దయనీయంగా మారిన ఏపీ ఉన్నత విద్యామండలి పరిస్థితి
posted on May 16, 2015 8:28AM
ఓడలు బళ్ళు అవడం అంటే బహుశః ఇదేనేమో! నిన్న మొన్నటి వరకు సమైక్య రాష్ట్రంలో ఆంధ్రా, తెలంగాణా, రాయలసీమ మూడు ప్రాంతాలలో ప్రవేశ పరీక్షలు నిర్వహించిన ఆంద్రప్రదేశ్ ఉన్నత విద్యామండలికి హైకోర్టు తీర్పుతో ఇప్పుడు హైదరాబాద్ లో కార్యాలయమే లేకుండాపోయింది. రాష్ట్ర విభజన బిల్లులో ఆంద్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి గురించి ఎటువంటి ప్రస్తావన లేకపోవడం చేత, అది తెలంగాణాలో ఉన్నందున అది తెలంగాణాకే చెందుతుందని దానిపై సర్వ హక్కులు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటాయని హైకోర్టు తీర్పు చెప్పడంతో, తక్షణమే స్పందించిన తెలంగాణా ప్రభుత్వం ఉన్నత విద్యామండలి భవనాన్ని తన స్వాధీనంలోకి తీసుకొంది. ఇంతవరకు ఉన్నత మండలి ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సెక్రెటరీలు విధులు నిర్వర్తించిన గదులకు, వాటితో పాటు ఉద్యోగుల పంచ్ గది, సర్వర్ ఉన్న గదులకూ తాళాలు వేయించింది.
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తే, ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలోనే రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించుకొనేందుకు అనుమతి ఇచ్చింది కానీ, హైకోర్టు తీర్పును కొట్టివేయకపోవడంతో ఉన్నత విద్యామండలికి ఇప్పుడు కార్యాలయం కానీ, చేతిలో డబ్బు గానీ లేకుండా పోయింది. ఇక చేసేదేమీ లేక ఆంద్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి, కార్యదర్శి టీవీ శ్రీకృష్ణమూర్తి ఇరువురూ కలిసి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సుమితా దావ్రాను కలిసి మండలి రోజువారి కార్యక్రమాలను నిర్వహించుకొనేందుకు అవసరమయిన నిధులు, ఒక కార్యాలయం ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. వారి అభ్యర్ధన మేరకు సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు హైదరాబాద్ లో నాంపల్లి వద్ద గల గగన్‌విహార్‌లోని ఏఎఫ్‌ఆర్‌సీ కార్యాలయంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.