జైలు నుండి రేవంత్ రెడ్డి విడుదల
posted on Jun 11, 2015 7:01AM
తెదేపా యంయల్యే రేవంత్ రెడ్డికి ఎసిబి కోర్టు ఈరోజు ఉదయం 6గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేయడంతో జైలు అధికారులు ఆయనను కొద్దిసేపటి క్రితమే జైలు నుండి విడుదల చేసారు. ఆయన అభిమానులు, తెదేపా శ్రేణులు భారీగా తరలివచ్చి ఆయనకు స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి సోదరుడు ఆయనను తమ ఇంటికి తోడ్కొని పోయారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఎసిబి అధికారులు కూడా రెండు వాహనాలలో ఆయనతో బయలుదేరివెళ్ళారు. వారితో బాటే వందలాదిగా తరలివచ్చిన అభిమానులు, తెదేపా శ్రేణులు కూడా రేవంత్ రెడ్డి ఇంటికి బయలుదేరారు. రేవంత్ రెడ్డి కుటుంబానికి కష్టకాలంలో తామంతా అండగా నిలబడతామని తెలిపేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రాష్ట్ర మంత్రులు, తెలంగాణా తెదేపా ప్రజా ప్రతినిధులు, నేతలు కార్యకర్తలు అందరూ ఈరోజు జరుగబోయే రేవంత్ రెడ్డి కుమార్త్ నిశ్చితార్ధ వేడుకకి హాజరవబోతున్నారని తెలుస్తోంది.