విశ్వరూపం 7న విడుదల: కమల్ ఊహించని క్లైమాక్స్

 

ఎట్టకేలకు కమల్ హస్సన్ తన స్వంత రాష్ట్రంలో, తన స్వంత ప్రజలకు, తన ‘విశ్వరూపం’ సినిమా చూపించుకొనే భాగ్యం దక్కింది. రాజకీయ నాయకులూ, కొందరు మత చాందసవాదులు, సినిమా డిస్ట్రిబ్యుటర్లూ అందరూ కలిసి తన దారిలో పేర్చిన ముళ్ళని జాగ్రత్తగా దాటుకొంటూ, చివరికి ఈ నెల 7వ తేదీన విశ్వరూపం తమిళ్ వెర్షన్ సినిమాని విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటికే తెలుగు హిందీ బాషలలో ప్రపంచమంతా విడుదలయి చాలా రోజులు అయినప్పటికీ, ఇంతవరకు తమిళ్ వెర్షన్ మాత్రం తన స్వంత రాష్ట్రంలోనే విడుదల చేసుకోలేకపోయారు. అయితే, మొన్న స్థానిక ముస్లిం నేతలతో ప్రభుత్వ మద్యవర్తిత్వంలో జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో అన్ని అడ్డంకులు తొలగిపోయి, సినిమా విడుదలకు మార్గం సుగమం అయింది.

 

ఒక మంచి సినిమాను తీసినందుకు అభినందించవలసిన తన ప్రజలే అనేక అడ్డంకులు సృష్టించి తీవ్ర విమర్శలు చేయడంతో వేదన చెందినకమల్ హస్సన్ ఒకానొక సమయం లో రాష్ట్రం, దేశం కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతానని అన్నారు. అయితే, ఆయన ఇంతవరకు పడిన బాధను మరిపిస్తూ దేశం నలుమూలాలనుండి ఆయన అభిమానులు చెక్కులు, డీడీలు పంపి ఆయనపై అవ్యాజమయిన ప్రేమాభిమానాలు కురిపించేసరికి, కమల్ హాస్సన్ చలించిపోయారు. తను ఆర్దిక ఇబ్బందుల్లో చిక్కుకొని, చివరికి తన ఇంటిని కూడా తాక్కట్టుపెట్టుకొన్నానని ఆయన మీడియా ముందు చెప్పిన మాటలకు స్పందించిన ఆయన అభిమానులు, యధాశక్తిన డబ్బు పంపి అయన ఊహించంత ప్రేమాభిమానాలు కురిపించారు.

 

కొందరు ప్రజలచేత ద్వేషింపబడి దేశం వదిలిపెట్టి వెళ్లిపోదామనుకొన్న ఆయనను తమ ప్రేమాభిమానాలతో బందించివేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “నా పై ప్రజలు చూపిన ఈ ఆధారాభిమానాలను నేన్నటికీ మరిచిపోలేను. త్వరలో నా సినిమా విడుదల అవుతున్నందున నా ఆర్దిక సమస్యలని అధిగమించగలను, గనుక చెక్కులను, డీడీలను త్రిప్పి పంపిస్తున్నాను. నా కష్ట కాలం లో నాకు అండగా నిలబడిన ప్రతీ ఒక్కరికీ ధన్య వాదాలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు. బహుశః ఇటువంటి క్లైమాక్స్ ఆయన కూడా ఊహించి ఉండరు. అందుకే ఆల్ ఈజ్ వెల్ అనుకోవాలని అమీర్ ఖాన్ అన్నారు.