వైభవంగా ‘తెలుగువన్’ 15వ వార్షికోత్సవం
తెలుగువారు ఒక్కటిగా వుండాలని, తెలుగువారు నంబర్‌వన్ స్థానంలో వుండాలని ఆకాంక్షిస్తూ ఆవిర్భవించి, విజయపథంలో దూసుకువెళ్తున్న సంపూర్ణ వెబ్ పోర్టల్ ‘తెలుగువన్.కామ్’ 15వ వార్షికోత్సవం మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని తాజ్ బంజారా హోటల్లో వైభవంగా జరిగింది. ఈ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ దర్శకుడు, సినిమా కళకోసం, సంగీత సాహిత్యాల కోసం విశేష కృషి చేసిన ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్‌కు ‘తెలుగువన్’ కుటుంబం ఆత్మీయ సత్కారం చేసింది. అలాగే వైద్యులుగా తమ అమృతహస్తాలతో ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపుతున్న ప్రముఖ డాక్టర్లు డాక్టర్ జి.సూర్యనారాయణరాజు, డాక్టర్ శ్రీభూషణ్ రాజు, డాక్టర్ నాగేశ్వరరావులను కూడా ఈ వేదిక మీద సత్కరించుకునే అవకాశం ‘తెలుగువన్’ కుటుంబానికి కలిగింది. ప్రముఖ రచయితలు, నటులు, దర్శకులు అయిన తనికెళ్ళ భరణి, జనార్దన మహర్షి ఈ కార్యక్రమంలో ముఖ్య, ఆత్మీయ అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమానికి ఒక నిండుతనాన్ని తెచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలుగువన్ అధినేత కంఠంనేని రవిశంకర్, తెలుగువన్ క్రియేటివ్ హెడ్, ప్రముఖ కార్టూనిస్టు మల్లిక్ పాల్గొని అతిథులకు ‘తెలుగువన్’ తరఫున స్వాగత సత్కారాలను అందించారు. కార్యక్రమ ప్రారంభంలో విశ్వదృక్ ఫౌండేషన్‌కి చెందిన అంధ కళాకారులు పాడిన పాటలు, చేసిన నృత్యం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి హృదయాన్నీ స్పృశించాయి. ఈ సందర్భంలోనే తెలుగువన్ మేనేజింగ్ డైరెక్టర్ కంఠంనేని రవిశంకర్ పుట్టినరోజు వేడుకలు కూడా జరిగాయి.
ఈ సందర్భంగా తెలుగువన్ మేనేజింగ్ డైరెక్టర్ కంఠంనేని రవిశంకర్ మాట్లాడుతూ, ‘‘పదిహేనేళ్ళ క్రితం నాకు వచ్చిన చిన్న ఆలోచన ‘తెలుగువన్’ రూపొంలో ఇప్పుడున్న ఉన్నత స్థాయికి చేరుకుంది. ఈ పదిహేనేళ్ళ ప్రస్థానంలో వచ్చిన ఎన్నో ఆటుపోట్లను ఎదురొడ్డి నిలిచి ‘తెలుగువన్’ని విజేతగా నిలిపాం. ఇందులో నాకు సహకారం అందించిన తెలుగువన్ కుటుంబానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రపంచంలోని తెలుగువారు ఒక్కటిగా వుండాలి, నంబర్ వన్ స్థానంలో వుండాలనే ఉద్దేశంతోనే మా పోర్టల్ పేరును ‘తెలుగువన్’ అనిపెట్టాం. ‘తెలుగువన్’కు ప్రపంచ వ్యాప్తంగా అద్భుత ఆదరణ లభిస్తోంది. అలాగే తెలుగువన్ రేడియో ‘టోరి’ నెలకు ఏడు మిలియన్ ట్యూనింగ్స్‌తో ప్రపంచంలోనే 24 గంటలు లైవ్ ప్రోగ్రామ్స్ ఇచ్చే ఏకైన వెబ్ రేడియోగా అవతరించింది. డిజిటల్ మీడియా అద్భుత పురోగతి వైపు దూసుకు వెళ్తోన్న ప్రస్తుత తరుణంలో తెలుగువన్ కూడా అన్ని అవకాశాలను అంది పుచ్చుకుని, మరింత అభివృద్ధి సాధించబోతోంది. భారతదేశంలో షార్ట్ ఫిలిమ్స్ అనే కాన్సెప్ట్‌ని ప్రారంభించింది తెలుగువన్ యూట్యూబ్ ఛానల్. తెలుగువన్ అందించిన 600 మంది దర్శకులు వేలాది షార్ట్ ఫిలిమ్స్ రూపొందించారు. కొంతమంది వెండితెర దర్శకులుగా ఎదిగారు. మా ‘తెలుగువన్’ విజయాలు సాధించడంతోపాటు సామాజిక బాధ్యతలను కూడా గుర్తుంచుకుని, పాటిస్తోంది.తెలుగువన్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేదలకు వైద్య సహాయం అందిస్తోంది. పదిహేను వసంతాలు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంలో కె.విశ్వనాథ్ గారి లాంటి మహానుభావుడికి, జి.సూర్యనారాయణ రాజు, శ్రీభూషణ్ రాజు, నాగేశ్వరరావు గారి లాంటి గొప్ప డాక్టర్లను సత్కరించుకోవడం గర్వకారణంగా భావిస్తున్నాను’’ అన్నారు.
ముఖ్య అతిథి తనికెళ్ళ భరణి మాట్లాడుతూ, ‘‘తెలుగువన్‌తో నాకెంతో అనుబంధం వుంది. నాకు అమెరికాకి చెందిన ఒక గొప్ప అభిమాని ‘టోరి’ రేడియో ద్వారా లభించాడు. సాహిత్య, సాంస్కృతిక సేవతోపాటు తెలుగువన్ చేస్తున్న సమాజ సేవ కూడా అభినందనీయం. ఈ వేదిక మీద విశ్వనాథ్ గారి లాంటి గొప్ప దర్శకుడిని సత్కరించుకోవడం సంతోషాన్ని కలిగిస్తోంది. విశ్వనాథ్ గారికి సమకాలికులం కావడం, ఆయన సినిమాలు చూడటం మనకు దేవుడిచ్చిన వరం. ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలను తెలుగువారికి అందించిన విశ్వనాథ్ గారికి తెలుగుజాతి మొత్తం రుణపడి వుంటుంది. ఆయన మన జాతి సాంస్కృతిక రాయబారి. ఆయన్ని సత్కరించే అవకాశం లభించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సాక్షాత్తూ భగవత్ స్వరూపులైన వైద్యులకు ఈ వేదిక మీద సత్కారం జరగడం మరో మంచి విషయం. తెలుగువన్ తన నంబర్‌వన్ స్థానాన్ని కొనసాగించాలని ఈ శుభసందర్భంలో కోరుకుంటున్నాను’’ అన్నారు.
ఆత్మీయ అతిథి జనార్దన మహర్షి తన హృదయ స్పందనను తెలియజేస్తూ, ‘‘విశ్వనాథ్ గారికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు లేరు... భక్తులు మాత్రమే వున్నారు. ఆ భక్తులలో నేను మొదటివాణ్ణి. ఆయనకు సత్కారం జరగడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ వేదిక మీద నా గురువు తనికెళ్ళ భరణి, నా దైవం విశ్వనాథ్ గారు వుండటం, ఆ వేదిక మీద నేను కూడా వుండటం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. 15 వసంతాలు పూర్తి చేసుకున్న ‘తెలుగువన్’కి అభినందనలు’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆత్మీయ సత్కారం అందుకున్న ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్ తన హృదయాన్ని ఆవిష్కరిస్తూ, ‘‘నేను సినిమాలు రూపొందించడం ఆపేసి పదేళ్ళు అవుతోంది. ఇప్పుడు ‘తెలుగువన్’ నన్ను సత్కరించడానికి కారణం నేను ఎప్పుడో తీసిన మంచి సినిమాల గుడ్‌విల్ అని భావిస్తున్నాను. సంగీతం, సాహిత్యం, నృత్యం ప్రధానాంశాలుగా నేను సినిమాలు రూపొందిస్తున్న సమయంలో ఎప్పుడూ వాడినే పట్టుకుని వేలాడుతూ వుంటావేంటయ్యా అని వ్యంగ్యంగా మాట్లాడినవాళ్ళు కూడా వున్నారు. అయినప్పటికీ నేను నా పని చేసుకుంటూ వెళ్ళాను. నా పని నేను త్రికరణశుద్ధిగా చేయడమే భగవంతుడి సేవ అని నేను నమ్ముతాను. తెలుగువన్ 15వ వార్షికోత్సవం సందర్భంగా ఆ సంస్థకు, ఆ సంస్థ అధినేత కంఠంనేని రవిశంకర్‌కు నా ఆశీస్సులు. ఈ కార్యక్రమం ప్రారంభంలో పాటలు పాడి, నృత్యం చేసిన అంధ కళాకారుల ప్రతిభ నన్ను ముగ్ధుడిని చేసింది. వారిలో నేను భగవంతుణ్ణి చూశాను. నన్ను సత్కరించిన ‘తెలుగువన్’ కుటుంబానికి నా ధన్యవాదాలు’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో గౌరవ సత్కారం అందుకున్న వైద్యులు డాక్టర్ జి.సూర్యనారాయణ రాజు, డాక్టర్ శ్రీభూషణ్ రాజు, డాక్టర్ నాగేశ్వరరావు తమకు జరిగిన సత్కారం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. పేదలకు వైద్యాన్ని అందించడం కోసం తెలుగువన్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా వారు ప్రశంసించారు. కె.విశ్వనాథ్, తనికెళ్ళ భరణి లాంటి మహానుభావుల చేతుల మీదుగా సత్కారాన్ని అందుకోవడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. తెలుగువన్‌కి 15వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగువన్’ క్రియేటివ్ హెడ్, డైరెక్టర్, ప్రముఖ కార్టూనిస్టు మల్లిక్ వందన సమర్పణతో ‘తెలుగువన్ 15వ వార్షికోత్సవం’ సంపూర్ణమైంది.