టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల అవిశ్వాస యుద్ధం

 

బొత్స సత్యనారాయణ ఏకారణంతో 9మంది జగన్ అనుకూల శాసన సభ్యులను పార్టీ నుండి బహిష్కరిస్తున్నాని ప్రకటించారో గానీ, అది తెలుగు దేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు మంచిపని కల్పించింది. ప్రభుత్వం మైనార్టీలో పడినప్పటికీ కూడా, దానిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి తెలుగు దేశం పార్టీ ఎందుకు జంకుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తే, మీ సభ్యులను బహిష్కరిస్తే మీరే స్వయంగా ఆపని ఎందుకుచేయట్లేదని తెలుగు దేశం పార్టీ ఎదురు ప్రశ్నిస్తోంది.

 

కాంగ్రెస్ యం.పీ.గా కొనసాగుతూ వైయస్సార్ పార్టీకి జై కొడుతున్న సబ్బంహరి అడిగిన ప్రశ్నలకు జవాబుగా, “అసలు ముందు మీరే పార్టీలో ఉన్నారిప్పుడు? కాంగ్రెస్ లోనా లేక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనా స్పష్టం చేయమని తెలుగు దేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలోఉంటూ తన స్వంత పార్టీ మీదనే అవిశ్వాసం పెట్టమని మమ్మలిని ఆయన అడుగుతుంటే, మరి కాంగ్రెస్ పార్టీ అతనిపై ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవట్లేదు? ఈవిధంగా అయన పార్టీ వ్యతిరేఖ కార్యక్రమాలకి పాల్పడుతున్నపుడు అతనిని కూడా పార్టీలోంచి ఇంకా బహిష్కరించకుండా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉపేక్షిస్తోంది? అని ప్రశ్నించారు.

 

కాంగ్రెస్ పార్టీపై అవిశ్వాసం పెట్టాలని ఆయన అంతగా తపిస్తుంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయే ఆ పని స్వయంగా ఎందుకు చేయట్లేదు?తమ అనుచరులు 9 మందిని కాంగ్రెస్ పార్టీలోంచి బహిష్కరిస్తున్నపుడు, వారే స్వయంగా గవర్నర్ దగ్గరకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉపసహరించుకొంటున్నామని స్వయంగా చెప్పి, కిరణ్ కుమార్ ప్రభుత్వంపై వారే స్వయంగా అవిశ్వాసం పెట్టవచ్చు కదా? అని సోమిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలని ప్రశ్నించారు.

 

మొత్తం మీద అటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ గానీ కిరణ్ ప్రభుత్వం పై అవిశ్వాసం పెట్టే విషయంలో ఈ విదంగా కీచులాడుకొంటూ, వెనకడుతుంటే కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం తన పని తానూ నిశ్చింతగా చేసుకుపోతున్నారు. బహుశః ఇప్పుడు ఏ పార్టీ కూడా తన ప్రభుత్వాన్ని కూల్చి, ఎన్నికలకి వెళ్ళే దైర్యం చేయలేదని ఆయనకి బాగా అర్ధం అయింది కనుకనే అంత నిశ్చింతగా ఉండగలుగుతున్నారేమో.