ప్రమాదబీమా పథకం టీడీపీదే

పార్టీ కార్యకర్తలకు ప్రమాదబీమా పథకం ప్రవేశపెట్టిన ఘనత తమదేనని అన్నారు టీడీపీ యువనేత లోకేష్..ఈ కార్యక్రమాన్ని చూసే ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమం చేపట్టారని ఆయన చెప్పారు. ఆయన టిడిపి మహానాడులో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. టీడీపీ ఆఫీస్ లో కూర్చుని సూట్ కేసులు కలెక్ట్ చేస్తున్నాని నాపై కొందరు ఆరోపణలు చేస్తున్నారని... సూట్ కేసులు మోసే సంస్కృతి కాంగ్రెస్ దేనని లోకేష్ విమర్శించారు. 54 లక్షల మంది కార్యకర్తలే టిడిపి బలమన్నారు. 11 నెలల్లో 50వేల మంది కార్యకర్తలను కలుసుకున్నాని, కార్యకర్తల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని లోకేష్ స్పష్టం చేశాడు. ఇప్పటి వరకు 450 మంది కార్యకర్తల పిల్లలకు ఉపాధి కల్పించామన్నారు. కృష్ణా, వరంగల్ జిల్లాల్లో టీడీపీ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసి కార్యకర్తల పిల్లలను చదివిస్తామన్నారు.

వైకాపా కుట్రలను తిప్పికొట్టిన రైతులు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపైన నిప్పులు చెరిగారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టుకే అక్రమమని అభివర్ణిస్తూ ఆ పార్టీ నాయకులు ఎర్రచందనం స్మగ్లర్లతో లాలూచీ పడ్డారని ఆరోపించారు. ఎర్రచందనం అక్రమరవాణాకు పాల్పడుతున్నవారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఈ వేదికపై నుంచి నేను అడుగుతున్నాను - మీకు ఎర్ర చందనం స్మగ్లర్లతో సంబంధాలు లేకపోతే ఎందుకు ఖండించడంలేదు అని ఆయన ప్రశ్నించారు. మీరు లాలూచీపడ్డారు కాబట్టే ఎర్రచందనం స్మగ్లర్ల అరాచకాలను ఖండించడానికి ముందుకు రావడంలేదని ఆయన విమర్శించారు. ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజధాని విషయంలో కూడా స్థానిక ప్రజలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలని యత్నించిందని, కాని తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని విషయంలో చిత్తశుధ్ధితో ఉందని గ్రహించిన రైతాంగం 33 వేల ఎకరాలు భూ సమీకరణకు ప్రభుత్వానికి అందించి వైసీపీ కుట్రలను భగ్నం చేశారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రైతాంగానికి కృతజ్ఞతలు తెలుపుతూ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన ఈ రైతులను ఎవ్వరినీ జీవితమంతా గుర్తుపెట్టుకుంటానని ఆయన చెప్పారు.

కాంగ్రెస్‌ దుష్టపాలనలో రైతులు బలి

కాంగ్రెస్‌ పార్టీని హయాంలో వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుందని, దాదాపు 25 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దుష్టఆలోచనతో కాంగ్రెస్‌ రెండు రాష్ర్టాలలోనూ బోర్లా పడిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ తన విధానాలవల్ల భూస్థాపితం అయ్యిందని, ఇక కోలుకునే పరిస్థితి లేదని ఆయన పునరుద్ఘాటించారు. పదేళ్లపాటు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్‌ పార్టీ అవినీతికి ఆలవాలంగా కాలయాపన చేసి అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌తో, తెలంగాణాలో టీఆర్‌ఎస్‌తో మిలాఖత్‌ కావడం ద్వారా తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని విఫలయత్నం చేసిందని ఆయన ఆరోపించారు. కానీ ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి ఆ పార్టీకి జీవితకాలం గుణపాఠం చెప్పారని ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

2022 నాటికి టాప్‌ 3లో ఆంధ్రప్రదేశ్

విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక సంక్షోభం కలిగిందని బాబు తెలిపారు. 2022 నాటికి దేశంలోనే టాప్‌-3 స్థానంలో ఏపీ ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో విపరీతమైన సహజవనరులు ఉన్నాయన్నారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. పారాశ్రామికాభివృద్ధికి సముద్ర తీరాన్ని వినియోగించనున్నట్లు చెప్పారు. భూగర్భ జలాలు పెరగాలంటే నీరు-చెట్టు కార్యక్రమం అవసరమని అభిప్రాయపడ్డారు. బిందుసేద్యం, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యతనిస్తామన్నారు. ఏడాదిలోగా ప్రతి ఇంటికి ఫైబర్‌ కనెక్టివిటీని కల్పించనున్నట్లు తెలిపారు. టెక్నాలజీ ఎంత ఉపయోగించుకుంటే అంత లాభమని చంద్రబాబు పేర్కొన్నారు. అందరికీ అనువుగా ఉండాలనే అమరావతిలో రాజధాని పెట్టామని వివరించారు.

క్రమశిక్షణకు మారుపేరు టీడీపీ

తెదేపా 34వ మహానాడు ప్రారంభమైంది. ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు క్రమశిక్షణకు మారుపేరు టీడీపీ అని, తెలుగు జాతిని ఒకటి చేసే పార్టీ తెదేపా అని అన్నారు. వైసీపీ, టీఆర్ ఎస్ తో కాంగ్రెస్ కుమ్మక్కై టీడీపీని దెబ్బతీయాలని చూసింది కానీ, కాంగ్రేస్ కే డిపాజిట్లు కూడా దక్కలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైపోయిందని, కోలుకునే పరిస్థితి లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేసిందన్నారు. వైసీపీ పుట్టుకే అవినీతి పుట్టుకని, 30 ఏళ్లు చరిత్ర ఉన్న మన పార్టీకే ఛానల్ లేదుకాని నిన్న కాక మొన్న వచ్చిన పార్టీ అవినీతి సొమ్ముతో ఛానల్ పెట్టి మనల్ని విమర్శిస్తుందని ఎద్దేవ చేశారు.  

స్వచ్ఛ హైదరాబాద్ లో పాల్గొన్న రౌడీ షీటర్లు

స్వచ్ఛ హైదరాబాద్ లో రౌడీ షీటర్లు కూడా స్వచ్చందంగా పాల్గొని చెత్తను ఊడ్పిపారేశారు. హైదరాబాద్ లో సౌత్‌జోన్ డిసిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో సంతోష్ నగర్ పరిధిలో ఉన్న 18 పోలీస్ స్టేషన్లో పోలీసులు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్టేషన్లలోని 400 మంది రౌడీ షీటర్లతో పాటు పోలీసు సిబ్బంది కూడా పాల్గొని స్టేషన్ పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ స్వచ్ఛ హైదరాబాద్ లో పాల్గొనడానికి రౌడీ షీటర్లు ఆసక్తి చూపించారని, వారే స్వచ్చందంగా ముందుకు వచ్చారని తెలిపారు. వారిలో మార్పు వస్తుందని, ప్రజలతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించారు.

తెదేపా మహానాడు.. ఎన్టీఆర్ పెళ్లి శుభలేఖ స్పెషల్ ఎట్రాక్షన్

మూడు రోజుల పాటు జరిగే తెదేపా 34వ మహానాడు ఏర్పాట్లలో ఎన్నో ఆసక్తికర విషయాలు పొందుపరిచారు. మహానాడు వేదికపై ఒకవైపు తెలంగాణకు చెందిన కాకతీయ స్థూపాన్ని ఉంచగా మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చిహ్నాలు ఉంచారు. రక్త సిబిర ఏర్పాట్లు, ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఫోటో ఎగ్జిబిషన్ లో ఒక ఫోటో మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అది తెలుగుదేశ పార్టీ పునాది వేసిన నందమూరి తారకరామారావు పెళ్లి శుభలేఖ. 1942 మే 2న జరిగిన ఎన్టీఆర్ పెళ్లి పత్రికను ఫోటోఎగ్జిబిషన్ లో పెట్టడంతో మహానాడు వచ్చే నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆసక్తికరంగా తిలకిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికి 24 రకాల వంటకాలతో 35 వేల మందికి భోజనం ఏర్పాట్లు చేశారు.

నారా లోకేశ్ అర్హుడే.. దేవినేని

హైదరాబాద్ గండిపేటలో నిర్వహించిన తెదేపా 34న మహానాడు కార్యక్రమం ప్రారంభం అయింది. అనేక మంది తెదేపా నేతలు భారీ ఎత్తున ఈ మహానాడు కార్యక్రమానికి తరలివస్తున్నారు. అయితే ఈ మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేశ్ కు కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశాలు, ఓ ముఖ్యమైన పదవిని కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ విషయంపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నారా లోకేశ్ కు పదవి ఇవ్వడంలో తప్పులేదని, దానికి అతను అర్హుడేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా దానిని తాము కట్టుబడి ఉంటామని అన్నారు.

ఏపీ రాజధానిలో జపాన్ బృందం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటకంగా ఎలా అభివృద్ధి చేయవచ్చు, అక్కడ ఏ విధమైన డెవలప్ మెంట్ చేయవచ్చు తదితర అంశాలు పరిశీలించడానికి జపాన్ బృందం రాజధాని ప్రాంతంలో పర్యటించింది. నూతన రాజధాని మాస్టర్ ప్లాన్ ఆధారంగా ఈ బృందం విజయవాడ నుండి బయలుదేరి ప్రకాశం బ్యారేజి మీదుగా గుంటూరు జిల్లా సీతానగరం చేరుకుని అక్కడ నుంచి ఉండవల్లి కరకట్ట మీదుగా తూళ్లూరు మండలం వెంకటపాలెం చేరుకున్నారు. అక్కడ నుండి మందడం మీదిగా తాళాయాపాలెం చేరుకుని అక్కడ నుండి కృష్ణానదిని పరిశీలించారు. అయితే ఈ ప్రాంతంలో పర్యటక కేంద్రంగా మార్చడానికి అనువైన స్థలంగా తాళాయపాలెంలోని శ్రీశైవక్షేత్రంకు ఉత్తరంగా కనిపించే కృష్ణానదిపై ఆసక్తి కనపరిచి అక్కడి ప్రాంత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మహానాడుకి సర్వం సంసిద్దం

  నేటి నుండి మూడు రోజుల పాటు హైదరాబాద్, గండిపేటలో తెదేపా 34వ మహానాడు సమావేశాలు జరుగబోతున్నాయి. తెలుగుదేశం పార్టీని జాతీయపార్టీగా మార్చేందుకు ఈ మహానాడు సమావేశాలలో తీర్మానం చేసే అవకాశం ఉంది. అదే జరిగితే రెండు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షుల నియామకం కూడా చేయవలసి ఉంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఇరుగు పొరుగు రాష్ట్రాలకు తెదేపాను విస్తరించవలసి ఉంటుంది. ఈ మహానాడు సమావేశాలలో వీటన్నిటిపై చర్చలు జరిపి తీర్మానాలు చేసే అవకాశం ఉంది. కనుక ఈ 34వ మహానాడు సమావేశాలు తెదేపాకు చాలా కీలకమయినవని చెప్పవచ్చును. ఈ మూడు రోజుల సమావేశాలకి రెండు రాష్ట్రాల నుండి కనీసం 40 వేల మంది కార్యకర్తలు తరలిరావచ్చని భావిస్తున్న తెదేపా అందుకు తగ్గట్లుగానే భారీ ఏర్పాట్లు చేసింది. రెండు రాష్ట్రాల నుండి వచ్చే వాహనాల కోసం సుమారు 100 ఎకరాలలో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేసారు. ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల నుండి వచ్చే పార్టీ నేతలు, కార్యకర్తల కోసం మూడు ప్రాంతాలకు చెందిన 34 రకాల శాఖాహార వంటకలాను మాగంటి బాబు పర్యవేక్షణలో సిద్దం చేస్తున్నారు. వేసవి తాపానికి తట్టుకొనేందుకు ఎయిర్ కూలర్లు, చల్లటి మజ్జిగ, మంచినీళ్ళను ఏర్పాటు చేసారు.

కాసేపట్లో ప్రారంభంకానున్నతెదేపా మహానాడు

తెలుగుదేశం పార్టీ 34 వ మహానాడు కార్యక్రమం మరికాసేపట్లో ప్రారంభంకానుంది. గండిపేట వేదికగా జరగనునన్న ఈ మహానాడు కార్యక్రమంలో రెండు రాష్ట్రాల నుండి తెదేపా నేతలు భారీగా తరలివస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, పార్టీ యువనేత, కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయకర్త నారా లోకేశ్, హరికృష్ణ మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ మహానాడు కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లన్నీ నారా లోకేశ్ దగ్గరుండి చూసుకున్నారు. ఈ మహానాడుకు 20 వేల మంది ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు. మూడు రోజుల పాటు జరిగే మహానాడులో 31 తీర్మానాలు ఆమోదించనున్నట్లు తెలిసింది. ఇందులో ఉమ్మడి తీర్మానాలు 7, ఏపీకి సంబంధించి 14, తెలంగాణకు సంబంధించి 10 ఉన్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.

సాగర్ ప్రక్షాళనకు సుప్రీం బ్రేక్

  తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఒక మంచి పనికి కూడా అవరోధాలు తప్పడం లేదు. హైదరాబాద్ నగరానికే తలమానికంగా నిలిచిన హుస్సేన్ సాగర్ ఒక పెద్ద మురికికూపంగా మారిపోవడంతో దానిని పూర్తిగా ప్రక్షాళన చేసి మళ్ళీ స్వచ్చమయిన మంచినీటితో నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకొంది. అందుకోసం ముందుగా హుస్సేన్ సాగర్ తో అనుసంధానమయున్న కాలువలను శుభ్రం చేసి చెరువులో ఉన్న మురికినీరును బయటకు పంపిస్తున్నారు. కానీ జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆదేశాలకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ హుస్సేన్‌ సాగర్‌ను ఎండగడుతున్నాయంటూ హైదరాబాద్ కి చెందిన ‘సేవ్‌ అవర్‌ అర్బన్‌ లేక్స్‌ (సోల్‌)’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి లుబ్నా సర్వత్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో హుస్సేన్ సాగర్ ని పూర్తిగా ఎండగట్టవద్దని, కాలువల మరమ్మత్తులకు అవసరమైనంత మేరకు మాత్రమే నిర్మాణ పనులు చేయాలని, ఇందుకు అవసరమయితే సాగర్‌ నుంచి కొంత మేరకు నీటిని వదలొచ్చునని జీహెచ్‌ఎంసీకి ఆదేశాలు ఇచ్చింది. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కోసం ఎన్‌జీటీ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి ఆ ప్రక్రియపై ఒక నివేదికను ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.   సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలతో హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కార్యక్రమం ఆర్దాంతరంగా ముగిసిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇటువంటి పనులలో విశేష అనుభవమున్న ఆస్ట్రేలియా సంస్థకు చెందిన ప్రతినిధులు, ప్రజలకు, పర్యావరణానికి ఎటువంటి కలుగకుండా హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేస్తామని ముందుకు వచ్చేరు. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఆర్దాంతరంగా నిలిపి వేయకుండా అవసరమయితే విదేశీ సాంకేతిక సహాయం తీసుకొని అయినా పూర్తిచేయగలిగితే బాగుంటుంది.

సమావేశానికి నలుగురు కాంగ్రెస్ యం.యల్యే.లు డుమ్మా!

  తెలంగాణాలో 6 యం.యల్సీ. స్థానాలకు 7మంది అభ్యర్ధులు పోటీలో ఉండటంతో బేరసారాలు అనివార్యమని తేలిపోయింది. పోలింగ్ కి ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున ప్రతిపక్ష పార్టీలు తమ యం.యల్యేలు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ తన ఏకైక అభ్యర్ధిని గెలిపించుకొనేందుకు అవసరమయిన 18మంది యం.యల్యేలున్నారు. కానీ వారిలో నలుగురు యం.యల్యేలు- పువ్వాడ అజయ్‌, గీతారెడ్డి, కిష్టారెడ్డి, వంశీచంద్‌రెడ్డిలు ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశానికి డుమ్మా కొట్టారు. వారి నలుగురిలో పువ్వాడ అజయ్‌ ప్రస్తుతం అమెరికాలో ఉన్నందున రాలేదని తెలుస్తోంది. కానీ మిగిలిన ముగ్గురు యం.యల్యేలు కీలకమయిన ఈ సమావేశానికి ఎందుకు డుమ్మా కొట్టేరో అసలు కారణం తెలియదు గానీ వారు వ్యక్తిగత పనులున్నందున సమావేశానికి రాలేకపోయారని, కానీ పోలింగ్ రోజున తప్పకుండా హాజరయ్యి కాంగ్రెస్ యం.యల్సీ.అభ్యర్ధి ఆకుల లలితకు ఓటువేసి గెలిపిస్తారని కాంగ్రెస్ నేతలు చెప్పుకొన్నారు. వారిలో గీతారెడ్డి సమావేశానికి హాజరు కాకపోయినప్పటికీ ఆమెను అనుమానించాల్సిన పనిలేదు. కానీ మిగిలిన ఇద్దరు యం.యల్యేల సంగతే కొంచెం అనుమానంగా కనిపిస్తోంది. వారు నలుగురు వచ్చి తమ పార్టీ అభ్యర్ధికి ఓటు వేస్తే పరువాలేదు కానీ వారిలో ఏ ఒక్కరు తెరాస అభ్యర్ధికి ఓటు వేసినా కాంగ్రెస్ అభ్యర్ధి గెలిచే అవకాశం ఉండదు. క్రాస్ ఓటింగ్ జరుగకుండా నివారించేందుకు ఈ ఎన్నికలలో తొలి ప్రాధాన్యత ఓటును మాత్రమే వేయాలని ఈ సమావేశంలో కాంగ్రెస్ నిర్ణయించింది.

కిసాన్ ఛానల్ ప్రారంభించిన మోడీ

ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో దూరదర్శన్ కిసాన్ ఛానల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులతోనే ఆర్ధికాభివృద్ధి సాధ్యమని, వ్యవసాయంతో గ్రామాలు.. గ్రామాలతో దేశాభివృద్ధి జరుగుతుందని అన్నారు. వ్యవసాయం, గ్రామాలు, దేశాలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని, వ్యవసాయం తరువాతే వ్యాపారం ఉద్యోగం అని అన్నారు. దేశంలో రైతులదే అతి పెద్ద కుటుంబమని, కృతిమ ఎరువుల గురించి తెలియనప్పుడే సేంద్రియ ఎరువులు ద్వారా రైతులు బాగా పండించేవారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేంద్రమోడీ తోపాటు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్, కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ రాఠోడ్ తో పాటు పలు అధికారులు వ్యవసాయ రంగ నిపుణులు పాల్గొన్నారు.

లోకేశ్ కు మంచి పదవి ఇవ్వాలి.. ఎర్రబెల్లి

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ ఏపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ కు మంచి పదవి ఇవ్వాలని కోరారు. టీడీపీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీని జాతీయ పార్టీగా మహానాడులో ప్రకటిస్తామని తెలిపారు. అంతే కాక ఏపీ ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు ఐదు లక్షల రూపాయల పరిహారం ఇస్తోందని.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం రూ. లక్ష రూపాయలు మాత్రమే ఇస్తోందని విమర్శించారు. ఇక ఎండతీవ్రతకు వడదెబ్బ తగిలి చనిపోతున్న వారిపట్ల తెలంగాణ ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదని అన్నారు.

ఏపీ ప్రత్యేక హోదాపై అయోమయం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఒకో నేత ఒకోలా మాట్లాడుతున్నారు. ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వడం కష్టమని 14వ పైనాన్స్ కమిషన్ సిఫార్సుల మేర ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర మంతి అరుణ్ జైట్లీ చెప్పగా ఏపీకీ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలేవీ లేవని ఒక్క ఆర్ధిక లోటు కారణంగా ఏపీకీ ప్రత్యేక హోదా కోరుతున్నమని వెంకయ్యనాయుడు అన్నారు. ఇదిలా ఉండగా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మోదీ ఏడాది పాలనపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడానని, త్వరలోనే సానుకూలమైన నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు ఏపీకీ ప్రత్యేక హోదా రాదని ఓవైపు చెపుతూ ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పడం.. మరోవైపు అమిత్ షా ప్రత్యేక హోదా గురించి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పడం జీజేపీ నేతల పరస్పర విరుద్ధ ప్రకటనలతో అయోమయ పరిస్థితి నెలకొంది.

నా డబ్బుతో ఇన్సూరెన్స్ చేస్తా... స్మృతి ఇరానీ

కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఓ హామీ ఇచ్చారు. నరేంద్ర మోడీ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా అమేథీ నియోజక వర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె మాట్లాడుతూ తాను అమేథీ కుటుంబానికి కూతురునని, అమేథీ నియోజక వర్గంలో ఉన్న 25 వేల మంది మహిళలకు తన సొంత డబ్బుతో ఇన్సూరెన్స్ కడతానని హామీ ఇచ్చారు. 10 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అమేథీ ప్రజలకు ఏమీ చేయలేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. తాము పదిరోజుల్లోనే పలు రకాల పనులు చేసి చూపిస్తామని, యూపీఏ ప్రభుత్వం చేయలేని పనులను మోడీ ఏడాది పాలనలో చేసి చూపించామన్నారు. స్మృతి ఇరానీ అమేథీ నియోజక వర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఓడిపోయిన సంగతి తెలిసందే.