ఆదినారాయణ రెడ్డి మమ్మల్ని చంపేస్తారు.. రామసుబ్బారెడ్డికి ఫిర్యాదు

ఒకే పార్టీలో ఉన్నప్పటికీ టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, రామ సుబ్బారెడ్డిల మధ్య అంతగా సత్సంబంధాలు లేవన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. గతం నుండే వీరిద్దరి మధ్య విబేధాలు ఉంటున్నప్పటికీ.. తాజా వివాదాల వల్ల ఇంకా దూరం పెరుగుతున్నట్టు తెలుస్తోంది. పెద్దదండ్లూరు గ్రామంలో ఇటీవలే దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ గ్రామాన్ని సందర్సించడానికి గాను రామసుబ్బారెడ్డి అక్కడికి వెళ్లారు. అలా వెళ్లిన ఆయనకు ఆదినారాయణ రెడ్డి, ఆయన సోదరుడు రామాంజనేయ రెడ్డి తమపై దాడులు చేశారని పలువురు రామసుబ్బారెడ్డి వద్ద వాపోయారు. ఈ క్రమంలో దాడికి గురైన సుబ్బారాయుడి భార్య ఆయన వద్దకు వచ్చి జరిగిన ఉదంతాన్ని కన్నీళ్లతో చెప్పింది. అభివృద్ధి పనులు చేయించాలని కోరినందుకే, చెప్పులతో కొట్టుకుంటూ ఈడ్చుకు వెళ్లారని వాపోయింది. తాము కేసులు పెట్టలేమని, ఇప్పుడు మీరు వచ్చినందుకు, తర్వాత మమ్మల్ని చంపేస్తారని భయపడుతూ చెప్పింది. ట్రాక్టర్లలో వచ్చిన జనాలు ఊరిపై దాడి చేసి డబ్బులు దోచుకెళ్లారని, ఇళ్లల్లోకి దూరి ఫర్నీచర్ ధ్వంసం చేశారని బాధితులు ఆరోపించారు. దీనిపై స్పందించిన ఆది నారాయణరెడ్డి..తనపై కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని.. జిల్లా అభివృద్దికి రామసుబ్బారెడ్డితో కలిసి పనిచేయడానికి తాను సిద్దమే అని చెప్పారు. మరి రామసుబ్బారెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

పాశ్వాన్ ప్రతిపాదన..కాంగ్రెస్ మద్ధతు

సంపన్న దళితులు, ఇతర కులాల వారు స్వచ్ఛందంగా రిజర్వేషన్లు వదులుకోవాలంటూ కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడు, లోక్‌జన శక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ చేసిన ప్రతిపాదనలకు అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వస్తోంది. ఆర్థికంగా సమాజంలో నిలదొక్కుకున్న దళితులు, తమకు హక్కుగా వస్తున్న రిజర్వేషన్‌ను తిరస్కరించాలని కోరారు. దీని వల్ల ఆర్ధికంగా బలహీనంగా ఉన్న వారికి ప్రయోజనం కలుగుతుందని చిరాగ్ అన్నారు. ఇది వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన నిర్ణయమని చట్టాల ద్వారా కాదని చిరాగ్ స్పష్టం చేశారు. చిరాగ్ ప్రతిపాదనను కాంగ్రెస్ స్వాగతించింది. రిజర్వేషన్ల వల్ల వస్తున్న ప్రయోజనాలను ధనిక దళితులు స్వచ్ఛందంగా వదులుకుంటే నిజమైన పేదలకు లబ్థి కలుగుతుందని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ అన్నారు.  

కొల్లం ఘటన ఎఫెక్ట్.. మనసు మార్చుకున్న కర్ణాటక

మొత్తానికి కేరళ కొల్లం పుట్టింగల్ దేవి ఆలయంలో జరిగిన ప్రమాదం వల్ల పలు రాష్ట్రాలు కళ్లు తెరిచినట్టు కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదంలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వందలమందికి గాయాలయ్యాయి. ఈనేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు జరగకుండా కర్ణాటక వాసులు ముందుగానే జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. పాత బెంగళూరులోని ధర్మారాయస్వామి ఆలయంలో శక్తిమాతకు పూజలు జరిపి నిర్వహించే కరగ ఉత్సవాల్లో ఈ సంవత్సరం టపాకాయలు కాల్చరాదని నిర్వాహకులు నిశ్చయించారు. అయితే ముందు దాదాపు లక్ష రూపాయల టపాసులు కాల్చాలని అనుకున్నా.. ఆలయ నిర్వాహకులు ఆ తరువాత నిర్ణయాన్ని మార్చుకున్నారు. దాదాపు 9 రోజులు జరిగే ఈ కరగ ఉత్సవాల్లో టపాసులు కాల్చడం ఆనవాయితీ. ఈ సంప్రదాయం 500 ఏళ్ల నుండి ఉందని.. కానీ ఈసారి మాత్రం టపాసులు కాల్చకుండానే ఉత్సవాలు నిర్విహంచాలని చూస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.

సల్మాన్, ధోని అర్థ్రరాత్రి మీటింగ్.. ఎందుకబ్బా..?

  ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే.. సల్మాన్ ఖాన్ ను.. టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని కలవడం. అందులో ఆశ్చర్యం ఏంటంటారా.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్.. వారిద్దరూ కలిసింది ఏదో పగలు అయితే అంత చర్చ ఉండకపోయేది.. ఇద్దరూ కలిసింది అర్థ్రరాత్రి.. సల్మాన్ ఖాన్ ను మహేంద్రసింగ్ ధోనీ సతీసమేతంగా కలిశాడు. నిన్న అర్ధరాత్రి సల్మాన్ నివాసానికి మహేంద్రసింగ్ ధోనీ, భార్య సాక్షి, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ కుమార్తె పూర్ణ పటేల్ కూడా రావడం విశేషం. ధోనీ కారు సల్మాన్ ఇంటికి చేరగానే, ఎదురెళ్లి ధోనీని సల్మాన్ ఇంట్లోకి తీసుకెళ్లాడు. అయితే సల్మాన్ ను ధోనీ అంత అర్ధరాత్రి ఎందుకు కలవాల్సి వచ్చింది? అనే విషయాన్ని ఇద్దరూ వెల్లడించకపోవడం విశేషం. దీంతో వీరిద్దరి మీటింగ్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఎవరు మొదట నోరు విప్పుతారో చూడాలి.

అన్ని నియోజక వర్గాల్లో అగ్నిమాపక కేంద్రాలు..

  కేరళ కొల్లాం ఘటన వల్ల అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఓ నిర్ణయం తీసుకున్నారు. కేరళలో జరిగిన అగ్ని ప్రమాదం లాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడా జరగకుండా చూస్తామని చెప్పారు. అంతేకాదు.. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అగ్నిప్రమాదాలు జరగకుండా  ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తామ‌ని.. రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈనెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు పేర్కొన్నారు

మాల్యాకు కృతజ్ఞతలు తెలిపిన కోహ్లి.. ఎందుకో..?

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ విజయ్ మాల్యాకు కృతజ్ఞతలు తెలిపాడు. కోహ్లీ ఎంటీ మాల్యాకు కృతజ్ఞతలు చెప్పడం ఏంటని అనుకుంటున్నారా.. ఐపిఎల్ 9 సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా.. కోహ్లీ కెప్టెన్సీలో రాయల్ చాలెంజర్స్ జట్టు, హైదరాబాద్ సన్ రైజర్స్ తలపడనున్నారు. ఈసందర్భంగా కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. అసలు నేనింత మంచి పేరు తెచ్చుకోవడానికి గల కారణం మాల్యానే అని.. ఐపిఎల్ ప్రారంభంలో  చాలెంజర్స్ తరపున ఆటగాడిగా నన్ను ఎంపిక చేసింది మాల్యానే అని.. ఆతరువాతే క్రికెట్లో ఉన్నత శిఖరాలకు ఎదగడం మొదలు పెట్టానని.. అందుకు మాల్యాకు కృతజ్ఞతలు తెలుపుతన్నానని అన్నారు. కాగా బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి మాల్యా విదేశాల్లో చెక్కేసిన సంగతి తెలిసిందే.

ఇకనుండి అద్దెకు ఐఫోన్లు..

  ఈ మధ్య కాలంలో ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ ఉండటం కామన్. అయితే స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్లు మాత్రం తమ చేతిలో ఐఫోన్ ఉండాలనుకుంటారు. అయితే స్థోమత ఉన్నవాళ్లు కొనుక్కుంటారు.. లేని వాళ్లు వాటిని చూసి సంతోషపడతారు. అయితే ఇప్పుడు అలా చూసి సంతోషపడేవాళ్లకి యాపిల్ సంస్థ ఓ ఆఫర్ ను తీసుకొచ్చింది. తన ఫోన్లను అద్దెకు ఇస్తామని యాపిల్ సరికొత్త ప్రతిపాదన చేసింది. భారత కార్పొరేట్లు తాజా ఐఫోన్ ఎస్ఈ వేరియంట్ లను అద్దెకు తీసుకోవచ్చని, నెలకు రూ. 999ల అద్దెపై రెండేళ్ల పాటు వీటిని లీజుకు ఇస్తామని తెలిపింది. ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్ రకాలు అద్దెకు తీసుకోవాలంటే నెలకు రూ. 1,199, రూ. 1,399 అద్దెను చెల్లించాల్సి వుంటుందని తెలిపింది. ఇంకెందుకు ఆలస్యం డబ్బులు కట్టండి.. ఐఫోన్ అద్దెకు తెచ్చుకోండి.

పాకిస్థాన్ లో మరో భారతీయ ఖైదీ అనుమానాస్పద మృతి.. 20 ఏళ్లనుండి జైల్లో

  పాకిస్థాన్ లో మరో భారతీయ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన కలకలం రేపుతోంది. పాకిస్థాన్లో లఖ్ పత్ జైల్లో ఖైదీగా ఉన్న భారత జాతీయుడు క్రిపాల్ సింగ్ అనుమానాస్పదస్థితిలో చనిపోయాడు. 1992 వ సంవత్సరంలో మద్యం తాగి వాఘా సరిహద్దు దాటిన క్రిపాల్ ను పాకిస్థాన్.. ఉగ్రవాదం.. గూఢాచార్యం పేరుతో జైల్లో ఖైదీగా బంధించింది. అప్పటినుండీ జైల్లోనే గడుపుతున్న క్రిపాల్.. నిన్న ఉదయం జైలు గదిలో చనిపోయి కనిపించాడు. దీంతో ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిన్నా అస్పత్రికి తరలించారు. మరోవైపు క్రిపాల్ సోదరి జాగిర్ కౌర్ మాత్రం ఇది హత్యే అని ఆరోపిస్తున్నారు. తన అన్నను విడుదల చేయాలని భారత ప్రభుత్వం ఎప్పటినుండో కోరుతున్నప్పటికీ పాక్ మాత్రం స్పందించలేదని.. ఏప్రిల్ 2013లో సరబ్ జిత్ సింగ్ ను దారుణంగా హత్య చేసి చంపేసినట్టుగానే క్రిపాల్ ను హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. కనీసం తన అన్న మృతదేహాన్ని ఇండియాకు తెప్పించాలని ఈ దిశగా భారత ప్రభుత్వం కృషి చేయాలని క్రిపాల్ సోదరి జాగిర్ కౌర్ కోరారు.

అమరావతి.. అక్రమంగా కోట్లకి కోట్లు.. సీఆర్డీయే అధికారి ఇంటిపై సోదాలు

  ఒక పక్క ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తుంటే మరోపక్క దీనిని అడ్డంపెట్టుకొని కొంతమంది కోట్లకి కోట్లు సంపాదించుకున్నారు. అలా అక్రమంగా సంపాదించి అడ్డంగా బుక్కయ్యాడు ఓ సీఆర్డీయే అధికారి. వివరాల ప్రకారం.. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం సీఆర్డీఏను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సీఆర్డీఏలో రెహ్మాన్ టౌన్ ప్లానింగ్ అధికారిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన అక్రమంగా 4 కోట్ల ఆస్తులు కూడబెట్టారు అన్న ఆరోపణలు వస్తుండటంతో ఏసీబీ రెహ్మాన్ ఇంటిపై సోదాలు నిర్వహించింది. గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నంలోని పదకొండు చోట్ల అధికారులు దాడులు చేశారని తెలుస్తోంది. ఆయన ఇంట్లో విదేశీ కరెన్సీ కూడా దొరికినట్టుగా సమాచారం. ఆయన వద్ద రూ.1.60 కోట్ల అక్రమాస్తులను అధికారులు గుర్తించారని తెలుస్తోంది. విశాఖ ఆయన నివాసంలో 4.46 లక్షలు, విదేశీ కరెన్సీ, బంగారంతో పాటు పలు జిల్లాల్లో స్థిరాస్తులు గుర్తించారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.

రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

పద్మ అవార్డలు ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విజేతలకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐగుగురికి పద్మవిభూషణ్, పదిమందికి పద్మభూషణ్, 40 మందికి పద్మశ్రీ అవార్డులు అందించారు. సీనినటుడు రజినీకాంత్, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా తదితర ప్రముఖులు అవార్డులను అందుకున్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హామీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు హాజరయ్యారు.  

మరో నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి..! బుజ్జగించే పనిలో జగన్..

  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ నుండి ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు దాకా టీడీపీలోకి చేరారు. ఇప్పుడు మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా టీడీపీ లోకి వెళ్లడానికి చూస్తున్నట్టు వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ వారిని బుజ్జగించే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు.. గొట్టిపాటి రవి, మేకా ప్రతాప్ లను పిలిపించి ఆయన చర్చలు జరిపినట్టు రాజకీయవర్గాల టాక్. అంతేకాదు.. కేవలం రాజ్యసభ ఎన్నికల కోసమే పార్టీల్లోకి ఆహ్వానిస్తున్నారు.. ఆ తరువాత ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. వెళ్లిన వారు ఈ విషయం తెలుసుకోవడంలేదు అని జగన్ వారికి చెప్పినట్టు సమాచారం. కాగా రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నాలుగో సీటును కూడా గెలుచుకోవడానికి సాధ్యమైనంత ఎక్కువ మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను టిడిపిలోకి తీసుకు రావడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.

ఆ భారతీయ విద్యార్ధులపై చర్యలు తీసుకుంటా..

తెలియక తప్పు చేస్తే ఏముండదు కానీ.. తెలిసి, తెలిసి తప్పు చేస్తే దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పదు. ప్రస్తుతం అమెరికాలో అక్రమంగా ఉండాలనుకున్న భారతీయ విద్యార్ధుల పరిస్థితి అలానే ఉంది. ఎందుకంటే.. మోసపు యూనివర్శిటీ అని తెలిసీ కూడా.. వీసా గడువు లేకుండా దేశంలోనే ఉండిపోవాలని చూసిన 306 మంది భారతీయ విద్యార్ధులపై అమెరికా చర్యలు తీసుకుంటామని తెలిపింది. దీనిపై  హోంల్యాండ్‌ సెక్యూరిటీ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌  కొంతకాలం నుండి స్టింగ్ ఆఫరేషన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్లోనే అసలు వివరాలు బయటపడ్డాయి. అధికారులే బోగస్ వర్శిటీని స్పష్టించి విద్యార్ధులపై వల విసిరారని.. వీసా పొడిగింపుకు ప్రయత్నించి అది పొందలేకపోయిన వారికి బ్రోకర్లు రంగ ప్రవేశం చేసి వర్శిటీలో ప్రవేశాన్ని ఇప్పించారని.. అయితే మొత్తం 1000 మంది విద్యార్ధులు వర్శిటీలో చేరగా అది తప్పు అని తెలియక కొంతమంది చేరగా.. అందులో విషయం తెలిసినా కూడా కొంతమంది విద్యార్ధులు చేరారని తెలిసింది. దీంతో అమెరికా కూడా అది ఫ్రాడ్ అని తెలిసినా కూడా తప్పు చేసిన విద్యార్దులపై మాత్రమే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కాగా ఈ ఆపరేషన్లో బయటపడ్డ మొత్తం 32 మంది బ్రోకర్లను అరెస్ట్ చేశారు. వారిలో 11 మంది భారతీయులు కూడా ఉన్నారు.

సాయిబాబా, శని దేవుళ్లుగా అనర్హులు.. స్వామి స్వరూపానంద సరస్వతి

  సాయిబాబాను పూజించడంవల్లే కేరళలోని కొల్లం, పుట్టంగల్ దేవి ఆలయంలో ప్రమాదం జరిగిందని ద్వారాకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. ఇప్పుడు ఈ ఘటనపై ఆయన మరోసారి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని శనిసింగనాపూర్ ఆలయంలో మహిళలు ప్రేవేశించడంవల్లే అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని. శని దేవాలయంలోకి మహిళల్ని అనుమతించినందువల్లే  దేశంలో అన్ని అనర్థాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. నాలుగు శతాబ్ధాలుగా ఉన్న సంప్రదాయాన్ని ఒక్కసారిగా కూల్చివేసి మహిళలు ఆలయంలోకి ప్రవేశించారు.. అందుకే అమ్మవారి ఆలయంలో విలయం జరిగిందని వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ అసలు షిర్డీ సాయిబాబా, శని దేవుళ్లు.. దేవుళ్లుగా అనర్హులని.. వారికి పూజలు చేయడంవల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. మరోవైపు స్వరూపానంద స్వామి చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.