వాళ్లను బచ్చాగాళ్లనడం సరికాదు... నాగం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ సీనియర్ నేత నాగం జానార్ధన రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి దక్కిందంటే అది ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్ధుల పోరాటాల ఫలితమేనని ఎద్దేవా చేశారు. అలాంటి విద్యార్ధులను కేసీఆర్ బచ్చాగాళ్లనడం సబబు కాదని, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులతో పెట్టుకుంటే కేసీఆర్ దగ్దమవుతాడని నాగం హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో ఓయూ విద్యార్ధులు చేసిన త్యాగాలను ఎప్పటికీ మరిచిపోలేమని, ఓయూ అంటేనే పోరాటాల గడ్డ అని అన్నారు. 1969 నుంచి ప్రత్యేక రాష్ట్ర కోసం ఎంతో పోరాడి తెలంగాణ పురిటి గడ్డగా మారిందని గుర్తుచేశారు.

ధైర్యం ఉంటే కేసీఆర్ చర్చకు రా.. ఓయూ

ఉస్మానియా యూనివర్సిటీ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తానని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీసింది. విశ్వవిద్యాలయం భూములు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పిన కేసీఆర్ పై అటు విపక్షాలు, ఇటు ఓయూ విద్యార్ధులు విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓయూలో ధర్నా చేపట్టి కేసీఆర్ దిష్టి బోమ్మను కూడా తగలబెట్టారు. ఈ సందర్బంగా విద్యార్ధులు మాట్లాడుతూ పేదలపై కేసీఆర్ గారికి అంత ప్రేముంటే మైం హోం రామేశ్వర్రావుకు కట్టబెట్టిన 30 ఎకరాల భూమిలో ఇళ్లు కట్టించాలి అంతేకాని ఓయూ భూముల జోలికి వస్తే బావుండదని హెచ్చరించారు. విద్యార్ధులు నిరుద్యోగంతో బాధపడుతుంటే అవి మాత్రం పట్టించుకోకుండా పేదల పేరుతో భూములు విక్రయించడానికి కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు దమ్ము, దైర్యం ఉంటే కేసీఆర్ చర్చకు రావాలని ఓ సవాల్ కూడా విసిరారు.

గుత్తా లేఖపై జైరామ్ రమేష్ స్పందన

  రాష్ట్ర విభజనలో కీలకపాత్ర పోషించిన మాజీ కేంద్రమంత్రి జైరామ్ రమేష్ ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని మొదటి నుండి పోరాడుతున్న వారిలో ఒకరు. నల్గొండ కాంగ్రెస్ యంపీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవద్దంటూ ప్రధాని మోడీకి లేఖ వ్రాయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మొదట కాంగ్రెస్ పార్టీయే ప్రజలకు హామీ ఇచ్చిందని, దాని కోసం రాష్ట్రంలో, పార్లమెంటులో కాంగ్రెస్ నేతలు పోరాటం చేస్తుంటే, ప్రత్యేక హోదా ఇవ్వవద్దంటూ ప్రధానికి లేఖ వ్రాయడం చాలా పొరపాటని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ గుత్తా లేఖ వ్రాయడం వ్యక్తిగతమని దానితో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని సర్ది చెప్పుకొన్నారు. గుత్తా సంగతి కాంగ్రెస్ అధిష్టానం చూసుకొంటుందని రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ పోరాటం ఆగదని ఆయన అన్నారు.   ఇంతవరకు ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన యంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వహస్తాలతో ప్రధానమంత్రికి వ్రాసిన లేఖ వలన ఇప్పుడు కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడిపోయింది. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని చెప్పుకొంటున్న కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్య పూర్వకంగానే ఆయన చేత ఈ లేఖ వ్రాయించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డంకులు సృష్టిస్తోందని బీజేపీ ఇప్పుడు ఎదురు దాడి చేయవచ్చును . ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలోనే ఈ అంశం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పుడు, ఆ పార్టీ తమను ఏవిధంగా ప్రశ్నిస్తోందని బీజేపీ ఎదురు ప్రశ్న వేయవచ్చును. లేదా కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతునప్పుడు ప్రత్యేక హోదా కోసం ఆ పార్టీ ఎందుకు పోరాడుతోంది? ఒకవేళ మోడీ ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోతే అప్పుడు కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇదేవిధంగా అడ్డు తగులుతారా? అని బీజేపీ ఎదురు ప్రశ్నిస్తే కాంగ్రెస్ వద్ద సరయిన సమాధానం ఉండదు.

తలలు నరకడానికి ఉద్యోగులు కావాలి

  సౌదీ అరేబియా ప్రభుత్వం ఓ ఉద్యోగ ప్రకటన చేసింది. అది అలాంటి ఇలాంటి జాబ్ ఆఫర్ కూడా కాదండి తలలు నరిగే జాబ్ ఆఫర్. విషయం ఏంటంటే ఇస్లామికి చట్టాన్ని కఠినంగా అమలు చేసే దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. ఈ దేశంలో మత్తుమందుల రవాణా, అత్యాచారం, హత్య ఆయుధాల దోపిడీ వంటి అనేక రకాల నేరాలకు చాలా కఠినమైన శిక్షలు విధిస్తుంటారు. ఈ శిక్షల్లో శిరచ్చేదనం, తుపాకీతో కాల్చడం, రాళ్లతో కొట్టడం వంటి శిక్షలు విధిస్తుంటారు. అయితే చాలా వరకూ శిరచ్ఛేదనాన్నే అమలు చేస్తుంటారు సౌదీ అరేబియన్లు. ఈ నేపథ్యంలో ఆ దేశ సివిల్ సర్వీస్ మంత్రిత్వ శాఖ శిరచ్ఛేదం చేసేందుకు మొత్తం ఎనిమిది మంది ఉద్యోగులు కావాలంటూ అందరూ విస్తుపోయే ఈ నోటిఫికేషన్ విడుదుల చేసింది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారికి ఎటువంటి విద్యార్హతలు అవసరం లేదని, ఎటువంటి రాత పరీక్షలు కూడా ఉండవని సౌదీ అరేబియా ప్రభుత్వం తెలిపింది.

ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక రైల్వే జోన్ ఈ నెల26న?

  విశాఖ కేంద్రంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రజల చిరకాల డిమాండ్ త్వరలో నెరవేరబోతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ నెల26న మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవబోతోంది కనుక ఆరోజునే ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రకటించే అవకాశం ఉంది. దీని గురించి గట్టిగా కృషి చేస్తున్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు మరియు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు ఇరువురు సురేష్ ప్రభును కలిసినప్పుడు వారికి ఆయన ఈ విషయం గురించి తెలియజేసినట్లు సమాచారం.   ఈనెల 26న విశాఖపట్నంలో బీజేపీ ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటుచేసి, దానికి సురేష్ ప్రభును ముఖ్య అతిధిగా ఆహ్వానించి ఆయనచేతనే ప్రకటన చేయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా తమ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకొంటోందనే గట్టి సందేశం ప్రజలకు ఇచ్చి తమ పార్టీపై, కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు అయినట్లయితే రాష్ట్ర ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. అదేవిధంగా రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో ఉన్న అనేక రైల్వే ప్రాజెక్ట్ లు అన్నీ మరింత వేగంగా పూర్తయ్యే అవకాసహం కలుగుతుంది.

డాక్టర్ శ్రీభూషణ్ రాజుకు ‘తెలుగువన్’ సత్కారం

  తెలుగువన్ 15వ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ కిడ్నీ వైద్యులు డాక్టర్ శ్రీ భూషణ్ రాజును ఘనంగా సత్కరించారు. డా. శ్రీ భూషణ్ రాజు నిమ్స్‌లో ప్రముఖ కిడ్నీ వైద్యులు. ఆయన ఇప్పటి వరకూ దాదాపు 150కి పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేశారు. అందులో 145కు పైగా విజయం సాధించినవే. శ్రీ భూషణ్ రాజు గారు రోగులతో అంత ఆప్యాయంగా, ప్రేమగా ఉంటారు. మానసికంగా క్రుంగిపోయిన రోగులు సైతం ఆయన చేసే మోటివేషన్ వల్ల జీవితం మీద ఆశ పెంచుకుంటారు. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా రోగులందరిని సమానంగా చూసే మంచి మనసున్న వైద్యులు డా. భూషణ్ రాజు. తెలుగువన్ ఫౌండేషన్ ద్వారా వచ్చిన ఎంతో మంది షేషంట్లకు ఆయన సహాయం అందించారు. వైద్య వృత్తిలో నిర్విరామంగా కృషి చేస్తూ వేలాదిమంది జీవితాలలో సంతోషాన్ని నింపిన డా. శ్రీ భూషణ్ రాజు తన కెరీర్‌లో వ్యక్తిగత జీవితంలో మరిన్ని విజయాలను అందుకోవాలని ‘తెలుగువన్’ కోరుకుంటోంది. ఆయనను సత్కరించే సదవకాశం కలిగినందుకు సంతోషిస్తోంది.

డాక్టర్ జి.సూర్యనారాయణ రాజుకి ‘తెలుగువన్’ సత్కారం

  నిమ్స్‌లో అత్యున్నత స్థాయిలో వున్న డాక్టర్ జి.సూర్యనారాయణ రాజును తెలుగువన్ 15వ వార్షికోత్సవం సందర్భంగా తెలుగువన్ ఘనంగా సత్కరించింది. వైద్యో నారాయణో హరిః అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే డాక్టర్ మన తెలుగుబిడ్డ... డాక్టర్ గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు. హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో అసోసియేట్ డీన్, సీనియర్ ప్రొఫెసర్‌ స్థానంలో వుండటంతోపాటు సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్‌మెంట్‌కి హెడ్‌గా కూడా విధులు నిర్వహిస్తున్న ఆయన ఎంతోమంది కేన్సర్ వ్యాధిగ్రస్తుల జీవితాలలో కాంతి నింపారు. కేన్సర్‌ వ్యాధి నివారణకు ఆయన చేస్తున్న కృషి అనన్య సామానమైనది. 1998 నుంచి 2014 సంవత్సరం వరకు ఆయన 1,42,692 మంది కేన్సర్ ఔట్ పేషెంట్లను ట్రీట్ చేశారు. 29,808 మంది కేన్సర్ పేషెంట్లకు సర్జరీ నిర్వహించారు. ఆయన సర్జరీ చేసిన పెషెంట్లలో దాదాపు 98 శాతం మంది పేషెంట్లు కొత్త జీవితాన్ని పొందారు. హైదరాబాద్‌లో డాక్టర్‌గా ఊపిరిసలపనంత బిజీగా వున్నప్పటికీ, తన స్వస్థలమైన ఆకివీడులో ప్రతినెల మొదటి ఆదివారం నాడు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ వుంటారు. ఆ ఒక్కరోజే ఆయన దాదాపు రెండు వందల మంది పేషెంట్లను చూస్తారు. వైద్య వృత్తిలో నిర్విరామంగా కృషి చేస్తూ వేలాదిమంది జీవితాలలో సంతోషాన్ని నింపిన డాక్టర్ జి.సూర్యనారాయణరాజు తన కెరీర్‌లో వ్యక్తిగత జీవితంలో మరిన్ని విజయాలను అందుకోవాలని ‘తెలుగువన్’ కోరుకుంటోంది. ఆయనకు చిరు సత్కారం అందించే అవకాశం లభించినందుకు సంతోషిస్తోంది.

ప్రత్యేక హోదా ఇస్తే నీకేంటి నష్టం... రఘువీరారెడ్డి

  కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేదర్ రెడ్డి పై ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పక్క ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కాంగ్రెస్ తోపాటు పార్టీ అధిష్టానం కోరుతుండగా.. గుత్తా సుఖేందర్ రెడ్డి ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వద్దంటూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రఘువీరా రెడ్డి స్పందించి ఏపీకీ ప్రత్యేక హోదా ఇస్తే ఆయకేం నష్టంమని ప్రశ్నించారు. ఏపీకీ ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు నష్టమని, ఇక్కడ ఉన్న పరిశ్రమలు ఏపీకీ తరలిపోతాయంటూ గుత్తా ఆరోపించారు. అసలు రేవులు, పరిశ్రమలు, ఆర్ధికంగా వెనుకబడిన హిమాలయ ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలకు మాత్రమే ప్రత్యేక హోదా ఇస్తారని ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వడం తగదని లేఖలో పేర్కొన్నారు. దీంతో రఘువీరారెడ్డి ఈ విషయంపై సోనియా గాంధీకి గుత్తా సుఖేందర్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏపీకీ ప్రత్యేహోదా ఇస్తామని హామీ చేశారని, ఈ విషయం పై లోక్ సభలో కూడా ఏపీ ప్రత్యేక హోదా గురించి ఏం చేశారని మీరు నిలదీశారని గుర్తుచేశారు. ఇటు రాష్ట్రంలోనూ పార్టీ శ్రేణులు ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తున్నాయని, ఇప్పుడిప్పుడే కాంగ్రెస్‌ ప్రజలు మన ఆందోళనల్లో భాగస్వాములవుతున్నారని ఇలాంటి సమయంలో గుత్తా లేఖ రాయడం సరికాదని అన్నారు.

డాక్టర్ నాగేశ్వరరావుకు ‘తెలుగువన్’ సత్కారం

  కేర్ హాస్పిటల్‌లో కార్డియాలజిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగేశ్వరరావుకు తెలుగువన్ 15వ వార్షికోత్సవం సందర్భంగా తెలుగువన్ ఘనంగా సత్కరించింది. డాక్టర్ నాగేశ్వరరావు కార్డియాలజిస్ట్‌గా కేర్ హాస్పటల్‌లో విధులు నిర్వహిస్తూ ఎంతో మంది జీవితాలలో వెలుగు నింపారు. గుండెకు సంబంధించిన ఆపరేషన్ లు చేయడంలో ఈయన దిట్ట. ఈయన ఇప్పటివరకు 300 పైగా గుండె సంబంధిత ఆపరేషన్లు చేశారు. ఒక గర్భిణి గర్భంలో ఉన్న పసికందుకు హార్ట్ సర్జరీ చేసి స్టెంట్ వేశారాయన. అలాంటి అరుదైన ఆపరేషన్ చేసి వైద్య చరిత్రలో రికార్డ్ సృష్టించారు. అంతే కాకుండా ఎంతో మంది పేషెంట్లకు తక్కువ ఖర్చుతో ఆపరేషన్ జరిగేలా చూసే మానవతావాది ఆయన. ఆయన వైద్యంతో ఎంతో మంది పెషెంట్లు ఆయన ద్వారా కొత్త జీవితాన్ని పొందారు. ప్రతి రోగికి ఉత్తమమైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా సాగుతున్నారు డాక్టర్ నాగేశ్వరరావు. తెలుగువన్ పౌండేషన్ ద్వారా చాలా మంది పేషెంట్లకు ఆయన సహాయం అందించారు. వైద్య వృత్తిలో నిర్విరామంగా కృషి చేస్తూ వేలాదిమంది జీవితాలలో సంతోషాన్ని నింపిన డాక్టర్ నాగేశ్వరరావు తన కెరీర్‌లో, వ్యక్తిగత జీవితంలో మరిన్ని విజయాలను అందుకోవాలని ‘తెలుగువన్’ కోరుకుంటోంది. ఆయనను సత్కరించే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తోంది.

అంధ కళాకారుల అద్భుత ప్రతిభ

  మంగళవారం నాడు హైదరాబాద్‌లోని తాజ్ బంజారా హోటల్లో అత్యంత వైభవంగా జరిగిన ‘తెలుగువన్’ 15వ వార్షికోత్సవ కార్యక్రమంలో అంధ కళాకారులు ప్రదర్శించిన ప్రతిభ అందర్నీ మంత్రముగ్ధులను చేసింది. అంధ కళాకారులు సంగీత, నృత్యాలతో అలరించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటున్న పలువురు అంధ విద్యార్థులు విశ్వదృక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ వేదిక మీద తమ ప్రతిభను ప్రదర్శించారు. పలువురు గాయకులు తమ మధుర గాత్రంతో సభికులను రంజింపజేశారు. ముగ్గురు అంధులు తామే కంపోజ్ చేసిన నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ నృత్యాన్ని చూసి అందరూ మైమరచిపోయారు. వీరి ప్రతిభను గుర్తించిన ఒక అజ్ఞాత దాత వారికి 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే దుబాయ్‌ నుంచి వచ్చిన అతిథి ఒకరు వీరి ప్రదర్శనను గల్ఫ్‌లో ఏర్పాటు చేయడానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్ అయితే అంధ కళాకారుల ప్రతిభను మనస్పూర్తిగా ప్రశంసించారు. తనను చూడలేకపోయినా, తాను తీసిన సినిమాలను వారు చూడలేకపోయినా తన ముందు పాడటం వారికి సంతోషాన్ని కలిగించడం తన హృదయాన్ని స్పృశించిందని ఆయన అన్నారు. వారు పాటలు పాడుతున్నప్పుడు, నృత్యం చేస్తున్నప్పుడు వారిలో తనకు భగవంతుడు కనిపించాడని, వారికి తన పాదాభివందనాలని చెప్పారు.

చిన్నారి శ్రీనిధి మృతి

  బ్లడ్ క్యాన్సర్ వ్యాధి సోకిన పదేళ్ళ చిన్నారి శ్రీనిధి ఈరోజు తెల్లవారు జామున మరణించింది. ఆమె తనను కలవాలనుకొంటున్న సంగతి తెలుసుకొన్న జూనియర్ యన్టీఆర్ ఆమె (చివరి) కోరికను మన్నిస్తూ వారం రోజుల క్రితమే శ్రీనిధి (ఆఖరు) జన్మదినం జరుపుకొన్నప్పుడు ఆమె ఉన్న ఆసుపత్రికి వెళ్లి ఆమెతో కొద్దిసేపు గడిపారు. కానీ వారం తిరక్కుండానే సరిగ్గా జూ.యన్టీఆర్ జన్మదినం రోజునే శ్రీనిధి మరణించడం అందరినీ కలచివేసింది. శ్రీనిధి స్వస్థలం వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో బందనపల్లి గ్రామం. ఆమెకు బ్లడ్ క్యాన్సర్ సోకిన సంగతి తెలుసుకొన్న తరువాత ఆమె తల్లి తండ్రులు ఆమెను అనేక ఆసుపత్రులలో వైద్యం చేయించారు. కానీ ఆమె బ్రతకడం అసాధ్యమని వైద్యులు తేల్చి చెప్పడంతో గత కొంత కాలంగా ఆమెను కూకట్ పల్లిలో ఒక ఆసుపత్రిలో ఉంచి వైద్యం చేయిస్తున్నారు. ఆమె అక్కడ ఉన్నప్పుడే జూ. యన్టీఆర్ వచ్చి ఆమెతో కొంత సమయం గడిపారు. చిన్నారి శ్రీనిధి మరణించిందనే వార్త తెలిసి జూ. యన్టీఆర్ కూడా చాలా బాధపడ్డారు.

నేడు ఏపీలో 10వ తరగతి ఫలితాలు విడుదల

  నేడు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పదవ తరగతి ఫలితాలు వెలువడనున్నాయి. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి మంత్రి గంటా శ్రీనివాస రావు విశాఖపట్నంలో గల ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరీక్షా ఫలితాలను విడుదల చేస్తారు. ఆ తరువాత పరీక్షా ఫలితాలు, గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు, గ్రేడ్‌ పాయింట్‌ ఏవరేజ్‌ వంటి పూర్తి వివరాలను ఏపీ ఆన్‌లైన్‌లో పెడతామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఆర్‌.సురేందర్‌రెడ్డి నిన్న ఒక ప్రకటన ద్వారా విద్యార్ధులకు తెలియజేసారు. దాదాపు ఆరున్నర లక్షల మందికి పైగా విద్యార్ధులు పడవ తరగతి పరీక్షకి హాజరయ్యారు. విద్యార్ధులు తమ పరీక్షా ఫలితాలను www.bseap.org, www.vidyavision.com తదితర వెబ్ సైట్లలో కూడా చూసుకోవచ్చును.

దర్శకుడి దుర్మరణం

  భారతీయ అమెరికన్ దర్శకుడు విజయ్ మోహన్ అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మరణించారు. ఆయన వయసు 26 సంవత్సరాలు. మే 10వ తేదీన ఫిలిడెల్ఫియాలో బైక్పై వెళ్తున్న విజయ్ మోహన్‌ని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతు విజయ్ మోహన్ మరణించారు. విజయ్ మోహన్ చికాగోలో జన్మించారు. అయితే ఆయన ఇండియాలో చదువుకున్నారు. ఆ తర్వాత టెంపుల్ యూనివర్శిటీ నుంచి ఫిల్మ్, మీడియా అర్ట్స్ డిగ్రీ తీసుకున్నారు. కొన్ని హాలీవుడ్ సినిమాలకు పనిచేశారు. విజయ్ మోహన్ మరణం పట్ల ఫిలిడెల్ఫియా ఫిల్మ్ అండ్ టెలివిజన్ కమ్యూనిటీ సంతాపం ప్రకటించింది.

ట్విట్టర్లో ఒబామా.. రికార్డు...

  అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సోమవారం నాడు అధికారికంగా తన ట్విట్టర్ ఖాతాను తెరిచారు. ఇప్పటికే ఒబామా పేరుతో అనేక అనధికారిక ఖాతాలు వున్నాయి. ఈ విషయాన్నే బరాక్ ఒబామా తన ట్విట్లర్లో ప్రస్తావిస్తూ, మొత్తానికి ట్విట్లర్లో నా సొంత అకౌంట్‌ని ప్రారంభిస్తున్నాను అని ట్వీట్ చేశారు. ఆ తర్వాత తన న్యూజెర్సీ పర్యటన గురించి రెండో ట్వీట్ చేశారు. ఒబామా తన ఖాతాను తెరిచిన 12 గంటల్లోనే 1.46 మిలియన్ల మంది ఆయన్ను ఫాలో అయ్యారు. ఇది ఒక రికార్డు. ట్విట్టర్ ప్రారంభమైన తర్వాత ఆయన మొదటిసారి అకౌంట్‌ తెరిచారు. ఒబామాను ఫాలో అయ్యేవారు మాత్రమే కాదు.. ఆయన ఫాలో అయ్యేవారు కూడా వున్నారు. ఒబామా మొత్తం 65 మందిని ఫాలో అవుతున్నారు.