అరుణ్ జైట్లీ విషయంలో వెనక్కి తగ్గిన కేజ్రీవాల్..?

డీడీసిఏ వ్యవహారంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ అరుణ్ జైట్లీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూసి కేజ్రీవాల్ కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అదేంటంటే.. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారంలో అరుణ్ జైట్లీకి క్రీడారంగ ప్రముఖుల నుంచి మద్దతు దొరకడమే. కేజ్రీవాల్ అరుణ్ జైట్లీ పై చేస్తున్న విమర్శలకు గాను గంగూలీ స్పందిస్తూ రాజకీయ నాయకుడు ఎన్నికల ద్వారా ప్రజల చేత ఎన్నుకోబడతారనీ అందుకే వారి అధికారాలను ఎవరూ ప్రశ్నించజాలరని అన్నారు. గుంగూలీ తో పాటు ఇంకా అరణ్ జైట్లీకి వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, విరాట్ కోహ్లీల మద్దతు కూడా లభించింది. అంతేకాదు ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ డీడీసీఏ నిధుల దుర్వినియోగం వ్యవహారంపై ఇంతకుముందే విచారణ జరిగిందని.. దీనిలో ఎటువంటి అక్రమాలు జరగలేదని విచారణలో తేలిందని చెప్పారు. అవినీతిపరుడైన అధికారిని దగ్గర పెట్టుకుని అవినీతిరహిత పాలన అందిస్తామని కేజ్రీవాల్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దీంతో అరుణ్ జైట్లీకి ప్రముఖ క్రీడాకారుల మద్దతు లభించే సరికి కాస్త సలైంట్ అయినట్టు కనిపిస్తుంది.

హేమను భర్తే చంపేశాడు

  ముంబైకి చెందిన ప్రముఖ చిత్రకారిణి హేమ ఉపాధ్యాయ్, ఆమె లాయర్ హరీష్ భంభానీ కొద్ది రోజుల క్రితం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులు హేమ భర్త, చిత్రకారుడు చింతన్ ఉపాధ్యాయ్‌ని నిందితుడిగా గుర్తిస్తూ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు తర్వాత పోలీసులు తమదైన శైలిలో చింతన్‌ను విచారించగా, కోర్టు కేసులు వదిలించుకోవడానికే హేమను హత్య చేశానని చింతన్ ఒప్పుకున్నాడు. చిత్రకారులైన ఈ దంపతుల మధ్య గత కొన్నేళ్ళుగా గొడవలు జరుగుతున్నాయి. 2013 సంవత్సరంలో హేమా ఉపాధ్యాయ్ చింతన్ ఉపాధ్యాయ్ మీద కేసు పెట్టింది. అప్పటి నుంచి అతన్ని కోర్టు చుట్టూ తిప్పుతోంది. కోర్టు కేసుతో విసుగెత్తిపోయిన చింతన్ తన భార్యను చంపడం ద్వారా కేసుల నుంచి తప్పించుకుందామని అనుకున్నాడు. దానికోసం విద్యాధర్ అనే వ్యక్తితో ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ప్రకారం విద్యాధర్ హేమకు ఫోన్ చేశాడు. చింతన్ నుంచి విడాకులు తీసుకోవడానికి ఉపకరించే ఆధారాలు తన దగ్గర వున్నాయని, తాను నివసించే వేర్‌హౌస్ ప్రాంతానికి వస్తే వాటిని ఇస్తానని చెప్పాడు. దాంతో హేమ తన లాయర్ హరీష్‌తో కలసి వేర్‌హౌస్ ప్రాంతంలోవున్న విద్యాధర్ ఇంటికి వెళ్ళింది. అక్కడ విద్యాధర్ వాళ్ళిద్దర్నీ హత్యచేసి, మృతదేహాలను అట్టపెట్టెల్లో కుక్కి చెత్త కుండీల దగ్గర పారేశాడు. హేమ హత్య విషయం బయట పడిన తర్వాత చింతన్ ఉపాధ్యాయ్ అమాయకుడిలాగా భోరుభోరున ఏడ్చాడు. అయితే చివరికి అతనే హత్యకు కారణమని బయటపడింది.  

ఢిల్లీ కోర్టులో కాల్పులు..

ఢిల్లీ కోర్టులో దుండగులు కాల్పులు జరిపి కలకలం సృష్టించారు.  న్యూఢిల్లీలోని కర్కర్డూమా కోర్టులో రూమ్ నెం. 73లోకి ఐదుగురు దుండగలు ప్రవేశించి జడ్జి ఎదుటే 10 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు, కోర్టు క్లర్క్ కు గాయాలు అవ్వగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ కాల్పులతో అప్రమత్తమైన సిబ్బంది ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా.. మిగిలిన ముగ్గురు ఆగంతకులు పరారయ్యారు. కాగా గాయపడిన పోలీస్ కానిస్టేబుల్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించి... చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి... పట్టుబడిన ఇద్దరు నిందితులను విచారిస్తున్నారు. పరారైన ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్

  వాట్సాప్.. ఈరోజుల్లో దీనిగురించి తెలియనివాళ్ళు జీవితంలో చాలా వెనుకబడిపోయినట్టే లెక్క. ప్రపంచ వ్యాప్తంగా విరివిగా ఉపయోగించే మెసేజ్ సర్వీస్‌గా వాట్సాప్ దూసుకుపోతుంది. గత సెప్టెంబర్ నాటికి వాట్సాప్‌ని వినియోగించేవారి సంఖ్య 9 వందల మిలియన్లకు చేరింది. ఈరెండు నెలల్లో వెయ్యి మిలియన్లకు చేరే వుంటుందని అంచనా. అయితే ఇంత ఆదరణ వున్న ఈ యాప్‌లో స్కైప్, హ్యాంగ్ ఔట్‌ తరహాలో వీడియో కాలింగ్ సదుపాయం లేదు. ఈ లోటును భర్తీ చేస్తూ త్వరలో వాట్సాప్‌లో వీడియో కాలింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం ఇది పరీక్ష దశలో వుందట. త్వరలో విడుదల చేయబోతున్న ఐఓఎస్ వెర్షన్‌లో ఈ వీడియో కాలింగ్ సదుపాయాన్ని ఇమడ్చాలని వాట్సాప్ సంస్థ ఆలోచిస్తున్నట్టు సమాచారం.  

మునిగిన పడవ.. 10 మంది మృతి

  గ్రీస్ సమీపంలో ఏజియన్ సముద్రంలో జరిగిన పడవ ప్రయాణంలో ఐదుగురు చిన్నపిల్లలతో సహా మొత్తం 10 మంది మరణించారు. ఏజియన్ సముద్రం ద్వారా గ్రీస్ ద్వీపం ఫార్మాకొనిస్సీకి వలస వెళ్తున్నవారి పడవ మునిగిపోవడంతో ఈ దారుణం జరిగింది. పడవ మునిగిపోయిన సమయంలో అటుగా వచ్చిన తీరప్రాంత రక్షక దళ అధికారులు 13 మందిని కాపాడారు. మంగళవారం నాడు టర్కీ సమీపంలో పడవ మునిగిపోయి ఇద్దరు చిన్నారులతో పాటు మొత్తం 11 మంది మరణించారు. ఇంతలోనే మరో దారుణం జరిగింది. ఇరాక్, సిరియాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద దాడులు, అంతర్యుద్ధాల కారణంగా లక్షలాదిమంది యూరోపియన్ దేశాలకు సముద్ర మార్గం ద్వారా ప్రయాణం చేస్తున్నారు. ఈ సందర్బంగా పడవలు మునిగిపోయి ఈ ఏడాదిలోనే దాదాపు ఏడు వందల మందికి పైగా మరణించారు.  

స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు..

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై వైసీపీ నేతలు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో అసెంబ్లీ కార్యదర్శిని కలిసి ఆర్టికల్ 179 (సి) ప్రకారం అవిశ్వాస నోటీసులు అందించారు. ఈనెల 18 న జరిగిన ప్రొసిడింగ్ వీడియో ఫూటేజ్ ను అందించాలని వైసీపీ నేతలు అసెంబ్లీ కార్యదర్శిని కోరినట్టు తెలుస్తోంది. శాసన సభలో రోజాకు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి..రోజాకు చెందిన వీడియోలు బయటకు ఎలా వచ్చాయని అసెంబ్లీ కార్యదర్శిని అడిగి ఆరా తీసినట్టు తెలుస్తోంది.సభాపతి అంటే నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. తొలి సమావేశం నుంచి స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అందుకే స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ఇస్తున్నామని తెలిపారు.

అప్పుడు తప్పనిపించలేదు.. ఇప్పుడు తప్పనిపిస్తుందా.. రోజా

వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిందన్న ఆరోపణకు గాను స్పీకర్ కోడెల ఆమెను సంవత్సరంపాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అటు అధికార పార్టీకి.. ప్రతిపక్ష పార్టీకి మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రోజా కూడా తనపై చేస్తున్న విమర్శల గురించి మాట్లాడుతూ అధికార పార్టీపై ప్రశ్నలు కురిపించింది. అధికార పార్టీ తనపై..తాను వాడుతున్న భాషపై అనవసరంగా విమర్శలు చేస్తుందని.. తాను గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఇదే బాషను ఉపయోగించా.. ఇప్పుడు అదే బాషను ఉపయోగించా.. అప్పుడు తప్పనిపించనిది.. ఇప్పుడు ఎలా తప్పనిపిస్తుంది అని ప్రశ్నించారు. అంతేకాదు కాల్ మనీ గురించి కూడా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వాలు రుణాలు ఇవ్వకపోవడం వల్లే ప్రజలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని.. ఇదే అదనుగా చూసుకొని వారు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు.

దావూద్ కారు దహనం చేస్తాం.. అందుకే కారు కొన్నాం.. స్వామి చక్రపాణి

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన కారు.. హోటల్ ను వేలం వేసిన సంగతి తెలిసిందే. ఈ వేలం పాటలో దావూద్ కారును హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి సొంతం చేసుకున్న సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు ఆయన దావూద్ కారును అందరూ చూస్తుండగానే దహనం చేస్తామని..ఈరోజు మద్యాహ్నం 1 నుంచి 2 గంటల సమయంలో దావూద్ కారును దహనం చేస్తున్నానని తెలిపారు. కిరాతకుడు దావూద్ ఇబ్రహీం, అతని ముఠా పాల్పడిన తీవ్రవాద కార్యకలాపాలకు అంత్యక్రియలు నిర్వహించాలనే ఉద్దేశంతోనే తాము ఈ కారును వేలంలో కొనుగోలుచేశామని, అందుకే దహనం చేస్తున్నామని ఆయన చెప్పారు. అయితే మొదట ఈ కారును అంబులెన్స్ లా ఉపయోగించాలని నిర్ణయించుకున్నాం కానీ.. తమకు దావూద్ అనుచరుల నుండి బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో వారికి తగిన బుద్ది చెప్పడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని.. వారి బెదిరింపులకు భయపడేది లేదని తెలిపారు. మరోవైపు ఈరోజు కారును దహనం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఘనంగా ప్రారంభమైన కేసీఆర్ ఆయుత చండీయాగం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆయుత చండీయాగం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. మెదక్ జిల్లాలోని తన ఫాంహౌస్ లో కేసీఆర్ తలపెట్టిన యాగం.. గురుప్రార్ధనలతో ప్రారంభమైంది. తొలుత రుత్విజులతో కలిసి సీఎం కేసీఆర్‌ దంపతులు యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేశారు. మొత్తం యాగం కోసం దేశ వ్యాప్తంగా నలుమూలల నుంచి రెండు వేల మంది రుత్విజులు వచ్చినట్టు తెలుస్తోంది. ఐదు రోజులు జరిగే ఈ చండీయాగంలో కోటి సవార్ణ మంత్రాలు, ఉదయం పూట సప్తశతి మంత్రజపాలు.. సాయంత్రం పూట సవార్ణ మంత్ర జపాలు జరుగుతాయి. 108 హోమగుండాలతో పాటు చతుర్వేద యాగశాలల్లో రాజశ్యామల, మహారుద్ర, అయుత మహా చండీయాగం జరగుతుంది. అయుత మహా చండీయాగంలో భాగంగా మొదటిరోజైన ఈరోజు వెయ్యి చండీ పారాయణాలు, 40లక్షల నవార్ణమంత్ర జపాలు చేస్తారు. చండీయాగం ప్రారంభోత్స సందర్భంగా తొలిరోజున జరిగే క్రతువులో కేసీఆర్‌తో పాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. మరోవైపు యాగశాల చుట్టూ 5కిలో మీటర్ల మేర సీసీ కెమెరాలు ఏర్పాటు..3,300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

  ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. చివరిరోజున పలు అంశాలపై చర్చించారు. తెలుగుదేశం శాసనసభ్యురాలు అనితపై వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలను సభ తీవ్రంగా ఖండించింది. చర్చ జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే అనిత కంటతడి పెట్టారు. అనంతరం బాక్సైట్ తవ్వకాలు, ఇసుక విధానంపై సభలో చర్చించారు. ఆ తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. ఐదురోజులపాటు జరిగిన ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాల్లో మొత్తం 18 గంటల 34 నిమిషాలపాటు సభా సమయాన్ని అధికార, ప్రతిపక్షాలు వినియోగించుకున్నాయి. ఇందులో అధికార తెలుగుదేశం పార్టీ 14 గంటల 42 నిమిషాల సమయాన్ని, ప్రతిపక్షం వైసీపీ 2 గంటల 14 నిమిషాల సమయాన్ని, బీజేపీ గంటన్నర సమయాన్ని వినియోగించుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు 2 గంటల 19 నిమిషాలు మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ 16 నిమిషాలు, బీజేపీ నాయకుడు విష్ణుకుమార్ రాజు 15 నిమిషాలు మాట్లాడారు.

స్పీకర్ మీద వైసీపీ అవిశ్వాసం

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైసీపీ శాసనసభాపక్షం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ శాసనసభా పక్ష ఉప నాయకుడు జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. విధిలేని పరిస్థితుల్లోనే స్పీకర్ మీద అవిశ్వాసం పెట్టాలని తీర్మానించామని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేయడానికి, అవిశ్వాస తీర్మానానికి సంబంధం లేదని ఆయన అన్నారు. బుధవారం నాడు అసెంబ్లీ కార్యదర్శికి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వనున్నామని ఆయన తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను సస్పెండ్ చేసిన అంశం మీద న్యాయపోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు.  

సినీ రచయిత కాశీ విశ్వనాథ్ కన్నుమూత

  సినిమా రచయిత, నటుడు కాశీ విశ్వనాథ్ (69) మంగళవారం నాడు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్టణానికి రైలులో ప్రయాణిస్తూ వుండగా ఖమ్మం సమీపంలో గుండెపోటుకు గురై మరణించారు. ఈ విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. ఖమ్మం రైల్వే పోలీసులు కాశీ విశ్వనాథ్ భౌతిక కాయాన్ని స్వాధీనం చేసుకుని, శవ పరీక్ష అనంతరం ఆయన కుమారుడు శ్రీధర్‌కి అప్పగించారు. కాశీ విశ్వనాథ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. కథ, నవల, సినిమా మాటల రచయిత, రంగస్థల దర్శకుడు, నటుడుగా ప్రశంసనీయమైన కృషి చేశారు. ఆయన 122 కథలు, 28 నవలలు, 43 నాటికలు రాశారు. ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘మగమహారాజు’ తదితర చిత్రాలకు ఆయన రచయితగా పనిచేశారు. ‘కాశీపట్నం చూడరబాబు’ అనే కాలమ్ కూడా రాశారు.

నిర్భయ నా కూతురైతే.. కాల్చేసేవాడిని.. ఎంపీ

నిర్భయ కేసులో జువైనల్ గా శిక్షపొందుతున్న నిందితుడు విడుదలైన సంగతి తెలిసిందే. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఒబ్రెయిన్ తీవ్రంగా స్పందించారు. రాజ్యాసభలో జువైనల్ చట్టసవరణ బిల్లుపై చర్చ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ గ్యాంగ్‌రేప్ బాధితురాలు నిర్భయ స్థానంలో ఒకవేళ తన కూతురు కనుక ఉండి ఉంటే.. నిందితులను అప్పుడే కాల్చి చంపేవాడినని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు సమస్యపై రాజకీయం చేస్తున్నాయని.. జువెనైల్ చట్ట సవరణ బిల్లుకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపుతోందని చెప్పారు. ఈ బిల్లును దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారని.. ఎంపీలందరూ ఈ బిల్లుకు ఆమోదం తెలపాలని అన్నారు. జువెనైల్ జస్టిస్ బిల్లును మరింత పటిష్టం చేసేందుకు అందరూ ఒక్కటికావాలన్నారు. బాల నేరస్థుల శిక్ష కాలాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.