తెలంగాణా ముఖ్యమంత్రిపై కర్నాటక ముఖ్యమంత్రి విమర్శలు
posted on Dec 30, 2015 @ 10:20AM
ఇటీవల తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ఆయుత చండీయాగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలనే ఈ యాగం చేసామని కేసీఆర్ చెప్పుకొంటున్నారు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అటువంటి యాగాలు, పూజల కోసం ప్రజా ధనాన్ని వృధా చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పు పట్టాయి. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య కూడా కేసీఆర్ పై విమర్శలు గుప్పించడం విశేషం.
బెంగళూరులోని విధానసౌదలో ప్రముఖ కన్నడ కవి కువెంపు జయంతి సభలో ఆయన పాల్గొన్నప్పుడు, మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ, “యజ్ఞాలు, యాగాలు చేస్తే వానలు పడి దేశం సుబిక్షంగా మారుతుందంటే అందరం అదే పని చేసే వాళ్లము కదా? హోమాలతో దేశంలో పరిస్థితులు మార్చే అవకాశం ఉంటే అదే చేసే వాళ్ళం కదా? అటువంటి హోమాలకు, యాగాలకు ఎటువంటి శాస్త్రీయత లేదు అని తెలిసినా ఉన్నత విద్యావంతులు కూడా వాటిని గుడ్డిగా నమ్మడం దురదృష్టకరం,” అని ముఖ్యమంత్రి సిద్ద రామయ్య అన్నారు.