చిన్నారి శ్రీనిధి మృతి
posted on May 20, 2015 8:27AM
బ్లడ్ క్యాన్సర్ వ్యాధి సోకిన పదేళ్ళ చిన్నారి శ్రీనిధి ఈరోజు తెల్లవారు జామున మరణించింది. ఆమె తనను కలవాలనుకొంటున్న సంగతి తెలుసుకొన్న జూనియర్ యన్టీఆర్ ఆమె (చివరి) కోరికను మన్నిస్తూ వారం రోజుల క్రితమే శ్రీనిధి (ఆఖరు) జన్మదినం జరుపుకొన్నప్పుడు ఆమె ఉన్న ఆసుపత్రికి వెళ్లి ఆమెతో కొద్దిసేపు గడిపారు. కానీ వారం తిరక్కుండానే సరిగ్గా జూ.యన్టీఆర్ జన్మదినం రోజునే శ్రీనిధి మరణించడం అందరినీ కలచివేసింది. శ్రీనిధి స్వస్థలం వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో బందనపల్లి గ్రామం. ఆమెకు బ్లడ్ క్యాన్సర్ సోకిన సంగతి తెలుసుకొన్న తరువాత ఆమె తల్లి తండ్రులు ఆమెను అనేక ఆసుపత్రులలో వైద్యం చేయించారు. కానీ ఆమె బ్రతకడం అసాధ్యమని వైద్యులు తేల్చి చెప్పడంతో గత కొంత కాలంగా ఆమెను కూకట్ పల్లిలో ఒక ఆసుపత్రిలో ఉంచి వైద్యం చేయిస్తున్నారు. ఆమె అక్కడ ఉన్నప్పుడే జూ. యన్టీఆర్ వచ్చి ఆమెతో కొంత సమయం గడిపారు. చిన్నారి శ్రీనిధి మరణించిందనే వార్త తెలిసి జూ. యన్టీఆర్ కూడా చాలా బాధపడ్డారు.