తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

      తెలంగాణ శాసనసభ తొలి సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. తెలంగాణ నుంచి ఎన్నికైన దాదాపు అందరు శాసనసభ్యులు మొదటి రోజు సమావేశాలకు ఉత్సాహంగా హాజరయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కుందూరు జానారెడ్డి తెలంగాణ అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రొటెం స్పీకర్ హోదాలో జానారెడ్డి తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మొదట తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దైవ సాక్షిగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత సభ్యులందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన తెరాస ఎమ్మెల్యేలలో చాలామంది శాసనసభకు కొత్తవారు కావడంతో కొంతమంది ప్రమాణ స్వీకారం చేసే సమయంలో తడబడ్డారు. ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులకు ప్రొటెం స్పీకర్ జానారెడ్డి అభినందనలు తెలిపారు. కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ స్థానంలో వున్న జానారెడ్డికి పాదాభివందనం చేశారు.

హిమాచల్‌ ప్రమాదం: బాబు ప్రత్యేక విమానం

      హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులను ప్రమాద స్థలానికి తీసుకువెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయించారు. ఈ విమానం శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి చండీగఢ్ కు వెళ్ళనుంది. అక్కడి నుంచి విద్యార్ధుల తల్లిదండ్రులని ఘటన స్థలానికి తీసుకువెళ్ళడానికి రెండు ప్రత్యేక బస్సులను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు మంత్రులు,అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని మంత్రి నారాయణ,ఏపీ అధికార ప్రతినిధి కంభంపాటి, ఏపీ రెసిడెంట్ కమిషనర్ సతీష్‌చంద్రను ఆదేశించారు.

పాకిస్థాన్: కరాచీ ఎయిర్‌పోర్టుపై తీవ్రవాదుల దాడి

  పాకిస్థాన్‌లో తీవ్రవాదుల కార్యకలాపాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తీవ్రవాదుల దాడులతో పాకిస్థాన్ నగరాలు వణికిపోతున్నాయి. తాజాగా కరాచి జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై తీవ్రవాదులు దాడి చేశారు. ఆదివారం రాత్రి పాత విమానాశ్రయం భవనాన్ని చుట్టుముట్టిన తీవ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో 11 మంది మృతి చెందారు. ఎయిర్ భద్రతా సిబ్బంది వేషాల్లో వచ్చిన 10 మంది తీవ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు.అయితే ఏ విమానాన్ని ధ్వంసం చేయలేదని వెల్లడించారు. తీవ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. భద్రతా సిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు తీవ్రవాదులు మృతి చెందారు. ప్రస్తుతం కరాచీ ఎయిర్ పోర్టులో పరిస్థితి అదుపులో వుంది.

హిమాచల్‌ప్రదేశ్: రంగంలోకి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం

  హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రమాదస్థలికి నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ బృందం బయలుదేరి వెళ్లిందని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. పంజాబ్‌లోని బతింద నుంచి 45 మంది రిస్క్యూ టీమ్ సభ్యులతో పాటు 4 పడవలు, గజ ఈతగాళ్లు బయలుదేరి వెళ్లారన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల గల్లంతు సమాచారం తెలియగానే అక్కడి పోలీసు అధికారులతో మాట్లాడానని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. విద్యార్థులో సురక్షితంగా ఉన్నవారి నుంచి సమాచారాన్ని తీసుకుని మిగతావారి జాడ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. కాగా, బాలానగర్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్‌తో కూడిన ప్రత్యేక పోలీసు బృందం సోమవారం ఉదయం ఘటనా స్థలానికి బయల్దేరి వెళ్ళిందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.

కేసీఆర్ దిగ్భ్రాంతి.. హిమాచల్‌కి నాయిని

  హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్‌ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో ఆ నీటి ప్రవాహంలో రాష్ట్రానికి చెందిన 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయిన ఘటన గురించి తెలియగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని, క్షేమంగా వున్న విద్యార్థులను తిరిగి హైదరాబాద్‌కి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రమాద ఘటన గురించి తెలియగానే రాష్ట్ర హోంమంత్రి నాయిని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. సోమవారం ఉదయం రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి బిఆర్ మీనా, గ్రేహౌండ్స్ ఎస్‌పి కార్తికేయలతో, కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ప్రత్యేక విమానంలో హిమాచల్ ప్రదేశ్‌లోని ఘటనా స్థలానికి బయల్దేరారు. అలాగే రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అక్కడి డీజీపీ, మండి ఎస్‌పితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

హిమాచల్‌ప్రదేశ్: ముమ్మరంగా సహాయక చర్యలు

  హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్‌ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో ఆ నీటి ప్రవాహంలో రాష్ట్రానికి చెందిన 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయిన సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అధికారులు హుటాహుటిన సహాయ చర్యలు చేపట్టారు. కొంతమంది విద్యార్థుల మృతదేహాలు లభించాయని మండి జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ అధికారులు వెల్లడించారు.సమాచారం అందగానే ఇరవైమంది గజ ఈతగాళ్లు, పదిమంది బోట్ డ్రైవర్స్‌తో సహాయక చర్యలు ప్రారంభించామని, అయితే, చీకటి కావడంతో ఆదివారం రాత్రి కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని, ఇప్పటివరకు మృతదేహాలేవీ లభించలేదన్నారు. మరోవైపు, 10 మృతదేహాలు లభించినట్లు తమకు సమాచారం ఉందని మండి జిల్లా పోలీసుకంట్రోల్‌రూమ్ అధికారులు వెల్లడించారు. డ్యామ్ గేట్లు తెరవడంతో అత్యంత వేగంతో నీటి ప్రవాహం కిందకు వెళ్తుందని, ఆ ప్రవాహం 35 కిలోమీటర్ల దూరంలోని పాంథా ప్రాజెక్టు వరకు సాగుతుందని మండీ జిల్లా ఎస్పీ ఆర్‌ఎస్ నేగీ వివరించారు. అందువల్ల గల్లంతైన విద్యార్థుల్లో ఎంతమంది ప్రాణాలతో ఉంటారనేది చెప్పలేమన్నారు. గల్లంతైన వారిలో చాలామంది పాంథా పాజెక్టులోనే లభించే అవకాశం ఉందన్నారు.

ఒక్కసారిగా నీటి ప్రవాహం వచ్చేసింది: ప్రత్యక్ష సాక్షి దివ్య

  హిమాచల్ ప్రదేశ్‌ దుర్ఘటనను ప్రత్యక్షంగా చూసిన విద్యార్థులు షాక్‌లో వున్నారు. తమ స్నేహితులు 24 మంది ఒక్కసారిగా నీటిలోకి కొట్టుకుని పోవడాన్ని వీరు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. డ్యామ్ కింది భాగంలో తోటి విద్యార్థులు ఫోటోలు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం రావడంతో కొట్టుకుపోయారని సంఘటన స్థలంలో వున్న ప్రత్యక్ష సాక్షి, విజ్ఞానజ్యోతి కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దివ్య చెప్పారు. దుర్ఘటన దృశ్యాలు ఇప్పటికీ తన కళ్లముందే కదలాడుతున్నాయన్నారు. తోటి విద్యార్థులు నీళ్లలో కొట్టుకుపోవడంతో షాక్‌కు గురయ్యానన్నారు. ఈ నెల 3వ తేదీ రాత్రి 10.30 గంటలకు తామంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరామని ఆమె తెలిపారు. తాను క్షేమంగానే ఉన్నానని హైదరాబాద్‌లోని తన తండ్రి రవిందర్‌రెడ్డికి ఫోన్ ద్వారా తెలియజేశానని చెప్పారు.

హిమాచల్‌ప్రదేశ్: అకస్మాత్తుగా గేట్లు ఎత్తడంతో విషాదం

  ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా, సమీప ప్రాంతాల వాసులను అప్రమత్తం చేయకుండానే లార్జి డ్యామ్ గేట్లను ఎత్తివేయడం వల్లనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సాధారణంగా హైడ్రో పవర్‌స్టేషన్‌లో స్వల్ప పేలుడు సంభవించినపుడు కూడా తక్షణం గేట్లు ఎత్తుతూ వుంటారు. అలాగే డ్యామ్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో అత్యధికమైతే తక్షణం గేట్లు ఎత్తి అధికంగా వచ్చి పడుతున్న నీటిని బయటికి పంపడానికి గేట్లు ఎత్తుతారు. అయితే గేట్లను ఎత్తేముందు వాకీటాకీల ద్వారా డ్యామ్‌కు సమీపంలో మూడు కిలోమీటర్ల వరకు సమీప ప్రాంత వాసులను హెచ్చరికలు జారీ చేయాల్సి ఉంటుంది. గేట్లుఎత్తే సమయంలో పెద్ద సైరన్ మోగించాల్సి ఉంటుంది. అలా హెచ్చరికలు జారీ చేయకపోవడం, సైరన్ మోగించకపోవడం వల్లే నది మధ్యలో వున్న విద్యార్థులు నీటి ప్రవాహం వస్తోందని తెలియక కొట్టుకుపోయారు. ఒకవేళ హెచ్చరికలు జారీ చేసినా, సైరన్ మోగించినా విద్యార్థులకు నీటి ప్రవాహం వస్తోందన్న విషయం తెలియకపోవడం వల్ల కూడా పట్టించుకుని వుండకపోవచ్చు.

షాక్‌లో విద్యార్థులు.. ఆందోళనలో తల్లిదండ్రులు

  హిమాచల్ ప్రదేశ్‌లోని లాల్జీ డ్యామ్ ప్రమాద ఘటనలో అప్పటి వరకూ తమతో కలసి నవ్వుతూ తుళ్ళుతూ సరదాగా గడిపిన తమ సహచర విద్యార్థులు 24 మంది అకస్మాత్తుగా నీళ్ళలో కొట్టుకుపోవడంతో సంఘటన స్థలంలో వున్న మిగతా విద్యార్థులు షాక్‌కి గురయ్యారు. 24 మంది ఒకేసారి గల్లంతవడంతో మిగిలిన విద్యార్థులు, లెక్చరర్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సహచర విద్యార్థులు వరద ప్రవాహంలో కొట్టుకుపోవడంతో మిగిలిన విద్యార్థులు షాక్‌‌తో మాట్లాడలేకపోతున్నారు. ఇదిలా వుంటే, హిమాచల్ ప్రదేశ్‌లోని లాల్జీ డ్యామ్ ప్రమాద ఘటనతో విజ్ఞాన యాత్రకు వెళ్లిన విద్యార్థుల కుటుంబాలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాయి. తమ పిల్లల నుంచి క్షేమసమాచారం అందని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి తమ పిల్లల క్షేమ సమాచారాన్ని అందించాలని కోరుతున్నారు. బాచుపల్లిలోని కళాశాల దగ్గరకి విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇండియా - చైనా భాయీ భాయీ

  ఇండియా-చైనాల మధ్య ఆదివారం జరిగిన చర్చలు స్నేహపూరిత వాతావరణంలో విస్తృత స్థాయిలో సాగాయి. భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మధ్య దాదాపు మూడు గంటలపాటు జరిగిన చర్చల్లో వివాదాస్పద సరిహద్దు అంశంతోపాటు అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ భేటీలో చర్చకు వచ్చిన అంశాలలో... 1. బ్రహ్మపుత్ర నదిపై ఆనకట్ట నిర్మించడం, 2. కొందరు భారతీయులకు ‘ప్రత్యేక వీసాలు’ జారీచేయడం,3. ఇటీవల జరిగిన దురాక్రమణలు తదితర సమస్యలను పరిష్కరించే మార్గాలపై దృష్టి పెట్టడం వున్నాయి. ఈ అంశాలపై సాధ్యమైనంత త్వరలో తగిన చర్యలు తీసుకోవాలని ఇరు దేశాల విదేశాంగ శాఖ మంత్రులు నిర్ణయించారు. ఈ భేటీలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. నరేంద్రమోదీ సారథ్యంలో భారత కొత్త ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు తన ప్రత్యేక దూతగా విదేశాంగ మంత్రి వాంగ్‌ను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పంపించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం అత్యంత ప్రాచీనమైన భారత నాగరికతకు కొత్త శక్తిని అందించిందంటూ వాంగ్ కితాబునిచ్చారు. భారత-చైనా పరిణామాలను ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయని అన్నారు.రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకుంటూ మైత్రిని పెంచే చర్యలను చేపడుతూనే పరస్పర మనోభావాలను, ఆకాంక్షలను గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని రెండు దేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

హిమాచల్‌ప్రదేశ్: విషాదాన్ని మిగిల్చిన విహారయాత్ర

  వేసవి సెలవుల సందర్భంగా ఏర్పాటు చేసిన విహార యాత్ర విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్ నగర శివార్లలోని బాచుపల్లిలోని విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం పూర్తి చేసుకున్న 48 మంది విద్యార్థులు ఈనెల 3న స్టడీటూర్‌కు వెళ్లారు. వారితో పాటు ముగ్గురు లెక్చరర్లు, ఒక లెక్చరర్ కుమారుడు కూడా ఉన్నారు. టూర్‌లో భాగంగా ఢిల్లీ, ఆగ్రా, ఉదంపూర్, సిమ్లాల్లో పర్యటించారు. అనంతరం ఆదివారం సాయంత్రం మండి జిల్లాలోని లార్జి హైడ్రోపవర్ ప్రాజెక్టు (తలోట్ గ్రామం) వద్దకు చేరుకున్నారు. డ్యామ్ గేట్ల సమీపంలోవిద్యార్థులు ఫొటో దిగుతున్న సమయంలో ఎలాంటి సమాచారం, హెచ్చరికలు లేకుండా ఒక్కసారిగా డ్యామ్ గేట్లను ఎత్తారు. దాంతో ఒక్కసారిగా పెరిగిన నది ప్రవాహంలో 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయారు. సాయంత్రం 6.00-6.20 సమయంలో ప్రమాద ఘటన జరిగినట్టు తెలుస్తోంది. గల్లంతైన వారిలో 18 మంది విద్యార్థులు, ఆరుగురు విద్యార్థినులు ఉన్నట్లు తెలిసింది. విద్యార్థులతో పాటు వెళ్లిన లెక్చరర్లు ఆదిత్య కశ్యప్, కిరణ్, సుమబాల సురక్షితంగానే ఉన్నట్టు సమాచారం.

బాధితుల వివరాల కోసం కంట్రోల్ రూమ్

  హిమాచల్‌ప్రదేశ్‌లో ఆదివారం జరిగిన ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్‌ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో ఆ నీటి ప్రవాహంలో రాష్ట్రానికి చెందిన 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయారు. ఈ నేపథ్యంలో హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వంతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సహాయక చర్యలను చేపట్టాయి. బాధిత విద్యార్థుల వివరాలు తెలుసుకునేందుకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూం నెంబర్లు 040-23202813,  9440815887. అలాగే హిమాచల్‌లోని హెల్ప్‌లైన్ నెంబర్ ల్యాండ్‌ఫోన్ 1902-224455.

హిమాచల్ ప్రదేశ్‌లో గల్లంతైన విద్యార్థులు వీరే

  హిమాచల్ ప్రదేశ్‌లో లార్జి డ్యామ్ గేట్లు తెరవడం కారణంగా హైదరాబాద్‌కి చెందిన 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారు. బాచుపల్లిలోని విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 48 మంది విద్యార్థులు స్టడీ టూర్‌లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌కి వెళ్ళారు. మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్‌ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో ఆ నీటి ప్రవాహంలో రాష్ట్రానికి చెందిన 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయారు. అప్పటివరకు ఉల్లాసంగా.. నదీ జలాల్లో కేరింతలు కొడుతూ, ఆటలాడుకుంటూ, ఫొటోలు దిగుతున్న విద్యార్థులపై ఒక్కసారిగా పెరిగిన నీటి ప్రవాహం విరుచుకుపడింది. తేరుకునే లోపే దాదాపు 24 మంది విద్యార్థులు ఆ ప్రవాహ ఉధృతికి గల్లంతయ్యారు. వారిలో కొందరి వివరాలు....   గల్లంతైన విద్యార్థుల పేర్లు.. 1. శ్రీనిధి, 2. రిశిత, 3. ఐశ్వర్య, 4. గాయత్రి, 5. విజిత, 6. రిధిమ పాపాని, 7. విదియ, 8. దేవాశిష్ బోస్, 9. రిత్విక్ రావు, 10. ఆశిష్ మంథా, 11. సందీప్ బస్వరాజ్, 12. అరవింద్, 13. పరమేష్, 14. జగదీష్, 15. అఖిల్, 16. ఉపేందర్.   క్షేమంగా వున్న విద్యార్థులు...   1. రమణ్ తేజ, 2. రిషిక, 3. లావణ్య, 4. రఘువంశ్, 5. దివ్య, 6. శ్రీకర్, 7. మౌనిక, 8. దీప్తి, 9. ప్రత్యూష, 10. నవ్య, 11. రాకేష్, 12. స‌ృజన్, 13. నితిన్, 14. శ్రీకాంత్, 15. రాఘవేంద్ర, 16. చేతన్. విద్యార్థుల పూర్తి వివరాలు అందాల్సి వుంది.

హిమాచల్‌ప్రదేశ్‌లో తెలుగు విద్యార్థులు గల్లంతు?

      హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోరం జరిగింది. హైదరాబాద్‌కి చెందిన కొంతమంది విద్యార్థులు నదిలో కొట్టుకుపోయారు. ఎంతమంది కొట్టుకుపోయారన్నది సమాచారం అందాల్సి వుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు మనాలికి 16 కిలోమీటర్ల దూరంలో వున్న వ్యాస్‌ నది వద్ద 20 మంది విద్యార్థులతో వున్న వ్యాన్ నీళ్ళు లేని నది మధ్యలో వుండగా, డ్యామ్ నుంచి నీరు వదలడంతో ఆ నీటి ప్రవాహంలో వ్యాను కొట్టుకుపోయినట్టు సమాచారం అందుతోంది. 20 మంది విద్యార్థులూ నీటిలో కొట్టుకుపోయారని తెలుస్తోంది. నీళ్ళు లేని నది మధ్యలో వ్యాన్ ఆపుకుని ఫొటోలు దిగుతూ వుండగా అకస్మాత్తుగా నీటి ప్రవాహం వచ్చినట్టు సమారం. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లోని బాచుపల్లికి చెందిన ఓ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులుగా భావిస్తున్నారు. బాచుపల్లికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 50 మంది విద్యార్థులు విహార యాత్ర కోసం హిమాచల్ ప్రదేశ్‌కి వెళ్ళారు. అనుకోకుండా ఈ సంఘటన సంభవించింది.

జై ఆంధ్రప్రదేశ్: వెంకయ్య నాయుడు

      చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదిక మీద నుంచి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడినందుకు నాకు ఒకవైపు బాధగా, మరోవైపు సంతోషంగా వుంది. తెలుగువారు రెండు రాష్ట్రాలుగా విడిపోవడం బాధని కలిగించే అంశం. కొత్త ఆంధ్రప్రదేశ్‌కి గత ప్రభుత్వం ఎంతో అన్యాయం చేసింది. ఆ విషయం గుర్తుకు వస్తేనే ఎంతో బాధ కలుగుతూ వుంటుంది. ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని లేదు. బడ్జెట్ లోటుగా వుంది, విద్యాలయాలు లేవు, ప్రభుత్వ సంస్థలు లేవు. ఎన్నో ఇబ్బందులున్నాయి. అయినా అధైర్యపడాల్సిన అవసరం లేదని నా మనసు చెబుతోంది. ఎందుకంటే తెలుగువారికి వున్న తెలివి మరెవరికీ లేదు. ఏ రంగంలో అయినా తెలుగువారు పోటీ పడతారు. ముందడుగు వేస్తారు. మనకి పెద్ద సముద్ర తీరం వుంది. తడ నుంచి ఇచ్ఛాపురం వరకు జాతీయ రహదారి వుంది. పొడవైన రైలుమార్గం వుంది. ఇంటర్ లింక్ రైలు మార్గాలు వున్నాయి. రైలు వ్యవస్థ చాలా బాగా వుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇండియాలోనే నంబర్ వన్ కాంట్రాక్టర్స్ వున్నారు. హోటల్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశే నంబర్ వన్. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో తెలుగువారే నంబర్ వన్. అందుకే మనం ఎంతమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌కి అనుభవజ్ఞుడు, సమర్థుడైన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌ని అగ్రస్థానంలో నిలుపుతారన్న నమ్మకం వుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వున్నప్పుడు పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌ పొందిన హామీలను ఎన్డీయే ప్రభుత్వం తు.చ. తప్పకుండా అమలు చేస్తుంది. దానికి ఉదాహరణ కేంద్ర కేబినెట్ మొదటి సమావేశంలోనే పోలవరం ఆర్డినెన్స్ తేవడం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోవడం బాధకరమే అయినప్పటికీ, కలసి వుండి కలహించుకోవడం కంటే, విడిపోయి సహకరించుకోవడం మేలు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరూ శ్రమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తు్న్నాను. జై ఆంధ్రప్రదేశ్’’ అన్నారు.

చంద్రబాబుతో ఎంతో అనుబంధం: పంజాబ్ సీఎం బాదల్

      చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ మాట్లాడారు. ‘‘ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఎంతో మంచి రోజు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభినందనలు. చంద్రబాబు నాయుడు సమర్థుడైన నాయకుడు. అడ్మినిస్ట్రేటర్. మీకు గొప్ప నాయకుడు దొరికాడు. తెలుగుదేశం పార్టీలో నాకు ఎన్టీఆర్ హయాం నుంచి అనుబంధం వుంది. పంజాబ్‌లో ఏ కార్యక్రమం జరిగినా నేను చంద్రబాబు నాయుడిని పిలుస్తూ వుంటాను. ఆయన ఎంత బిజీగా వున్నా వస్తూ వుంటారు. ఆ అనుబంధంతోనే నేను వచ్చాను. నా తరఫున, పంజాబ్ ప్రజల తరఫున మీకు, చంద్రబాబుకు నా అభినందనలు’’ అన్నారు.

చంద్రబాబు ఉద్వేగభరిత ప్రసంగం

      ప్రమాణ స్వీకారోత్సవ వేదిక మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ‘‘నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పెద్దకొడుకుగా వుంటాను. కాంగ్రెస్ పార్టీ చేసిన నష్టాన్ని పూడ్చుకోవలసిన అవసరం వుంది. కాంగ్రెస్ పార్టీ మనకి నష్టం చేసి అది కూడా నాశనమైపోయింది. ఇక భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. తెలుగువారు రాజధాని కోసం ఒక్క ఇటుక అయినా పంపించాల్సిన అవసరం వుంది. చందాలు ఇవ్వాల్సిన అవసరం వుంది. ఏపీ ఎన్జీవోలు, విద్యార్థులు ఎంతో సహకరించారు. సమైక్య పోరాటం సందర్భంగా పెట్టిన కేసులు మొత్తం రద్దు చేస్తానని హామీ ఇస్తున్నాను. కాంగ్రెస్ పాలన సందర్భంగా దేశం ఎంతో వెనక్కి వెళ్ళిపోయింది. ఇచ్చిన హామీలను నెరవేర్చానికి కృషి చేస్తాం. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో వుంది. ఆంధ్రప్రదేశ్‌ని పునాదుల నుంచి అభివృద్ధి చేయాలి. ఆంధ్రప్రదేశ్‌కి న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. కేంద్రం తప్పకుండా సమహరిస్తుంది. ఆ సహకారంతో మన కాళ్ళమీద మనం నిలబడి ఆంధ్రప్రదేశ్‌ని నంబర్‌వన్ చేస్తామని నమ్మకం వుంది. మనకు తీరప్రాంతం వుంది, పోర్టులు వున్నాయి. తెలివైన వారున్నారు. అన్నదాతలున్నారు. విద్యావంతులున్నారు. మనకి చాలా వసతులు కూడా వున్నాయి. రాబోయే రోజుల్లో మనం మరింత ముందుకు వెళ్తామన్న నమ్మకం వుంది. రాష్ట్రాన్ని మళ్ళీ స్వర్ణాంధ్ర చేయడానికి నిద్రపోకుండా కృషి చేస్తాను’’ అని చంద్రబాబు అన్నారు.

ప్రజలకు, కార్యకర్తలకు ఈ విజయం అంకితం: చంద్రబాబు

      తన ప్రమాణ స్వీకారోత్సవ సభకు వచ్చిన ప్రముఖులు ప్రతి ఒక్కరికీ చంద్రబాబు నాయుడు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. వారితో తనకున్న అనుబంధాన్ని, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి వారు అందించిన సహకారాన్ని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్‌కి ఈ సందర్భంగా చంద్రబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్‌కి సొంత పార్టీ వున్నప్పటికీ, తనవల్ల ఓట్లు చీలకూడదని, రాష్ట్రంలో తాను, కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి రావాలని ఏమీ ఆశించకుండా సహకరించారని చెప్పారు. బాలకృష్ణకూ చంద్రబాబు థాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘వీరందరినీ చూస్తుంటే కొండంత ధైర్యం, ఎక్కడా లేని శక్తి నాకు వచ్చింది. ఈ ప్రమాణ స్వీకారం మీద కొంతమంది విమర్శలు చేశారు. కానీ ఈ ప్రమాణ స్వీకారం ఈరకంగా చేసింది ఆంధ్రప్రదేశ్‌కి ధైర్యం ఇవ్వడానికి, భరోసా ఇవ్వడానికి! నాకు అండగా నిలిచిన ఈ పెద్దలందరికీ శిరసు వంచి నమస్కారం చేస్తున్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అగమ్యగోచరమైన స్థితిలో వుంది. ఎన్నో సమస్యలు వున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలుగువారికి ఈ పరిస్థితి తెచ్చింది. మనం కసిగా పనిచేద్దాం. ధైర్యంగా ముందుకు వెళ్దాం. ఆ శక్తి తెలుగుజాతికి వుంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, కేంద్రంలో మోడీ అధికారంలోకి రావాలని అందరూ కోరుకున్నారు. ఈ విజయం తెలుగు ప్రజలకు అంకితం చేస్తున్నాను. తెలుగుదేశం కార్యకర్తల మేలు మరచిపోలేను. ఈ విజయం కార్యకర్తలకూ అంకితం చేస్తున్నాను. హైదరాబాద్‌లో ప్రమాణ స్వీకారం చేయనని నేను ముందే చెప్పాను. అలాగే చేశాను. మొదటి కేబినెట్ విశాఖలో పెట్టబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్నీ అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకున్నాను. మళ్ళీ రాజధాని కట్టే వరకూ నంబర్‌వన్ కూలీగా పనిచేస్తాను. నన్ను ఆశీర్వదించాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నారు. మనకు ఇప్పుడు ఎన్నో ఇబ్బందుల్లో వున్నాం. ఎంత అప్పుంది. ఆదాయం వుంది.. జీతాలు ఎంత ఇస్తామనేది కూడా నాకు తెలియదు. వెంకయ్య నాయుడి వల్లే పోలవరం వచ్చింది. మనం కష్టపడదాం. శ్రమిద్దాం. మనకి కేంద్రం అండగా వుంటుంది. మోడీ మనతోనే వుంటారు. మనకి సహకరిస్తారు. కేంద్ర ప్రభుత్వం మనకి న్యాయం చేస్తుందన్న నమ్మకం వుంది. ఈ సందర్భంగా యుగపురుషుడు, తెలుగు జాతి వున్నంతవరకు మరచిపోలేని మహానాయకుడు ఎన్టీఆర్ని ఈ సందర్భంగా తలచుకుంటున్నాను. దేశాభివృద్ధికి తెలుగువారు ఎంతో కృషి చేశారు. 

ఐదు ఫైళ్ళ మీద చంద్రబాబు సంతకాలు

      ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు ప్రజలకు మాట ఇచ్చినట్టుగా మూడే ఫైళ్ళ మీద కాకుండా మొత్తం ఐదు ఫైళ్ళ మీద సంతకాలు చేశారు. ఫైళ్ళ మీద సంతకాల విషయంలో ఎవరూ ఊహించని ట్విస్టు ఇచ్చారు. రైతులు, చేనేత కార్మికులు, డ్వాక్రా మహిళల రుణాల రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించే ఫైలు మీద మొదటి సంతకం పెట్టారు. అలాగే వికలాంగులకు, వృద్ధులకు గాంధీ జయంతి నుంచి వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చే విధంగా ఆదేశిస్తూ రెండో సంతకం పెట్టారు. ఎన్టీఆర్ సుజల పథకం కింద అన్ని గ్రామాలకూ తాగునీరు ఇచ్చే ఆదేశాల మీద మూడో సంతకం పెట్టారు. బెల్టు షాపులను రద్దు చేసే ఆదేశాల మీద నాలుగో సంతకం చేశారు. ఉద్యోగుల వయో పరిమితి పెంచే ఆదేశాల మీద ఐదో సంతకం చేశారు. నిరుద్యోగులకు తాము అండగా నిలుస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు.