రెండేళ్ల పాపకు వివాహం
posted on Feb 27, 2016 @ 2:46PM
బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్తాన్‌లోని నలుగురు బాలికలకు ఇలా వివాహం జరిగిన వార్తలు వినిపిస్తున్నాయి. వీరంతా 2 నుంచి 12 సంవత్సరాల మధ్య వయసున్న బాలికలే! వీరిని వివాహం చేసుకున్నవారు కూడా మైనర్లు కావడం విశేషం. రాజస్తాన్‌లోని భిల్వారా జిల్లాలో జరిగిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. అయితే ఈ వివాహం గురించి తెలిసి కూడా అధికార యంత్రాంగం కానీ పోలీసులు కానీ సత్వరం స్పందించకపోవడం ఆశ్చర్యం. స్థానికంగా ఓ వార్తాపత్రికలో వచ్చిన వార్త ఆధారంగా పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తుకి ఆదేశించిన తరువాత కానీ, అధికారులలో చలనం కలుగలేదు. 2001 గణాంకా ప్రకారం ఏటా 15లక్షలమంది బాలికలకి, వారికి 15 ఏళ్ల వయసులోపుగానే వివాహం చేసేస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ‘బాల్యవివాహ వ్యతిరేక చట్టం- 2006’ని అమలులోకి తీసుకు వచ్చింది. అయినా అధికారుల అలసత్వం వల్ల అడపాదడపా ఇలాంటి వార్తలు వినవస్తూనే ఉన్నాయి.