అత్యాధునికంగా చంద్రబాబు క్యాంపు కార్యాలయం

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోసం విజయవాడలో ఏర్పాటు చేయనున్న క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వం రూ. 10.21 కోట్లు మంజూరు చేసింది. విజయవాడలోని సూర్యారావుపేటలో ఉన్న జలవనరులశాఖ కార్యలయంలో చంద్రబాబు నివాసం కోసం అత్యాధునిక వసతులతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం ఛాంబర్, ఆయన రాకపోకలు సాగించే ప్రాంతం, తలుపులు బులెట్ ప్రూఫ్ తో ఏర్పాటవుతున్నాయి. శాటిలైట్ ఫోన్లు జామర్లు, రాకెట్ లాంచర్ల దాడుల నియంత్రణతో కూడిన సాంకేతిక వస్తువుల వినియాగం జరుగుతుంది. జూన్ 2వ తేదీ నుండి వారానాకి మూడు రోజులు చంద్రబాబు ఇక్కడే ఉంటారు. అక్కడ నుండే ఆయన వివిధ ప్రాంతాలకు పర్యటించనున్నారు.

ప్రజాస్వామ్యమా? రాక్షస పాలనా?

  ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కోసం 166 జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విశ్వరూప్ మాట్లాడుతూ భూసేకరణ బిల్లుకు తాము వ్యతిరేకమని, కేంద్ర ప్రభుత్వమే చట్టం చేయని ఆర్డినెన్స్ ను రాష్ట్రంలో ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. నూతన రాజధాని నిర్మాణం కోసం రైతులే స్వయంగా భూములు ఇస్తున్నారని చెప్పిన రైతులు ఇప్పుడు భూసేకరణ ద్వారా ఎందుకు భూములు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. రైతులకు అన్యాయం చేయడానికే ఈ భూసేకరణ జీవో తీసుకొచ్చారని మండిపడ్డారు. ఈ జీవోను అడ్డుపెట్టుకొని రైతుల భూములను ప్రభుత్వం లాక్కుంటుందని, ఇది ప్రజాస్వామ్యమా? రాక్షస పాలనా? అని ప్రశ్నించారు. సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్న ఎంవోయూను ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ బయటపెట్టడం లేదని విశ్వరూప్ విమర్శించారు.

రాజధాని గ్రామాల్లో భూ సేకరణ

  ఏపీ రాజధాని ప్రాంతంలో భూసేకరణతోపాటు భూ సమీకరణలోనూ భుములు ఇచ్చేందుకు రైతులకు అవకాశం వుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో రైతులు భూసేకరణ చట్టంలోకంటే భూ సమీకరణ ద్వారానే ఎక్కువ మేలు జరుగుతుందని అంటున్నారని చెప్పారు. రాజధాని ప్రాంతంలో భూ సమీకరణకు ఇవ్వని భూములను భూ సేకరణ ద్వారా సేకరించాలని కలెక్టర్‌కి ఆదేశాలు జారీ అయ్యాయని ఆయన తెలిపారు. త్వరలోనే ఆ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. కేంద్ర మంత్రుల పర్యటనలో మార్పుల కారణంగానే మంగళగిరి వద్ద ఎయిమ్స్ శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడిందని ఆయన వెల్లడించారు.

రక్తసంబంధం అంటే ఇదే...

  75 సంవత్సరాల క్రితం తనకు దూరమైన అక్కను చెల్లెలు కలుసుకుని ఎంతో సంతోషించింది. భారత ప్రధాని నరేంద్రమోడీ చైనా పర్యటన సందర్భంగా ఈ అపురూపమైన ఘట్టం జరిగింది. చైనా దేశానికి చెందిన మెరైన్ ఇంజినీర్ అన్‌చి పొంగ్ 75 ఏండ్ల క్రితం తన కూతురు అన్ రోసీని (81) బీజింగ్‌లో వదిలిపెట్టి చెన్నైకి వచ్చి స్థిరపడ్డాడు. ఆయన చెన్నైలో మరో వివాహం చేసుకున్నాడు. ఆయనకు అన్ (62) అనే మరో కుమార్తె పుట్టింది. ఇటీవల తన తండ్రి మూలాలను తెలుసుకొనేందుకు ప్రయత్నించిన అన్, బీజింగ్‌లో తన సోదరి ఉన్నట్లు సోషల్‌మీడియా ద్వారా తెలుసుకుని, ఆమెను కలుసుకొనేందుకు సహకరించాలని ప్రధాని మోదీకి తన  కుమారుడి చేత లేఖ రాయించింది. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ అధికారులు చైనా అధికారులకు తెలియజేసి, ఈ అక్కా చెల్లెళ్ళ కలయికకు ఏర్పాట్లు చేశారు. గురువారం నాడు బీజింగ్‌లోని ఓ రెస్టారెంటులో ఈ అక్కాచెల్లెళ్ళు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ భావోద్వేగానికి లోనయ్యారు. వీరి మనోభావాలను ఒకరికొకరు చెప్పడానికి ఒక దుబాసీ కూడా వీరికి సహకరించాడు.

ఆ విషయం 22న డిసైడవుద్ది

  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మీద వున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసును కర్ణాటక హైకోర్టు కొట్టి వేసిన విషయం తెలిసిందే. గతంలో ఈ కేసులో శిక్ష పడిన సందర్భంగా జయలలిత శాసనసభ సభ్యత్వానికి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఈకేసు నుంచి విముక్తి పొందిన నేపథ్యంలో ఆమె మళ్ళీ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునే అవకాశం వుందని తెలుస్తోంది. అయితే జయలలిత నుంచి దీనికి సంబంధించిన సంకేతాలేవీ రాలేదు. ఈ నేపథ్యంలో జయలలిత ఈనెల 22వ తేదీన అన్నా డీఎంకే శాసనసభ్యులతో భేటీ కానున్నారు. ఈ సమావేశం అనంతరం జయలలిత ఎప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించేదీ తెలుస్తుంది. ఈ సమావేశం తర్వాత ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

127 మంది రేప్

  తూర్పు కాంగోలో ఆర్మీ వాళ్ళు అత్యాచారాలకు పాల్పడటం మామూలు విషయమైపోయింది. కొద్దిరోజుల క్రితం 60 మంది ఆర్మీ మిలిషియా సభ్యులు 127 మంది మహిళల మీద అత్యాచారం జరిపారు. అయితే అత్యాచారానికి గురైన మహిళలు ఈ విషయాన్ని బయటపెట్టడానికి జంకడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పు కాంగోలోని దక్షిణ కీవ్ ప్రావెన్స్లో ఈనెల మొదటివారంలో ఈ ఘోరం జరిగింది. డాక్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ దారుణ ఘటనను శుక్రవారం నాడు ప్రపంచానికి వెల్లడించింది. ఆర్మీ చేతిలో అత్యాచారానికి గురైన మహిళలలో 14 నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు వున్నారు. ప్రస్తుతం వారందరికీ వారందరికి వైద్య సహాయం అందుతోంది. కాంగోతోపాటు దాదాపు 18 దేశాలలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని యూఎన్ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఇటీవలే ఆందోళన వ్యక్తం చేశారు.

కుటుంబాన్నే చంపేశాడు

  శుక్రవారం నాడు వరల్డ్ ఫ్యామిలీ డే. కుటుంబ ప్రాధాన్యాన్ని తెలిపే రోజు. కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పే రోజు. కుటుంబానికి సంబంధించి ఇంత ప్రాధాన్యం వున్న ఈ రోజున హైదరాబాద్‌లో ఓ కిరాతకుడు తన కుటుంబాన్నే చంపేశాడు. హైదరాబాద్‌లోని బాలాపూర్ ప్రాంతంలో వున్న సాయినగర్‌తో ఈ ఘోరం జరిగింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో సమ్మిరెడ్డి రామిరెడ్డి అనే వ్యక్తి తన తల్లి సుభద్ర (65), భార్య రాధిక (40), కుమార్తె అక్షయ (14)లను కత్తితో గొంతు కోసి చంపేశాడు. శుక్రవారం తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో ఈ ముగ్గర్నీ చంపేసిన ఆ వ్యక్తి ఆ తర్వాత ఘటనా స్థలం నుంచి పరైరయ్యాడు. తర్వాత ఓ బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యలు జరిగిన సమయంలో హంతకుడి పెద్దకూతురు ప్రత్యూష ఇంట్లో లేకపోవడంతో బతికి బయటపడింది.

500 ‘ఆ’ వీడియోలు దొరికాయి

  బెంగుళూరులో ‘ఆ’ తరహా వీడియోలను తయారు చేస్తూ, వాటిని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తున్న ఒక ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తిని సీబీఐ పోలీసులు అరెస్టు చేశారు. అతని దగ్గరి నుంచి ‘ఆ’ తరహా వీడియోలు 500 స్వాధీనం చేసుకుని, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతను ఈ ‘కుటీర పరిశ్రమ’ పెట్టింది డబ్బు సంపాదన కోసం మాత్రమే కాదు.. తనలోని ‘హాబీ’ని సంతృప్తి పరచడానికి అని తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోయారు. కౌశిక్ కునార్ అనే కోటీశ్వరుడికి బోలెడంత డబ్బుంది. విదేశాలలో చదువుకున్నాడు. కుటుంబంలో అందరూ ఉన్నత స్థానాల్లో వున్నారు. అందమైన భార్య కూడా వుంది. అయితే కౌశిక్‌కి బ్లూఫిలింలు నిర్మించడం అంటే సరదా. డబ్బు అవసరం అమ్మాయిలను లోబరుచుకుని, వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ బ్లూఫిలిమ్స్ చిత్రీకరించేవాడు. మహిళలను హింసిస్తూ బ్లూఫిలిమ్స్ చిత్రీకరించడం ఇతని స్పెషాలిలీ. వాటిని ఇంటర్నెట్లో అప్‌లోడ్ చేయడం ద్వారా బోలెడంత డబ్బు కూడా సంపాదిస్తున్నాడు. ఈ బ్లూఫిలిమ్స్ బిజినెస్ కోసం అతను ఒక అత్యాధునిక ఎడిటింగ్, డబ్బింగ్ స్టూడియోలు ఏర్పాటు చేసుకున్నాడు. అత్యాధునిక వీడియో కెమెరాలు 20కి పైగా అతని దగ్గర వున్నాయి. ఈ వ్యవహారంపై హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తూకు లేఖ రాసిన నేపథ్యంలో ఈ కేసును పోలీసులు చేపట్టి, ఛేదించారు.

ప్రధానికి బీజింగ్‌లో ఘన స్వాగతం

    భారత ప్రధాని నరేంద్రమోడీ చైనా పర్యటనలో వున్న విషయం తెలిసిందే. ఆయన చైనా పర్యటనలో రెండోరోజు శుక్రవారం నాడు బీజింగ్‌లో పర్యటిస్తున్నారు. బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ దగ్గర నరేంద్రమోడీకి చైనా ప్రభుత్వం అధికారికంగా ఘన స్వాగతాన్ని అందించింది. మోడీ స్వాగత కార్యక్రమంలో చైనా ప్రధాని లీ కెషాంగ్ పాల్గొన్నారు. ఆ తర్వాత మోడీ, లీ కెషాంగ్ సమావేశమయ్యారు. సరిహద్దు సమస్య గురించి, భారత్‌లో చైనా పెట్టుబడులు పెట్టే అంశం గురించి చర్చించారు. సమావేశం కొనసాగుతోంది. చైనాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశం వుంది. మోడీ శనివారం నాడు చైనా సంస్థల సీఇఓలతో సమావేశం అవుతారు.

రాహుల్‌కి కడుపునొప్పికి కారణమేంటి?

  తెలంగాణ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కడుపు నొప్పి వచ్చింది. ఆయన జ్వరంతో కూడా బాధపడ్డారు. పాదయాత్ర కోసం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కి వచ్చిన ఆయన గురువారం రాత్రి కడుపునొప్పి, జ్వరంతో బాదపడ్డారు. వెంటనే ఆయన తనకు కేటాయించిన హోటల్ రూమ్‌కి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. తమ నాయకుడికి కడుపునొప్పి వచ్చిందని తెలియడంతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్మల్‌లోని ఒక ప్రైవేట్ వైద్యుడిని రాహుల్ గాంధీ దగ్గరకి పంపించి వైద్య పరీక్షలు చేయించారు. ప్రయాణిక బడలిక కారణంగా జ్వరం వచ్చిందని, ఆహారం సరిపడకపోవడం వల్ల కడుపు నొప్పి వచ్చిందని డాక్టర్ నిర్ధారించి, ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పడంతో కాంగ్రెస్ వర్గాలు తేరుకున్నాయి. అయితే కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళను ఆపుకోలేక రాహుల్ గాంధీ తమకు దర్శనం ఇస్తేగానీ తమ మనసులు శాంతించవంటూ రాహుల్ బసచేసిన హోటల్ ముందు చేరి ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వచ్చి, రాహుల్ బాగానే వున్నారని చెప్పడంతో వారు మనశ్శాంతి పొంది వెనుదిరిగారు.

ఆ ముగ్గురికీ ఆ ‘టెస్ట్’ చేస్తారట..

  కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం పార్లమెంట్ సభ్యుడు శశిథరూర్ భార్య సునందా పుష్కర్ హత్య కేసు విచారణ వేగవంతంగా జరుగుతోంది. మొదట ఆమెది అనుమానాస్పద మృతి అని భావించినప్పటికీ, తర్వాత అది హత్యగా పోలీసులు నిర్ధారించిన విషయం తెలిసిందే. సునంద హత్య జరిగిన రోజున, అంతకుముందు జరిగిన పరిణామాలను పరిశోధిస్తున్న ఢిల్లీ పోలీసులు ఈ కేసులో ముగ్గురు సాక్షులుగా వున్న శశి థరూర్ వ్యక్తిగత సహాయకుడు నారాయణ్ సింగ్, డ్రైవర్ భజరంగి, స్నేహితుడు సంజయ్ దావన్కు లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ మేరేకు తమకు అనుమతినివ్వాలని కోర్టుకు విన్నవించారు. ఈ ముగ్గురూ దర్యాప్తుకు సహకరించకుండా తమ ప్రశ్నలకు నోటికి వచ్చిన సమాధానాలు చెబుతున్నారని పోలీసులు కోర్టుకు నివేదించారు. ఈ విషయంలో కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి వుంది.

రైతులకు షాక్.. భూసేకరణకు జీవో

  ఆంధ్రరాష్ట నూతన రాజధాని కోసం భూములు ఇవ్వాలని ప్రభుత్వ అధికారులు, ఇవ్వమని రైతులు చెపుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు షాకిచ్చింది. రాజధాని ప్రాంతంలో ఉన్న భూములను రైతులు ఇవ్వాలని జీవోను జారీ చేసింది. రాజధాని నిర్మాణం కోసం భూసేకరణకు ఉన్న అడ్డంకులను తొలగిస్తూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం 2, 3 చాప్లర్ల నుంచి రాజధాని అభివృద్ధి ప్రాజెక్టుకు మినహాయింపు ఇస్తూ జీవో 166ను జారీ చేసింది. భూసేకరణకు సంబంధించిన అన్ని అధికారాలను కలెక్టర్ ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల నుండి ఈ జీవో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భూములు తీసుకుంటుంది.

ప్రాణం తీసిన సెల్ఫీ

  సెల్ఫీల పిచ్చి ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు అది కాస్త ముదిరి సాహసాలు చేస్తూ ఫోటోలు తీసి మరీ పెడుతున్నారు యువత. అలా సాహసం చేసి ప్రాణాలు పోయే పరిస్థితి తెచ్చుకుంది ఓ యువతి. ఈ ఘటన ఉత్తర రొమేనియాలోని లాసి పట్టణంలో చోటుచేసుకుంది. అన్నా ఉర్సూ అనే యువతి ఓ సెల్ఫీ తీసి పోస్ట్ చేయాలనుకుంది అది కూడా మామూలుగా కాదు రైలు పైకి ఎక్కి. అనుకున్నదే తడువుగా వెంటనే రైలు పైకి ఎక్కింది. సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించగా ఆమె కాలు పొరపాటున హైవోల్టేజ్ కరెంట్ వైర్లకు తాకడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలవ్వగా ఆస్పత్రికి తరలించగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఆమె రైలు ఎక్కుతున్నప్పుడు ఎక్కొద్దని హెచ్చరించానని ఆమె వినిపించుకోకుండా ఎక్కిందని అక్కడ ఉన్న ప్రయాణికుడు తెలిపాడు.

రోడ్డు ప్రమాదంలో జీజేపీ నేత మృతి

  పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్ గురిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో స్థానిక భాజపా నాయకుడు అసిత్ శంకర్ మృతి చెందారు. వివరాల ప్రకారం.. రాజ్ గంజ్ లోని తన పార్టీ కార్యలయం నుండి అసిత్ శంకర్ తిరిగి వస్తుండగా బెలకొడ వద్ద తన కారును ద్విచక్ర వాహనం ఢికొట్టింది. ఈ ప్రమాదంలో అసిత్ శంకర్ కు తీవ్ర గాయాలవ్వగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం అసిత్ శంకర్ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు రాజ్ గంజ్ రోడ్డు వద్ద ధర్నాకి దిగారు. రాజ్ గంజ్ ప్రాంతంలో ట్రాఫిక్ సరైన ట్రాఫిక్ నిబంధనలు లేనందుకు ఈ ప్రమాదం జరిగిందని, అక్కడ సరైన ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీడీవో ఎస్.పి షెర్బా వచ్చి నచ్చజెప్పడంతో వారి ఆందోళనలు విరమించారు.

నా కొడుకును కాపాడండి... దేవేందర్ గౌడ్

  నేపాల్ దేశంలో భూకంపం వచ్చి అక్కడి ప్రజలు తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఎంతో ఆస్తి నష్టం కలిగింది. ఆ దేశానికి సాయం చేయడానికి భారత్ సహా ఎన్నో దేశాలు ముందుకొచ్చాయి. అలా వారికి సాయం చేయడానికి వెళ్లిన వారిలో టీడీపీ సీనియర్ నేత, మాజీ హోంశాఖ మంత్రి దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ గౌడ్ కూడా ఉన్నాడు. అయితే మంగళవారం నేపాల్ లో మళ్లీ భూకంపం వచ్చింది. ఈ ప్రమాదంలో కొండ చరియలు విరిగిపడటంతో వాటి నుండి జాగ్రత్తగానే తప్పించుకున్నారు కానీ అక్కడి నుండి ఎలా బయట పడాలో వాళ్లకు తెలియడం లేదట. దీంతో దేవేందర్ గౌడ్ రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతో భేటీ అయ్యారు. నేపాల్ లో చిక్కుకుపోయిన తన కొడుకు తోపాటు మరో 16 మంది బృందాన్ని సురక్షితంగా తీసుకురావాలని కేంద్ర మంత్రులను కోరారు.

అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం.. చంద్రబాబు

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రకాశం జిల్లా దోర్నాలోని బహిరంగ సభలో పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా విధానంలో రైతులు చితికిపోయారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా బాగా రెచ్చిపోయిందని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక మాఫియాను అరికట్టామని అన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ. 500 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. ఇంకొంతమంది రుణమాఫీ చేయడం అసాధ్యమన్నారని.. కానీ 24వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని చెప్పారు.

ప్రధాని 64 వేల కోట్ల ప్లాన్

  ప్రధానమంత్రి నరేంద్రమోడీ మూడు రోజుల చైనా పర్యటనలో భాగంగా మొదటి రోజు జియాన్ చేరుకున్నారు. జియాన్ లోని జింగ్‌షాన్ ఆలయాన్ని, టెర్రకోట యుద్ధవీరుల మ్యూజియాన్ని సందర్శించిన ఆయన తరువాత ప్రముఖ బౌద్ధ దేవాలయం గోల్డెన్ టెంపుల్ ని సందర్శించి ప్రత్యేక పార్ధనలు చేశారు. అనంతరం ఆయన చైనా అధ్యక్షుడు జి షిన్ పింగ్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన వివిధ వాణిజ్య ఒప్పందాలు, సరిహద్దు సమస్యలు, వీసా తదితర అంశాలపై చర్చించారు. దాదాపు 20 రకాల వాణిజ్య అంశాలపై ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని, సుమారు 64వేల కోట్ల రూపాయల ఒప్పందం కుదిరే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 19 వరకు మోడీ చైనాలోని మంగోలియా, దక్షిణకొరియా లో పర్యటించనున్నారు.

కేజ్రీవాల్ కు అక్షింతలు వేసిన సుప్రీం

  భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో రైతు గజేంద్రసింగ్ మరణించిన విషయంలో, ఆప్ మంత్రి నకిలీ డాక్యుమెంట్లు చూపిన విషయంలో మీడియా రాద్దాంతం చేసిందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మీడియా పై మండిపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియాపై పరువు నష్టం కింద కేసులు రిజస్టర్ చేయాలంటూ, హోంశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేయాలంటూ అధికారులను సూచించారు. ఢిల్లీ అసెంబ్లీలో కూడా మీడియాకు ప్రవేశం నిషేదించారు. అయితే సుప్రీంకోర్టు కేజ్రీవాల్ మీడియాకు వ్యతిరేకంగా సూచించిన సూచనలను తిప్పికొట్టింది. కేజ్రీవాల్ పంపిన సర్క్యులర్ పై స్టే విధించింది. అధికారం చేతికి వచ్చేంత వరకు మీడియాను ఉపయోగించుకోని ఇప్పుడు మీడియాతో కయ్యానికి దిగిన కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది.