానా విధించింది. జస్టిస్ రమణపై అవాస్తవాలు, విపరీతమైన వ్యతిరేకాలంకారాలతో కూడిన కథనం ప్రచురించిన 'సాక్షి' పత్రికని తీవ్రంగా తప్పు పట్టింది. ఆ కథనం పరువునష్టం, కోర్టు ధిక్కారం నేరాల కిందికి వస్తుందని పేర్కొంది. సాక్షి పత్రికలో కథనం ప్రచురితమైన తర్వాతే, జడ్జిపై ఉన్న క్రిమినల్ కేసు వివరాలను సేకరించి, దాని ఆధారంగా ఈ పిటిషన్ వేసినట్లు అర్థమవుతోందని తెలిపింది. "ఈ పిటిషన్‌ను చాలా నైపుణ్యంతో డ్రాఫ్ట్ చేశారు. జస్టిస్ రమణను చెడుకోణంలో చూపించేలా ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలను మెలితిప్పారు. పిటిషనర్లు ఎంత సమర్థులో, న్యాయవాది ఎంత అనుభవజ్ఞుడో ఈ పిటిషన్‌ను డ్రాఫ్ట్ చేసిన విధానం చూస్తేనే అర్థమైపోతుంది'' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివేదికలోని అంశాలను తన తీర్పులో ప్రస్తావించింది. 'జస్టిస్ రమణపై ఉన్న కేసు రికార్డులను నిజాయితీతో, నిష్పాక్షికంగా పరిశీలించి ఉంటే... మేం ఈ తీర్పులో, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన నివేదికలో వ్యక్తం చేసిన అభిప్రాయాలే వారికీ కలిగేవి. ఈ పిటిషన్‌లో చిత్తశుద్ధి లేదు. ఏదైనా తప్పును సరిచేయాలనే నిజాయితీ లేదు. జస్టిస్ రమణను అపఖ్యాతి పాలు చేయడమే వారి అసలు ఉద్దేశం'' అని ధర్మాసనం స్పష్టం చేసింది. సీవీసీ కేసులో ఇచ్చిన తీర్పును ఈ కేసుకూ వర్తింప చేయాలన్న వాదనను తోసి పుచ్చింది.

వైఎస్ షర్మిలాకు ఆపరేషన్ జరగలేదు!

        వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలా మోకాలికి గాయం కావడంతో కీహోల్ ఆపరేషన్ చేశారు. దీంతో యాత్రకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే షర్మిలా మోకాలికి ఆపరేషన్ జరగలేదని కవిత అనుమాన౦ వ్యక్తం చేశారు. ఆపరేషన్ నిజమే అయితే అందుకు సంబంధించిన వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. షర్మిల ప్రభుత్వ సహకారంతో పోలీసుల అండతో పాదయాత్ర చేస్తున్నారని, తెలంగాణ ప్రజలను అది అవమానించడమేనని తెలంగాణ జాగృతి అద్యక్షురాలు కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణపై స్పష్టత ఇచ్చిన తర్వాతనే షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. లేదంటే తాము నల్ల జెండాలతో ఆమె మరో ప్రజా ప్రస్థానం యాత్రకు నిరసన తెలియజేస్తామన్నారు. జగన్ అధికారంలోకి వస్తే వైయస్ కుటుంబానికే వెలుగు కానీ, తెలంగాణ ప్రజలకు తెలంగాణ వస్తేనే వెలుగు వస్తుందని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణలోని నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను షర్మిల గౌరవించాలని ఆమె సూచించారు. ఇప్పటి వరకు జగన్ పార్టీ తెలంగాణపై స్పష్టత ఇవ్వక పోవడం శోచనీయం అన్నారు. బ్రదర్ అనిల్ కుమార్, షర్మిల అవినీతి పై చట్టం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నానని చెప్పారు.  

మళ్ళీ విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీ

  నిన్నజరిగిన సహకారసంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మరోమారు విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 2933 సంఘాలలోకాంగ్రెస్ 1233 గెలుచుకొని తన ప్రత్యర్దులయిన తెలుగు దేశం పార్టీ, తెరాస, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలను వెనక్కు నెట్టి, రాష్ట్రం మొత్తం మీద పట్టు సాదించింది. తెలుగు దేశం పార్టీ:730; వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ:432;తెరాస:121; లెఫ్ట్:31; ఇతరులు:131 సంఘాలలో గెలిచారు. మొత్తం 161 సంఘాల ఫలితాలు వాయిదాపడగా, మరో 85 సంఘాల ఫలితాలు ‘హంగ్’ అని ప్రకటించారు.   పార్టీ రహితంగా జరుగవలసిన ఈ సహకార ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగానే పోటీకి దిగడంతో, సాధారణ ఎన్నికలు తీసిపోని రీతిలోసాగాయి. ఈ ఎన్నికలలోపట్టు సాధించడం ద్వారా రాజకీయ పార్టీలు గ్రామ స్థాయిలో తమ పార్టీలను బలోపేతం చేసుకొనే అవకాశం ఉన్నందునే, అన్నిపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీ పడ్డాయి.   వచ్చే సాధారణ ఎన్నికలలో రాష్ట్రంలో మిగిలిన పార్టీలన్నిటినీ తుడిచిపెట్టేస్తామని బింకాలు పలుకుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణా అంశంపై, తెలంగాణా ప్రజలపై తమకే పూర్తీ హక్కులున్నయనట్లు మాట్లాడే తెరాస, రెండూ కూడా ఈఎన్నికలలో చతికిలబడ్డాయి. అయితే, ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి కూడా ఒక హెచ్చరిక వంటివే నని చెప్పవచ్చును. రాష్ట్రంలో అన్ని పార్టీలు కట్టకట్టుకొని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఎంత ప్రచారం చేసినా కూడా, చివరికి ఆయనదే పైచేయి అవడం వారందరికీ చెంప పెట్టువంటిదేనని చెప్పవచ్చును.   కిరణ్ కుమార్ రెడ్డిని చరిత్రలోనే అత్యంత అసమర్ధ ముఖ్యమంత్రి అని పేర్కొనే వారికి, ఈ ఎన్నికలోక చెంప దెబ్బవంటివి. ఆయన నేతృత్వంలో ఎన్నికలకు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెరాసలు చేరుకోలేకపోయాయి. ఈ విషయంలో తెలుగు దేశం పార్టీ కొంత మెరుగుయిన ఫలితాలను రాబట్టి, ఆ రెండు పార్తీలకన్నా ఎక్కువ సంఘాలను గెలుచుకొని రాష్ట్రంలో తన ప్రభావం తగ్గలేదని నిరూపించుకొంది.   ఈ ఎన్నికలలో స్థానిక పరిస్థితులు, స్థానిక నేతల మద్య నున్న సంబంధ బాంధవ్యాలు లెక్కలోకి తీసుకొంటే, వీటిని సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా చెప్పలేక పోయిన్నపటికీ, ఈ ఎన్నికల ప్రభావం రాజకీయ పార్టీలపై తప్పకుండా ఉంటుంది. మళ్ళీ అదికారంలోకి రావాలనుకొనే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఫలితాలను హెచ్చరికగా తెసుకొని తగిన మార్పులు, ప్రణాలికలు చేసుకోకపొతే, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత ధృడంగా ఎదిగి, రాష్ట్రంలో అన్నిరాజకీయ పార్టీలకు పెనుసవాలు విసురుతుందని చెప్పవచ్చును.  

సీఎం ఢిల్లీ టూర్ తెలిసి..బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

        ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లాల్లో ఉన్న విట్స్ కళాశాలలో మొదటి సంవత్సరం స్టూడెంట్ కడవెండి నీరజ్ భరద్వాజ్ బాత్రూంలోకి వెళ్లి డీజిల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకొవడంతో, అతనిని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. గాయాలు పెద్దవి కావడంతో పరిస్థితి విషమించి సోమవారం రాత్రి చికిత్స పొందుతూతుది శ్వాస విడిచాడు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్తున్నారని మీడియా ద్వారా తెలిసిందని, అదే రోజు ఆత్మ బలిదానానికి సిద్ధపడితే దాని ప్రభావం అధిష్టానంపై ఉంటుందనే భావనతోనే భరద్వాజ్ ఆత్మహత్యకు పూనుకున్నట్లు తనతో చెప్పారని టిఎంయు నేత బాబు తెలిపారు. భరద్వాజ్ నూ  పరామర్శించడానికి వచ్చిన తెలంగాణ విద్యార్థులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఎంజీఎం ఆస్పత్రి ముందు రాజీవ్‌గాంధీ విగ్రహం ఎదుట విద్యార్థులు టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావు, పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. రాస్తారోకో నిర్వహించారు. ఒక పోలీసు జీపు, రెండు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు.

బాలయ్యతో మళ్ళీ జత కట్టనున్ననయనతార?

  నందమూరి బాలకృష్ణ తన శ్రీమన్నారాయణ చిత్రం తరువాత మళ్ళీ ఇంతవరకు కొత్తగా ఏసినిమా కూడా మొదలుపెట్టలేదు. అయితే, త్వరలో ఆయన ఒక జానపద సినిమాలో నటించబోతున్నాడని టాలీవుడ్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ‘సింహా,’ ‘శ్రీ రామ రాజ్యం’ సినిమాలలో ఆయనతో జతకట్టిన నయనతార మళ్ళీ ఈ సినిమాలో కూడా ఆయనతో జత కట్టబోతోందని సమాచారం. ఈ సినిమాలో వారిద్దరూ మహారాజు, మహారాణీ పాత్రలు పోషిస్తారని సమాచారం. ఇక, బాలయ్య బాబు అభిమానులకు సంతోషం కలిగించే మరో ఆసక్తికరమయిన వార్త ఏమిటంటే ఈ సినిమాకు ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాను ‘శ్రీరామరాజ్యం’ సినిమాను నిర్మించిన ఎలమంచిలి శివాజీ నిర్మిస్తారని సమాచారం. బాలయ్య బాబు పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10వ తేదీన ఈ సినిమా షూటింగు మొదలవవచ్చునని సమాచారం. అయితే, ఈ విషయాన్నిఇంకా సంబందిత వ్యక్తులు ధృవీకరించవలసి ఉంది.

విశ్వరూపం 7న విడుదల: కమల్ ఊహించని క్లైమాక్స్

  ఎట్టకేలకు కమల్ హస్సన్ తన స్వంత రాష్ట్రంలో, తన స్వంత ప్రజలకు, తన ‘విశ్వరూపం’ సినిమా చూపించుకొనే భాగ్యం దక్కింది. రాజకీయ నాయకులూ, కొందరు మత చాందసవాదులు, సినిమా డిస్ట్రిబ్యుటర్లూ అందరూ కలిసి తన దారిలో పేర్చిన ముళ్ళని జాగ్రత్తగా దాటుకొంటూ, చివరికి ఈ నెల 7వ తేదీన విశ్వరూపం తమిళ్ వెర్షన్ సినిమాని విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటికే తెలుగు హిందీ బాషలలో ప్రపంచమంతా విడుదలయి చాలా రోజులు అయినప్పటికీ, ఇంతవరకు తమిళ్ వెర్షన్ మాత్రం తన స్వంత రాష్ట్రంలోనే విడుదల చేసుకోలేకపోయారు. అయితే, మొన్న స్థానిక ముస్లిం నేతలతో ప్రభుత్వ మద్యవర్తిత్వంలో జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో అన్ని అడ్డంకులు తొలగిపోయి, సినిమా విడుదలకు మార్గం సుగమం అయింది.   ఒక మంచి సినిమాను తీసినందుకు అభినందించవలసిన తన ప్రజలే అనేక అడ్డంకులు సృష్టించి తీవ్ర విమర్శలు చేయడంతో వేదన చెందినకమల్ హస్సన్ ఒకానొక సమయం లో రాష్ట్రం, దేశం కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతానని అన్నారు. అయితే, ఆయన ఇంతవరకు పడిన బాధను మరిపిస్తూ దేశం నలుమూలాలనుండి ఆయన అభిమానులు చెక్కులు, డీడీలు పంపి ఆయనపై అవ్యాజమయిన ప్రేమాభిమానాలు కురిపించేసరికి, కమల్ హాస్సన్ చలించిపోయారు. తను ఆర్దిక ఇబ్బందుల్లో చిక్కుకొని, చివరికి తన ఇంటిని కూడా తాక్కట్టుపెట్టుకొన్నానని ఆయన మీడియా ముందు చెప్పిన మాటలకు స్పందించిన ఆయన అభిమానులు, యధాశక్తిన డబ్బు పంపి అయన ఊహించంత ప్రేమాభిమానాలు కురిపించారు.   కొందరు ప్రజలచేత ద్వేషింపబడి దేశం వదిలిపెట్టి వెళ్లిపోదామనుకొన్న ఆయనను తమ ప్రేమాభిమానాలతో బందించివేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “నా పై ప్రజలు చూపిన ఈ ఆధారాభిమానాలను నేన్నటికీ మరిచిపోలేను. త్వరలో నా సినిమా విడుదల అవుతున్నందున నా ఆర్దిక సమస్యలని అధిగమించగలను, గనుక చెక్కులను, డీడీలను త్రిప్పి పంపిస్తున్నాను. నా కష్ట కాలం లో నాకు అండగా నిలబడిన ప్రతీ ఒక్కరికీ ధన్య వాదాలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు. బహుశః ఇటువంటి క్లైమాక్స్ ఆయన కూడా ఊహించి ఉండరు. అందుకే ఆల్ ఈజ్ వెల్ అనుకోవాలని అమీర్ ఖాన్ అన్నారు.

సీఎం కిరణ్ చప్రాసీయా

        సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి అధిష్టానం పిలిపించడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అపహాస్యం చేశారు. తెలంగాణలోని పరిస్థితులు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాని మన్మోహన్ సింగ్‌లకు తెలియవా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఓ చప్రాసీయా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇక్కడీవన్ని మోసుకుపోయి ఢిల్లీకి అందించే డ్యూటీ ముఖ్యమంత్రిదయినట్టు కనిపిస్తోందన్నారు. తెలంగాణపై సంప్రదింపులు జరుపుతామని కేంద్ర పెద్దలు చెబితే.. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఆధ్వర్యంలో గత నెల జరిగిన అఖిలపక్ష సమావేశాన్ని అవమానించినట్లేనని ఆయన అన్నారు. తెలంగాణపై నాన్చకుండా వెంటనే తేల్చాలన్నారు. తెలంగాణలో ఆత్మహత్యలకు కారణం సోనియానేనని ఆరోపించారు.

షర్మిలా, బ్రదర్ అనిల్ ఆస్తులపై విచారణకు విహెచ్ డిమాండ్

        వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్‌ల ఆస్తులపై విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు డిమాండ్ చేశారు. షర్మిల, జగన్ ఆస్తులపై కాంగ్రెసు ఊరురా ప్రచారం చేయాలన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు ఎంత దోచుకున్నారో బయటకు రావాలన్నారు. 10 కంపెనీలలో బ్రదర్ అనిల్ కుమార్‌కు పెట్టుబడులు ఉన్నాయని, దోచుకున్నది కాక కాంగ్రెసు నేతలనే కించపర్చేలా వారు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ కు వ్యతిరేఖంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కనువిప్పు యాత్ర చేయాలని పిలుపునిచ్చారు.

రాజస్థాన్ రాయల్స్ కు 100 కోట్ల జరిమానా

      ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝులిపించింది. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ 100 కోట్ల రూపాయల జరిమానా విధి౦చింది. ఈ మేరకు రాజసాన్ రాయల్స్‌ యాజమాన్యనికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు విదేశాల నుండి అక్రమంగా నిధులు సేకరించినట్లు ఈడీ పేర్కొంది. ఇది ఫెమా ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది. ఫెమా ఉల్లంఘన కింద ఈ మేరకు జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. జరిమానాగా విధించిన రూ.100 కోట్లను 45 రోజుల్లో చెల్లించాలని రాజస్థాన్ రాయల్స్ జట్టును ఆదేశించింది.

జగన్ కార్పోరేట్ వ్యూహం

        వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి దివంగత నేత రాజశేఖరరెడ్డి హయంలో లబ్ది పొందిన కంపెనీలు సహకరిస్తున్నాయని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణ ఆరోపించారు. పార్టీలలో నేతల ఫిరాయింపులను కార్పోరేట్ సంస్థల యాజమాన్యాలు ప్రోత్సహిస్తున్నాయని ఆయన అన్నారు.   పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన వ్యూహ రచన చంచల్‌గూడ జైలు నుంచే జగన్ చేస్తుంటే, దానికి అవసరమైన డబ్బును వైయస్ వల్ల లబ్ధి పొందిన పారిశ్రామికవేత్తలు సమకూర్చుతున్నారన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే అవినీతి సొమ్ము పోతుందనే భయంతో వారు జగన్‌తో దోస్తీ చేస్తున్నారని యనమల మండిపడ్డారు.    

వరంగల్లో మంత్రుల ఇళ్ళ ముట్టడి, ఉద్రిక్తత

        తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్లో తెలంగాణ వాదులు మంత్రుల ఇళ్ళ ముట్టడికి దిగారు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ మంత్రి సారయ్య ఇంటి ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేసి విద్యార్థులను అక్కడి నుండి చెదరగొట్టారు. ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి భర్త భాస్కర్ వాహనంపై కూడా ఆందోళనకారులు దాడి చేసి అద్దాలు పగులకొట్టారు. మరో మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిని కూడా ముట్టడించాలని వారు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ కోసం విద్యార్ధులు బలిదానాలు చేస్తుంటే మంత్రులు తమ పదవులలో కొనసాగడం సరికాదని వారు విమర్శిస్తున్నారు.

సీఎం కిరణ్ ఢిల్లీ టూర్: ఆజాద్ అసంతృప్తి

        అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వెళ్ళిన కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఆజాద్ తో భేటి అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ పైన, రాష్ట రాజకీయాలపైన చర్చించినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి శంకర్రావు, మజ్లిస్ పార్టీ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీలపై ప్రభుత్వం వ్యవహించిన తీరు పై ఆజాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శంకర్ రావు, ఓవైసీ అరెస్ట్ పై కిరణ్ ఆజాద్ కి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆతరువాత సహకార ఎన్నికల నివేదికను కూడా ఆయన సమర్పించారు. మొదటి విడత సహకార ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుచుకున్నామని, నేటి నుంచి జరగనున్న రెండో విడత సహకారఎన్నికల్లో కూడా మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటామని కిరణ్ అజాద్ తో ధీమా వ్యక్తం చేశారు.  తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు, రాజకీయ వ్యవహారాలు, రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ బలం తదితర అంశాలపై వారు చర్చించినట్లు  సమాచారం. గులాం నబీ ఆజాద్‌తో భేటీ అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకోవడం విశేషంగా కనిపిస్తుంది.

భయపడుతున్న జగన్ పార్టీ !

        సహకార ఎన్నికల్లో సత్తా చూపలేకపోయిన జగన్ పార్టీ తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న శాసనమండలి ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు భయపడుతున్నట్లుగా తెలుస్తోంది. విద్యావంతులు, మేధావులు ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్నందున తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థులను పోటీకి దించడం లేదని ప్రకటించింది. రాష్ట్రంలో మూడు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుల స్థానాలకు మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఎక్కడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం లేదు. దీనిని బట్టి ఆ పార్టీ భయపడుతున్నట్లు కనిపిస్తుంది. వైఎస్ పట్ల కిందిస్థాయి వర్గాల్లో సానుభూతి ఉంది. అయితే విద్యావంతులు, మేధావుల వరకు వచ్చే సరికి జగన్ అవినీతి చర్చకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు దిగి రిస్కు తీసుకోవడ౦ ఎందుకు అని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రెండవ విడత సహకారం నేడే

    ఈ రోజు సోమవారం రాష్ట్రంలో రెండవ విడత సహకార ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 1484 వ్యవసాయ సహకార సంఘాలకు, 940 ఇతర సంఘాలకు ఈ రోజు ఎన్నికలు జరుగవలసి ఉండగా, వాటిలో 68సంఘాల ఎన్నికల పై ప్రభుత్వం స్టే విదించింది. మొదటి విడతలో రాజకీయ పార్టీలు ఒక దానికొకటి పూర్తిగా సహకరించుకోనట్లే, రెండవ విడతలో కూడా నీకిది-నాకది అనే రీతిలో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో 475 సంఘాలలో పోటీ లేకుండా ఏకగ్రీవం అయినందున అక్కడ ఎన్నికలు జరుపవలసిన అవసరం లేదు. ఈ రోజు ఉదయం 7గంటలకు మొదలయ్యే పోలింగు మధ్యాహ్నం 2గంటల జరుగుతుంది. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు మొదలు పెట్టి పూర్తవగానే ఫలితాలు కూడా ఈ రోజే వెల్లడిస్తారు.ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగే సంఘాలు:    జిల్లా పేరు            సంఘాల సంఖ్య విశాఖపట్నం 42 విజయనగరం 37 శ్రీకాకుళం 42 తూర్పుగోదావరి 42 పశ్చిమగో దావరి 56 కృష్టా 95 గుంటూరు 47 ప్రకా శం 61 నెల్లూరు 34 చిత్తూరు 30 కడప 22 కర్నూలు 27 అనంతపురం 42 అదిలాబాద్‌ 35 కరీంనగర్‌ 57 ఖమ్మం 48 వరంగల్‌ 33 నిజామబాద్‌ 54 నల్లగొం డ 53 మహబూ బ్‌నగర్‌ 44 మెదక్‌ 51 రంగారె డ్డి 18

టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల అవిశ్వాస యుద్ధం

  బొత్స సత్యనారాయణ ఏకారణంతో 9మంది జగన్ అనుకూల శాసన సభ్యులను పార్టీ నుండి బహిష్కరిస్తున్నాని ప్రకటించారో గానీ, అది తెలుగు దేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు మంచిపని కల్పించింది. ప్రభుత్వం మైనార్టీలో పడినప్పటికీ కూడా, దానిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి తెలుగు దేశం పార్టీ ఎందుకు జంకుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తే, మీ సభ్యులను బహిష్కరిస్తే మీరే స్వయంగా ఆపని ఎందుకుచేయట్లేదని తెలుగు దేశం పార్టీ ఎదురు ప్రశ్నిస్తోంది.   కాంగ్రెస్ యం.పీ.గా కొనసాగుతూ వైయస్సార్ పార్టీకి జై కొడుతున్న సబ్బంహరి అడిగిన ప్రశ్నలకు జవాబుగా, “అసలు ముందు మీరే పార్టీలో ఉన్నారిప్పుడు? కాంగ్రెస్ లోనా లేక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనా స్పష్టం చేయమని తెలుగు దేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలోఉంటూ తన స్వంత పార్టీ మీదనే అవిశ్వాసం పెట్టమని మమ్మలిని ఆయన అడుగుతుంటే, మరి కాంగ్రెస్ పార్టీ అతనిపై ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవట్లేదు? ఈవిధంగా అయన పార్టీ వ్యతిరేఖ కార్యక్రమాలకి పాల్పడుతున్నపుడు అతనిని కూడా పార్టీలోంచి ఇంకా బహిష్కరించకుండా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉపేక్షిస్తోంది? అని ప్రశ్నించారు.   కాంగ్రెస్ పార్టీపై అవిశ్వాసం పెట్టాలని ఆయన అంతగా తపిస్తుంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయే ఆ పని స్వయంగా ఎందుకు చేయట్లేదు?తమ అనుచరులు 9 మందిని కాంగ్రెస్ పార్టీలోంచి బహిష్కరిస్తున్నపుడు, వారే స్వయంగా గవర్నర్ దగ్గరకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉపసహరించుకొంటున్నామని స్వయంగా చెప్పి, కిరణ్ కుమార్ ప్రభుత్వంపై వారే స్వయంగా అవిశ్వాసం పెట్టవచ్చు కదా? అని సోమిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలని ప్రశ్నించారు.   మొత్తం మీద అటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ గానీ కిరణ్ ప్రభుత్వం పై అవిశ్వాసం పెట్టే విషయంలో ఈ విదంగా కీచులాడుకొంటూ, వెనకడుతుంటే కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం తన పని తానూ నిశ్చింతగా చేసుకుపోతున్నారు. బహుశః ఇప్పుడు ఏ పార్టీ కూడా తన ప్రభుత్వాన్ని కూల్చి, ఎన్నికలకి వెళ్ళే దైర్యం చేయలేదని ఆయనకి బాగా అర్ధం అయింది కనుకనే అంత నిశ్చింతగా ఉండగలుగుతున్నారేమో.

విజయవాడలో బాబు పాదయాత్ర, లగడపాటి హల్ చల్

      చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర విజయవాడ నగరంలో ప్రవేశించనున్న నేపథ్యంలో లగడపాటి ఆదివారం వ్యూహాత్మకంగా ‘సమైక్యర్యాలీ’కి శ్రీకారం చుట్టాడు. అటు చంద్రబాబు యాత్ర నగరంలోకి రావడం, ఇక్కడ లగడపాటి ర్యాలీ ఒకేసారి ఎదురుపడే పరిస్థితి వచ్చింది. దీంతో తాను చంద్రబాబును కలిసి వినతిపత్రం ఇస్తానంటూ లొల్లిపెట్టాడు. దీంతో బుడమేరు వంతెన వద్ద పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు నాయుడు అనుమతి ఇస్తే వెళ్తానని పోలీసులను కోరాడు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఊరుకున్నాడు. ఇంతకుముందు యాత్ర జిల్లాలోకి వచ్చిన సమయంలో అనుమంచి వద్ద లగడపాటి ఇలాగే హడావిడి చేశాడు. తాజాగా మళ్లీ ఇదే సీన్ క్రియేట్ చేశాడు. చంద్రబాబు సమైక్య రాష్ట్రానికి వ్యతిరేకం అన్న భావన కలిగించడమే లగడపాటి లక్ష్యంగా కనిపిస్తుంది.