ఎమ్మెల్సీ ఫలితాలు నేడే
posted on Dec 30, 2015 6:37AM
తెలంగాణాలో 6 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఫలితాలు బుదవారం వెలువడనున్నాయి. మొత్తం 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలలో 6 స్థానాలకు తెరాస అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికవడంతో మిగిలిన ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహించబడ్డాయి. వాటిలో మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలో చెరో 2 స్థానాలకు, నల్లగొండ, ఖమ్మం జిల్లాలలో చెరో ఒక్క స్థానానికి ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. ఎప్పటిలాగే అబ్యర్ధులకు పడిన ఓట్లను ప్రాధాన్యత క్రమంలో లెక్కించి విజేతల పేర్లను ప్రకటిస్తారు. ఉదయం 11 గంటలలోపే తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలో ఉన్న నాలుగు స్థానాల కోసం తెరాస, కాంగ్రెస్ పార్టీ, తెదేపాలు పోటీ పడ్డాయి. నల్లగొండ తెరాస-కాంగ్రెస్, ఖమ్మం జిల్లాలో తెరాస-సిపిఐ పోటీ పడ్డాయి. ఈ ఆరు స్థానాలకు మొత్తం 19 మంది అభ్యర్ధులూ పోటీ పడ్డారు. అందరూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.