5 గంటల తరువాత రేవంత్ విడుదుల

ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి బెయిల్‌ ఆర్డర్‌ కు లైన్ క్లియర్ అయింది. హైకోర్టు రేవంత్ కు నిన్ననే బెయిల్ మంజూరు చేసిన తీర్పు ప్రతిలో సాంకేతిక లోపం కారణంగా రేవంత్ ఇంకా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. అయితే కోర్టు ఇప్పుడు ఆ సందిగ్ధతను తొలగించింది. నిన్న తీర్పు ప్రతిలో బెయిల్‌ పేపర్స్‌ను ఏసీబీ పోలీస్‌ స్టేషన్‌లో సమర్పించాలని రాసి ఉంది. అయితే దానిపై రేవంత్‌ తరఫు న్యాయవాదులు బెయిల్‌ పేపర్స్‌ను ఏసీబీ కోర్టులో సమర్పించే విధంగా ఆర్డర్స్‌ సవరించాలని బుధవారం పిటిషన్‌ వేశారు. దీంతో న్యాయమూర్తి బెయిల్‌ ఆర్డర్‌లో మార్పులు చేశారు. న్యాయమూర్తి సవరించిన బెయిల్ ఆర్డర్ కాపీని రేవంత్‌ తరఫు న్యాయవాదులు తీసుకొని దానిని ఏసీబీ కోర్టులో సమర్పించారు. అనంతరం ఏసీబీ కోర్టు నుంచి రిలీవ్‌ ఆర్డర్స్‌ తీసుకుని చర్లపల్లి జైలుకు వెళ్లనున్నారు. మొత్తానికి ఐదు గంటల తర్వాతే రేవంత్‌ రెడ్డి జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా.. సండ్ర

నోటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు తెదేపా నేతలు వేం నరేందర్ రెడ్డికి, సండ్ర వెంకట వీరయ్యలకు కూడా విచారణలో పాల్గొనాలని నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసింది. అయితే అప్పుడు వేం నరేంద్ర రెడ్డి మాత్రమే ఏసీబీ విచారణలో పాల్గొన్నారు. సండ్ర తనకు గుండె సంబంధిత సమస్య ఉందని పదిరోజుల తరువాత విచారణలో పాల్గొంటానని ఏసీబీకి లేఖ రాశారు. కానీ ఆ పదిరోజుల గడువు ఎప్పుడో ముగిసింది. ఈ నేపథ్యంలో సండ్ర ఎక్కడ ఉన్నాడని పలు ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు సండ్ర ఏసీబీకి మరో లేఖ రాశారు. తాను ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యానని.. ఎప్పుడు విచారణకు రమ్మంటే అప్పుడు రావడానికి సిద్దంగా ఉన్నానని లేఖలో పేర్కొన్నారు.

కేసీఆర్ కు ఏం జ్వరం వచ్చిందో.. జూపుడి

టీడీపీ నేత జూపూడి ప్రభాకరరావు తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కావాలనే జ్వరం అని చెప్పి కేసీఆర్ రాష్ట్రపతితో సమావేశాన్ని తిరస్కరించారని.. ఇద్దరు సీఎంలతో రాష్ట్రపతి సమావేశమైతే కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయని భావించామని.. కానీ తెలంగాణ ప్రభుత్వం దానికి సహకరించలేదని ఎద్దేవ చేశారు. కేసీఆర్‌కు ఏ జ్వరం రాలేదని విమర్శించారు. చంద్రబాబు కేసీఆర్ లా కాదని.. చంద్రబాబుకు దూర దృష్టి ఎక్కువని చిన్న చిన్న సమస్యలు ఉంటే మాట్లాడుకుంటే పరిష్కారమవుతాయని చెప్పారని జూపుడి అన్నారు. కానీ తెలంగాణ వైఖరి చూస్తే రెడ్డగొట్టే విధానాలే కనిపిస్తున్నాయని అన్నారు. మనం సమాఖ్య వ్యవస్థలో ఉన్నామని, సీఎం కేసీఆర్‌ తన భాషను మార్చుకోవాలని జూపూడి కోరారు.

కాంగ్రెస్ నాయకుల పార్టీల జంప్

రాష్ట్రం విడిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఆనవాలు కూడా సరిగా కనపడకుండా పోయింది. అటు తెలంగాణలోనూ ఏదో ఉంది అంటే ఉంది అనే పరిస్థితి వచ్చింది. ఇక ఆంధ్రాలో అయితే చెప్పనవసరంలేదు.. మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే అది దేవుడికే తెలియాలి. అందుకే పార్టీ లో ఉన్న నాయకులు కూడా చిన్నచిన్నగా వేరే పార్టీల గూటికి చేరుకుంటున్నారు. ఈ పార్టీలో ఉండి ఒట్టిగా ఖాళీగా ఉండటం కంటే వేరే పార్టీలోకి చేరితే కనీసం ఏదో ఒక పదవి ఇవ్వకపోతారా అని ఆ రూట్ లో వెళుతున్నట్టున్నారు. మొన్నటికి మొన్న పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. అసలు ఎప్పుడో వెళ్లాల్సింది కానీ కొన్ని బేరసారాలు కుదరక లేట్ అయింది. కానీ మొత్తానికి పార్టీ వీడారు.   ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాను కూడా పార్టీని వీడి టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకుంటున్నట్టు రాజకీయవర్గాలు అనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్లి కేసీఆర్ ను కలిసి సమావేశమయినట్టు తెలుస్తోంది. అసలు ఎప్పటినుంచో తనకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని కాంగ్రెస్ పై డీ.ఎస్ అసంతృప్తితో ఉన్నారు. దానికి తోడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డీఎస్ కు నిరాశే ఎదురైంది. ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నించినా ఆ అవకాశం వేరే వాళ్లకు ఇవ్వడంతో మనస్తాపానికి గురై పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే డిఎస్ ను పార్టీలోనే ఉంచేందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బాగానే కష్టపడ్డారు కానీ అసలే కాంగ్రెస్ పార్టీ మీద ఫుల్లు ఫైర్ మీద ఉన్న డిఎస్ మాత్రం పార్టీ మారాలనే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 6 న గులాబీ గూటికి చేరనున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ కు చెందిన మరో నేత కూడా డిఎస్ బాటలోనే టీఆర్ఎస్ లో చేరనున్నారట. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో తమకు భవిష్యత్ ఉండదని ముందే తెలుసుకుంటున్నారేమో నేతలు పాపం ఒక్కోక్కరుగా పార్టీ నుండి బయటకు వచ్చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్ ఎంటో కాలమే నిర్ణయించాలి..

కేసీఆర్ ని అందుకోసం కలవలేదు: డి.శ్రీనివాస్

  సమైక్యాంధ్ర ప్రదేశ్ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఈరోజు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆయన చాంబర్ లో కలిసిరావడంతో ఆయన పార్టీ మారుతారన్న వార్తలకు బలం చేకూరింది. కానీ తను అందుకోసం కేసీఆర్ ని కలవలేదని ఆయనకు జ్వరంగా ఉందని తెలిసి పరామర్శించడానికే వెళ్లానని సంజాయిషీ ఇచ్చుకొన్నారు. కానీ తమ ప్రత్యర్ధ పార్టీ అధ్యక్షుడికి జ్వరం వస్తే ఇతర పార్టీల నేతలెవరూ వెళ్లి పరామర్శించరని అందరికీ తెలుసు. కనుక ఇక ఆయన తెరాసలో చేరడం దాదాపు ఖరారు చేసినట్లే భావించవచ్చును. ఆయన ఈనెల 6వ తేదీన తెరాస అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరుతారని తాజా సమాచారం.

తమిళనాడుకు.. ఏపీకి ఉమ్మడి రాజధాని ఉందా? ప్రత్తిపాటి

తమిళనాడు పోలీసుల్ని ఏపీలో అనుమతిస్తారా? అని ఒక రిటైర్డ్ జడ్జి చేసిన వ్యాఖ్యలపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి పత్రిపాటి పుల్లారావు మండిపడ్డారు. రెండు రాష్ట్రాల రాజధాని అయిన హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు అవసరమా? లేదా? అనే విషయం ఆయనకు తెలియదా? న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తికి ఈమాత్రం తెలియదా? అని ప్రశ్నించారు. తమిళనాడు పోలీసుల్ని ఏపీలో అనుమతిస్తారా అని అడుగుతున్నారు.. తమిళనాడు, ఏపీ కి ఉమ్మడి రాజధాని లేదని.. ఒకవేళ ఉంటే అనుమతిస్తామని అన్నారు. ఏపీకీ, తెలంగాణకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి తెలంగాణ తో పాటు ఏపీకి కూడా సమాన హక్కులు ఉంటాయని.. అందుకే హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని కోరుతున్నామని అన్నారు. ఈ విషయంపై గవర్నర్ వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.

బెయిల్ దొరికినా విడుదలకు జాప్యం

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి హైకోర్టు నిన్నబైయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్ కి బెయిల్ దొరికినా జైలు నుండి విడుదలవడానికి మాత్రం జాప్యం జరుగుతుంది. నిజానికి నిన్న రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చిన తరువాత వెంటనే జైలు నుండి విడుదలవుతారని అటు కుటుంబసభ్యులు, ఇటు అభిమానులు, తెదేపా పార్టీ శ్రేణులు ఎదురుచూశారు కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులలో లోపం ఉండటం వల్ల నిన్న కూడా రేవంత్ రెడ్డి జైలులోనే ఉండాల్సివచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిలో రేవంత్ రెడ్డి వ్యక్తిగత పూచీకత్తుని ఎసిబి కోర్టుకి ఇవ్వాలని వ్రాయవలసి ఉండగా, ఎసిబికి ఇవ్వాలని ఉండటంతో కోర్టు దానిని తిరస్కరించింది. ఈ కారణంగా రేవంత్ రెడ్డి నిన్న కూడా జైలులోనే ఉండాల్సి వచ్చింది. మరోవైపు ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి విడుదలకు జాప్యం అవుతుందనే అనుమానాలు తలెత్తున్నాయి. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో పూచికత్తు సమర్పించడం లో సమస్య వస్తుందా?వారు అంగీకరించకపోతే, ఒకవేళ అంగీకరించినా, ఆలస్యం చేస్తే రేవంత్ విడుదల జాప్యం అవుతుందన్న అనుమానం ఉంది. దీంతో రేవంత్ ఈ రోజు సాయంత్రానికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి తనకు బెయిల్ వచ్చిన తరువాత జైలులో ఉన్నప్పుడు తాను ఉపయోగించిన వస్తువులన్నింటిని తోటి ఖైదీలకు ఇచ్చేశారంట. కానీ మంగళవారం రాత్రి కూడా అక్కడే ఉండాల్సి రావడంతో వాటిని తీసుకున్నవారు మళ్లీ తెచ్చిచ్చినట్లు సమాచారం.

తెదేపా యం.పిపై ముఖ్యమంత్రి ఆగ్రహం

  భారత సైనికులపై అమలాపురం తెదేపా యం.పి. రవీంద్ర బాబు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మాజీ సైనికోద్యోగులు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుతూ ఆందోళన చేప్పట్టారు. వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పిర్యాదు చేయడంతో ఆయన కూడా యం.పి.పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా సంజాయిషీ నోటీసు కూడా జారీ చేయించినట్లు సమాచారం. భారత ఆర్మీలో చేరితే మద్యం, మాంసం, ఉచిత ప్రయాణాలు వంటి సౌకర్యాలు లభిస్తాయనే ఉద్దేశ్యంతోనే యువకులు ఆర్మీలో చేరుతున్నారని రవీంద్ర బాబు వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు నాయుడు మాజీ సైనికులతో మాట్లాడుతూ భారతదేశాన్ని కాపాడేందుకు ప్రాణాలొడ్డి కాపలా కాస్తున్న సైనికులంటే తమ పార్టీకి చాలా గౌరవమని అన్నారు.

కేసీఆర్ కి అప్పుడే జ్వరం వచ్చేసిందా? లోకేష్ ప్రశ్న

  తెదేపా యువనేత నారా లోకేష్ మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై చాలా ఘాటయిన వ్యాఖ్యలు చేసారు. “ఏదయినా తెగే వరకు లాగకూడదు. కానీ ఒకవేళ మాకు నోటీసులు ఇవ్వాలని తెలంగాణా ప్రభుత్వం అంతగా ఉబాలాటపడుతుంటే మేమూ కాదనము. మాకు నోటీసులు ఇస్తే మా నెత్తిన పాలు పోసినట్లే భావిస్తాము. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మెడకి ఉచ్చు బిగుసుకొంటుంటే దానితో సంబంధం ఉన్న ఉన్నతాధికారులను తెలంగాణా ప్రభుత్వం ఒకరొకరిగా మార్చేస్తోంది లేదా దీర్ఘ కాలిక శలవు మీద పంపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ తో తమకు సంబంధం లేదనుకొంటే తెలంగాణా హోంశాఖ కార్యదర్శిని ఇంత అకస్మాత్తుగా మార్చడం ఎందుకు? రేవంత్ రెడ్డి కేసును చూస్తున్న ఇంటెలిజన్స్‌ చీఫ్‌ అకస్మాత్తుగా దీర్ఘాకాలిక సెలవుపై ఎందుకు వెళ్లారు?” అని లోకేష్ ప్రశ్నించారు.   “చంద్రబాబు నాయుడుకి ఎదురు పడలేకనే కేసీఆర్ జ్వరం సాకుతో గవర్నర్ ఇచ్చిన విందుకు మొకం చాటేశారు. ఇన్ని రోజులు బాగానే ఉన్న కేసీఆర్ కి అకస్మాత్తుగా జ్వరం వచ్చేసింది,” అని లోకేష్ ఎద్దేవా చేసారు.   “తెలంగాణా రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమల స్థాపించేందుకు నూతన పారిశ్రామిక విధానం ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకొంటున్న తెలంగాణా ప్రభుత్వం ఎప్పటి నుండో తెలంగాణాలో ఉండి వేల కోట్ల టర్నోవర్ చేస్తున్న హెరిటేజ్ సంస్థని తెలంగాణా నుండి వెళ్ళగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే కేసీఆర్‌ వైఖరిని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు,” అని లోకేష్ విమర్శించారు.

గవర్నర్ విందుకి కేసీఆర్ డుమ్మా?

  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్ధం గవర్నర్ నరసింహన్ మంగళవారం సాయంత్రం రాజ్ భవన్ లో విందు ఏర్పాటు చేసారు. దానికి ఆంద్ర, తెలంగాణా ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, ఇరు రాష్ట్రాల శాసనసభాపతులను, ఉన్నతాధికారులను ఆహ్వానించారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు ఈ విదుకు హాజరయ్యారు. కానీ తెలంగాణా ముఖ్యమంత్రి జ్వరంతో బాధపడుతున్నందున ఈ విందుకు హాజరు కాలేకపోయారు. ఈ విందులో రాష్ట్రపతి మరియు గవర్నర్ సమక్షంలో ముఖ్యమంత్రులిరువురూ ఎదురుపడినప్పుడు ఏవిధంగా వ్యవహరిస్తారో చూద్దామని ఆశపడిన వాళ్ళందరూ చాలా నిరాశ చెందారు.

అరుకు యంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ కేసు

  విశాఖ జిల్లా అరుకు యంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ ఈరోజు చార్జ్ షీట్ దాఖలు చేసింది. తప్పుడు ధ్రువ పత్రాలతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి రూ. 42 కోట్ల రూపాయాలు అక్రమంగా తీసుకొన్నారని బ్యాంక్ అధికారులు చేసిన పిర్యాదు మేరకు సీబీఐ దర్యాప్తు చేసి ఆమెపై ఐపీసీ 120, 420, 458,421, 13(2), రెడ్ విత్ 1(సి) సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఆమెతో బాటు ఆమెకు సహకరించిన బ్యాంక్ అధికారులపైన, విశ్వేశావరా ఇన్ఫ్రా అనే సంస్థ మీద కూడా సీబీఐ కేసులు నమోదు చేసిందీ రోజు. ఆమెను ఈ కేసు విషయంలో ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.   ఆమె వైకాపా టికెట్ మీద అరుకు నుండి లోక్ సభకు పోటీ చేసి గెలిచారు. కానీ ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాల కారణంగా ఆమె పార్టీకి దూరమయ్యారు. ఆమె తెదేపాలో చేరాలనుకొన్నారు. కానీ దాని వలన ప్రతిపక్ష పార్టీల నుండి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందనే ఆలోచనతో ఆమెను ఇంతవరకు పార్టీలో చేర్చుకోలేదు. కానీ ఆమె తెదేపాతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు.

రేవంత్ రెడ్డి బెయిలుకి సాంకేతిక అవరోధం

  ఈరోజు (మంగళవారం) హైకోర్టు రేవంత్ రెడ్డి తదితరులకు బెయిలు మంజూరు చేసినప్పటికీ కోర్టు తీర్పుని టైపింగ్ చేయడంలో దొర్లిన చిన్న పొరపాటు వలన ఈరోజు జైలు నుండి విడుదల కాలేకపోయారు. తీర్పు ప్రతిలో రేవంత్ రెడ్డి వ్యక్తిగత పూచీకత్తుని ఎసిబి కోర్టుకి ఇవ్వాలని వ్రాయవలసి ఉండగా, ఎసిబికి ఇవ్వాలని టైప్ చేయడంతో ఎసిబి కోర్టు దానిని తిరస్కరించింది. కనుక రేవంత్ రెడ్డి లాయర్లు రేపు హైకోర్టులో మరొక మేమో సమర్పించి సవరణ కోరుతారు. సవరించిన తీర్పు ప్రతిని ఎసిబి కోర్టుకి సమర్పించిన తరువాత, రేవంత్ రెడ్డి తదితరులను జైలు నుండి విడుదల చేయమని ఎసిబి కోర్టు ఉత్తర్వులు ఇస్తుంది. అది జైలు అధికారులకు చేరిన తరువాత వారిని జైలు నుండి విడుదల చేస్తారు. బహుశః రేపు మధ్యహ్నంలోగా ఈ ప్రక్రియలన్నీ పూర్తయితే మధ్యాహ్నం 1-2 గంటలలోగా రేవంత్ రెడ్డి, సెబాస్టియన్ మరియు ఉదయ్ సింహాలను జైలు నుండి విడుదల కావచ్చును. ఈరోజు ఆయన జైలు నుండి విడుదల అవుతున్నారని ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు కొందరు సన్నిహిత బంధువులు చర్లపల్లి జైలు వద్దకి భారీ సంఖ్యలో తరలి వచ్చారు. కానీ ఆయన రేపు విడుదలవుతారని తెలిసి తీవ్ర నిరాశతో వెనుతిరిగారు.

పార్టీ మారేది లేదు.. సుజయ్ కృష్ణ

వైఎస్ఆర్ సీపీ పార్టీలోకి బొత్సా సత్యనారాయణ చేరిన తరువాత ఆ పార్టీలో ఉన్న నేతలు కొందరు అసంతృప్తిగా ఉన్నారన్నది మాత్రం వాస్తవం. ముందుగా బొత్సచేరికతో ఆపార్టీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు వైసీపీని వీడి బయటకు వస్తారనే వార్తలు బాగానే వచ్చాయి. అయితే ఇప్పుడు సుజయ్ కృష్ణ మాత్రం తాను పార్టీని మారేదిలేదని.. పార్టీకి నష్టం కలిగించే పనులు చేయనని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని.. టీడీపీ తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని తెలిపారు. వైకాపాలోకి పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ చేరే సమయంలో తాను లేనని అందుకే ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోయానని అన్నారు. అంతేకాని వ్యక్తిగత కారణాలు ఏం లేవని స్పష్టం చేశారు.

కేసీఆర్ మొదటి దోషి.. స్టీఫెన్ సన్ రెండో దోషి.. గాలి

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కేసీఆర్ పై మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అసలు మొదటి దోషి కేసీఆర్ అని రెండో దోషి తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వీళ్లిద్దరిపై టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 8 గురించి మాట్లాడుతూ హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలులోనే ఉందని ఇప్పటికే కోర్టు తీర్పు నిచ్చింది.. ఉమ్మడి రాజధానిలో ఇంకా తెలంగాణ ప్రభుత్వం పెత్తనం చూపడానికి కుదరదని.. ఏదైనా చర్యలు తీసుకోవాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలని.. గవర్నర్ కు అన్ని అధికారాలుంటాయని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వానికి ఝలక్కుల మీద ఝలక్కులు

నోటుకు ఓటు కేసులో ఇప్పుడు ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకుంటున్నాయి. తెదేపాని దెబ్బతీయాలని తెలంగాణ నేతలు చాలా పథకం ప్రకారం వ్యూహాన్ని రచించి రేవంత్ రెడ్డిని ఈ కేసులో ఇరికించారు. అయితే గత వారం రోజుల నుండి ఈ కేసులో అంత ఆసక్తికర పరిణామాలేవి చోటుచేసుకోలేకపోవడంతో ఈ కేసులో రెండు ప్రభుత్వాలు కొంచెం వెనక్కి తగ్గి పరిస్థితి సద్దుమణిగిందేమో అనిపించింది. కానీ నేడు రేవంత్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మళ్లీ కేసులో కీలకమైన మలుపులు తిరుగుతాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా శాయశక్తుల ప్రయత్నించిన తెలంగాణ ఏసీబీ అధికారులు బెయిల్ రాకపోవడాన్ని జీర్ణించుకోలేరేమో. అందుకే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు.   ఇదిలా ఉండగా ఏపీ నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న హోం శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బుర్రా వెంకటేశంను ప్రభుత్వం తప్పించిందనే ప్రచారం సాగుతోంది. ఆస్థానంలో ఐపీఎస్ అధికారి రాజీవ్‌ త్రివేది నియమితులయినట్టు తెలుస్తోంది. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ ఏపీ నేతలు ఆరోపించిగా దర్యాప్తు ముమ్మరం చేసిన నేపథ్యంలో బుర్రా వెంకటేశ్ అకస్మాత్తుగా నెల రోజులు సెలవులు పెట్టినట్టు తెలిసింది. కేసు కీలక దశలో ఉన్న సందర్భంలో బుర్రా వెంకటేశ్ సెలవులపై వెళ్లిన నేపథ్యంలో అతనిని తప్పించి తెలంగాణ ప్రభుత్వం ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేదిని హోం శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం ఏపీ ప్రభుత్వ వాదనకు మరింత ఊతమిచ్చినట్లయింది.   మరోవైపు రెండు రాష్ట్రాలు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని కొట్టుకు చస్తుంటే హైకోర్టు అందరికి దిమ్మతిరిగి పోయే తీర్పు నిచ్చింది. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలులోనే ఉందని హైదరాబాద్ లో బాధ్యతలు చేపట్టాల్సిన బాధ్యత గవర్నర్ పై నే ఉందని కేంద్రాన్ని అడగాల్సిన అవసరం లేదని ట్విస్ట్ ఇచ్చింది. దీంతో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అందరికి ఫుల్లు క్లారిటీ వచ్చినట్టుంది. ఇక గవర్నర్ సక్రమంగా బాధ్యతలు చేపడితే శాంతి భద్రతల విషయంలో సీమాంధ్రులకు ఎటువంటి సమస్య లేనట్టే. మొత్తానికి ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఝలక్కులు మీద ఝలక్కులు తగులుతున్నట్టున్నాయి. అటు రేవంత్ రెడ్డి బెయిల్ విషయంలో.. హోం శాఖ ప్రధాన కార్యదర్శి మార్పు.. సెక్షన్ 8 పై మూడు విషయాలలో చుక్కెదురైంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఈ కేసు విషయంలో ఒక్కసారి ఆలోచిస్తే మంచిదనిపిస్తోంది.

ఇక్కడ మొట్టికాయ పడింది.. అక్కడ కూడా పడాలా?

ఇప్పటికే రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఏసీబీ అధికారులకు మొట్టికాయ వేసింది. ఇక్కడ తిన్న మొట్టికాయలు చాలవేమో మళ్లీ సుప్రీంకోర్టులో కూడా తింటే కాని వాళ్లకి నిద్రపట్టేట్టు లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయనుంది తెలంగాణ ఏసీబీ. రేవంత్ రెడ్డికి, ఉదయ్ సింహ, సెబాస్టియన్ లకు కోర్టు బెయిల్ ఇచ్చిందని.. కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలంగాణ న్యాయవాదులు కూడా ఆరాటపడుతున్నారు. హైకోర్టు తీర్పు ప్రతి అందిన తర్వాత సమీక్ష జరిపి ఒకటి రెండు రోజుల్లో సుప్రీంకోర్టుకు వెళ్తామని అంటున్నారు.

నిర్ణయాలన్నీ మన్మోహన్ సింగ్ వే.. దాసరి

జార్ఖండ్‌లోని అమరుకొండ ముర్గా దుంగల్‌ బొగ్గు క్షేత్రాల కేటాయింపు కేసులో కేంద్ర మాజీ మంత్రి, సినీ దర్శకుడు దాసరి నారాయణరావుతోపాటు మొత్తం 14 మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాసరి మంగళవారం ఢిల్లీలోని ఢిల్లీలోని సిబిఐ కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ బొగ్గు కుంభకోణంలో తన ప్రమేయం ఏం లేదని.. యుపిఎ ప్రభుత్వ హయాంలో తాను కేవలం సహాయ మంత్రిగా మాత్రమే ఉన్నానని చెప్పారు. అప్పుటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ బొగ్గు మంత్రిత్వ శాఖ ఇంచార్జీగా ఉండేవారని.. నిర్ణయాలన్నీ తనే తీసుకునేవారని చెప్పారు.

రేవంత్ కు బెయిల్.. న్యాయమే గెలిచింది

ఓటుకు నోటు కేసులో తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా చేయడానికి ఏసీబీ అధికారులు ఎన్ని కుట్రలు చేసినా అవేమి పారలేదు. ఎప్పుడో బెయిల్ రావల్సిన రేవంత్ రెడ్డికి ఏసీబీ అధికారులు బెయిల్ రాకుండా చేసిన ప్రయత్నాలు ఇప్పుడు పటాపంచలైపోయాయి. కస్డడీలో విచారణ జరిగిన తరువాత బెయిల్ మంజూరు చేయవచ్చు కానీ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు ఏసీబీ అధికారులు. పైగా కేసు లో ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి.. సాక్ష్యులను బెదిరిస్తారు.. సాక్ష్యాలు తారుమారు చేస్తారు.. అని ఏవేవో కాహానీలు చెప్పింది.. కనీసం తన కూతురు ఏంగేజ్ మెంట్ కి కూడా ఏవో షరతులతో కూడిన బెయిల్ ఇచ్చి సంతోషంగా లేకుండా చేశారు. కానీ న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందనేది నిజం. అది నిజం చేసి చూపించింది కోర్టు. ఏసీబీ చెప్పిన వాదనలన్నింటిని తోసి పుచ్చి రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింద   రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో తెలంగాణ నేతలలో ఇప్పటికే అలజడి మొదలై ఉండవచ్చు. ఎందుకంటే టీడీపీ నేతలలో చాలా పవర్ ఫుల్ నాయకుడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ని నేరుగా ఢీకొనడం కుదరగా ఓ పథకం ప్రకారం ఈ కేసులో ఇరికించారు తెలంగాణ అధికార నేతలు. ఇప్పుడు జూలు విదిల్చిన సింహాల రేవంత్ రెడ్డి బయటకు వస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దాటికి తెలంగాణ నేతలు తట్టుకుంటారో లేదో చూడాలి. ఇప్పటి వరకు ఈకేసులో జరిగిన పరిణామాలు వేరు.. ఇప్పుడు రేవంత్ రెడ్డి బయటకు వచ్చిన తరువాత జరగబోయే పరిణామాలు వేరని తెలుస్తోంది. అసలే ఫుల్ ఫైర్ మీద ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ అధికార నేతలకు ఎలా సమాధానం చెప్తారో చూడాలి.