రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం

  ఈరోజే తెలంగాణాలో నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి రోజు గనుక వివిధ పార్టీలలో టికెట్ దొరకని వారిలో స్వతంత్ర అభ్యర్ధులుగా నామినేషన్లు వేసినవారిలో ఇంకా ఎంతమంది బరిలో నిలిచి ఆయా పార్టీలకు సవాలు విసరనున్నారో, ఎంతమంది తమ నామినేషన్లు ఉపసంహరించుకొంటారో కూడా తేలిపోనుంది.   ఇక ఈరోజే ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)కు ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడనుంది. అదేవిధంగా ఈరోజు నుండే అక్కడ కూడా అభ్యర్ధుల నుండి నామినేషన్ దరఖాస్తులు స్వీకరణ కూడా మొదలవుతుంది. ఈనెల 19వ తేదీ నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి రోజు. మధ్యలో 13 (ఆదివారం),14 (అంబేడ్కర్ జయంతి),19 (గుడ్ ఫ్రైడే) శలవు దినాలలో మాత్రం నామినేషన్లు స్వీకరించరు. అంటే అభ్యర్ధులకు నామినేషన్లు దాఖలు చేయడానికి కేవలం 5రోజులు మాత్రమే సమయం ఉంటుందన్నమాట. ఈనెల 21 నామినేషన్ల పరిశీలన చేస్తారు. 23మధ్యాహ్ననానికి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది.   ఏప్రిల్ 30న తెలంగాణాలో పది జిల్లాలో 17 పార్లమెంటు, 119 శాసనసభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా మే 7న ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలలో 25 లోక్ సభ మరియు 175 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. మే16న ఓట్ల కౌటింగ్ చేసి అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు.   ఈరోజు నాలుగవ విడత ఎన్నికలలో భాగంగా గోవా, అస్సోం, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలలో ఏడు నియోజక వర్గాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు స్థానాలకు మొత్తం 74మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు.

కోలగట్ల వైకాపాలోకి జంప్

  విజయనగరంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో బలమయిన దెబ్బ తగిలింది. అక్కడ ఉన్న బలమయిన రాజకీయ నేతలలో కొలగట్ల వీరభద్రస్వామి కూడా ఒకరు. ఆయన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు శాసనమండలి సభ్యుడు కూడా. జిల్లాలో బొత్స సత్యనారాయణ, అశోక్ గజపతి తరువాత అంతటి బలమయిన నేతగా పేరుపొందారు. అటువంటి వ్యక్తి నేడు అకస్మాత్తుగా వైకాపాలో చేరిపోయారు.   ఇప్పటికే జిల్లాలో దాదాపు పార్టీ ఖాళీ అయిపోగా, ఇప్పుడు కోలగట్ల కూడా వెళ్లిపోవడంతో, కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అపకీర్తి మూటగట్టుకొన్న బొత్ససత్యనారాయణపైనే తప్పనిసరిగా ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇది బొత్సకు సానుకూలాంశంగా మారినందున మళ్ళీ ఇప్పుడు తను సూచించిన వారికే ఆయన టికెట్స్ ఇప్పించుకోగలిగే స్థితికి చేరుకొన్నారు. అదేవిధంగా ఇటువంటి కీలక తరుణంలో కోలగట్ల వైకాపా వైపు మారడంతో జిల్లాలో పార్టీల బలాబలాలు మారాయి. ఆయన వైకాపా తరపున శాసనసభకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. తేదేపాకు జిల్లాలో బలమయిన అభ్యర్ధి అయిన మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుని ఈసారి లోక్ సభకు పోటీలో దింపుతున్నందున, బొత్సను వైకాపాను ఎదుర్కోవడానికి తెదేపా మరో బలమయిన అభ్యర్ధిని వెతుక్కోవలసి ఉంటుంది.

ఉండమ్మా ముక్కుపుడక పెడతా: జగన్ పార్టీ పిలుపు

      ఉండమ్మా బొట్టు పెడతా అన్నట్టు జగన్ పార్టీ ఉండమ్మా ముక్కుపుడక పెడతా అనే సందేశంతో మహిళా ఓటర్లకు ముక్కుతాడు వేసే ప్రయత్నాలు చేస్తోంది. దీనికి జగన్ సొంత జిల్లాలోనే స్థానిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా శ్రీకారం చుట్టారు. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు మండలం అమృత్‌నగర్‌లోకి వైకాపా బృందం బోలెడన్ని ముక్కుపుడకలు పట్టుకుని దిగిపోయింది. ఆ ఊళ్ళో ఉన్న పోలింగ్ బూత్ దగ్గరకి చేరుకుంది. మహిళలకు ముక్కుపుడకలు పంచుతూ జగన్ పార్టీకే ఓటు వేయాలని సెంటిమెంట్‌తో కూడిన మాటలు చెబుతోంది. పోలింగ్ బూత్‌ల దగ్గర ముక్కుపుడకలు పంచుతున్న వైకాపా కార్యక్తలను అధికారులు గమనించి పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు ముక్కుపుడకల బ్యాచ్‌ని అరెస్టు చేసి వాళ్ళ దగ్గర నుంచి 62 ముక్కు పుడకలు స్వాధీనం చేసుకున్నారు.

నందమూరి కుటుంబానికి బాబు చెక్?

  కొద్ది రోజుల క్రితం వరకు కూడా ఎన్నికలలో తప్పకుండా పోటీ చేస్తానని చెపుతూ వచ్చిన బాలకృష్ణ, నిన్న కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ తను అవసరమయితే ఎన్నికలలో పోటీ చేయకుండా పార్టీ కోసం ప్రచారంలో పాల్గొంటానని చెప్పడం చూస్తే, ఆయనకు చంద్రబాబు నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదని స్పష్టమవుతోంది. అయితే షరా మామూలుగానే ‘పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తా’నంటూ బాలయ్య తన స్టేట్మెంటుకి చిన్న ట్యాగ్ లైన్ కూడా తగిలించారు. కానీ గెలుపు గుర్రమని చెప్పదగ్గ బాలకృష్ణను ఎన్నికల బరిలో దింపకపోతే అందుకు చంద్రబాబు తగిన కారణం చెప్పవలసి ఉంటుంది.   మొన్న తెదేపా అభ్యర్ధుల తొలి జాబితా విడుదల చేసిన తరువాత జూ.యన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా లేదా? అనే మీడియా ప్రశ్నకు చంద్రబాబు జవాబిస్తూ “పార్టీ కోసం ప్రచారం చేసేందుకు ఎవరు ముందుకు వచ్చినా ఆహ్వానిస్తాము,” అని క్లుప్తంగా జవాబీయడం చూస్తే, ఈసారి పార్టీ కోసం జూ.యన్టీఆర్ సేవలను ఉపయోగించుకొనేందుకు ఆసక్తిగా లేరని స్పష్టమవుతోంది. అదేవిధంగా అతని తండ్రి హరికృష్ణకు కూడా ఈసారి ఆయన టికెట్ ఇస్తారో లేదో అనే ప్రస్తావన రాకుండా జాగ్రత్తపడటం గమనిస్తే ఆయనకీ టికెట్ దక్కడం అనుమానంగానే ఉంది.   ఒకవేళ  నందమూరి సోదరులిరువురికీ టికెట్స్ ఈయకుండా, జూ.యన్టీఆర్ ని కీలకమయిన ఈ దశలో కూడా పార్టీకి దూరంగా ఉంచుతూ, మరోవైపు బీజేపీ తరపున వైజాగ్ నుండి పోటీ చేయాలనుకొంటున్న పురందేశ్వరిని కూడా చంద్రబాబు అడ్డుకొన్నట్లయితే, అది ప్రత్యర్ధులకు ఎన్నికలలో బలమయిన ఆయుధంగా మారడం తధ్యం.

పాయింట్ లాగిన పొన్నాల!

      మొన్నటి వరకూ టీఆర్ఎస్‌తో చివరి క్షణంలోనైనా పొత్తు కుదురుతుందేమోననే ఆశతో టీఆర్ఎస్ ఎంత తిట్టినా ఆచితూచి మాట్లాడిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో గొంతు పెంచారు. టీఆర్ఎస్‌ మీద తనదైన శైలితో సెటైర్లు వదలడం మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్న వాగ్దానాల ఖరీదు కనీసం ఐదు లక్షల కోట్లు వుంటుందని, మొత్తం తెలంగాణ బడ్జెట్టే డెబ్బై వేల కోట్లు అయినప్పుడు, ఐదు లక్షల కోట్ల హామీని కేసీఆర్ ఎలా నెరవేరుస్తాడో ఆయనకే తెలియాలని పొన్నాల పాయింట్ లాగారు. కేసీఆర్ చేస్తున్న హామీలన్నీ అరచేతిలో స్వర్గం చూపించేవేనని అన్నారు. కేసీఆర్ హెలికాప్టర్‌లో ప్రచారం చేస్తున్నారని ప్రస్తావిస్తే, కేసీఆర్ ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో డబ్బులు పండిస్తున్నారో లేక రకరకాలుగా డబ్బు వచ్చి పడుతోందోనని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. కేసీఆర్ లాగా ఆచరణసాధ్యం కాని హామీలు తమ పార్టీ ఇవ్వదని పొన్నాల చెప్పారు.

చేతులెత్తేసిన జగన్ పార్టీ అభ్యర్థి

      మూలిగే నక్కమీద తాటికాయ పడటం అంటే ఏమిటో ఇంకా క్లియర్‌గా తెలుసుకోవాలంటే తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూడాలి. అసలే తెలంగాణలో అడ్రస్ గల్లంతైన ఆ పార్టీకి మరికొన్ని షాకులు తగులుతున్నాయి. హైదరాబాద్‌లోని మహేశ్వరం నియోజకవర్గం నుంచి భాస్కర్‌రెడ్డి అనే క్యాండిడేట్ వైకాపా తరఫున రంగంలో వున్నాడు. చాలాకాలంగా పార్టీల చురుగ్గా వుండటంతోపాటు మంచి సౌండ్ పార్టీ కూడా అయిన భాస్కర్‌రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి గెలవకపోయినా గట్టి పోటీ అయితే ఇస్తాడని వైకాపా భావిస్తోంది. అయితే భాస్కర్‌రెడ్డికి ఏ బోధి చెట్టు కింద జ్ఞానోదయం కలిగిందోగానీ, వైకాపా తరఫున తాను పోటీలో నిలబడేది లేదని చేతులు ఎత్తేశాడు. పనిలోపనిగా వైఎస్సార్ కాంగ్రెస్‌కి రాజీనామా కూడా చేసేశాడు. ఊహించని ఈ పరిణామానికి జగన్ పార్టీ షాకైపోయింది.

స్థానిక ఎన్నికలు: బ్యాలెట్ పేపర్ మింగేసిన ప్రబుద్ధుడు

      పోలింగ్ బూత్‌ల్లో రకరకాల విచిత్రాలు జరుగుతూ వుంటాయి. ఓటర్లని ప్రభావితం చేయడం, బ్యాలెట్ బాక్సుల్లో ఇంకులు పోయడం, రిగ్గింగ్ చేయడం... రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఇలాంటి కళలు ఎన్నో ప్రదర్శిస్తూ వుంటారు. ఆ కళల్లో ఒక కళని అనంతపురం జిల్లాలో పోలింగ్ ఏజెంట్ పనిలో వున్న ఓ పార్టీ కార్యకర్త ప్రదర్శించాడు. ఆ కళ బ్యాలెట్ పేపర్ని అప్పడంలా నమిలి మింగేయడం. ఒక ఓటరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడాన్ని గమనించిన మరో పార్టీకి చెందిన ఆ వ్యక్తి ఓటరు దగ్గర్నుంచి బ్యాలెట్ పేపర్ని లాక్కున్నాడు. ఓటర్ దగ్గర్నుంచి బ్యాలెట్ పేపర్ ఎందుకు లాక్కున్నావ్? అంటూ అతని దగ్గరి నుంచి బ్యాలెట్ పేపర్ని తీసుకోవాలని అక్కడున్న అధికారులు ప్రయత్నించారు. దాంతో అతగాడు బ్యాలెట్ పేపర్ని నమిలి మింగేశాడు. అసలు ఇప్పుడేమైంది? నేను ఓటర్ దగ్గర్నుంచి బ్యాలెట్ పేపర్ లాక్కున్నానని ఎలా నిరూపిస్తారని ప్రశ్నించాడు. అతగాడి అతి తెలివి చూసి అధికారులు నెత్తీనోరూ బాదుకున్నారు.

కేజ్రీవాల్ కి బుద్దొచ్చింది

      ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కి ఎన్నికల సందర్భంగా ఎండలో తిరిగీ తిరిగీ జ్ఞానోదయంతోపాటు బుద్ధి కూడా వచ్చినట్టుంది. అందుకే గతంలో తాను చేసిన తప్పుని ఒప్పుకుని చెంపలేసుకుంటున్నాడు. కేజ్రీవాల్ చేసిన తప్పు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం. అమృత్‌సర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేజ్రీవాల్ తొందరపడి ఆవేశంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్టు ఒప్పుకున్నాడు. మరికొంతకాలం పదవిలో వుండి ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమై వాళ్ళకి పరిపాలనలో తనకు కలుగుతున్న ఆటంకాల గురించి వివరిస్తే బాగుండేదని చెప్పాడు.

ములాయం వ్యాఖ్యలపై నిర్భయ పేరెంట్స్ ఆగ్రహం

      రేప్ చేసిన వారికి ఉరిశిక్ష విధించడం దారుణమని, రేప్ లాంటి పొరపాట్లు జరుగుతూ వుంటాయని, వాటికి మరణశిక్ష విధించడం అన్యాయమని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ములాయం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని నిర్భయ తల్లిదండ్రులు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల పట్ల వారు తీవ్రంగా స్పందించారు. కూతుర్ని పోగొట్టుకున్నవారికి, కూతుళ్ళు అత్యాచారాలకి గురైన వారికి ఆ బాధ తెలుస్తుందని వారు అన్నారు. అత్యాచారం అనేది మగవాళ్ళు చేసే తప్పు కాదని.. అది దారుణమైన నేరమని వారు అన్నరు. తనను తాను ప్రధానమంత్రి అభ్యర్థిగా చెప్పుకుంటున్న ములాయం సింగ్ ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం విచారకరమని అన్నారు. ములాయంసింగ్ లాంటి నాయకుల వల్లే దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోతోందని అన్నారు. ములాయం లాంటి నాయకులు అధికారంలోకి రాకుండా ప్రజలు జాగ్రత్తగా వుండాలని వారు కోరారు.

చిట్టీల రాణి స్టోరీలో ట్విస్టు: జూనియర్ ఆర్టిస్టుల మోసం?

      సినిమా, టీవీ రంగాల్లో వున్న అనేక మంది దగ్గర్నుంచి చిట్టీలు, అధిక వడ్డీల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి విజయరాణి అనే టీవీ నటి బిచాణా ఎత్తేసిందన్న వార్తలు ఈమధ్యకాలంలో వచ్చాయి. ఇప్పటి వరకూ అందరూ చిట్టీల విజయరాణిని విలన్‌గా ప్రొజెక్ట్ చేశారు. అయితే బెంగుళూరులో పోలీసులకు దొరికిపోయిన విజయరాణిని హైదరాబాద్‌ పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు. ఈ ఇంటరాగేషన్‌లో ఎవరూ ఊహించని విషయాలు బయటకి వచ్చాయని తెలుస్తోంది. నిజానికి విజయరాణి ఎవరినీ మోసం చేయలేదని, ఆమెనే కొంతమంది జూనియర్ ఆర్టిస్టులో మోసం చేశారని తెలుస్తోంది. విజయరాణికి వడ్డీకి డబ్బులు ఇచ్చిన కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు ఆమె దగ్గర నుంచి కోట్లాది రూపాయలు బెదిరించి తీసుకున్నారట. దాంతో ఆమె దిక్కుతోచని స్థితిలో బెంగుళూరుకి పారిపోయి, అక్కడ రోడ్లమీద తిండికూడా లేకుండా పిచ్చివాళ్ళు తిరిగినట్టు తిరిగిందట. ఈ విషయాలు విజయరాణి నుంచి తెలుసుకున్న పోలీసులు ఆమెను మోసం చేసిన జూనియర్ ఆర్టిస్టుల కోసం అన్వేషణ ప్రారంభించినట్టు తెలుస్తోంది. వాళ్ళు కూడా దొరికాక ఈ స్టోరీలో వాళ్ళేం ట్విస్టు ఇస్తారో చూడాలి.

రేప్‌కి గురైనవారిని ఉరితీయాలి: అబు అజ్మీ

      సమాజ్‌వాది పార్టీ నాయకులు అందరిచేతా ఛీ కొట్టించుకునే స్టేట్‌మెంట్లు ఇచ్చి ఈ ఎలక్షన్లలో అదనపు ప్రచారం పొందాలని ప్రయత్నిస్తున్నట్టుగా వుంది. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ నిన్న ఏదో కుర్రాళ్ళు రేప్ చేసినంతమాత్రాన ఉరిశిక్ష వేసేస్తారా అని ఆవేశంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ములాయం చేసిన వ్యాఖ్యల మీద దేశమంతా భగ్గుమంటోంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు. పార్టీ అధ్యక్షుడు ములాయంసింగే పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తుంటే నేను మాత్రం ఎందుకు చేయకూడని అనుకున్నాడేమో సమాజ్‌వాది పార్టీ మహారాష్ట్ర చీఫ్ అబు అజ్మీ ములాయం సింగ్‌కి మించిన కామెంట్స్ చేశాడు. ‘‘భర్తతో కాకుండా పర పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళలను ఉరితీయాలి. అలాగే రేప్‌కి గురైన మహిళలను కూడా ఉరితీయాలి. ఎందుకంటే ఒక మహిళ ఒక పురుషుడితోనే సంబంధం కలిగి వుండాలి’’ అని దారుణంగా వ్యాఖ్యానించాడు. రేప్‌కి గురైన మహిళను సదరు రేపిస్టుతో కలిపి ఉరి తీసేయాలని అబు ఆజ్మీ చెప్పాడు. ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా, ఇలా చెయ్యమని ఇస్లాంలో చెప్పారని అంటున్నాడు.

మోడీపై కాంగ్రెస్ ‘మహిళాస్త్రం’

      బీజేపీ ప్రధాన అభ్యర్థి నరేంద్రమోడీని బద్నామ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ శాయశక్తులా కృషి చేస్తోంది. గోద్రా అల్లర్లు మోడీయే దగ్గరుండి చేయించారన్నట్టు హడావిడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మోడీ పెళ్ళికి సంబంధించి కూడా మాటల దాడి చేస్తూ వచ్చింది. నిన్నటి వరకూ మోడీకి పెళ్ళయినా పెళ్ళి కాలేదని చెబుతున్నాడు. ఆ వివరాలు బయటపెట్టాలంటూ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టింది. ఇప్పుడు మోడీయే స్వయంగా తన పెళ్ళికి సంబంధించిన వివరాలను బయటపెట్టడంతో కాంగ్రెస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. తమ దగ్గర ఉన్న ఒక అస్త్రం పోయిందే అని బాధపడింది. అంతలోనే తేరుకుని మరో అస్త్రాన్ని బయటకి తీసింది. ఆ అస్త్రం పేరు ‘మహిళాస్త్రం’. దేశంలో కాస్తంత నోరున్న కాంగ్రెస్ మహిళా నాయకులను రంగంలోకి దించింది. సొంత భార్యకే న్యాయం చేయలేని మోడీ దేశంలోని మహిళలకు ఏం న్యాయం చేస్తాడని వాళ్ళచేత స్టేట్‌మెంట్లు ఇప్పించింది. మన రాష్ట్రం నుంచి మోడీ మీద మహిళాస్త్రాన్ని సంధించే బాధ్యతని తెలంగాణ ఆడపడుచు రేణుకా చౌదరి స్వీకరించారు. మోడీని మహిళా వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మొత్తమ్మీద ఈ సాకు చూపించి మోడీని మహిళలకు దూరం చేయాలన్న ప్లాన్‌లో కాంగ్రెస్ పార్టీ వుంది. ఏమవుతుందో చూడాలి.

శేరిలింగంపల్లిలో తెరాసలీలలు!

      హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్ ఆడిన డ్రామా ప్రత్యర్థి పార్టీలను మాత్రమే కాకుండా టీఆర్ఎస్ నాయకులను కూడా బితరపోయేలా చేసింది. సీట్ల కేటాయింపులో ఈరకం నాటకాలు కూడా ఆడవచ్చా, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఈ టైపులో జెల్ల కొట్టవచ్చా అని ఈ నియోజకవర్గంలోని రాజకీయ వర్గాలు నోళ్ళు నొక్కుకుంటున్నాయి. ఈ నియోజవర్గంలో తెరాసలీలల గురించి చెప్పాలంటే, టీఆర్ఎస్ పార్టీ పుట్టిన దగ్గర్నుంచీ శేరిలింగంపల్లి నియోజకవర్గం బాధ్యతలను కొండకల్ శంకర్‌గౌడ్ అనే నాయకులు నిర్వర్తిస్తున్నారు. అప్పటి నుంచి పార్టీ కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. కోట్లకు కోట్లు డబ్బు ఖర్చుపెట్టారు. ఈసారి ఎన్నికలలో శంకర్‌గౌడ్‌కి టీఆర్ఎస్ టిక్కెట్ ఖాయమని అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే టీఆర్ఎస్ శంకర్‌గౌడ్‌కి టిక్కెట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆ విషయం తెలిసిన కొండకల్ శంకర్‌గౌడ్ సంబరాలు చేసుకున్నారు. పార్టీకి తాను చేసిన సేవకి గుర్తింపు లభించిందని సంతోషించారు. అయితే ఆ తర్వాత తెలిసిన న్యూస్ విని బిత్తరపోయారు. టీఆర్ఎస్ శేరిలింగంపల్లి టిక్కెట్ శంకర్‌గౌడ్‌కే ఇచ్చింది. కానీ పార్టీకి పన్నెండేళ్ళుగా సేవ చేసిన కొండకల్ శంకర్‌గౌడ్‌కి కాదు.. నిన్నగాక మొన్న టీఆర్ఎస్‌లో చేరిన తెలుగుదేశం నాయకుడు కొమరగాని శంకర్‌గౌడ్‌కి!  ఈ విషయం తెలిసి కొండకల్ శంకర్‌గౌడ్ గుండెలో  మండిపోతోంది.  

దేవెగౌడకి పిచ్చెక్కిందా?

      మాజీ ప్రధాని దేవెగౌడకి పిచ్చిగానీ ఎక్కిందా అనే సందేహాన్ని ఆయన రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. దేవెగౌడ ఏ జన్మలోనో ఏదో పుణ్యం చేసుకున్నందువల్ల ఏ అర్హత లేకపోయినా అప్పట్లో దేశ ప్రధాని అయ్యారు. మన దేశానికి ప్రధానులుగా పనిచేసిన వారిలో అత్యంత అసమర్థుడన్న అప్రతిష్ట కూడా మూటగట్టుకున్నారు. ప్రధానమంత్రిగా పనిచేసినంతకాలం నిద్రపోవడం మినహా మరేమీ చేయని ప్రధానమంత్రిగా ఆయనకి పేరొచ్చింది. అలాంటి దేవెగౌడ ఈ ఎన్నికల తర్వాత తాను మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వుందని ప్రకటించడం ఆయన రాజకీయ ప్రత్యర్థులకు మంచి మేటర్‌ ఇచ్చింది. దేవెగౌడ చెప్పేదాని ప్రకారం దేవెగౌడ పార్టీకి 12 ఎంపీ సీట్లు వస్తే చాలు. ప్రధానమంత్రి పీఠం మీద తాను మళ్ళీ కూర్చుంటారు. ప్రధాన మంత్రి పదవికి పోటీ పడుతున్న నరేంద్రమోడీ, రాహుల్ గాంధీ ఇద్దరికీ ఆ పదవి మీద కూర్చునే అర్హత లేదని, తనకు మాత్రమే అర్హత వుందని ఆయన చెప్పారు.  దేవెగౌడ వ్యక్తం చేసిన ఈ అతి విశ్వాసాన్ని అతి తెలివితేటలు అనాలా, అమాయకత్వం అనాలా అని రాజకీయ ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఒకపక్క దేశమంతా మోడీ ప్రభంజనం వీస్తుంటే దేవెగౌడకి మళ్ళీ ప్రధానమంత్రి అవ్వాలన్న కోరిక పుట్టడం, ఆ కోరిక తీరుతుందని నమ్ముతూ వుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వారు అంటున్నారు.

రాజీపడిన కోడెల: సత్తెనపల్లి నుంచి పోటీ

      చాలామంది తెలుగుదేశం నాయకులు ప్రస్తుతం రాజీనామా బాటలో నడవలేక రాజీబాటలో నడుస్తున్నారు. నిన్నగాక మొన్న మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం కావాల్సిందేనని పట్టుబట్టిన రేవంత్‌రెడ్డి, చంద్రబాబు కాదని అనడంతో పార్టీని వదిలి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమయ్యారు. అయితే తెలుగుదేశం నాయకులు బుజ్జగించి, నచ్చజెప్పిన మీదట కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి అంగకరించారు. ఇలాంటి పరిస్థితే సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాద్ ఎదుర్కొన్నారు. రాష్ట్ర రాజకీయ రంగంలో కోడెల శివప్రసాద్ అంటే నరసరావుపేట. నరసరావుపేట అంటే కోడెల శివప్రసాద్. అలాంటి స్థానాన్ని బీజేపీ పొత్తులో ఇచ్చేయడంతో కోడెల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. పొత్తుల్లో ఇవ్వడానికి తన స్థానం తప్ప మరో స్థానం చంద్రబాబుకి దొరకలేదా అని కోడెల మథనపడిపోయారు. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై కొట్టేసి అక్కడే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేయాలని డిసైడైపోయారు. అయితే షరా మామూలుగానే పార్టీ నాయకులు కోడెలను బుజ్జగించి శాంతపరిచారు. దాంతో సత్తెనపల్లి నుంచి పోటీ చేయడానికి కోడెల అంగీకరించారు. అయితే నరసరావుపేట తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు వారిని శాంతపరిచేందుకు కోడెల ప్రయత్నిస్తున్నారు.

స్థానిక ఎన్నికలు: జగన్ పార్టీ నాయకుల దౌర్జన్యాలు

      స్థానిక ఎన్నికలలో పైచేయి సాధించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతకైనా తెగించేట్టున్నారు. స్థానిక ఎన్నికల సందర్భంగా సదరు పార్టీ నాయకుల దౌర్జన్యకాండ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలింగ్ కేంద్రాలో వైసీపీ నాయకులు దౌర్జన్యాల పరంపరను కొనసాగిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. కర్నూలు జిల్లాలోని దేవరకొండ మండలం కప్పట్రాళ్ళలో వైసీపీ కార్యకర్తలు తమ విశ్వరూపాన్ని చూపించారు. పోలింగ్ బూత్ దగ్గర వున్న టీడీపీ ఏజెంట్‌ని చావగొట్టి చెవులు మూసి అక్కడి నుంచి బయటకి పంపేశారు. ముఖ్యంగా రాయలసీమలోని పలు పోలింగ్ కేంద్రాలలో వైసీపీ నాయకులు ఏదో ఒక హడావిడి సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక ఎన్నికలలో తమ అడ్రస్ గల్లంతైపోతుందన్న భయంతోనే వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు దిగుతున్నారని తెలుగుదేశం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

అత్యాచార౦ చేస్తే ఉరితీస్తారా?.. ములాయం ప్రశ్న

      సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అత్యాచార నిరోధక చట్టాన్ని వ్యతిరేకిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచారానికి పాల్పడితే ఉరి వేస్తారా? అని ప్రశ్నించారు. 'వాళ్లు పిల్లలు. పిల్లలన్నాక తప్పులు చేస్తారు. దానికే ఉరి శిక్ష వేయాలా?' అని నేరస్థులకు మద్దతు తెలిపారు. ఇద్దరు ప్రేమికుల మధ్య విభేదాలు రాగానే, అబ్బాయి తనను రేప్ చేశాడంటూ అమ్మాయి ఫిర్యాదు చేస్తుందంటూ వ్యాఖ్యానించారు. అత్యాచారం పేరిట తప్పుడు కేసులు పెట్టే మహిళలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఢిల్లీలో గ్యాంగ్ రేప్ అనంతరం కేంద్రం తెచ్చిన ‘నిర్భయ’ చట్టాన్ని తాము సవరిస్తామని ఎన్నికల సభలో హామీ ఇవ్వడం ఆశ్చర్యకరంగా వుంది.   అయితే ములాయం చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. ములాయం ఆ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, ఈ వ్యాఖ్యలు మహిళలకే కాదు.. సమాజానికే వ్యతిరేకమని అన్నారు. ములాయం సింగ్ యాదవ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.