ఢిల్లీ అసెంబ్లీలో అగ్నిప్రమాదం

ఢిల్లీ అసెంబ్లీలో అగ్ని ప్రమాదం జరిగింది. మరికొద్ది సేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి అనగా అగ్ని ప్రమాదం జరిగింది. ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఛాంబర్లోని ఏసీ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలు కీలక డాక్యుమెంట్లు, ఫైళ్లు కాలిపోయినట్టు సమాచారం. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఇదిలా ఉండగా ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరగడానికి ముందే ప్రమాదం జరగడం, ప్రమాదం సంభవించే సమయానికి ఆరోగ్యమంత్రి కూడా అక్కడ లేకపోవడం వంటివి పలు అనుమానాలకు దారితీస్తున్నాయి.

బాంబు పెట్టింది నేతకు... బలైంది బాడీగార్డ్

బీహార్ గయాలో జేడీయూ నేత హత్యకు కుట్ర పన్నిన ఉదంతం మంగళవారం బయటపడింది. జేడీయూ అధ్యక్షుడు జిల్లా నేత అభయ్ కుశ్వాహ్ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు పార్శిల్ పంపారు. వచ్చిన పార్శిల్ ను తెరిచి చూస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలింది. ఈ పేలుడులో అభయ్ కుశ్వాన్ బాడీగార్డ్ అక్కడికక్కడే మరణించగా, అభయ్ కుశ్వాన్ బంధువుకు తీవ్రగాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని, మావోయిస్టులకు ఈ పేలుడుపై ఎదైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సునీల్ కుమార్ తెలిపారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉచిత వైఫై

కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉచిత వైఫై సేవలు ప్రారంభించారు. ఈ ఉచిత వైఫై సౌకర్యం ద్వారా మొదటి 30 నిమిషాలు ఉచిత వైఫై సేవలు పొందవచ్చని అధికారులు తెలిపారు. దీనితో పాటు నూతన టికెట్ బుకింగ్ కౌంటర్ ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఐటీ సేవలను మరింత విస్తరింపజేస్తామని, తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంగా మారుస్తామని అన్నారు. ఈ ఉచిత వైఫై సేవలను మరి కొన్ని రైల్యేస్టేషన్ లకు విస్తరింపజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పికె. శ్రీవాత్సవ పాల్గొన్నారు.

టీడీపీ నేతల అనుమానాస్పద మృతి

తెలుగుదేశం పార్టీ కార్యకర్త నారాయణస్వామి అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం షేక్‌సాన్‌పల్లిలో ఈ ఘటన జరిగింది. ఉదయం వాకింగ్ కు వెళ్లిన నారాయణస్వామిని గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరో టీడీపీ నాయకుడు కూడా మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. మారుతీనగర్‌కు ఆనుకుని ఉన్న కాల్వకట్ట వద్ద పురుషుడి మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందిచడంతో అక్కడికి చేరుకున్న సీఐ ఉమామహేశ్వరరావు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం వద్ద లభించిన ఆధారాలను బట్టి మృతిచెందింది మొగల్రాజపురం 6వ డివిజన్‌ కు చెందిన పడాల కన్నారావుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

2జీ స్కాంలో మన్మోహన్ సింగ్ బెదిరించారు... బైజాల్

2జీ స్కాంలో విచారణ ఎదుర్కొంటున్న టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్) మాజీ చైర్మన్ ప్రదీప్ బైజాల్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై మండిపడ్డారు. బైజాల్ 'ద కంప్లీట్ స్టోరీ ఆఫ్ ఇండియన్ రిఫామ్స్- 2జీ, పవర్ అండ్ ప్రైవేట్ ఎంటర్ ప్రైజ్ ఏ ప్రాక్టీషనర్స్ డైరీ' పేరుతో రాసిన పుస్తకంలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు. మన్మోహన్ సింగ్ వల్లే తనకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని, ఈ రోజు తను విచారణను ఎదుర్కొనడానికి కారణం మన్మోహన్ సింగ్ లాంటి వాళ్లేనని ఆరోపించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 2జీ వ్యవహారంలో సహకరించకుంటే హాని తప్పదని తనను హెచ్చరించారని, యూపీఏ ప్రభుత్వం వలన తన పరువు, ప్రతిష్ట దిగజారిపోయిందని అన్నారు. టెలికాం మంత్రిగా దయానిధి మారన్ నియమకాన్ని వ్యతిరేకించానని, మన్మోహన్ సింగ్ మాత్రం అవేమి పట్టించుకోకుండా మారన్ ను నియమించారని తెలిపారు. ఈ నేపథ్యంలో మారన్ కూడా తనను బెదిరించారని 2009-10లో 2జీ స్కామ్ బయటపడిన తరువాత దానికి సంబంధించిన పలు కీలక ఫైళ్లను యూపీఏ ప్రభుత్వం తొలగించిందని బైజాల్ తన పుస్తకంలో ఆరోపించారు.  

నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు

  టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారులను హెచ్చరించారు. నెల్లూరులో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మినీ మహానాడులో ఆయన ప్రసంగిస్తూ ఈ మధ్య పార్టీకి చెందిన మండల అధ్యక్షుడు ఆర్డీఓ ను కలవడానికి వెళితే పట్టించుకోలేదని, వెంటనే అతనికి ఫోన్ చేసి మందలించామని తెలిపారు. ఎలాంటి పరిస్థితిలోనైనా అధికారుల కారణంగా పార్టీకి, కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నా, కార్యకర్తలను నిర్లక్ష్యం చేసినా సహించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా నెల్లూరు జిల్లాకు వద్దంటున్నా పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొంతకాలం తరువాత తెలంగాణ వారు ఆంధ్రాలో కలవాలని కోరుకునే రోజు వస్తుందని అన్నారు.

సుబ్బిరామి రెడ్డి కూడా దీక్ష చేస్తారుట!

  కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి కూడా ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోరుతూ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. వచ్చేనెల 6వ తేదీన రాజమండ్రిలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు. ప్రత్యేక హోదా కోరుతూ జూన్ 3నుండి 5వ తేదీ వరకు వరుసగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.   అయితే ఆయన కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా ఒక్కరే ఎందుకు ఈ హడావుడి చేస్తున్నారోనని పార్టీలో వారే ఆశ్చర్యపోతున్నారు. ఆయన తనకు బలం ఉన్న విశాఖలో దీక్షకు కూర్చోకుండా రాజమండ్రిలో ఎందుకు దీక్ష చేయాలనుకొంటున్నారో కూడా తెలియదు. వచ్చే నెలాఖరులోగా రాష్ట్రానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వస్తారని పార్టీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రకటించారు గనుక ఆయన దృష్టిలో పడాలనే ఉద్దేశ్యంతోనే, ఇంతవరకు రాష్ట్ర సమస్యల గురించి ఎన్నడూ మాట్లాడక పోయినా సుబ్బిరామి రెడ్డి ఈ హడావుడి చేసేందుకు సిద్దమవుతున్నారేమోననే పార్టీలోనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బహుశః ఆయనను చూసి పార్టీలో మిగిలిన నేతలు కూడా దీక్షలకు కూర్చొంటారేమో?

రేపటి నుండి మహానాడు

  తెలుగుదేశం పార్టీ ప్రతీ ఏటా నిర్వహించుకొనే మహానాడు సభలు రేపటి నుండి మూడు రోజులపాటు హైదరాబాద్ గండిపేటలో జరగబోతున్నాయి. రాష్ట్ర విభజన తరువాత నిర్వహిస్తున్న ఈ మొట్టమొదటి మహానాడు సభలకి రెండు రాష్ట్రాల నుండి సుమారు 40 వేల మంది కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు హాజరవుతారని సమాచారం. అందుకు తగ్గట్లుగానే తెదేపా భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ 34వ మహానాడు సభలలో తెదేపా చాలా కీలకమయిన నిర్ణయాలు తీసుకోబోతోంది.   రాష్ట్ర విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీని నిర్వహించేందుకు వీలుగా పార్టీకి ఒక కేంద్ర కమిటీని ఏర్పాటు చేసుకొని దానికి అధ్యక్షుడిని ఎన్నుకోవలసి ఉంటుంది. అప్పుడు రెండు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను నియమించవలసి ఉంటుంది. వీటి కోసం మహానాడులో తీర్మానాలు చేసి కేంద్రకమిటీకి చంద్రబాబు నాయుడుని అధ్యక్షుడిగా ఎన్నుకొన్న తరువాత ఆయన రెండు రాష్ట్రాలకు అధ్యక్షుల నియామకాలు చేయవచ్చునని సమాచారం. తెలంగాణా తెదేపాకు ప్రస్తుతం యల్. రమణ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు. కానీ ఆయన స్థానంలో ఎర్రబెల్లి దయాకర్ రావుని కానీ రేవంత్ రెడ్డిని గానీ నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తెదేపా కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేష్ కు ఈ మహానాడులో పార్టీకి సంబంధించి ఏదయినా కీలకమయిన పదవిని ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ పార్టీలో సీనియర్ నేతలలో ఎవరినో ఒకరిని ఆంద్రప్రదేశ్ తెదేపా అధ్యక్షునిగా నియమించే అవకాశం ఉందని సమాచారం.   రేపటి నుండి మూడు రోజులపాటు జరిగే సమావేశాలలో బహుశః రెండవ రోజు దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మహానాడు సభలలో ఆంధ్రా, తెలంగాణా సంస్కృతి ఉట్టిపడేలా వేదికను రూపొందిస్తున్నారు. అదే విధంగా ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల వంటకాలను కూడా సభకు విచ్చేసినవారికి రుచి చూపించబోతున్నారు. వేసవి ఎండా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని  ఏసీలను, ఎయిర్ కూలర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కేజ్రీవాల్ ప్రభుత్వంతోనే వ్యవహరించండి. హైకోర్టు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎట్టకేలకు ఓ పెద్ద ఊరట లభించింది. గత కొంత కాలంగా లెఫ్టింనెంట్ గవర్నర్ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ఇబ్బందులు పడుతున్న కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టు తీర్పుతో ఊపిరి పీల్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులను ఢిల్లీ ప్రభుత్వ ఏసీబీ అధికారులు విచారించడానికి వీల్లేదని, ఇంకా కొన్ని అంశాలపై ఢిల్లీ ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని, ఈ అంశాలలో లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ ప్రభుత్వ సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం నుంచే ఏసీబీ విభాగం ఆదేశాలు తీసుకుని పాటించాలే తప్ప కేంద్ర ప్రభుత్వం నుండి కాదని, అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఢిల్లీ మంత్రి వర్గం సలహాలతోనే పనిచేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో కేజ్రీవాల్ హైకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అని ఆయన ట్వీట్ చేశారు.

జయలలిత విడుదలపై అప్పీల్ చేస్తాం

అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై ఉన్న కేసును కొట్టిపారేస్తూ కర్ణాటక హైకోర్టు తీర్పు నిచ్చిన సంగతి తెలిసిందే. అయితే కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును పార్టీ సవాల్ చేస్తుందని డీఎంకే అధ్యక్షుడు ఎం.కరుణానిధి తెలిపారు. ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యే హక్కు ఉందని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు రెండుసార్లు చెప్పిందని అన్నారు. అందుకే తాము అప్పీలు చేద్దామని అనుకుంటున్నామని పార్టీ జిల్లా కార్యదర్శకుల సమావేశంలో పాల్గొన్న ఆయన వెల్లడించారు. జయలలితపై వేసిన కేసులో ముందుగా ఫిర్యాదు చేసిన బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యం కూడా అప్పీలు చేయడానికే మెగ్గు చూపుతున్నారని వెల్లడించారు.

రాహుల్‌కి పిజ్జాకు బర్గర్ కు తేడా తెలియదు.. ముక్తార్

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఉల్లిపాయకు, పిజ్జాకు తేడా తెలియదంటూ కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నఖ్వీ మాట్లాడుతూ రాహుల్ గాంధీకీ ఉల్లిపాయకు, పిజ్జాకు, బర్గర్ కు తేడా తెలియదు కానీ రైతుల నాయకుడిగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంలో ఆయన ఏ మాత్రం విజయం సాధించలేరని ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ తొలిసారి రాజకీయాలకంటే దేశాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది తమ ప్రభుత్వమని, మోడీ పాలన వలన ప్రపంచంలో దేశ ప్రతిష్ఠ పెరిగిందని కొనియాడారు. అసత్యాలతో ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారని, నిజనిజాలేంటో ప్రజలకు, మీడియాకు తెలియజేయాలని పార్టీ అధికారలను సూచించారు.

మూడో భార్య కోసం రెండో భార్య హత్య

రంగారెడ్డి జిల్లా పూడూరు మండలంలో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన రెండో భార్యపై కిరోసిన్ పోసి నిప్పింటించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రంగారెడ్డి జిల్లా సోమన్‌గుర్తికి చెందిన ఉప్పరి శేఖర్ అనే వ్యక్తి మొదటి భార్య పేరు అంజమ్మ. వారికి నలుగురు సంతానం. కానీ శేఖర్ మొదటి భార్య అంజమ్మ, పెద్ద కూతురు ఆత్మహత్యకు పాల్పడటంతో శేఖర్ సునీత అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే శేఖర్ కు పరిగిలో మరో యువతితో పరిచయం ఏర్పడి మూడో పెళ్లి చేసుకొన్నాడు. ఈ నేపథ్యంలో శేఖర్ తన రెండో భార్య సునీత తన మూడో భార్యతో కాపురానికి అడ్డు వస్తుందనే అనుమానంతో తనపై కిరోసిన్ పోసి నిప్పింటించి కాల్చి చంపేశాడు. అయితే సునీత ఇంట్లోంచి దుర్వాసన వస్తుండటంతో గ్రామస్థులు వెళ్లి చూడగా సునీత మృతదేహం కనిపించింది. దీంతో విషయం తెలుసుకున్న సునీత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు కథ బయటపడింది.

ఇంట్లోకి దూసుకెళ్లిన స్కార్పియో.. ఏడుగురు మృతి

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం పెద్దబోధనం గ్రామం వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా జాతీయ రహదారిపై తిరుపతికి వెళుతున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్నా ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనంలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, మిగిలిన ఇద్దరికి తీవ్రగాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు చర్యలు చేపట్టారు. మరణించిన వారందరూ మహారాష్ట్ర పుణె జిల్లా బారామతికి చెందిన వారుగా పోలీసుల తెలిపారు.

నన్నెందుకు ప్రత్యేక హోదా అడుగుతారు.. వెంకయ్యనాయుడు

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఏపీ ప్రత్యేక హోదాపై చాలా ఘాటుగా స్పందించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు తనను కాదన్నారని, అందుకే కర్నాటక నుండి రాజ్యసభకు వెళ్లానని అన్నారు. అలాంటప్పుడు తెలుగు ప్రజలు తనను ప్రత్యేక హోదా గురించి ఎందుకు ప్రశ్నిస్తున్నారని ఎదురు ప్రశ్నించారు. ఏపీ ప్రత్యేక హోదా గురించి నన్ను అడగడం సబబు కాదని, నేను ఒక్క ఆంధ్రపదేశ్ రాష్ట్రానికే మంత్రిని కాదని, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు మంత్రినని అన్నారు. అసలు ఏపీకీ లోటు బడ్టెట్ అనే ఒకే ఒక్క అంశమే ప్రత్యేక హోదా అడగటానికి కారణంగా ఉందని.. అంతకుమించి ప్రత్యేక హోదా పొందే అంశాలేవీ లేవని స్పష్టం చేశారు. ఏపీకి ఉన్న లోటు బడ్జెట్‌ను పూరించేందుకు జాతీయ స్థాయిలో కృషి చేశానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు భూసేకణ చేపట్టడం చాలా అభినందనీయమని, ఏపీ ప్రత్యేక హోదాపై తనకు ఇంకా నమ్మకం ఉందని వెల్లడించారు.

కేసీఆర్ పై కోదండరాం ఫైర్

ఓయూ విశ్వవిద్యాలయంలో ఉన్న భూమిలో పేదలకు ఇళ్లు కట్టిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై జేఏసీ నాయకుడు కోదండరాం మండిపడ్డారు. నవ తెలంగాణ విద్యార్ధి జేఏసీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న కోదండరాం... పేదలకు ఇళ్ల కోసం ఓయూ భూములే ఇవ్వాల్సిన అవసరం లేదని కేసీఆర్ తీరుపై ధ్వజమెత్తారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడం మంచిదే కాని వాటి కోసం ఓయూ భూములు ఇవ్వడం సబబు కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే మంచిదని తెలిపారు. ఓయూ భూములు విద్యా సంబంధ, పరశోధనలకు మాత్రమే ఉపయోగించుకోవాలి అని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న మరో నేత ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ గద్దెనెక్కక ముందు ఏడాదికి లక్ష ఉద్యోగాలు ఇస్తానన్న కేసీఆర్ ఇప్పుడు ఆమాట మరిచిపోయాడని, రెండు లక్షల ఖాళీలు ఉన్నా వాటిని భర్తీ చేయడంలేదని అన్నారు.