మిధున్ చక్రవర్తిని ప్రశ్నించిన ఈడీ అధికారులు

  ఒకనాటి ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ర్టంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్.పి అయిన మిధున్ చక్రవర్తి శారదా గ్రూప్ ఆఫ్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఆ గ్రూప్ కే చెందిన శారదా చిట్ ఫండ్ సంస్థలో జరిగిన భారీ కుంభకోణంలో ఇప్పటికే తృణమూల్ పార్టీకి చెందిన కొందరు మంత్రులు, యంపీలను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసారు. ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నిన్న మిధున్ చక్రవర్తిని కూడా ఈ కుంభకోణం గురించి చాలాసేపు ప్రశ్నించి ఆయన సాక్ష్యాన్ని రికార్డు చేశారు. తనకు ఈ కుంభకోణానికి ఎటువంటి సంబంధం లేదని, తను కేవలం ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా మాత్రమే వ్యవహరించానని, అందుకోసం ఆ సంస్థ తనకు చెల్లించిన మొత్తాన్ని కూడా తను తిరిగి ఇచ్చేందుకు సిద్దమని ఈడీ అధికారులకు ఆయన చెప్పినట్లు సమాచారం. సినీ నటులందరికీ రాజకీయాలు అచ్చిరావనే సంగతి ఇదివరకు అమితాభ్ బచ్చన్, ఆ తరువాత దాసరి నారాయణ రావు ఇప్పుడు మిధున్ చక్రవర్తిలను చూస్తే అర్ధమవుతుంది.

విజయవాడ తెదేపా నగర అధ్యక్షునిగా బుద్దా వెంకన్న ఎన్నిక

  తెలుగుదేశం పార్టీ జిల్లాలవారిగా అధ్యక్షపదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదివారంనాడు జరిగిన ఎన్నికలలో కృష్ణా జిల్లాకు బచ్చు అర్జునుడు, విజయనగరం జిల్లాకు ద్వారంపూడి జగదీష్ జిల్లా అద్యక్షులుగా ఎన్నికయ్యారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో అనివార్య కారణాల వలన ఎన్నికలు వాయిదా పడ్డాయి. శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష అభ్యర్ధులపై స్థానిక తెదేపా నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో అధ్యక్షుని ఎంపిక చేసే బాధ్యత పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికే వదిలిపెట్టాలని అందరూ నిర్ణయించినట్లు తెలుస్తోంది.   విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి ఎక్కువ మంది పోటీలో ఉండటంతో అందరి మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం గానీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకొన్నారో ప్రకటిస్తామని మంత్రి యనమల రామకృస్ణుడు తెలిపారు. విజయవాడ నగర తెదేపా అధ్యక్షునిగా బుద్దా వెంకన్న ఎన్నుకోబడ్డారు.

తెదేపా జిల్లా అధ్యక్ష పదవులకు కొనసాగుతున్న ఎన్నికలు

  ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో ఈరోజు (ఆదివారం) తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక జరుగుతుంది. ఆంధ్రాలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా మరియు చిత్తూరు జిల్లాల, తెలంగాణాలో నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ జిల్లాల అధ్యక్షుల ఎన్నిక జరుగుతుంది.   ఇంతకు ముందు గుంటూరు, నెల్లూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో గుంటూరు జిల్లా అధ్యక్షునిగా వినుకొండ శాసనసభ్యుడు ఆంజనేయులు, నెల్లూరుకి బీద రవిచంద్ర, అనంతపురం జిల్లాకి పార్ధసారధి మరియు పశ్చిమగోదావరి జిల్లాకి రాజ్యసభ సభ్యురాలు సీతారామలక్ష్మి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.   రేపు కడప, కర్నూలు, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి.   అధ్యక్ష పదవులు చేప్పట్టిన వారు తమ తమ జిల్లాలలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, అదే విధంగా ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రచారం చేసి ప్రజలకు పార్టీని, ప్రభుత్వాన్ని మరింత చేరువచేయాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పుడు అధ్యక్షులుగా ఎన్నికవుతున్న వారందరికీ ఆరు నెలల సమయం ఇస్తానని ఒకవేళ వారి పనితీరు బాగోకపోతే వారిని తొలగించి వారి స్థానంలో మరో సమర్ధమయిన వ్యక్తిని నియమిస్తానని చంద్రబాబు నాయుడు అధ్యక్షులుగా ఎన్నికయిన వారికి ముందే హెచ్చరిస్తున్నారు. ఈ మధ్యనే తెదేపా ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాలకు ఇన్-చార్జ్ మంత్రులను కూడా నియమించింది. ఇప్పుడు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికవుతున్నవారు, జిల్లా ఇన్-చార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకొంటూ పార్టీని పటిష్టపరిచేందుకు కృషి చేయాలని చంద్రబాబు నాయుడు సూచిస్తున్నారు.

స్వచ్ఛ భారత్ కోసం చీపుర్లు పట్టిన హీరో వెంకటేష్, రానా

  ఈరోజు (ఆదివారం) హైదరాబాద్ ఫిలిం నగర్ లో జరుగుతున్నా ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో తెలుగుసినీ పరిశ్రమకు చెందిన అనేకమంది నటులు, ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, దర్శకులు కె. రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, నరేంద్రరెడ్డి, ఎన్.శంకర్, నటులు వెంకటేష్, రానా, సందీప్ కిషన్ తనికెళ్ల భరణి వేణుమాధవ్, ఉత్తేజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో బాటు వారి అభిమానులు, అనేక మంది అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొన్నారు.

కెవ్... కోసేసింది...

  ఒక్కోసారి ‘అలాంటి’ మగాళ్ళకు ‘ఇలాంటి’ శిక్ష న్యాయమే అనిపిస్తూ వుంటుంది. ఆమె కూడా ఇది న్యాయమే అనుకుందేమో... నిర్దాక్షిణ్యంగా ‘కోసేసింది’. అయితే ఈ కేసులో ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఆ కోసేసిన మహిళకి, ‘కోత’కి గురైన అతనికి గతంలో ‘అది’ వుండేది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, బీహార్‌ రాష్ట్రంలోని గోపాల్ గంజ్ జిల్లాలో నివసించే ఒక వ్యక్తికి, తన గ్రామానికి చెందిన మరో మహిళతో చాలాకాలంగా వివాహేతర సంబంధం వుంది. అయితే ఈ ఇద్దరికీ ఎందుకోగానీ ఈ మధ్యకాలంలో చెడింది. నువ్వు నా జోలికి రావద్దు అని ఆమె అతనికి చెప్పింది. అయితే అతను తమ మధ్య వున్న సంబంధాన్ని కొనసాగించాల్సిందేనని ఆమె మీద ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. దాంతో ఆమె పూర్తిగా విసిగిపోయింది. అతన్ని అదుపు చేయాలంటే ‘కోసేయడమే’ ఏకైక మార్గం అనుకుంది.ఈ బృహత్ కార్యక్రమానికి ఇరుగుపొరుగు వారు కూడా ఆమెకు తమవంతు సహకారం అందించారు. శనివారం నాడు అతను ఆమె ఇంటికి వచ్చి తనతో సంబంధాన్ని కొనసాగించాలని పాత పాటే పాడాడు. అతను రావడం కోసమే కాసుక్కూర్చుని వున్న ఇరుగుపొరుగువారు అతన్ని గట్టిగా పట్టుకున్నారు. అప్పుడు ఆ వీరనారి ఇంట్లో వున్న తుప్పుపట్టిన కత్తితో... దేవుడా... ఇక చెప్పలేం... అదన్నమాట. ఏదో జరుగుతుందని వస్తే మరేదో జరిగేసరికి ఆ వ్యక్తి కెవ్వుమన్నాడు. కిందపడి గిలగిలలాడాడు. అప్పటి వరకూ అతన్ని ఒడిసి పట్టుకుని, ‘కోత’కు సహకరించిన ఇరుగుపొరుగు వారు మానవతా ధర్మంగా అతన్ని గవర్నమెంట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతను చావుబతుకుల్లో వున్నాడు.

డిల్లీ సీయం కేజ్రీవాల్ డిల్లీ గవర్నర్ తో యుద్ధం

  డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పై యుద్ధం ప్రకటించారు. డిల్లీ ప్రధాన కార్యదర్శి కెకె. శర్మ స్వంత పని మీద శలవుపెట్టి అమెరికా వెళ్ళడంతో, తాత్కాలికంగా ఆ బాధ్యతలు శకుంతల గామ్లిన్ అనే ఐ.ఏ.యస్. అధికారిణికి అప్పగిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేసారు. కానీ ఆవిషయం తన ప్రభుత్వానికి తెలియజేయకుండా, అనుమతి తీసుకోకుండా గవర్నర్ ఆమెకు బాధ్యతలు అప్పగించి తన పరిధిని అతిక్రమించారని, రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించారని కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన శకుంతలను బాధ్యతలు స్వీకరించవద్దని ఆదేశించారు. కానీ ఆమె కేజ్రీవాల్ ఆదేశాలను లెక్కచేయకుండా ఈరోజు సాయంత్రం నుండి ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు స్వీకరించడంతో కేజ్రీవాల్ మరింత ఆగ్రహం చెందారు. ఈ వ్యవహారం గురించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పిర్యాదు చేసేందుకు అపాయింట్ మెంట్ కోరారు. కానీ డిల్లీకి లెఫ్టినెంట్ గవర్నరుగా వ్యవహరిస్తున్న తనకు సెక్షన్ 239ఎఎ ప్రకారం ఏ అధికారినయినా నియమించే అధికారాలున్నాయని గవర్నర్ నజీబ్ జంగ్ స్పష్టం చేసారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయకుండా గవర్నర్ ఈవిధంగా ప్రధాన కార్యదర్శిని నియమించవచ్చా లేదా? నియమిస్తే ఆ వ్యక్తిని బాధ్యతలు స్వీకరించవద్దని ముఖ్యమంత్రి చెప్పడం తప్పా ఒప్పా? అనే విషయాలు న్యాయ నిపుణులే తేల్చాలి. కనుక ఒకవేళ రాష్ట్రపతి కూడా ఎటువంటి చర్యలు తీసుకోనట్లయితే కేజ్రీవాల్ గవర్నర్ ఆదేశాలను సవాలు చేస్తూ కోర్టుకి వెళ్లినా ఆశ్చర్యం లేదు.

అభిమానిపై చేయి చేసుకున్న చిరంజీవి

  సినిమాల్లో విలన్ పై తమ పంచ్ పవర్ చూపే హీరోలు ఈ మధ్య బయట కూడా చూపిస్తున్నారు. ఏ హీరో? ఎక్కడ చూపించాడు? అనే కదా సందేహం... మీరే చూడండి మెగాస్టార్ చిరంజీవి కడపజిల్లా రైల్వే కోడూరులో శ్రీకృష్ణ దేవరాయలి విగ్రహాన్న ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తన 150వ గురించి ప్రస్తావించారు. మెగా అభిమానులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న 150 సినిమా షూటింగ్ ఆగష్ట్ లో ప్రారంభమవుతుందని తెలిపారు. మరోవైపు తమ అభిమాన హీరో చిరంజీవిని చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ నేపథ్యంలో వారి మధ్య తోపులాటలు జరిగాయి. ఈ తోపులాటలో ఒక అభిమాని వెళ్లి చిరంజీవి మీద పడబోయాడు. దీంతో చిరంజీవికి కోపం వచ్చి అభిమాని డొక్కలో ఒక కిక్ ఇచ్చి అభిమానుల తోపులాట మధ్యే చిరు కారెక్కి పెళ్లిపోయారు.

కేసీఆర్ ఇలియానా కంటే అందంగా... రాంగోపాల్ వర్మ

  వివాదాలతో నిరంతరం వార్తల్లో ఉండే రాంగోపాల్ వర్మ తాజాగా కేసీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కేసీఆర్ ఇలియానా కంటే అందంగా ఉంటారు కానీ ఈ మధ్య నిత్యామీనన్ కంటే బాగా నటిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది మంచికో, చెడుకో నాకు అర్ధ కావడం లేదని కామెంట్ చేశారు. అయితే రామ్ గోపాల్ వర్మ కేసీఆర్ పై చేసిన కామెంట్స్ కు టీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేసీఆర్ ను హీరోయిన్ల తో పోల్చడం రాంగోపాల్ వర్మ ముర్ఖత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. గతంలో కూడా కేసీఆర్ పై ఇలాంటి కామెంట్స్ చేశారని, రాంగోపాల్ వర్మకు ప్రముఖలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రచారం చేసుపోవడం అలవాటై పోయిందని అన్నారు. ఇప్పటికైనా ఇలాంటి కామెంట్లు చేయడం మానకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

పొట్టలో ఫోన్.. వైద్యుల నిర్లక్ష్యం

  వైద్యులను దేవుళ్లతో పోల్చుతాం ఎందుకంటే వాళ్లు ప్రాణాలు నిలబెడతారు కాబట్టి. అలాంటి వైద్యులే నిర్లక్ష్యంగా ఉంటే మనిషి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. కానీ ఇక్కడ ఓ డాక్టర్ ఏకంగా పొట్టలో సెల్ ఫోన్ పెట్టి ఆపరేషన్ చేసింది. ఈ ఘటన యెమన్లోని అల్ బషర్ ఆసుపత్రిలో జరిగింది. యెమన్ కు చెందిన హనన్ మహమూద్ అబ్దుల్ కరీం అనే మహిళ ప్రసవం కోసం ఆస్పత్రకి వెళ్లగా అక్కడ ఆమెకు సిజేరియన్ చేయాల్సి వచ్చింది. ఓ మహిళా వైద్యురాలు ఆమెకు ఆపరేషన్ చేసి బిడ్డను కాపాడారు. అనంతరం ఆమె బిడ్డతో ఇంటికి వెళ్లిపోయింది. ఇంతలో సడెన్ గా అబ్దుల్ కరీంకు పొట్టలో వైబ్రేషన్ రావడం, కడుపునొప్పి రావడంతో మళ్లీ పరుగుపరుగున ఆస్పత్రికి వెళ్లింది. అక్కడికి వెళ్లిన తరువాత బాధితురాలని ఎక్స్రే తీసుకోవాలని సూచించారు. అబ్దుల్ కరీం వారి సూచన మేరకు ఎక్స్రే తీసుకోగా ఎక్స్రే తీసిన టెక్నీషియన్లు ఆమె పొట్టలో మొబైల్ ఫోన్ ఉండటం చూసి నోరెళ్ల పెట్టారు. అసలు సంగతి ఏంటంటే సిజేరియన్ చేసిన డాక్టర్ తన మొబైల్ ను అబ్దుల్ కరీం పొట్టలో పెట్టేసి కుట్లు వేసేసింది. ఇప్పుడు ఈ ఘటన జోర్డాన్ పార్లమెంటులో దుమారం రేపుతోంది.

ఆగష్ట్ లో చిరు సినిమా షూటింగ్

  చిరంజీవి 150 వ సినిమా తీస్తాడా? తీయడా? ఇప్పుడు తీస్తాడు.. అప్పుడు తీస్తాడు అంటూ ఎన్నో రోజులుగా ఎన్నో వార్తలు వింటూనే ఉన్నాం. ఎట్టకేలకు సినిమా తీస్తున్నారు అని ప్రకటించారు. తీస్తున్నారు అని చెప్పడంతో మళ్లీ ప్రేక్షకుల్లోహీరోయిన్ ఎవరు, ఎవరు దర్శకత్వ వహిస్తారు, ఎవరు నిర్మిస్తారు అని మళ్లీ 'చిరు' సందేహాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆ సందేహాలు చాలా వరకు తీరినట్టే. తన 150 వ సినిమా షూటింగ్ ను ఆగష్ట్ లో ప్రారంభించనున్నట్లు స్వయంగా చిరంజీవినే ఈ విషయాన్ని వెల్లడించారు. చిరు నటించబోయే 150 చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నట్లు ఖరారైంది. ఈ చిత్రానికి చిరు తనయుడు రామ్ చరణ్ తేజనే నిర్మాతగా వ్యవహరించడం విశేషం. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార కానీ, అనుష్క కానీ నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిసంక్రాంతికి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

పేదల కోసం శ్రమిస్తున్న లీడర్

    ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే రాజకీయ నాయకులకు ప్రజలు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు కళ్ళకు కనపడతాయి సందులు గొందులు తిరుగుతారు వరినాట్లువేస్తారు, వరికోతలు కొస్తారు, ఇస్త్రీ చేస్తారు పేపరు ఫోటోలకు పోజులిస్తారు. రాజకీయ నాయకులు అది చేస్తాం, ఇదిచేస్తాం అని మాటల గారడితో పిచ్చిగా నమ్మే ప్రజలకు హామీలతో వరాల జల్లులు కురిపిస్తారు వారి మాటలు నమ్మి వారికి ఓట్లేసిన ఓటర్లు ఎలక్షన్ కాగానే ఎలక్షన్ ముందు ఉన్న సమస్యలు పరిష్కారం కాక ప్రజలు బాధలతో కన్నీళ్ళతో తడసి ముద్దవుతున్నారు. ప్రజల సమస్యలు నాయకులకు అర్జీల రూపంలో ఇచ్చినా బడ్జెట్ లేదని అటకెక్కుతాయి గతంలో ప్రజలకు వారిచ్చిన హామీలు నెరవేర్చటానికి సొంత డబ్బులు కర్చుచేసి ప్రజల బాధలు తీర్చే నాయకులు ఉన్నారా ?.   ఇదే మనభారత దేశ రాజకీయం, రాజకీయనాయకులు. (ప్రజల సమస్యలు తీర్చలేని రాజకీయనాయకులకు మాత్రమే)   పై కోవకు చెందని నాయకులు కొందరుంటారు వారిలో ఒక్కడు మన కంఠంనేని రవిశంకర్ ప్రజల నుంచి ఏమీ ఆశించకుండా, రాజకీయ పదవి లేకపోయిన, తాత ముత్తాతలు సంపాదించినా ఆస్తులు లేకపోయినా తాను సంపాదించుకున్న దానిలో పేద ప్రజల కోసం ఖర్చు చేసి పేద ప్రజలిచ్చేఆశీస్సులు తాను ఎన్ని కోట్లిచ్చినా దొరకవని మానవ సేవయే మాధవ సేవ అని ముందుకు సాగుతూ "తెలుగు వన్" ఫౌండేషన్ స్థాపించి అనేకమంది పేద ప్రజలను ఆదుకుంటున్న (ఆపదలో ఉన్నవారికి వైద్యం, పేద పిల్లలకు స్కాలర్ షిప్ ద్వారా విధ్య , నిరు పేదలకు గృహనిర్మాణం, ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్, గ్రామీణ మహిళలకు ఉపాధి, ఉచిత కంఫ్యూటర్ విధ్య, వరదబాధితులకు సహాయం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం, యువతకు క్రికెట్ కోచింగులు, అగ్ని ప్రమాద బాధితులకు అర్దిక సహాయం, చేనేత కార్మికులకు బియ్యం పంపిణి, దేవాలయాల పునర్నిర్మాణాలకు ఆర్ధిక సహాయం ) ఇలా అనేక సేవాకార్యక్రమాలు చేస్తూ ప్రాంతం, కులం, మతం, ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా పేద ప్రజలకు సహాయం చేయాలి.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి అనే సంకల్పంతో నిరుపేదల బ్రతుకులలో వెలుగులు నింపటానికి నిస్వార్ధసేవనే నిరుపమానంగా అందించటానికి నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు నిజమైన లీడర్ కంఠంనేని రవిశంకర్ గారు రాజకీయల్లోకి రావాలని ప్రజలకు మరింత సేవలు చేయాలని కోరుకుందాం.

ఏపీలో శాశ్వత హైకోర్టుకు స్థలం గుర్తించండి

  ఉమ్మడి హైకోర్టును విభజించాలని తెలంగాణ న్యాయవాదులు ఎప్పటినుండో కోరుతున్నారు. అయితే హైకోర్టు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు నిర్మించేంత వరకూ ఇక్కడే కొనసాగుతుందని తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో శాశ్వత హైకోర్టు ఎక్కడ నిర్మించాలనుకుంటున్నారో స్థలాన్ని గుర్తించి దానిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివరించాలని ధర్మాసనం వెల్లడించింది. తరువాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్యమంత్రితో సంప్రదించి స్థలం ఎంపికపై సీజే ఓ నిర్ణయం తీసుకునే వీలుంటుందని, ఈ ప్రక్రియ ఆరునెలలో పూర్తి కావాలని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో ప్రధాన అంశాలు   * ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసి పరస్పర సంప్రదింపులతో హైకోర్టు భవనం, పరిపాలన భవనం, న్యాయమూర్తుల, అధికారుల గృహ సముదాయాలు, హైకోర్టు సిబ్బంది క్వార్టర్లు మొదలైన అంశాలపై నిర్ణయం తీసుకోవాలి.   * హైకోర్టు ఏర్పాటు కోసం నిధుల కేటాయింపు, విడుదలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.   * శాశ్వత హైకోర్టు ఏర్పాటయ్యేవరకూ 1956 పునర్విభజన చట్టంలోని సెక్షన్ 51 (3) ప్రకారం తాత్కాలికంగా హైకోర్టు బెంచీలను ఏర్పాటు చేసే విషయంలో ప్రధాన న్యాయమూర్తి ముఖ్యమంత్రితో చర్చించి రెండు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి.

ఇక ఎన్నికల్లో పోటీచేయను... వెంకయ్యనాయుడు

  కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్ననేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయన శుక్రవారం జరిగిన చిగురుపాటి నాగేశ్వరరావు వర్దంతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను జీవితంలో ఇక ఎన్నికల్లో పోటీ చేయనని, తానే కాదు తన కుటుంబసభ్యులు కూడా పోటీ చేయరని స్పష్టం చేశారు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగానని, ఎమ్మెల్యేగా ఉన్పప్పుడు అసెంబ్లీ సీటు వదిలి వెళ్లేవాడిని కాదని... ఇప్పుడు కొందరు ఎంపీలు మాత్రం ఏదో విహారయాత్రకు వచ్చి వెళుతున్నట్టుగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి మాట్లాడుతూ 'ఆయన నిద్రపోరు.. నన్ను నిద్రపోనివ్వరూ' అని చలోక్తులు విసిరారు. కొన్ని పార్టీలు మాత్రం 'ఆయన తినరు మమ్మల్ని తిననివ్వరు అని' అనుకుంటున్నారని ఎద్దేవ చేశారు. భూసేకరణతో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, భూసేకరణ చట్టంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ఆంధ్రరాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

22 మంది సీఈఓలతో మోదీ

ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల చైనా పర్యటనలో భాగంగా షాంఘై చేరుకున్నారు. అక్కడ 22 మంది సీఈవోలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తయారీ రంగాన్ని ప్రోత్సహించడం వల్ల యువతకు ఉపాధి కల్పించవచ్చని,  "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమం ద్వారా భారత్ లో వస్తువులు ఉత్పత్తి చేస్తామని తెలిపారు. భారత్, చైనా దేశాలు భాగస్వామ్యులైతే ఆసియాలో రాజకీయ స్ధిరత్వం, ఆర్ధిక అభివృద్ధి మెరుగుపడుతుందని అన్నారు. రైల్యేలను ఆధునీకరిస్తామని, 50 నగరాల్లో మెట్రో రైలుకు ప్రణాళికలున్నాయని మోదీ తెలిపారు. భారత సంస్కృతి సంప్రదాయాలను చైనాకు పరిచయం చేసిన విధ్వాంసులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని, మోదీ అన్నారు.

దయనీయంగా మారిన ఏపీ ఉన్నత విద్యామండలి పరిస్థితి

  ఓడలు బళ్ళు అవడం అంటే బహుశః ఇదేనేమో! నిన్న మొన్నటి వరకు సమైక్య రాష్ట్రంలో ఆంధ్రా, తెలంగాణా, రాయలసీమ మూడు ప్రాంతాలలో ప్రవేశ పరీక్షలు నిర్వహించిన ఆంద్రప్రదేశ్ ఉన్నత విద్యామండలికి హైకోర్టు తీర్పుతో ఇప్పుడు హైదరాబాద్ లో కార్యాలయమే లేకుండాపోయింది. రాష్ట్ర విభజన బిల్లులో ఆంద్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి గురించి ఎటువంటి ప్రస్తావన లేకపోవడం చేత, అది తెలంగాణాలో ఉన్నందున అది తెలంగాణాకే చెందుతుందని దానిపై సర్వ హక్కులు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటాయని హైకోర్టు తీర్పు చెప్పడంతో, తక్షణమే స్పందించిన తెలంగాణా ప్రభుత్వం ఉన్నత విద్యామండలి భవనాన్ని తన స్వాధీనంలోకి తీసుకొంది. ఇంతవరకు ఉన్నత మండలి ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, సెక్రెటరీలు విధులు నిర్వర్తించిన గదులకు, వాటితో పాటు ఉద్యోగుల పంచ్‌ గది, సర్వర్‌ ఉన్న గదులకూ తాళాలు వేయించింది.   ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తే, ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలోనే రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించుకొనేందుకు అనుమతి ఇచ్చింది కానీ, హైకోర్టు తీర్పును కొట్టివేయకపోవడంతో ఉన్నత విద్యామండలికి ఇప్పుడు కార్యాలయం కానీ, చేతిలో డబ్బు గానీ లేకుండా పోయింది. ఇక చేసేదేమీ లేక ఆంద్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్‌ ఎల్‌.వేణుగోపాల్‌రెడ్డి, కార్యదర్శి టీవీ శ్రీకృష్ణమూర్తి ఇరువురూ కలిసి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సుమితా దావ్రాను కలిసి మండలి రోజువారి కార్యక్రమాలను నిర్వహించుకొనేందుకు అవసరమయిన నిధులు, ఒక కార్యాలయం ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. వారి అభ్యర్ధన మేరకు సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు హైదరాబాద్ లో నాంపల్లి వద్ద గల గగన్‌విహార్‌లోని ఏఎఫ్‌ఆర్‌సీ కార్యాలయంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

శుక్రవారం అర్ధరాత్రి నుండి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

  పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు అర్ధరాత్రి నుండి మళ్ళీ భారీగా పెరగబోతున్నాయి. పెట్రోల్ పై లీటరుకు రూ. 3.13, డీజిల్ పై లీటరుకు రూ. 2.71 చొప్పున ధరలు పెరగబోతున్నాయి. మొత్తం మీద చూసుకొన్నట్లయితే కేవలం ఈ రెండు వారాల వ్యవధిలో పెట్రోలు మీద లీటరుకి రూ.7.09, డీజిల్ మీద లీటరుకి రూ.5.08 పెరిగినట్లయింది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు భారీగా తగ్గిపోయినప్పటికీ ఆ లాభాన్ని నేరుగా ప్రజలకు అందజేయడానికి ఆయిల్ సంస్థలకు కానీ ప్రభుత్వాలకు గానీ మనసొప్పలేదు. కానీ ప్రజల నుండి వస్తున్న తీవ్ర విమర్శల వల్లనయితేనేమి లేక రాజకీయ ఒత్తిడి వల్లనయితేనేమి గతేడాది 2014 అక్టోబర్ నుంచి 2015 ఫిబ్రవరి వరకు పది విడతల్లో పెట్రోల్ పై లీటరుకి రూ. 17.11, డీజిల్ పై 12.96 తగ్గించారు. కానీ ఇప్పుడు కేవలం రెండు వారాల వ్యవధిలోనే పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. బహుశః మరొకటి రెండు నెలల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలను మళ్ళీ పెంచుకొంటూపోయి, ఇదివరకున్న ధరలకే చేర్చుతాయేమో ఆయిల్ కంపెనీలు?

రాహుల్ పై వెంకయ్యనాయుడు సెటైర్లు

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన రైతు భరోసా పాదయాత్రలో భాగంగా అదిలాబాద్ జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సెటైర్లు వేశారు. యూపీఏ ప్రభుత్వం పాలనలో ఉన్నప్పుడు ఎంతో మంది రైతులు చనిపోతే పట్టించుకోని రాహులు గాంధీ ఇప్పుడు మాత్రం రైతు భరోసా పేరిట పాదయాత్ర చేయడం చాలా విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఎలాగూ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉనికి లేకుండా పోయింది, ఇప్పుడు తెలంగాణలో ఆ పరిస్థితి రాకుండా చూసుకునేందుకే రాహులు పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా భూసేకరణ చట్టంపై యూపీఏ అనవసరమైన రాద్దాంతం చేస్తుందని, బ్రిటిష్ కాలం నాటి భూసేకరణ చట్టం కింద కాంగ్రెస్ లక్షల ఎకరాలు భూములను సేకరించి ఇప్పుడు ఈ భూసేకరణ చట్టానికి అడ్డుపడటం చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు. నరేంద్ర మోడీ సూట్ వేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.. గాంధీ, నెహ్రూలు కూడా సూట్ వేసుకున్నారు, ఆసంగతి వారు మర్చిపోయారేమో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు.