రాజకీయ నేతల జంపింగ్ జపాంగ్స్
posted on Jul 8, 2015 @ 12:02PM
మాన్ సూన్ వచ్చేసింది.. చిన్నగా వర్షాలు కూడా పడుతుండటంతో కప్పలు కూడా ఇక్కడి నుండి అక్కడికి జంప్ చేయడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఈ మాన్ సూన్.. కప్పల గొడవేంటి అనుకుంటున్నారా.. అక్కడే ఉంది ఇప్పుడు ఆ కప్పలనూ చూస్తుంటే మన రాజకీయనాయకులే గుర్తొస్తున్నారు. ఈ పార్టీలో నుండి ఆపార్టీలోకి అంటూ కప్పల కంటే ఫాస్ట్ గా తెగ జంపింగ్ల మీద జంపింగ్ లు చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఈ జంపింగ్ లు మరీ ఎక్కువైపోయాయి. పార్టీ మీద గౌరవం.. అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీని వెన్నంటి ఉండే నమ్మకమైన నాయకులను బూతద్దంలో వెతికినా ఎక్కడో ఒకరిద్దరు ఉంటారేమో కానీ అలాంటి వాళ్లు ఇప్పుడు దొరకడం కష్టమే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుండి జంపిగ్ రాయుళ్లు ఎక్కువైపోయారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందో సమాధానం లేని ప్రశ్న.. అందుకే ఆపార్టీలోనే ఉంటూ గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవడం కంటే పార్టీ మారితే ఏదో ఒక పదవి కట్టబెడతారుకదా అన్న ఆలోచనతో నాయకులంతా పార్టీ ఫిరాయించే పనిలో పడ్డారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి బొత్స సత్యనారాయణ, కేకే, డిఎస్ పార్టీ మారిపోయారు. ఇప్పుడు వాళ్ల బాటలోనే కొంత మంది కాంగ్రెస్ నేతలు పార్టీ మారే ప్రయత్నాలు చేస్తున్నట్టు రాజకీయ వర్గాలు చెవులుకొరుక్కుంటున్నాయి. వారిలో గాదె వెంకటరెడ్డి, శైలజానాథ్, ఉండవల్లి అరుణకుమార్, దేవినేని నెహ్రూ, డొక్కా మాణిక్యవరప్రసాద్ ఉన్నట్టు సమాచారం.
గాదె వెకంటరెడ్డి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేత. ఈయన రాజకీయ ప్రవేశం చేయకముందు న్యాయవాదిగా, వ్యాపారం రంగంలో పనిచేసేవారు. ఒకటి కాదు రెండు కాదు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వ్యక్తి గాదె వెంకటరెడ్డి. అలాంటి ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వెంకటరెడ్డి కూడా పార్టీ మారే యోచన చేస్తుండటం ఓ రకంగా కాంగ్రెస్ కు జీర్ణించుకోలేని విషయమే.
ప్రభుత్వ వైద్యుడిగా ఉన్న డాక్టర్ శైలజనాథ్ 2004లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. శింగనమల నుంచి కాంగ్రెస్ టికెట్టును దక్కించుకుని విజయం సాధించారు. 2009లోనూ అతికష్టం మీద మూడు వేల మెజార్టీతో బయట పడ్డారు. రెండోసారి విజయం సాధించాక వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ విప్ పదవిని దక్కించుకున్నారు. తరువాత వైఎస్ఆర్ చనిపోయిన తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి ఆయనకు ప్రాథమిక విద్యాశాఖను కట్టబెట్టారు. మంత్రి పదవితో ఆయన జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్రనే పోషించారు. తరువాత కేంద్రం రాష్ట్ర విభజన చేసిన తరువాత కూడా కాంగ్రెస్ ఉనికి పోయిన ఇన్ని రోజులు ఆపార్టీలోనే ఉన్నారు. పాపం ఇంకా ఎన్ని రోజులు ఖాళీగా ఉంటామనుకున్నారేమో పార్టీ మారే యోచనలో ఉన్నారట.
మరో కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా వైకాపాలోకి జంప్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తూర్పు గోదావరి మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్ మంచి మాటకారి. ఉండవల్లి 2004, 2009 లో రాజమండ్రి నియోజక వర్గం నుండి లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అంతేకాదు ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆపార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ట్రాన్స్ లేటర్ గా కూడా పనిచేశారు. అలాంటి మంచి వక్త, వాదనా పటిమ కలిగిన అరుణ్ కుమార్ ను తమ పార్టీలోకి రావడానికి వైకాపా కూడా ఆకట్టుకుంటుందన్నది సమాచారం.
అంతేకాక దేవినేని నెహ్రూ కూడా కాంగ్రెస్ పార్టీను వీడి వైకాపాలోకి చేరనున్నట్టు తెలుస్తోంది. దేవినేని నెహ్రూ కంకిపాడు నియోజక వర్గం నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయిన బలమైన రాజకీయ నాయకుడు. ఇప్పుడు వైకాపాలోకి నెహ్రూ చేరడం వల్ల కృష్ణా జిల్లాలో పార్టీ నిర్వహణ సులభం అవుతుందని భావిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు నెహ్రూ రాకను గుడివాడ వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని మరో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వ్యతిరేకిస్తున్నారు. వీటిని పరిష్కరించుకుంటారా?లేదా? వీరు వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరడానికి ముందుకు వస్తారా?లేదా అన్నది తేలడానికి మరికొంత సమయం పట్టవచ్చు.
డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా వైకాపాలోకి చేరే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈయన 2004లో తాడికొండ నియాజక వర్గం తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత పార్టీ తరపున ఎన్నో పాత్రలు పోషించారు. అయితే ఇప్పుడ కాంగ్రెస్ పార్టీకి సరైన ఉనికి లేకపోడంతో కాంగ్రెస్ పార్టీ నుండి వైకాపాలోకి మారనున్నట్టు తెలుస్తోంది.
మొత్తానికి కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యమైన నేతలందరూ కట్టకట్టుకొని ఒకేసారి వేరే పార్టీలోకి చేరిపోతున్నారు. అసలే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు కోలుకోలేని దెబ్బగొట్టారు. ఇప్పుడు పార్టీలోని నేతలందరూ వేరే పార్టీలోకి చేరడం వల్ల ఇంకా పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. దీంతో అసలు భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.