మరో 20 మంది విద్యార్ధులు అమెరికా నుంచి వెనక్కి!
posted on Dec 29, 2015 @ 3:49PM
అమెరికాలో సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్‌వెస్టర్న్ పాలిటెక్నిక్ కాలేజీలలో చేరేందుకు వెళ్ళిన 14 మంది భారతీయ విద్యార్థులను శాన్‌ఫ్రాన్సిస్కోలో అమెరికా అధికారులు నిర్బంధించి ఉగ్రవాదులను ప్రశ్నించినట్లు ప్రశ్నించి, తరువాత వారినందరినీ వెనక్కి తిప్పి పంపేసారు. అందుకు భారత్ లోని అమెరికన్ ఎంబసీ క్షమాపణలు కూడా చెప్పింది. ఆ సంఘటన జరిగి వారం రోజులు కూడా కాలేదు. మళ్ళీ మరో 20 మంది తెలుగు విద్యార్థులకు అటువంటి చేదు అనుభవమే షికాగో విమానాశ్రయంలో ఎదురయింది. వారు కూడా అదే యూనివర్సిటీలలో చేరేందుకు ఆదివారం షికాగో విమానాశ్రయం చేరుకొన్నప్పుడు, వారిని అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అక్కడే ప్రశ్నించి వెనక్కి తిప్పి పంపేసారు. వారందరూ ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు.
ఇదివరకు 14 మంది విద్యార్ధులను వెనక్కి తిప్పి పంపేసిన తరువాత, అవే విశ్వవిద్యాలయాలలో చేరేందుకు బయలుదేరుతున్న మరి కొందరు విద్యార్ధులను ఎయిర్ ఇండియా విమాన సంస్థ అధికారులు వారించారు. వారికి అక్కడి పరిస్థితుల గురించి వివరించి తమ ప్రయాణాలను కొంత కాలం పాటు వాయిదా వేసుకోమని కోరారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా వారికి అదే సలహా ఇచ్చేరు. కానీ వారి మాటలను పెడచెవిన పెట్టి వెళ్లిన 20 మంది తెలుగు విద్యార్థులకు మళ్ళీ అటువంటి చేదు అనుభవమే ఎదుర్కోవలసి వచ్చింది.
ఆ రెండు విశ్వవిద్యాలయాలు తాము నిషేధిత జాబితాలో లేమని చెపుతున్నాయి. అయినా అమెరికా అధికారులు వాటిలో చేరేందుకు వెళుతున్న విద్యార్ధులను అడ్డుకొని వెనక్కి తిప్పి పంపేస్తున్నారు. మధ్యలో విద్యార్ధులు, వారి తల్లి తండ్రులు నలిగిపోతున్నారు. ఆ రెండు విశ్వవిద్యాలయాల అధికారులు అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించుకోకపోతే మధ్యలో విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతారు.భారత్ విదేశాంగ శాఖ అధికారులు చొరవ తీసుకొని తక్షణమే ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది. అలాగే వాటిలో చేరేందుకు అమెరికా అధికారులు అనుమతించడం లేదని తెలిసి కూడా విద్యార్ధులు అమెరికా ప్రయాణం అవడం పొరపాటే. విద్యార్ధుల తల్లి తండ్రులు కూడా తమ పిల్లలు ఆ రెండు విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్లు పొందినప్పటికీ, భారత విదేశాంగ శాఖా నుంచి క్లియరెన్స్ వచ్చే వరకు అమెరికా పంపకుండా కొంతకాలం ఆగితే నష్టపోకుండా ఉంటారు.