జాట్ రిజర్వేషన్ బిల్లుతో తృప్తి చెందని నేతలు
posted on Mar 30, 2016 @ 3:28PM
హర్యానాలో జాట్ వర్గానికి రిజర్వేషన్లను కల్పిస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఒక బిల్లును ఆమోదించి ఉండవచ్చుగాక. కానీ తాము ఈ బిల్లుతో తృప్తిగా లేమని ఆ వర్గ నేతలు తెగేసి చెబుతున్నారు. బిల్లు ప్రకారం జాట్ వర్గానికి క్లాస్ 1, 2 ఉద్యోగాలలో 6 శాతం, క్లాస్ 3,4 ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. కానీ ఆ శాతం తమకు ఏమాత్రం సరిపోవని మండిపడుతున్నారు జాట్ నాయకులు. చిన్న ఉద్యోగాలకు ఎక్కువ శాతం రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా తమను గుమాస్తాలుగా ఉంచాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపిస్తున్నారు. కాబట్టి క్లాస్ 1,2 ఉద్యోగాలలో కనీసం 12 శాతం రిజర్వేషన్ కావాలని పట్టుబడుతున్నారు.
ఇంతేకాదు! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా తమకు రిజర్వేషన్లను కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తమ అభ్యంతరాలన్నింటి గురించి చర్చించేందుకు వచ్చే నెల మూడో తేదీన జాట్ నేతలు సమావేశం కానున్నారు. మరోవైపు జాట్ వర్గం సాగించిన హింసాత్మక ఆందోళనకు ప్రభుత్వం తల ఒగ్గిందని కాంగ్రెస్ నేతలే కాదు, కొందరు బీజేపీ సభ్యులు కూడా విమర్శిస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో హర్యానా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి!