నామా మధుకాన్ కంపెనీ పై చీటింగ్ కేసు..

మాజీ ఎంపీ, టీడీపీ నేత నామా నాగేశ్వరారవుకు చెందిన మధుకాన్ కంపెనీపై చీటింగ్ కేసు నమోదైనట్టు తెలుస్తోంది. జూబ్లిహిల్స్ పోలీసులు ఈ కంపెనీ పై చీటింగ్ కేసు నమోదు చేశారు. అసలు సంగతేంటంటే.. ఈపీఎఫ్ ఎఎన్ ఫోర్స్మెంట్ ఆఫీసర్ జేవీఎస్ఎస్ కుమార్ అనే ఉద్యోగి.. మధుకాన్ కంపెనీ తమ నుండి సేకరించిన ప్రావిడెంట్ ఫండ్ డబ్బును తమ అకౌంట్‌లో జమ చేయడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూబ్లిహిల్స్ లోని రోడ్డు నెం 36 లో ఉన్న మధుకాన్ కంపెనీపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. 2009 నుంచి ఉద్యోగుల నుంచి సేకరించిన ప్రావిడెంట్ ఫండ్ డబ్బును మధుకాన్ ప్రాజెక్ట్స్ ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేయడం లేదని.. సుమారు రూ. 8.5 లక్షల వరకు అవకవతకలు జరిగాయనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని జేవీఎస్ఎస్ కుమార్ తెలిపారు.

గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు మాదే.. ఉత్తమ్

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 స్థానాలకు గాను.. కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెలిసింది. నల్గొంగ, మహబూబ్ నగర్ రెండో స్థానం సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ సందర్బంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల ఓటమికి గల కారణాలను సమీక్షించుకుంటామని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకాభిప్రాయం మేరకే టికెట్ల పంపిణీ జరుగుతుందని..జీహెచ్ఎంసీ ఎన్నికలకు కార్యకర్తలు సిద్దం కావాలని పిలువునిచ్చారు.  డివిజన్‌, బూత్‌ స్థాయి నాయకులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు మా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నాంది అని.. త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లో కూడా గెలుపు మాదేనని ధీమా వ్యక్తం చేశారు.

పొగడ్తలతో చంద్రబాబును కట్టిపడేసిన పనగరియా..

రాజకీయాల్లో ఉండే నేతలకు ఎవరిని ఎప్పుడు ఎలాగ కంట్రోల్ చేయాలన్న విషయం ఇచ్చే పట్టేస్తారు. ప్రతి ఒక్కరికి ఒక బలహీనమైన అంశం ఉంటుంది. అలా చంద్రబాబు బలహీనత మీద కొట్టారు నీతి ఆయోగ్ ఛైర్మన్ అరవింద్ పనగరియా. అదేంటంటే మామూలుగానే చంద్రబాబుకు కాస్తంత పొగడ్తలంటే ఇష్టమని అందరికి తెలిసిన విషయమే. అయితే పనగరియా అది కనిపెట్టినట్టునట్టున్నారు.. అందుకే ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు తనను ప్రశ్నించకుండా ఉండేదుంకు ముందు జాగ్రత్తగా ఆయపై ప్రశంసల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. ఈ రోజు విజయవాడకు వచ్చిన పనగరియా ఏపీలో చంద్రబాబు చేపట్టిన పలు అభివృధ్ది కార్యక్రమాల పట్ల ఆయనను తెగ పొగిడేశారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీ ఆర్ధిక లోటులో ఉన్నా కానీ చంద్రబాబు ఏపీ అభివృద్దికి కృషిచేస్తున్నారని.. సీఎం చంద్రబాబు డైనమిక్ లీడరని ఆకాశానికి ఎత్తేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ను అద్భుతంగా నడిపిస్తున్నారని కొనియాడారు. అంతేకాదు ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధానాన్ని ప్రస్తావిస్తూ.. గోదావరి - కృష్ణా నదులు అనుసంధానం గొప్ప విషయమని చెప్పారు. అయితే ఇంతా పొగిడిన పనగరియా మాత్రం ఏపీ ప్రత్యేక హోదా గురించి మాత్రం ఏం చెప్పకపోవడం గమనార్హం. మొత్తానికి నీతి అయోగ్ పర్యవేక్షణలో ఏపీ ప్రత్యేక హోదా అంశం ఉన్న నేపథ్యంలో తనపై చంద్రబాబు ఒత్తిడి తేకుండా ఉండేదుకు పనగరియా ముందుగానే చంద్రబాబుని పొగిడినట్టు రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.

ఓటర్లను ఆకర్షించడానికి మోడీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంతర్జాతీయంగా దేశం అభివృద్ధి చెందడంలో ఎంతగా కృషి చేస్తున్న అవేమి దేశ ప్రజలు పెద్దగా పట్టించుకోనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఓటర్లను ఆకర్షించడంలో అవేమి పెద్దగా ఉపయోగపడవు కాబట్టి.. ప్రజలు కూడా వాటిని పట్టించుకోవడంలేదు. ప్రజాదరణ పొందాలంటే ప్రజలకు ప్రత్యక్ష లబ్ధి కలిగే పథకాలు అమలు చేయాల్సిందే. ఇప్పుడు మోడీ కూడా ఈ రూటులోకే వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్రంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన కూడా ఆతరువాత ఎన్నికల్లో ఎన్టీఏ ఘోర పరాజయం పొందిన దాఖలాలు ఉన్నాయి..దీంతో మోడీ ఇప్పుడు తన రూటు మార్చి..ప్రజలను ఆకర్షించే విధంగా పనులు చేపట్టాలని చూస్తున్నారంట. దీనిలో భాగంగానే మోడీ ఈ కొత్త సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేసేందుకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ విధానం ద్వారా ఎంతో మంది ప్రజలకు లాభం చేకూరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి మోడీ ప్లాన్ కనుక పక్కాగా వర్కవుట్ అయితే మోడీకి మంచి ప్రజాదారణ లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్ధులు వీరే..

తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాగంగా ఆరు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇప్పుడు మిగిలిన ఆరు స్థానాలకు గాను జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో కూడా టీఆర్ఎస్ దే హవా సాగింది. ఈ ఆరు స్థానాల్లో నాలుగు స్థానాలు టీఆర్ఎస్.. రెండు స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాల్లో నల్గొండ - కాంగ్రెస్ - కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖమ్మం - టీఆర్ఎస్ - బాలసాని లక్ష్మీ నారాయణ మహబూబ్ నగర్ మొదటి సీటుకు - టీఆర్ఎస్ - కసిరెడ్డి నారాయణరెడ్డి మహబూబ్ నగర్ రెండో సీటులో- కాంగ్రెస్ - దామోదర్ రెడ్డి రంగారెడ్డి మొదటి సీటుకు - టీఆర్ఎస్ - శంభీపూర్ రాజు రంగారెడ్డి - టీఆర్ఎస్- పట్నం నరేందర్ రెడ్డి కాగా నిజామాబాద్ నుండి డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి, కరీంనగర్ లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నారదాసు లక్ష్మణ రావు, భాను ప్రసాద రావులు, వరంగల్ జిల్లా నుండి కొండా మురళి.. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు పురాణం సతీశ్, వీ భూపాల్‌రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

హైకోర్టులో ఎంఎస్‌వోలకు ఊరట.. సెట్‌టాప్‌ బాక్సులపై రెండు నెలలు గడువు

హైకోర్టులో ఎంఎస్‌వోలకు ఊరట లభించింది. రేపటితో సెట్‌టాప్‌ బాక్సుల ఏర్పాటుకు గడువు ముగుస్తుండటంతో కేంద్రం సరిపడా సెట్‌టాప్‌ బాక్సులు ఏర్పాటు చేయలేదని.. ఎంఎస్‌వోలు సెట్‌టాప్‌ బాక్సుల ఏర్పాటుకు గడువు పెంచాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై హైకోర్టు ఈరోజు విచారణ జరిపినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఎంఎస్‌వోలు  సెట్‌టాప్‌ బాక్సుల కొరత ఉన్నందున గడువు పొడిగించాలని.. 85 శాతం మందికి సెట్‌టాప్‌ బాక్సులు అందుబాటులో లేవని తమ వాదనను వినిపించారు. దీంతో కేబుల్‌ టీవీ డిజిటలైజేషన్‌కు గాను సెట్‌టాప్‌ బాక్సుల ఏర్పాటుకు గడువును మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

రెండో ఎమ్మెల్సీ స్థానం కైవసం చేసుకున్న కాంగ్రెస్..

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నల్గొండ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంది. 193 కోట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపొందారు. ఇప్పుడు మహబూబ్ నగర్ రెండో స్థానాన్ని కూడా కాంగ్రెస్ అభ్యర్ధి దామోదర్ రెడ్డి దక్కించుకున్నారు. మొత్తానికి 12 ఎమ్మెల్సీ స్థానాలకు గాను మొదటనే ఆరు స్ఠానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగా.. ఈరోజు మిగిలిన ఆరు స్థానాలకు గాను ఫలితాలు వెలువడిన నేపథ్యంలో నల్గొండ, మహబూబ్ నగర్  ఎమ్మెల్సీ స్ఠానాలు కాంగ్రెస్, ఖమ్మం టీఆర్ఎస్, రంగారెడ్డిలో కూడా మరో రెండు స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

కేసీఆర్ యాగంపై కర్నాటక సీఎం కామెంట్స్..

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఏదో ఒక విషయంపై కామెంట్లు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించిన ఆయుత చండీయాగంపై కూడా విమర్శలు చేసినట్టు తెలుస్తోంది. కర్నాటక విధాన సౌధలో జరిగిన కవి కువెంపు జయంతి వేడుకల సందర్భంగా హాజరైన సిద్ద రామయ్య కేసీఆర్ యాగం గురించి ప్రస్తావిస్తూ..  తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటూ కేసీఆర్ చండీయాగం చేశారని, హోమాలు చేసినంత మాత్రాన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? ఈ విషయంలో శాస్త్రీయత ఉందా? అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. యాగాలు చేస్తే వర్షాలు కురుస్తాయా? అదే నిజమైతే దేశంలో కరవు ఛాయలే కనిపించేవి కావని, యావత్తు దేశాన్నే సుభిక్షం చేసేవాళ్లమని ఆయన అన్నారు. కాగా సిద్ద రామయ్య మూఢ నమ్మక వ్యతిరేక బిల్లు పైన కృషి చేస్తున్నారు. తన విషయంలో జ్యోతిష్యులు చెప్పింది ఏదీ నిజం కాలేదని.. టీవీ కార్యక్రమాల్లో జ్యోతిష్య శాస్త్రం తదితరాలను నిషేధించడానికి తానే ఓ నిదర్శనం అని సిద్ధరామయ్య అంటున్నారు. మరి సిద్ద రామయ్య చేసిన కామెంట్స్ కు కేసీఆర్ ఎలా సమాధానం చెబుతారో చూడాలి.

తెలంగాణా ముఖ్యమంత్రిపై కర్నాటక ముఖ్యమంత్రి విమర్శలు

  ఇటీవల తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ఆయుత చండీయాగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలనే ఈ యాగం చేసామని కేసీఆర్ చెప్పుకొంటున్నారు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అటువంటి యాగాలు, పూజల కోసం ప్రజా ధనాన్ని వృధా చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పు పట్టాయి. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య కూడా కేసీఆర్ పై విమర్శలు గుప్పించడం విశేషం.   బెంగళూరులోని విధానసౌదలో ప్రముఖ కన్నడ కవి కువెంపు జయంతి సభలో ఆయన పాల్గొన్నప్పుడు, మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ, “యజ్ఞాలు, యాగాలు చేస్తే వానలు పడి దేశం సుబిక్షంగా మారుతుందంటే అందరం అదే పని చేసే వాళ్లము కదా? హోమాలతో దేశంలో పరిస్థితులు మార్చే అవకాశం ఉంటే అదే చేసే వాళ్ళం కదా? అటువంటి హోమాలకు, యాగాలకు ఎటువంటి శాస్త్రీయత లేదు అని తెలిసినా ఉన్నత విద్యావంతులు కూడా వాటిని గుడ్డిగా నమ్మడం దురదృష్టకరం,” అని ముఖ్యమంత్రి సిద్ద రామయ్య అన్నారు.

నా గెలుపు రాజకీయాల్లో కొత్త మలుపు.. కోమటిరెడ్డి

  నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 193 కోట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని.. నా గెలుపు తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు అని అన్నారు. ఈ విజయం రాబోయే ఎన్నికలకు శుభ సూచికమని.. టీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా అభిమానంతోనే నన్ను గెలిపించారు అని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో వందకు వంద శాతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తామని వెల్లడించారు. నల్గొండ జిల్లా అభివృద్దే మా లక్ష్యమని అన్నారు.

జగన్ పై జేసీ ఫైర్.. జగన్ కు అదే పని..

జేసీ దివాకర్ రెడ్డి.. ఆయన మాట్లాడేవిధానం గురించి అందరికి తెలిసిందే. ఏది మాట్లాడినా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం ఆయన నైజం. ఎవరినైనా తిట్టాడానికి అస్సలు భయపడేతత్వం కాదు దివాకర్ రెడ్డి. అలాంటి జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు ఏకంగా ప్రతిపక్షనేత.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా విఫలమయ్యాడని విమర్శిస్తూ....ఆయన ఎప్పుడూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తిట్టడమే అని ఎద్దేవా చేశారు. ఎప్పుడూ చంద్రబాబునే విమర్శిస్తూ.. చంద్రబాబు విమర్శించడమే ప్రతిపక్షనేత తన పనిగా ఫీలవుతున్నారని అన్నారు. అంతేకాదు ఎప్పుడూ సీఎం పదవి గురించే ఆలోచించే జగన్ మంచి పనులు చేసి తద్వారా ఆ పదవిని పొందలే కాని ఇలా విమర్శలు చేయడం తగదని విమర్శించారు. మరోవైపు జగన్ ను తిడుతూనే.. జేసీ చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్నిప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు పాటుపడుతున్నారని.. సీమను సస్యశ్యామలం చేసేందుకు చంద్రబాబు క్రియాశీలంగా అడుగులు వేస్తున్నారని కీర్తించారు. అలాంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ సంతోపడాలి తప్పులు ఏమైనా చేస్తే సర్దిచెప్పాలే తప్ప ఊరికే విమర్శలు చేయవద్దన్నారు.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు..

  తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాగంగా ఆరు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇప్పుడు మిగిలిన ఆరు స్థానాలకు గాను జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు ఫలితాలు విడుదలకానున్నాయి. దీనిలో ఖమ్మం ఎమ్మెల్సీ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 31 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్ధి బాలసాని విజయం సాధించాడు. నల్గొండలో కాంగ్రెస్ విజయం సాధించింది. రంగారెడ్డి జిల్లాల్లో రెండు స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మరోస్థానం కోసం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

కేరళలో మద్యనిషేదానికి సుప్రీం ఒకే

  కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరికొత్త మద్యం పాలసీ దెబ్బకి ఆ రాష్ట్రంలో మద్యం వ్యాపారులు, సంస్థలు అన్నీ దెబ్బతిన్నాయి. ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఉన్న బార్లలో తప్ప బయట మద్యం బార్లలో ఎక్కడా మద్యం అమ్మరాదని ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్రంలోని మద్యం వ్యాపారులు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మొదట రాష్ట్ర హైకోర్టుకి వెళ్ళారు. అక్కడ వారి పిటిషన్ తిరస్కరించబడటంతో సుప్రీం కోర్టు వెళ్ళారు. ఈసారి వారి తరపున అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ముకుల్ రోహాత్గీతో సహా పలువురు ఉద్దండులయిన న్యాయవాదులు వాదించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. జస్టిస్ విక్రంజిత్ సేన్, జస్టిస్ శివ కీర్తి సింగ్ లతో కూడిన ధర్మాసనం కూడా మద్యనిషేధం అమలుచేయాలనే కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్దిస్తూ వారి పిటిషన్ కొట్టివేసింది. మద్యనిషేధం కారణంగా నష్టపోయే మద్యం వ్యాపారులకు నష్టపరిహారం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలనీ సుప్రీం కోర్టు కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది.   సుప్రీం కోర్టు తీర్పు ప్రభావం వివిధ మద్యం ఉత్పత్తి సంస్థల షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఎంపీ డిస్టిలరీస్ షేర్లు-3.20 శాతం, పింకాన్ స్పిరిట్-3.05 శాతం, తిలక్ నగర్ ఇండస్ట్రీస్-2.75 శాతం, యునైటడ్ స్పిరిట్స్-2.69 శాతం, యునైటడ్ బ్రూవరీస్-0.71 శాతం నష్టపోయాయి.   దేశ వ్యాప్తంగా చూసినట్లయితే మద్యపానంలో కేరళ వాటా 14.9 శాతంగా ఉంటోంది. గత మూడు దశాబ్దాలలో కేరళ రాష్ట్రంలో మద్యం విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. 1985 ఆర్ధిక సం.లో రూ.55.46 కోట్లు మాత్రమే ఉన్న మద్యం అమ్మకాలు 2013-14సం. ఆర్ధిక సంవత్సరానికి ఏకంగా రూ. 9353.74 కోట్లకి చేరుకొన్నాయి. కేరళ రాష్ట్రంలో రోజుకి రూ.30 కోట్లు విలువయిన మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంతో ఆ ఆదాయం తగ్గిపోయింది. రాష్ట్రంలో మద్యనిషేధం అమలుచేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకొన్న తరువాత మద్యపానం 20.27 శాతం పడిపోయింది. తత్ఫలితంగా రూ.4,000 కోట్ల ఆదాయం కోల్పోయింది. రాష్ట్రంలో 700 బార్లు మూతపడ్డాయి. వాటిపైనే ఆధారపడిన అనేక వందల మంది రోడ్డున పడ్డారు. మద్యం వ్యాపారులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు.   కేరళ రాష్ట్రం ప్రధానంగా పర్యాటక రంగం మీద ఆధారపడి ఉంది. అక్కడికి దేశ విదేశాల నుండి పర్యాటకులు బారీ సంఖ్యలో వస్తుంటారు. ఆ కారణంగానే అక్కడ మద్యం వ్యాపారం క్రమంగా పెరుగుతూ వస్తోంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం వలన పర్యాటక రంగంపై కూడా ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉండవచ్చును.

ఎమ్మెల్సీ ఫలితాలు నేడే

  తెలంగాణాలో 6 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఫలితాలు బుదవారం వెలువడనున్నాయి. మొత్తం 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలలో 6 స్థానాలకు తెరాస అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికవడంతో మిగిలిన ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహించబడ్డాయి. వాటిలో మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలో చెరో 2 స్థానాలకు, నల్లగొండ, ఖమ్మం జిల్లాలలో చెరో ఒక్క స్థానానికి ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. ఎప్పటిలాగే అబ్యర్ధులకు పడిన ఓట్లను ప్రాధాన్యత క్రమంలో లెక్కించి విజేతల పేర్లను ప్రకటిస్తారు. ఉదయం 11 గంటలలోపే తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.   మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలో ఉన్న నాలుగు స్థానాల కోసం తెరాస, కాంగ్రెస్ పార్టీ, తెదేపాలు పోటీ పడ్డాయి. నల్లగొండ తెరాస-కాంగ్రెస్, ఖమ్మం జిల్లాలో తెరాస-సిపిఐ పోటీ పడ్డాయి. ఈ ఆరు స్థానాలకు మొత్తం 19 మంది అభ్యర్ధులూ పోటీ పడ్డారు. అందరూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

న్యూ ఇయర్ వేడుకలకు షాకింగ్ న్యూస్...

  నూతన సంవత్సర వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలని అనుకునేవారికి ఒక షాకింగ్ న్యూస్... నూతన సంవత్సర సందర్భంగా దేశంలో లష్కర్ ఎ తొయిబా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం వుందని కేంద్ర నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశాయి. దేశంలో పలుచోట్ల ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలు వున్నాయని, ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకలు జరిగే ప్రాంతాల్లో దాడులు జరపడానికి ఉగ్రవాదులు పథక రచన చేశారని సమాచారం అందిందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా వుండాలని, అనుమానిత వ్యక్తుల మీద నిఘా పెట్టాలని సూచించాయి. పాకిస్థాన్ నుంచి దాదాపు 20 మంది సభ్యులున్న ఉగ్రవాదుల బృందం దేశంలోకి చొరబడిందని, ముంబై తరహా దాడులకు పాల్పడే ప్రమాదం వుందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రధాని, ముఖ్యమంత్రుల నివాసాలతోపాటు సైనిక, అణు సంబంధిత ప్రాంతాలపై దాడులు జరిపే అవకాశం వుందని భద్రత అధికారులు అనుమానిస్తున్నారు.

బిడ్డకు పాలిచ్చిందని చంపేశారు

  ఐసీస్ ఉగ్రవాద సంస్థ ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ ఉగ్రవాద సంస్థను సాధ్యమైనంత త్వరగా నాశనం చేయాల్సిన అవసరం వుందనే విషయాన్ని ప్రపంచానికి గుర్తు చేసే ఘటన అల్‌రకా నగరంలో జరిగింది. అల్‌రకా నగరంలో బిడ్డకు పాలిచ్చిందనే నేరం మీద ఐసీస్ ఉగ్రవాదులు ఒక మహిళను దారుణంగా హింసించి, ఆ తర్వాత బహిరంగంగా కాల్చి చంపారు. సరుకుల కొనుగోలు కోసం నెలల శిశువుతో కలసి బయటకి వచ్చిన ఒక మహిళ మధ్యలో తన బిడ్డ ఆకలితో ఏడవటంతో ఒక చెట్టు పక్కకి వెళ్ళి పాలిచ్చింది. దీనిని ఐసీస్ అనుబంధ మహిళా ఉగ్రవాద సంస్థ అయిన అల్‌ఖన్సా సభ్యులు గమనించారు. ఐసీస్ ఉగ్రవాదుల నిబంధనల ప్రకారం బహిరంగ ప్రదేశాలలో తల్లులు బిడ్డలకు పాలు ఇవ్వడం నేరం. ఈ నేరం మీద సదరు మహిళ నుంచి బిడ్డను లాక్కున్నారు. ఆమెను దారుణంగా హింసించిన అనంతరం బహిరంగంగా కాల్చి చంపారు.

పాక్‌లో ఆత్మాహుతి దాడి... 22 మంది మృతి

  పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. పాకిస్థాన్ వాయవ్య ప్రాంతంలోని ఒక ప్రభుత్వ కార్యాలయంలోకి మోటర్ సైకిల్ మీద వచ్చిన దుండగుడు తనను తాను పేల్చేసుకోవడంతో భారీ విధ్వంసం జరిగింది. ఈ ఘటనలో 22 మంది మరణించారు. వాయవ్య పాకిస్థాన్‌లోని మార్దన్ ప్రాంతంలో నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ కార్యాలయం గేటును తోసుకుంటూ రద్దీగా వుండే కార్యాలయంలోకి మోటర్ సైకిల్‌తో దూసుకెళ్ళి ఆత్మాహుతి చేసుకోవడంతో 22 మరణించడంతోపాటు 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కార్యాలయం గేటు దగ్గర వున్న సిబ్బంది దూసుకొస్తున్న మోటార్ సైకిల్‌ని ఆపడానికి ప్రయత్నించినా విఫలమయ్యారు. పేలుడు ధాటికి కార్యాలయ భవనం తలుపులు, కిటికీలు ధ్వంసమైపోయాయి. క్షతగాత్రుల్లో చాలామంది పరిస్థితి విషమంగా వున్నట్టు సమాచారం.

మరో 20 మంది విద్యార్ధులు అమెరికా నుంచి వెనక్కి!

  అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్‌వెస్టర్న్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలలో చేరేందుకు వెళ్ళిన 14 మంది భారతీయ విద్యార్థులను శాన్‌ఫ్రాన్సిస్కోలో అమెరికా అధికారులు నిర్బంధించి ఉగ్రవాదులను ప్రశ్నించినట్లు ప్రశ్నించి, తరువాత వారినందరినీ వెనక్కి తిప్పి పంపేసారు. అందుకు భారత్ లోని అమెరికన్ ఎంబసీ క్షమాపణలు కూడా చెప్పింది. ఆ సంఘటన జరిగి వారం రోజులు కూడా కాలేదు. మళ్ళీ మరో 20 మంది తెలుగు విద్యార్థులకు అటువంటి చేదు అనుభవమే షికాగో విమానాశ్రయంలో ఎదురయింది. వారు కూడా అదే యూనివర్సిటీలలో చేరేందుకు ఆదివారం షికాగో విమానాశ్రయం చేరుకొన్నప్పుడు, వారిని అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అక్కడే ప్రశ్నించి వెనక్కి తిప్పి పంపేసారు. వారందరూ ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు.   ఇదివరకు 14 మంది విద్యార్ధులను వెనక్కి తిప్పి పంపేసిన తరువాత,  అవే విశ్వవిద్యాలయాలలో చేరేందుకు  బయలుదేరుతున్న మరి కొందరు విద్యార్ధులను ఎయిర్ ఇండియా విమాన సంస్థ అధికారులు వారించారు. వారికి అక్కడి పరిస్థితుల గురించి వివరించి తమ ప్రయాణాలను కొంత కాలం పాటు వాయిదా వేసుకోమని కోరారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా వారికి అదే సలహా ఇచ్చేరు. కానీ వారి మాటలను పెడచెవిన పెట్టి వెళ్లిన 20 మంది తెలుగు విద్యార్థులకు మళ్ళీ అటువంటి చేదు అనుభవమే ఎదుర్కోవలసి వచ్చింది.   ఆ రెండు విశ్వవిద్యాలయాలు తాము నిషేధిత జాబితాలో లేమని చెపుతున్నాయి. అయినా అమెరికా అధికారులు వాటిలో చేరేందుకు వెళుతున్న విద్యార్ధులను అడ్డుకొని వెనక్కి తిప్పి పంపేస్తున్నారు. మధ్యలో విద్యార్ధులు, వారి తల్లి తండ్రులు నలిగిపోతున్నారు.  ఆ రెండు విశ్వవిద్యాలయాల అధికారులు అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించుకోకపోతే మధ్యలో విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతారు.భారత్ విదేశాంగ శాఖ అధికారులు చొరవ తీసుకొని తక్షణమే ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది. అలాగే వాటిలో చేరేందుకు అమెరికా అధికారులు అనుమతించడం లేదని తెలిసి కూడా విద్యార్ధులు అమెరికా ప్రయాణం అవడం పొరపాటే. విద్యార్ధుల తల్లి తండ్రులు కూడా తమ పిల్లలు ఆ రెండు విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్లు పొందినప్పటికీ, భారత విదేశాంగ శాఖా నుంచి క్లియరెన్స్ వచ్చే వరకు అమెరికా పంపకుండా కొంతకాలం ఆగితే నష్టపోకుండా ఉంటారు.

జపాన్‌లో వింత జీవి

  జపాన్ సముద్ర తీరంలో అరుదైన వింత జీవి కనిపించి ప్రజలను ఆశ్చర్యచకితులను చేసింది. సెంట్రల్ జపాన్‌లోని టొయామా బే తీరంలో వెండి రంగు మచ్చలతో ఎర్రగా వున్న చాలా పెద్ద వింత జీవి చేపలు పట్టేవారి పడవల కిందుగ ఈదుకుంటూ వచ్చి కొద్దిసేపు నీటి ఉపరితలంలో కనిపించింది. దీనిని సముద్రం లోపలి దృశ్యాలను వీడియో చిత్రీకరించే కెమెరా చిత్రీకరించింది. కొన్ని గంటలపాటు నీటి ఉపరితంపైనే ఈదుతూ కనిపించిన ఈ వింత జీవిని మత్స్యకారులు, ప్రజలు ఆసక్తిగా తిలకించారు. దాదాపు 13 అడుగుల పొడవున్న ఈ జీవి ఆ తర్వాత సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఈ తరహా వింత జీవిని గతంలో కూడా ఒకసారి చూశామని, అప్పుడు చూసిన జీవి దాదాపు 43 అడుగుల పొడవు వుందని కొంతమంది సీనియర్ మత్స్యకారులు చెబుతున్నారు.