నేటి నుండి ఏపీలో ఉద్యోగుల బదిలీ

  నేటి నుండి ఈ నెలాఖరు వరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల బదిలీల ప్రక్రియ ఆరంభించేందుకు ప్రభుత్వం నిన్న జీ.ఓ. (నెంబర్: 57) జారీ చేసింది. అందులో ఉద్యోగుల బదిలీలకు సంబందించి మార్గదర్శకాలను సూచించింది. వరుసగా ఐదేళ్ళపాటు ఒకే చోట పనిచేసిన వారికి బదిలీ తప్పనిసరి. వరుసగా రెందేల్లో ఒకే చోట పనిచేసినవారు కావాలనుకొంటే బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చును. కానీ ఈ బదిలీల కోసం ఉద్యోగులు ప్రజాప్రతినిధుల నుండి సిఫార్సు లేఖలు తీసుకోనివస్తే అటువంటి వారిపై కటినచర్యలు తీసుకొంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుగానే హెచ్చరించారు. ఈ ప్రక్రియ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరగాలని ఆయన అధికారులను ఆదేశించారు.

చంద్రబాబు అధ్యక్షతలో నీతి ఆయోగ్ సమావేశం నేడు

  ఈరోజు చండీఘడ్ లో జరుగబోయే నీతి ఆయోగ్ (ప్రణాళిక సంఘం) సమావేశానికి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించబోతున్నారు. ఇంతవరకు ప్రణాళికా సంఘంలో రాష్ట్రాల పాత్ర నామమాత్రంగానే ఉండేది. ఇంతకు ముందు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఈ లోపాన్ని గుర్తించిన నరేంద్ర మోడీ తను ప్రధానమంత్రి అయిన తరువాత దానిని సరిదిద్దారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు ప్రణాళికా సంఘంలో సమాన ప్రాతినిధ్యం ఉన్నప్పుడే అది ఆశించిన ఫలితాలు ఇస్తుందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. అందుకే పాత ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసి, ఆ వ్యవస్థలో ఉన్న అనేక లోపాలను సవరించి దాని స్థానంలో కొత్తగా ఈ నీతి ఆయోగ్ ని ఏర్పాటు చేసారు. ఈరోజు నీతి ఆయోగ్ సమావేశానికి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించడమే ఆ వ్యవస్థలో జరిగిన మార్పులకి అద్దం పడుతోంది.

కేసీఆర్ కు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యోగులు

తెలంగాణ ముఖ్యమంత్రి పై తెలంగాణ ఉద్యోగులు మండిపడుతున్నారు. అధికారంలోకి రాకముందు కేసీఆర్ తెలంగాణ ఉద్యోగులతో సక్యతగా ఉన్నారని ఇప్పుడు సీఎం కాగానే ఉద్యోగులను విస్మరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ కార్యలయంలో ఉద్యోగుల కోసం వార్ రూమ్ ఉండేదని అది ఇప్పుడు వాష్ రూమ్ గా మార్చారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి పనిచేసిన మేము ఇప్పుడు సమస్య పరిష్కారం కోసం అదే కేసీఆర్ పై పోరాటం చేసేందుకు సిద్ధమని అంటున్నారు. తెలంగాణ జేఏసీ ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకుండా నిద్రపోతే తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

తప్పించుకున్న సింహాన్ని చంపేశారు

  జూలో వున్న సింహం బోనులో వున్నంతవరకే గౌరవం. బోను నుంచి తప్పించుకుంటే దానిమీద ఎవరికీ గౌరవం వుండదు. చైనాలో ఇలాంటి ఘటనే జరిగింది. చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని తైయాన్ టైగర్స్ పార్క్‌లో ఆదివారం నాడు సింహాల ఎన్‌క్లోజర్ని క్లీన్ చేయడానికి వెళ్ళిన జూ సిబ్బంది ఒకరి మీద ఒక సింహం దాడి చేసి చంపేసింది. ఆ తర్వాత ఎన్‌క్లోజర్లోంచి తప్పించుకుని బయటకి వచ్చింది. దాంతో జూ సిబ్బంది అప్రమత్తమయ్యారు. జూలో వున్న అందర్నీ బయటకి పంపేసి సింహాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. గంటసేపు ప్రయత్నించినా ఆ సింహం అదుపులోకి రాలేదు. దాంతో దాన్ని కాల్చి చంపేశారు. సింహాన్ని చంపి చాలా మంచి పనిచేశారని చాలామంది అంటుంటే, కొంతమంది జంతు ప్రేమికులు మాత్రం ఇది దారుణమని విమర్శిస్తున్నారు.

కొత్త పైత్యం.. ఫైర్ ఛాలెంజ్...

  ఆ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చిన ‘ఐస్ బక్కెట్ ఛాలెంజ్’ గురించి అందరికీ తెలిసిందే. నెత్తిన ఐస్ ముక్కలను కుమ్మరించుకునే ఈ ఛాలెంజ్‌కి సోషల్ మీడియా పుణ్యమా అని విస్తృత ప్రచారం లభించింది. ఈ ఛాలెంజ్‌కి నకలుగా ప్రపంచ వ్యాప్తంగా అనేక ఛాలెంజ్‌లు బయల్దేరాయి. నెత్తిన ఐస్ ముక్కల బక్కెట్‌ని కుమ్మరించుకుని మరికొంతమందికి అలా చేయాలంటూ ఛాలెంజ్ విసిరే ఈ ‘ఐస్ బక్కెట్’ ఛాలెంజ్ ఎంత వేగంగా ప్రపంచమంతటా వ్యాపించిందో, అంత త్వరగా చల్లారింది. ఆ ఛాలెంజ్ చల్లారినా, అలాంటి ఛాలెంజ్‌లు మాత్రం పుట్టుకొస్తూనే వున్నాయి. ఏఎల్ఎస్ వ్యాధి నివారణ కోసం ప్రారంభించిన ఐస్ బకెట్ ఛాలెంజ్ ప్రారంభమైంది. అయితే ఇప్పుడు అమెరికా యువతరం ఒక కొత్త ఛాలెంజ్‌ని ప్రారంభించారు. ఆ ఛాలెంజ్ పేరు ‘ఫైర్ ఛాలెంజ్’ ఒంటిమీద పెట్రోలు పోసుకుని, నిప్పంటించుకుని, వెంటనే నీళ్ళలోకి దూకే ఛాలెంజ్ ఇది. ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటున్న చాలామంది తీవ్రంగా గాయపడుతున్నారు. అబ్బాయిలే కాదు... అమ్మాయిలు కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటూ గాయపడుతున్నారు. ఈ మధ్య ఈ ఫైర్ఛాలెంజ్లో పాల్గొన్న ఇద్దరు అన్నదమ్ములు ఒంటికి నిప్పంటించుకున్నారు. అయితే మంటలు విపరీతంగా వ్యాపించాయి. పక్కన ఉన్నవాళ్ళు సమయానికి మంటలార్పి వాళ్ళని కాపాడారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అలాగే నిప్పంటించుకుని ఏడుస్తున్న ఓఅమ్మాయి ఫొటో కూడా సోషల్ మీడియాలో సంచరిస్తోంది. ఇలాంటి ప్రమాదకరమైన ఛాలెంజ్‌ల కారణంగా తమ పిల్లలు ఏమైపోతారో అని అమెరికాలోని తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు.

ఏపీ రాజధాని ముహూర్తం బాలేదని హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణానికి జూన్ 6వ తేదీన శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 6వ తేదీన ఉదయం 8.49 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేయనున్నారు. మరోవైపు చంద్రబాబు అధికారం చేపట్టి జూన్ 8 నాటికి ఏడాది కావడంతో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన స్థలంలోనే బహిరంగసభ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇదిలా ఉండగా నూతన రాజధాని నిర్మాణానికి పెట్టిన ముహూర్తం సరిగా లేదని ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీనివాస గార్గేయ అన్నట్లు తెలుస్తోంది. గోదావరి పుష్కరాల ముందు ముహుర్తాలు ఆశించినంత ఫలితాలు ఇవ్వవని, పుష్కరాలు ప్రారంభమైన 70 రోజుల తరువాత ముహుర్తాలు బావుంటాయని చెప్పినట్టు సమాచారం. ఒకవేళ జూన్ 6వ తేదీనే భూమి పూజ నిర్వహిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు.

లంచం ఇవ్వబోయిన కేజ్రీవాల్ కూతురు

  ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూతురు ఓ ప్రభుత్వాధికారికి లంచం ఇవ్వబోయింది. అసలు అవినీతిని అంతం చేయాలి అనే కేజ్రీవాల్ కూతురే లంచం ఇవ్వడమేంటి అని ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ విషయాన్ని స్వయంగా కేజ్రీవాల్ గారే చెప్పారు. అదేంటో చూద్దాం.. కేజ్రీవాల్ ఆటో డ్రైవర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఢిల్లీలో లంచగొండితనం 80 శాతం వరకు తగ్గిందని అన్నారు. దానికి ఒక ఉదాహరణ కుడా చెప్పారు. కేజ్రీవాల్ కూతురు లెర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి కార్యలయంకి వెళ్లింది. అయితే అక్కడ తన వంతు వచ్చే వరకు ఎదురు చూసింది. అధికారి దగ్గరికి వెళ్లి కావాలనే ఒక ముఖ్యమైన సర్టిఫికేట్ తీసుకురాలేదని చెప్పడంతో అధికారి లైసెన్స్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఆమె అతనికి లంచం ఇస్తానని చెప్పిందట. కానీ ఆప్రభుత్వాధికారి దానిని తిరస్కరించి లైసెన్స్ ఇవ్వలేదట. తరువాత ఆమె మళ్లీ వెనక్కి వచ్చి సర్టిఫికెట్ ఇవ్వగా అందులో కేజ్రీవాల్ పేరు చూసి తన పని పూర్తి చేసి పంపారట.

గోదావరి పుష్కరాల లోగో

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధానికి జూన్ 6వ తేదీన భూమి పూజ జరగనున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చింది. ఆరోజు ఉదయం 8.49 గంటలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమిపూజ, శంకుస్థాపన చేస్తారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ వెల్లడించారు. అలాగే పుష్కరాలకు సంబంధించిన లోగోను విడుదల చేశామని కూడా ఆయన తెలిపారు. 198 ఎంట్రీలను పరిశీలించాక పుష్కరాల లోగోను ఎంపిక చేశామని వివరించారు. ఈసారి గోదావరి పుష్కరాలను మహా పుష్కరంగా పరిగణిస్తామని ఆయన చెప్పారు. ఆవిష్కరించామని ఆయన తెలిపారు. ఈ లోగోను అన్ని ప్రభుత్వ ప్రకటనల్లో ఉపయోగిస్తారు. గోదావరి పుష్కరాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను చంద్రబాబు ఆహ్వానిస్తారని తెలిపారు. పుష్కరాల లోగోను చంద్రబాబు ఆవిష్కరించారు.

లవ్ లాక్స్‌ కట్...

  మెల్‌బోర్న్ సిటీలో లవర్స్‌ ఒకపని తప్పకుండా చేస్తారు. సౌత్ గేట్ ఫుట్ బ్రిడ్జికి వున్న తీగలకు తమ ప్రేమకు గుర్తుగా తమ పేర్లు రాసి వున్న ఒక తాళాన్ని వేస్తారు. ఆ తర్వాత ఆ తాళాన్ని దూరంగా విసిరేస్తారు. అలా చేయడం తమ ప్రేమకు బలాన్నిస్తుందని, తాము ఎప్పటికీ విడిపోమని అక్కడి ప్రేమికులకున్న ఒక నమ్మకం. వీళ్ళ నమ్మకం విషయం ఏమోగానీ, ఈ తాళలా బరువుకు సదరు బ్రిడ్జి తీగలు సాగిపోతూ, కిందకు వాలిపోతున్నాయట. ఇలా తాళాలు వేయడం కొనసాగితే బ్రిడ్జి రక్షణకే డేంజరొచ్చే ప్రమాదం వుందని గ్రహించిన అధికారులు ప్రేమికులు వేసిన ఆ తాళాలన్నిటినీ తొలగించాలని నిర్ణయించారు. మూడేళ్ళుగా వున్న తాళం కప్పలు బ్రిడ్జి నిండా కుప్పలు తెప్పలుగా పెరిగిపోయాయి. తాళాలు తీసేసిన తర్వాత వాటిని ఏం చేయాలన్న విషయం మీద మెల్‌బోర్న్ అధికారులు ప్రజల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానించారు. ఇంగ్లాండ్‌లో ఇలా లవ్ లాక్స్ వేసే బ్రిడ్జి ఒకటి వుంది. ఆ బ్రిడ్జి మీద ప్రేమికులు వేసిన ఏడు లక్షల తాళాల బరువు ధాటికి బ్రిడ్జి కూలిపోయింది. అలాంటి ప్రమాదం మెల్‌బోర్న్ బ్రిడ్జికి కూడా రాకూడదనే ఉద్దేశంతోనే తాళాలు తొలగిస్తున్నామని మెల్‌బోర్న్ మేయర్ పేర్కొంటున్నాడు.

42 ఏళ్ళ కోమా ముగిసింది...

  42 సంవత్సరాల క్రితం ఒక అన్యాయాన్ని ఎదిరించిన అరుణా షాన్‌బాగ్ అనే మహిళ అత్యాచారానికి గురై, షాక్‌లో కోమాలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ మహిళ మరణించింది. 26 ఏళ్ళ వయసులో కోమాలోకి వెళ్ళిపోయిన ఆమె 42 సంవత్సరాల తర్వాత ఆమెకు 68 సంవత్సరాల వయసులో ముంబైలోని కింగ్‌ అడ్వర్డ్స్ మెమోరియల్‌ (కెఇఎమ్‌) ఆస్పత్రిలో సోమవారం మరణించింది. ఆమె ఇదే ఆస్పత్రిలో నర్సుగా పనిచేసేది. ఆస్పత్రిలో మందులను సోహన్‌లాల్ అనే వార్డు బాయ్‌ దొడ్డిదారిన అమ్ముకుంటూ వుండటాన్ని గమనించిన అరుణా షాన్‌బాగ్ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పింది. దాంతో ఆ వార్డు బాయ్ ఆమె మీద అత్యాచారం జరిపి, తీవ్రంగా గాయపరిచాడు. దాంతో ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆమె కోమాలోనే వుంది. సుదీర్ఘంగా కోమాలో వున్న అరుణా షాన్‌బాగ్‌కి కారుణ్య మరణాన్ని ఇవ్వాలని ఆమె మీద ఒక పుస్తకాన్ని రాసిన పింకీ విరానీ అనే రచయిత్రి సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అయితే అరుణా షాన్‌బాగ్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కింగ్‌ అడ్వర్డ్స్ మెమోరియల్‌ (కెఇఎమ్‌) సిబ్బంది సుప్రీం కోర్టుకు హామీ ఇవ్వడంతో కోర్టు ఆమెకు కారుణ్య మరణాన్ని ఇవ్వడానికి నిరాకరించింది. ఇప్పుడు అరుణా షాన్‌బాగ్ కన్నుమూసింది.

బ్యాటరీలు కాదు.. బంగారం

  శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటూవుంటారు. ఇలాగే బంగారం స్మగ్లర్లు కూడా కస్టమ్స్ అధికారులకు దొరకకుండా బంగారం అక్రమ రవాణా చేయడం కోసం రకరకాల మార్గాలను అన్వేషిస్తూ వుంటారు. చాలాసార్లు వాళ్ళు సక్సెస్ అవుతూ వుంటారు. ఒక్కోసారి మాత్రం అడ్డంగా దొరికిపోతూ వుంటారు. ఇలాంటి సంఘటన సోమవారం నాడు శంషాబాద్ విమానాశ్రయంలో జరిగింది. అబుదాబి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు బోలెడన్ని సెల్‌ఫోన్లను తనవెంట తెచ్చుకున్నాడు. సెల్‌ఫోన్లే కదా అని అధికారులు వాటన్నిటినీ బయటకి తీసుకెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. అయితే చివరి క్షణాల్లో ఎందుకో అనుమానం వచ్చి సెల్‌ఫోన్లను తెరిచి చూస్తే, సెల్‌లో బ్యాటరీల స్థానంలో బంగారు బిస్కెట్లు పెట్టి వున్నాయి. దాంతో బిత్తరపోయిన కస్టమ్స్ అధికారులు ఆ బంగారాన్ని, సదరు స్మగ్లర్ని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రెండు కిలోల బంగారం పట్టుబడినట్టు తెలుస్తోంది.

మంత్రి ఈటెలకు ముప్పు తప్పింది

  తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు ఈటెల రాజేందర్‌ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీనిని దైవకృపగానే భావించాల్సి వుంటుంది. ఈటెల రాజేందర్ కాన్వాయ్‌లో ఉన్న ఒక బుల్లెట్ ప్రూఫ్ కారు మెట్‌పల్లి సమీపంలో ఒక చెట్టును చాలా వేగంగా ఢీకొంది. మంత్రి కాన్వాయ్ హుజూరాబాద్ నుంచి వెంకట్రావ్‌పల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చాలా వేగంగా ఈ వాహనం చెట్టును డీకొనడంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో మంత్రి ఆ కారులో లేరు. దాంతో పెద్ద ముప్పు తప్పింది. సాధారణంగా మంత్రి ఈటెల ఎప్పుడూ ఈ కారులోనే ప్రయాణిస్తూ వుంటారు. సోమవారం నాడు ఎందుకనో ఆయన ఈ కారు ఎక్కలేదు. మంత్రికి ప్రమాదం ముప్పు తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మా ఫొటోలు మార్ఫింగ్ చేశారు...

  హర్యానాలోని రోహతక్ ప్రాంతానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్ళు తమను బస్సులో ఏడిపించిన ఆకతాయిలకు బుద్ధి చెప్పారు. తమ మీద కక్ష సాధించడానికి ఆ ఆకతాయిలు తమ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్‌లో పెట్టారని, వారిని అరెస్టు చేయాలని ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్ళు పూజ, ఆరతి ఆందోళన చేపట్టారు. వీరిద్దరూ తండ్రితో కలసి రోహతక్ జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ విషయంలో ఒక నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. నిందితులందర్నీ అరెస్టు చేసేవరకూ ఎస్పీ కార్యాలయం ముందు నుంచి కదలమని అక్కాచెల్లెళ్ళు పట్టుదలగా వున్నారు.

పార్కింగ్ గొడవ.. 9 మంది మృతి

  అమెరికాలోని టెక్సాస్ నగరంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన కాల్పుల్లో 9 మంది మరణించారు. టెక్సాస్‌లోని ట్విన్‌పీక్సీ రెస్టారెంట్ వద్ద ఈ దారుణం జరిగింది. మూడు గ్రూపుల మధ్య పార్కింగ్ స్థలం వద్ద జరిగిన ఘర్షణ కాల్పులకు దారి తీసింది. ఈ సందర్భంగా ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరందరికీ చికిత్స జరుగుతోంది. ఈ ఘటనా స్థలంలో ఘర్షణ పడిన యువకులు వదలి వెళ్ళిన దాదాపు వంద ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నిందితుల కోసం గాలిస్తున్నారు. అమెరికాలో పెరిగిపోయిన గన్ కల్చర్ వికృత స్వరూపానికి ఈ ఘటనను ఉదాహరణగా చెప్పవచ్చు.

చంద్రబాబు పీఎం, లోకేష్ సీఎం.. వైవీబీ జోస్యం

మచిలీపట్నంలో టీడీపీ కృష్ణాజిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా అవతరిస్తుందని, 2024లో నారా చంద్రబాబు నాయుడు దేశ ప్రధాన మంత్రి, నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ ను నియమించాలని ఈ విషయాన్ని సభా పూర్వకంగా తీర్మానించాలని కోరారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషిచేసునందుకే ప్రతిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రులయ్యారని అన్నారు.

అనుష్క నడుంపై కోహ్లీ.. యువీ ఎదుటే

  అనుష్కశర్మ, విరాట్ కోహ్లీ ప్రేమ వ్యవహారం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు ఎప్పుడూ ఏదో వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఆ మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోవడానికి కారణం వీరిద్దరే అని అందరూ తిట్ల వర్షం కూడా కురిపించారు. ఇప్పుడు కొత్తగా మరో వివాదంలో ఇరుక్కున్నారు ఈ జంట. సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ జరిగే సమయంలో తోటి ఆటగాళ్లతో, మ్యాచ్ అధికారులతో తప్ప ఎవరితో మాట్లాడకూడదు ఇది నిబంధన. అయితే మన హీరో విరాట్ కోహ్లీ మాత్రం తన ప్రేయసి కోసం నిబంధనలను అతిక్రమించాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసిన తరువాత అనుష్క శర్మను దగ్గరకు రమ్మని పిలిచి ఇద్దరూ మాట్లాడుకున్నారు. అదే సమయంలో యువరాజ్ సింగ్ కూడా పక్కనే ఉన్నా.. విరాట్ మాత్రం అనుష్క శర్మ నడుపై చేయి వేసి మరీ మాట్లాడాడు. దీంతో మ్యాచ్ రిజల్ట్ ఎలా ఉన్నా అందరి చూపులు మాత్రం ఈ జంటపైనే పడ్డాయి.