కీలకు దశకు చేరుకొన్న ఆర్టీసీ సమ్మె

  ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణా ప్రభుత్వాలు రెండూ కూడా ఈరోజు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి సిద్దా రాఘవరావు నేతృత్వంలో మంత్రుల సబ్-కమిటీ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో ఈరోజు ఉదయం9-10 గంటల మధ్య సమావేశమవుతుంది. అదేవిధంగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానున్నారు.   ఇక ఈరోజే ఉదయం 10 గంటలలోగా సమ్మె విరమిస్తున్నట్లు తమకు తెలియజేయాలని హైకోర్టు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను ఆదేశించినందున వారు కోర్టుకి కూడా తమ అభిప్రాయం చెప్పవలసి ఉంది. హైకోర్టు ఆదేశాన్ని మన్నిస్తూ సమ్మె విరమణ చేసినట్లయితే ఇప్పుడిప్పుడే దిగివస్తున్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ బిగుసుకుపోతాయని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు భావిస్తున్నారు. కనుక ఈరోజు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు పూర్తయ్యేవరకు, హైకోర్టు ఒత్తిడి చేస్తున్నప్పటికీ వారు సమ్మె విరమణకు మొగ్గు చూపకపోవచ్చును. మరి వారి ఈ సమస్యను అర్ధం చేసుకొని హైకోర్టు వారికి మరికొంత సమయం గడువు ఇస్తుందో లేదో మరి కొద్ది సేపటిలో తేలిపోనుంది.

హైకోర్టు ఆదేశంపై ఆర్టీసీ సంఘాలు నిరసన

  గత 8రోజులుగా ఉదృతంగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె ఈ రోజుతో 9వ రోజుకు చేరుకొంది. ఈరోజు ఉదయం 10 గంటలలోపుగా సమ్మె విరమించాలని, ఆ సంగతి తనకు తెలియజేయాలని హైకోర్టు ఆర్టీసీ కార్మిక సంఘాలను ఆదేశించింది. తమ కార్మిక చట్ట సమ్మతమయినదేనని, తమ హక్కుల కోసం సమ్మె చేసే హక్కు తమకు ఉందని, చట్ట ప్రకారం ప్రభుత్వాలకి నెల రోజులు ముందుగానే సమ్మె నోటీసులు అందజేసిన తరువాతనే, ప్రభుత్వాలు తమ డిమాండ్లను పట్టించుకోక పోవడంతో విధిలేని పరిస్థితుల్లో సమ్మె చేయవలసి వస్తోందని ఆర్టీసీ కార్మిక సంఘాల వాదన. అందుకే వారు సమ్మె విరమించాలని హైకోర్టు ఆదేశంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకు నిరసనగా రెండు రాష్ట్రాలలో అన్ని బస్సు డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయబోతున్నారు. హైదరాబాద్ లో గల ‘బస్ భవన్’ ను ఈరోజు ముట్టడించడానికి ఆర్టీసీ కార్మిక సంఘాలు సిద్దమవుతున్నాయి. ఈరోజు హైకోర్టులో తమ వాదనలు వినిపిస్తామని, ఒకవేళ హైకోర్టు తమ సమ్మె కొనసాగానికి అభ్యంతరం వ్యక్తం చేసినట్లయితే సుప్రీంకోర్టులో అప్పులు చేసుకొనయినా సరే తమ సమ్మెను కొనసాగిస్తామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు చెపుతున్నారు. ప్రభుత్వాలు న్యాయబద్దమయిన తమ డిమాండ్లకు అంగీకరించేవరకు సమ్మెను నిలిపేది లేదని వారు తేల్చి చెపుతున్నారు.

ఏపీ ఉన్నత విద్యా మండలిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

  ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఉన్న ఆంద్రప్రదేశ్ ఉన్నత విద్యామండలిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషనుపై ఈరోజు విచారణ జరగుతుంది. రాష్ట్ర విభజన చట్టంలో ఆంద్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి గురించి ఎటువంటి ప్రస్తావన లేదు కనుక హైదరాబాద్ లో ఉన్న ఆ సంస్థ తన ఉనికిని కోల్పోయినట్లేనని కనుక అది తెలంగాణా రాష్ట్రానికే చెందుతుందని కొన్ని రోజుల క్రితం హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆంద్రప్రదేశ్ ఉన్నత విద్యామండలికి చెందిన ఉద్యోగులు, భవనాలు, ఆసంస్థకు చెందిన బ్యాంక్ ఖాతాలలో ఉన్న సొమ్ము అన్నీ కూడా తెలంగాణా ప్రభుత్వానికే చెందుతాయని హైకోర్టు చెప్పడంతో వెంటనే స్పందించిన తెలంగాణా ప్రభుత్వం వాటన్నిటినీ తన అధీనంలో తీసుకొంటున్నట్లు ప్రకటించింది.   హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలినట్లయింది. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తరువాత హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పిటిషను వేసింది. దానిపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేప్పట్టబోతోంది.ఒకవేళ సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించినట్లయితే మళ్ళీ కొత్తగా ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసుకోవడం తప్ప ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి వేరే గత్యంతరం ఉండదు. కానీ సుప్రీంకోర్టు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలతో అంగీకరించినట్లయితే, మళ్ళీ ఉన్నత విద్యామండలి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికే దక్కే అవకాశం ఉంటుంది. 

కోతులను కూడా వదల్లేదు

  దొంగలు సహజంగా ఏ బంగారమో, డబ్బులో దొంగతనం చేస్తారు. కాని ఇక్కడ వెరైటీగా కోతులని దొంగతనం చేశారు. ఎక్కడనుకుంటున్నారా... సెంట్రల్ ఫ్రాన్స్ లోని సెయింట్ ఆగ్నన్ జులాజికల్ పార్క్ లో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని దుండగులు అరుదైన జాతికి చెందిన 17 కోతుల్ని ఎత్తుకెళ్లారని, ఎలాంటి ఆధారాలు వదలకుండా చాలా చాకచక్యంగా కోతులను తీసుకెళ్లారని జూ పార్క్ డైరెక్టర్ రుడాల్ఫ్ డెలార్డ్ చెప్పారు. అంతరించిపోతున్న కోతుల జాబితాలో ఉన్న ఏడు గోల్డెన్ లయన్ టమరిన్స్, పది సిల్వర్ మెర్కోసెట్స్ కోతులను అపహరించారని తెలిపారు. కోతులకు ఎలాంటి హానీ చేయకముందే దొంగలనుపట్టుకోవాలని పోలీసులకు చెప్పామని రుడాల్ఫ్ డెలార్డ్ చెప్పారు.

క్యాన్సర్ బాధిత చిన్నారి శ్రీనిధికి జూ.ఎన్టీఆర్ పరామర్శ

  వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటకు చెందిన పదేళ్ళ శ్రీనిధికి బ్లడ్‌క్యాన్సర్‌ సోకడంతో ఆమె తల్లి తండ్రులు పాప ప్రాణాలు దక్కించుకోవడం కోసం అనేక పెద్ద పెద్ద ఆసుపత్రులు చుట్టూ తిరిగారు. కానీ ఆమె వ్యాధి నయం కాదని డాక్టర్లు తేల్చి చెప్పడంతో ఆమెను కూకట్‌పల్లిలోని రామ్‌దేవ్‌రావ్‌ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయిస్తున్నారు. ఆ పాపకు చిన్నప్పటి నుండి జూ.ఎన్టీఆర్ అన్నా అతని డ్యాన్సులు అన్నా చాలా ఇష్టం. ఎప్పటికయినా జూ.ఎన్టీఆర్ తో కలిసి ఫోటో తీయించుకోవాలనేది ఆ పాప కోరిక. అయితే తనకు భయంకరమయిన క్యాన్సర్ వ్యాధి కబళించబోతోందనే సంగతి తెలియకుండా ఆ పాప తల్లితండ్రులు ఇంతవరకు దాచిపెట్టారు. ఆ పాప (చివరి) కోరిక గురించి తెలుసుకొన్న జూ.ఎన్టీఆర్ ఈరోజు ఆ పాప పుట్టినరోజు కావడంతో బహుమతులు తీసుకొని పాపను చూసేందుకు నేరుగా ఆస్పత్రికి వచ్చారు. పాపతో కొద్ది సేపు గడిపి, ఆమెతో కలిసి ఫోటోలు తీయించుకొన్నారు. దానితో ఆ పాప ఆనందానికి హద్దే లేకుండా పోయింది. మళ్ళీ త్వరలోనే మరో మారు వచ్చి కలుస్తానని ప్రామిస్ చేసి వెళ్లిపోయారు. తన చిన్నారి అభిమాని వైద్యం కోసం వీలయినంత ఆర్ధిక సహాయం చేస్తానని ఆయన పాప తల్లి తండ్రులకు హామీ ఇచ్చేరు.

మళ్ళీ నేపాల్లో భూకంపం, ఈసారి ఆంద్రప్రదేశ్ లో కూడా!

  మళ్ళీ ఈ రోజు నేపాల్లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతగా నమోదయిన ఈ భూకంపం యొక్క కేంద్రం నేపాల్ దేశంలోనే ఢోలాక-సింధుపల్చోక్ ప్రాంతాల మధ్యన ఉన్నట్లు గుర్తించారు. భూమికి 19 కిలోమీటర్ల లోపల నుండి ఈ ప్రకంపనలు మొదలయినట్లు భూగర్భశాఖ నిపుణులు తెలిపారు.   వరుస భూకంపాలతో ఇప్పటికే బెంబేలెత్తిపోయున్న నేపాల్ ప్రజలు భూకంపం మొదలవగానే వెంటనే అప్రమత్తమయ్యి తమ ఇళ్ళు, కార్యాలయాలు వదిలి పెట్టి భయంతో రోడ్లమీదకు పరుగులు తీసారు. అయితే ఈసారి భూకంపం వలన ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగలేదని సమాచారం. సుమారు 55 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. ఈ భూకంప ప్రభావం బంగ్లాదేశ్, పాక్లిస్తాన్, చైనా దేశాలలో కనిపించింది. ఉత్తరాది రాష్ట్రాలలో , ముఖ్యంగా దేశ రాజధాని డిల్లీలో కూడా ఈ భూకంప ప్రభావం బాగా కనబడింది. డిల్లీలో కొన్ని ప్రాంతాలలో మెట్రో రైళ్ళను కొద్దిసేపు నిలిపివేశారు.   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పలుచోట్ల భూకంప ప్రభావం కనబడింది. రిక్టర్ స్కేల్ మీద దీని తీవ్రత 5.4 గా నమోదైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు, భీమవరం, పాలకొల్లు, కాళ్లకూరు, మొగల్తూరు, నరసాపురం తదితర ప్రాంతాల్లో, తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి, అమలాపురం పరిసరాల్లోని కొన్ని ప్రాంతాలలో స్వల్పంగా భూమి కంపించింది. విజయవాడలోని బెంజి సర్కిల్ కృష్ణలంక, భవానీపురం వాటి సమీప ప్రాంతాలలో కూడా భూమి స్వల్పంగా కంపించింది. విశాఖపట్నంలో మధురవాడ, మద్దిలపాలెం, మాధవధార, మురళీనగర్, విశాలాక్షి నగర్ తదితర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది.

ఆర్టీసీ కార్మికులకు డెడ్లైన్

  ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు మండిపడింది. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల లోపు ఆర్టీసీ కార్మికులు సమ్మెవిరమించాలని హైకోర్టు డెడ్లైన్ విధించింది. సమ్మె విరమించకుండా కార్మిక సంఘాలు ఇదే మొండి వైఖరి కొనసాగిస్తే ఊరుకోమని ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. చర్యలు తీసుకోవాలని తెలంగాణ, ఆంధ్ర రాష్టాలకు ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ అధికారులు, ఆర్టీసీ అధికారులు కూడా ఈ సమస్యపై ఆర్టీసీ సంఘాలతో చర్చలు జరిపి సరైన నిర్ణయాలు తీసుకొని, సమ్మె విరమణ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది.

అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహం

  తెలుగు చిత్ర పరిశ్రమలో తన నటనతో చరిత్ర సృష్టించి, నటసార్వభౌముడిగా కీర్తి గడించారు ఎన్టీఆర్. ఇప్పుడు ఆయన విగ్రహాన్ని అమెరికాలో ప్రతిష్ఠించాలనుకుంటున్నారు. అమెరికా తెలుగు అసోసియేషన్ (తానా) ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కాలిఫోర్నియాలోని పార్క్ లో నెలకొల్పేందుకు విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. తానా సభలు జులైలో జరగనున్నాయని, అప్పుడు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నామని, విగ్రహ రూపకల్పనకు ఎప్పుడో ఆర్డర్ ఇచ్చామని విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు శరత్ బి కామినేని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని డి.రాజ్కుమార్ వుడయార్ శిల్పశాలలో, 80 కిలోల పంచలోహాలతో కృష్ణావతారంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం రూపుదిద్దుకుంది. ఈ విగ్రహాన్ని బుధవారం విమానంలో అమెరికా పంపించనున్నారు.

మేనకా గాంధీ నన్ను కొట్టింది.. గార్డ్

  కేంద్ర మంత్రి మేనకా గాంధీ తనను కొట్టారని, తనపై దౌర్జన్యం చేసారని ఓ ఫారెస్ట్ గార్డు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల ప్రకారం... మేనకా గాంధీ ఫిలిబిత్ టైగర్ రిజర్వాయర్ ను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆమె అడవుల్లో తరచుగా మంటలు చెలరేగడం పై ఫారెస్ట్ అధికారుల్ని నిలదీశారు. దీంతో అక్కడున్నరాంగోపాల్ వర్మ అనే గార్డ్.. స్థానిక రైతులు గోధుమ పంటల్ని తగలబెట్టడం వల్లే మంటలు వ్యాపిస్తున్నాయని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె.. తాను మాట్లాడుతుండగా మధ్యలో కల్పించుకున్నందుకు అతనిపై మండిపడి అసలు అడవులు తగలబడటానికి కారణం నువ్వే అంటూ అతని చెంప చెళ్లుమనిపించారు. దీంతో గార్టు తో పాటు అక్కడున్న ఫారెస్ట్ అధికారులు కూడా ఒక్కసారిగా అవాక్కయి కిక్కురుమనకుండా నిల్చుండిపోయారు. ఈ ఘటనపై ఫారెస్ట్ గార్డ్ మేనకా గాంధీ పై పురాణ్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సచివాలయ బదలాయింపు జరిగేనా?

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర సచివాలయాన్ని మార్చలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సచివాలయ నిర్మాణాన్ని తొలుత ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో నిర్మించాలనుకున్నారు. కాని దానికి పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో ఆయన కంటోన్మెంట్ లోని బైసన్ పోలో గ్రౌండ్, జింఖానా మైదానాల్ని తమకు ఇవ్వాల్సిందిగా కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌కు లేఖ రాశారు. కేసీఆర్ లేఖకు స్పందించిన మనోహర్ పారికర్ ఆస్థలాల సమాచారాన్ని అందజేయాలని స్థానిక డిఫెన్స్ ఎస్టేట్స్, లోకల్ మిలటరీ అథారిటీస్ అధికారులను ఆదేశించారు. రక్షణశాఖ అధికారుల ఆదేశం మేరకు స్థానిక అధికారులు దానికి సంబంధించిన నివేదికను సోమవారం అందజేశారు. నివేదిక ఆధారంగా రక్షణ మంత్రిత్వ శాఖ కొద్ది రోజుల్లోనే సానుకూల నిర్ణయం వెలువరించే అవకాశమున్నట్లు సమాచారం. సచివాలయ బదాలయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన, అంగీకారాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సహా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, లోకల్ మిలటరీ అధికారులు సమావేశంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ సమావేశం సజావుగా సాగితే సచివాలయం బదాలాయింపు జరిగినట్టే.

రాజకీయాల్లోకి వెళ్లడం తప్పే: దాసరి

  తెలుగు సినీ రంగంలో విశేష గౌరవ మర్యాదలు అందుకొనే సీనియర్ దర్శకుడు దాసరి నారాయణ రావుకి బొగ్గు మసి అంటుకోవడం చాలా బాధ కలిగిస్తోంది. ఆయన బొగ్గుశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు బొగ్గు గనుల కేటాయింపులలో అక్రమాలకూ పాల్పడ్డారని ఆయనకు చెందిన సౌభాగ్య మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు పరోక్షంగా లబ్ది కలిగిందని ఆరోపిస్తూ సీబీఐ మరో 14మందితో బాటు అయనపై కూడా చార్జ్ షీట్ దాఖలు చేయడమే కాక సీబీఐ కోర్టులో విచారణకు హాజరు కమ్మని నోటీసులు కూడా జారీ చేసింది. తెలుగు సినీ పరిశ్రమలో నేరుగా ఆయన ఎదుట ఎవరూ అ ప్రస్తావన తేకపోయినా వెనుక గుసగుసలు ఆడుకోవడం, అవి ఆనోటా ఈనోటా ప్రాకి చివరికి ఆయన చెవిలో పడటం అందుకు ఆయన నోచ్చుకోవడం అన్నీ సహజమే. అందుకే ఇప్పుడు ఆయనే స్వయంగా తనపై మోపబడిన ఆరోపణల గురించి స్వయంగా చెప్పుకొని తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని, తను నిర్దోషినని చెప్పుకోవలసి వస్తోంది. ప్రత్యేకించి తన పుట్టిన రోజునాడు అటువంటి విషయాల గురించి మాట్లాడవలసి రావడం చాలా కష్టమే.   నిన్న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆయన 71వ పుట్టిన రోజు కార్యక్రమ వేడుకలు జరిగాయి. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను రాజకీయాలలో ప్రవేశించడమే ఒక పెద్ద పొరపాటని అన్నారు. “గత ఐదు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు ఎటువంటి మచ్చాలేకుండా బ్రతికాను కానీ రాజకీయాలలో ఉన్న కొద్దిపాటి సమయంలోనే మచ్చ పడింది. అయితే వేరొకరిని కాపాడేందుకే ఈ ఊభిలో నన్ను ఇరికించారు. కోర్టులో నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని నా మీద పడిన ఆ మచ్చను తొలగించుకొని మీ ముందుకు వస్తాను,” అని ఆయన అన్నారు.

కోల్ కొతా లోకల్ ట్రైన్ లో బాంబు ప్రేల్లుళ్ళు

  కోల్ కొతాలో సెల్దా-కృష్ణా నగర్ మధ్య నడిచే ఒక లోకల్ ట్రైన్ లో ఈరోజు తెల్లవారుజాము 4 గంటలకి బాంబు ప్రేలుడు జరిగింది. అందులో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. రైలులో ప్రయాణిస్తున్న రెండు వర్గాల మధ్య గొడవ మొదలవడంతో వారు ఒకరిపై మరొకరు బాంబులు విసురుకోవడం వలన ప్రేలుళ్ళు జరిగినట్లు ప్రాధమిక సమాచారం. రైలు టైటాఘర్ స్టేషన్ దాటిన తరువాత ఖర్దా స్టేషన్ చేరే ముందు ఈ ప్రేలుళ్ళు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గాయపడిన వారినందరినీ స్థానిక ఆర్.జి. ఖర్ మెడికల్ కాలేజి మరియు ఆసుపత్రిలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు. ఈ ప్రేలుళ్ళు తెల్లవారుజామున జరగడంతో అప్పటికి ఇంకా రైల్లో ప్రయాణికుల రద్దీ మొదలవదు కనుక పెద్ద ప్రమాదం తప్పిపోయింది. లేకుంటే ఇది ఘోర ప్రమాదంగా మారి ఉండేది.   రైలులో ప్రయాణిస్తున్న రెండు వర్గాలు ఒకరిపై మరొకరు బాంబులు విసురుకొన్నారంటే ఆ సమయంలో రైల్లో అసాంఘిక శక్తులో లేకపోతే తీవ్రవాదులో బాంబులతో ప్రయాణిస్తున్నట్లు అర్ధమవుతోంది. నిత్యం వేలాదిమంది సామాన్య ప్రజలు ప్రయాణించే లోకల్ రైళ్ళలో అసాంఘిక శక్తులు ఏకంగా బాంబులతో ప్రయాణించగలుగుతున్నారు అంటే ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాలుగానే ఉన్నాయని స్పష్టం అవుతోంది.

రామలింగ రాజుకి బెయిలు మంజూరు

  సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో దోషులుగా నిరూపించబడి ఏడేళ్ళ జైలు శిక్ష విధింపబడినరామలింగ రాజు, ఆయన సోదరుడు రామరాజుతో సహా పదిమందికి నాంపల్లి సెషన్స్‌ కోర్టు ఈరోజు బెయిలు మంజూరు చేసింది. ఈరోజు బెయిలు పొందినవారిలో వడ్లమాని శ్రీనివాస్‌, ఎస్‌. గోపాలకృష్ణ, తాళ్లూరి శ్రీనివాస్‌, బి. సూర్యనారాయణ రాజు, జి. రామక్ణృ, జి. వెంకటపతిరాజు, సీహెచ్‌. శ్రీశైలం, వీఎస్పీ గుప్తా ఉన్నారు. రామలింగరాజు ఆయన సోదరుడు రామరాజులను చెరో లక్ష రూపాయల పూచీకత్తు మరియు ఇద్దరు వ్యక్తుల ష్యూరిటీ సమర్పించమని, మిగిలిన వారందరూ చెరో రూ.50, 000 పూచీకత్తు మరియు చెరో ఇద్దరు వ్యక్తుల ష్యూరిటీ సమర్పించమని కోర్టు ఆదేశించింది. అయితే తమకు సీబీఐ కోర్టు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలనే వారి అభ్యర్ధనను మన్నించలేదు. తదుపరి విచారణలో ఆ విషయం తేల్చే అవకాశం ఉంది. సీబీఐ తీర్పుతో గత కొన్ని రోజులుగా జైలులో గడుపుతున్న రామలింగరాజు తదితరులకు ఒకవేళ సెషన్స్ కోర్టు కూడా బెయిలు పిటిషను తిరస్కరించి ఉండి ఉంటే మళ్ళీ వారు హైకోర్టులో అప్పులు చేసుకొనే వరకు జైలులోనే గడుపవలసి వచ్చేది. కానీ అదృష్టవశాత్తు సెషన్స్ కోర్టులో వారికి చాలా ఊరటలభించింది.

టీఆర్ఎస్ లో చేరమనేది ఎర్రబెల్లే

  పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఈయన తెలంగాణ టీడీఎల్పీనేత ఎర్రబెల్లి దయాకర్ పై విమర్శల వర్షం కురిపించారు. టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేరమని చెప్పింది ఎర్రబెల్లి దయాకరే అని, ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎర్రబెల్లి దయాకర్ పరకాల నుంచి పోటీచేసేందుకు సిద్దమైతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ ఎన్నికల్లో నిలబడతానని, ఒకవేళ తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. ప్యాకేజీలు తీసువడం ఎర్రబెల్లికి అలవాటేమో కాని ఆ సంస్కృతి తనకు లేదని అన్నారు.

లోకేశ్ అమెరికా పర్యటన ఫలితం.. 1000 గ్రామాలు దత్తత

  తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడిదారులను తీసుకురావడానికి మే 3వ తేదీ నుండి అమెరికా పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు గాను ఆయన పలు పారిశ్రామిక వేత్తలను కలిశారు. ఇందులో భాగంగానే ఆయన న్యూజెర్సీ లోని ఎన్నారైలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు చేపట్టిన స్మార్ట్ విలేజ్- స్మార్ట్ వార్డ్ అభివృద్ధి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్నైరైలు పాల్గొని గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రపంచ దేశాలన్నింటిని అమెరికా శాసిస్తుంటే అమెరికా అమెరికాను ఇక్కడున్న తెలుగువారు శాసిస్తున్నారని, అమెరికాలో ఉన్న అత్యుత్తమ పది కంపెనీల్లో పది పోస్టులలో తెలుగువారు ఉన్నారని కొనియాడారు. నారా లోకేశ్ ప్రసంగానికి ముగ్దులైన ఎన్నారైలు అప్పటికప్పుడు 780 గ్రామాలను దత్తత తీసుకున్నారని, మరో 220 గ్రామాలను దత్తత తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ మీడియా ఛైర్మన్ ఎల్.వి.ఎస్.ఆర్కే ప్రసాద్ తెలిపారు.