ఒంటిమిట్ట, భద్రాచలంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు..

  శ్రీరామనవమి సందర్భంగా రాముని ఆలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో సీతా రాముని కల్యాణం చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా కడపజిల్లాలోని ఒంటిమిట్టలో శ్రీ కోదండరామాలయంలో నవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి అతిధులుగా గంటా శ్రీనివాసరావు హాజరయి.. కోదండరాముడికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఇంకా ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి కూడా హాజరయ్యారు.     ఇంకా ఖమ్మం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవాలయం భక్తులతో పోటెత్తింది. నేటి తెల్లవారుజాము నుంచే ఆలయం ముందు ప్రత్యక్షమైన భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు భద్రాద్రి వెళ్లి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు.

ప్రియాంక అవసరం నాకు లేదు.. రాబర్ట్ వాద్రా

  సోనియా గాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రాపై భూ కొనుగొళ్ల వ్యవహారంపై ఆరోపణలు ఉన్నసంగతి తెలిసిందే. రాజస్థాన్, హర్యానాలో వాద్రా కంపెనీలు అక్రమ భూ కొనుగోళ్లకు పాల్పడినట్టు బీజేపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వాద్రా స్పందించి.. నేను ఇక్కడే పుట్టాను.. ఇక్కడే ఉంటాను.. దేశాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం నాకు లేదు అని ఆయన అన్నారు. అంతేకాదు.. ఈ విషయంపై ఆయన ఇంకా మాట్లాడుతూ ప్రియాంక గాంధీ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నా జీవితాన్ని ఉద్ధరించడానికి ప్రియాంక అవసరం నాకు లేదు అని అన్నారు. నా తండ్రి నాకు చాలినంత ఇచ్చారు.. అన్ని రకాల పరిస్థితులను తట్టుకొని నిలబడగల చదువు నాకుంది' అని వాద్రా ఏఎన్‌ఐ వార్తాసంస్థతో పేర్కొన్నారు. ఇంకా ఆయన రాజకీయ ఎంట్రీపై మాట్లాడుతూ.. తానేప్పుడూ రాజకీయాల్లోకి రానని చెప్పలేదు.. నా ఆత్మసాక్షి రమ్మంటే వస్తాను.. దేనికైనా టైమ్ రావాలని వ్యాఖ్యానించారు. అయితే అంతా బాగానే ఉన్నా వాద్రా ప్రియాంక గాంధీ గురించి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడ హాట్ టాపిక్ అయ్యాయి.

మంత్రులు గంటా, అయ్యన్నలకు చంద్రబాబు క్లాస్.. అంతవరకూ ఎందుకు రానిచ్చారు..

చంద్రబాబు మంత్రులకు అప్పుడప్పుడు క్లాస్ పీకడం కామనే. ఇప్పుడు తాజాగా మరో ఇద్దురు మంత్రులకు చంద్రబాబు క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. విశాఖ రైల్వే జోన్ కోసం గుడివాడ అమన్ నాథ్ దీక్ష ప్రారంభించడం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ దీక్షకు ప్రజల నుండి మద్దతు పెరుగుతోందని నిఘా వర్గాలు చంద్రబాబుకి చెప్పడంతో ఈవిషయంపై మంత్రులు గంటా శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడులకు క్లాస్ పీకారట. అసలు దీక్ష చేసే వరకూ ఎందుకు రానిచ్చారని.. అసలు దీక్షకు అనుమతి ఇవ్వకుండా ఉండాల్సిందని.. ఇప్పుడు ఏం చేసినా ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందని, జిల్లా వ్యవహారాలను గాలికి వదిలేశారని మండిపడ్డారట. జోన్ వస్తుందన్న సెంటిమెంటుతో ఉన్న ప్రజల్లో వ్యతిరేకత పెరగకముందే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించినట్టు సమాచారం.

పవన్ కళ్యాణ్ అసలు అలా ఎలా అంటారు.. గల్లా

  టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్.. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. పవన్ కళ్యాణ్ టీడీపీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్దికి కోసం ప్రయత్నించడంలేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన జయదేవ్.. పవన్ కళ్యాణ్ అసలు అలా ఎలా మాట్లాడుతారని.. తాను స్వయంగా పవన్ ను కలిసి అభివృద్ధి ఎలా జరుగుతున్నదో, తామెలా కష్టపడుతున్నామో తెలియజేస్తానని అన్నారు. అంతేకాదు బీజేపీ పొత్తుపై గురించి కూడా మాట్లాడుతూ.. 2019 లో జరిగే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుందో.. లేదో ఖచ్చితంగా చెప్పలేమని.. అప్పటివరకూ ఆ పార్టీతో కలిసి నడుస్తామని వ్యాఖ్యానించారు.

ఎర్రబెల్లి చెల్లని రూపాయి.. రేవంత్ రెడ్డి

  టీడీపీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎర్రబెల్లిపై.. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గురువారం హన్మకొండలో టీడీపీ మండలాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల వర్క్‌షాపు, జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఎర్రబెల్లి దయాకర్ గురించి మాట్లాడుతూ.. టీడీపీ పార్టీలో అన్ని పదవులు అనుభవించి టీఆర్ఎస్ లో చేరారు.. ఇక్కడ ఒక వెలుగు వెలిగిన ఆయన టీఆర్ఎస్లో మాత్రం చెల్లని రూపాయిగా ఉన్నారని.. పాపం కేసీఆర్ ఫాంహౌస్ వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని ఎద్దేవ చేశారు. టీడీపీలో ఉండగా ఎర్రబెల్లికి పదవులు ఇవ్వకుండా ఉండి ఉంటే.... ఇప్పటికీ ఎర్రబెల్లి రేషన్ డీలర్ గానే ఉండేవాడని ఎద్దేవా చేశారు.

మళ్లీ మాట మార్చిన పాకిస్థాన్..

  మన ప్రత్యర్ధ దేశమైన పాకిస్థాన్ ఎప్పుడూ మాట మారుస్తూనే ఉంటుంది. ఆ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు అర్ధమైంది మనకి. నాలుకకి నరం లేనట్టు మాట్లాడే పాకిస్థాన్ ఒకసారి ఒక మాట మాట్లాడితే.. ఆవెంటనే మరో మాట మాట్లాడుతుంది. ఇప్పుడు మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసింది పాక్. గతంలో భారత్-పాక్ కు మధ్య ధ్వైపాక్షిక చర్చలు జరగాల్సి ఉంది. అయితే అదే సమంయలో పఠాన్ కోట్ పై దాడి జరగడంతో అప్పుడు ఆచర్చలకు బ్రేక్ పడింది. దీంతో అప్పటి నుండి పాక్-భారత్ ల మధ్య చర్చలపై డౌట్ ఉండేది. అసలు జరుగుతాయా లేదా అన్న సందేహాలు ఉండగా పాక్ ప్రభుత్వం దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటేనే తప్ప చర్చలు జరిగేది లేదని మన ప్రభుత్వం తేల్చి చెప్పింది. అంతేకాదు భారత్ తో ద్వైపాక్షిక చర్చలు నిలిచిపోయినట్లేనని భారత్ లో ఆ దేశ రాయబారి అబ్దుల్ బాసిత్ గత వారంలో ప్రకటించారు. అందుకు పూర్తి భిన్నంగా పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా నిన్న ఇస్లామాబాదులో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తో చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని ప్రకటించిన జకారియా, ఈ విషయంలో ద్వారాలు మూసుకుపోలేదని ప్రకటించారు. మొత్తానికి పాకిస్థాన్ తాము చేసిన వ్యాఖ్యలపై తమకే నిలకడ లేకుండా మాట్లాడుతున్నారు.

అమ్మకానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్..

  అదేదో పాత వస్తువును కనుక ఈ కామర్స్ సైట్లో పెట్టి అమ్మేసినట్టు అమ్మకానికి పెట్టారు పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ను. ఈ విచిత్రమైన ఘటన పాకిస్థాన్ లోనే జరగడం ఆశ్చర్యకరం. పాకిస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి 'యూస్ లెస్ పాకిస్థాన్ పీఎం నవాజ్ షరీఫ్ ఫర్ సేల్' అంటూ ఆయన ఫొటోను ఈ 'బే'లో  పెట్టి ఒక ప్రకటన ఇచ్చాడు. అంతేకాదు ఆయన ప్రాథమిక ధర 66,200 పౌండ్ల అంటూ ఆయన ధరను కూడా ఫిక్స్ చేశాడు. ఇంకా ఆయన గురించి చెబుతూ.. ఇప్పటికే వాడేసిన ప్రధాని షరీఫ్‌ను అమ్మేస్తున్నాం. ఇంక ఎంతమాత్రం మాకు అవసరం లేదు. ఈ అమ్మకం కోసం బాక్స్ గానీ, ఇన్‌స్ట్రక్చన్స్ గానీ ఇవ్వబడవు. కొనుగోలుదారుడే వచ్చి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐటెం అమ్మకందారుడు ఇంతవరకు టచ్ చేయలేదు. సెంట్రల్ లండన్ నుంచి ఐటెంను కలెక్ట్ చేసుకోవచ్చు. కొనుగోలు పూర్తికాగానే పూర్తి చిరునామా తెలియజేస్తాం. కొనుగోలుదారుడే రవాణా ఏర్పాట్లు చేసుకోవాలి అని ప్రకటనలో పేర్కొన్నాడు.  

నా బట్టలు చించేశారు.. తృప్తీ దేశాయ్

భూమాతా బ్రిగేడ్ సంఘం అధ్యక్షురాలు తృప్తీ దేశాయ్ కొత్త ఆరోపణలు చేశారు. ఆమె కొల్హాపూర్ లోని మహాలక్ష్మీ దేవాలయానికి వెళ్లగా అక్కడ ఆమెను పోలీసులు అడ్డుకొని.. చీర కట్టుకున్న వారికే ఆలోయంలోకి ప్రవేశం ఉంటుందని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఇప్పుడు దీనిపై ఆమె కొల్హాపూర్ లో కొందరు తన బట్టలు చించివేశారని, తనను నోటితో చెప్పలేని విధంగా తూలనాడారని.. హిందూ సంస్థలు తనను హత్య చేయాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అంతేకాదు ఆందోళనకారులు తనను ప్రాణాలతో బయటకు పోనీయరాదని మాట్లాడుకున్నారని, స్వయంగా ఆలయ పూజారి తనను అడ్డుకున్నారని అన్నారు. ఈ విషయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కల్పించుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా తప్తీ దేశాయ్ పై కొంతమంది మతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రైతులకు మరితం లాభదాయకంగా మోడీ "నామ్"

అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ('నామ్') ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మరితం లాభదాయక ధరను దగ్గర చేయడమే దీని లక్ష్యమని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి రాదా మోహన్ సింగ్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులకు ఒకే ధరను అందించే ఆలోచనతో తయారైన ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్ ఈ నామ్.. 8 రాష్ట్రాల్లోని, 21 ప్రధాన మండీ( వ్యవసాయ మార్కెట్)లను 585 రెగ్యులేటెడ్ హోల్ సేల్ మార్కెట్లను భాగం చేస్తూ రూపొందించిన ఈ ఆన్ లైన్ ఫ్లాంట్ ఫాం ద్వారా రైతులు లాభపడవచ్చని.. దీని ద్వారా రైతులు తమ ఉత్పత్తులను పోటీ ధరలకు విక్రయించుకోవచ్చని, వినియోగదారులకు స్థిరమైన ధరలకు వ్యవసాయ ఉత్పత్తులు లభిస్తాయని తెలిపారు.

కన్నయ్య కుమార్ పై చెప్పు దాడి.. ఎండలు మండిపోతున్నాయి జాగ్రత్త

  జైఎన్యూ సంఘ నేత కన్నయ్య కుమార్ కు చేదు అనుభవం ఎదురైంది. నాగపూర్ లోని ఓ సభలో పాల్గొన్న ఆయనపై భజరంగ్ దళ్, ఏబీవీపీ కార్యకర్తలు చెప్పు విసిరి దాడి చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో కన్నయ్య సభికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. శాంతించాలని, తనపై చెప్పు విసిరిన వ్యక్తి చెప్పులు పోగొట్టుకున్నాడని అన్నారు. అంతేకాదు వారిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. జెఎన్యూ, హెచ్ సీయూలో జరిగిన ఘటనల్లో నా చెప్పులు పోయాయని.. అది గమనించిన భజరంగ్ దళ్, ఏబీవీపీ సోదరులు తనకు చెప్పులు తెచ్చారని.. కానీ ఇక్కడ వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. ఇక కన్నయ్య కుమార్ పై బయట ఎండలు మండిపోతున్నాయి. ఇలా ఒక్కో చెప్పు పారేసుకుంటే కాళ్లు కాలుతాయి, నాపై ద్వేషం పెంచుకున్నా పర్లేదు. కానీ, మీ కాళ్లు కాలకుండా చూసుకోండి. నా మీద ప్రేమతో చెప్పులు పోగొట్టుకోకండి' అని ఆయన చమత్కరిస్తూ మాట్లాడారు. ఇదిలా ఉండగా కన్నయ్యపై దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్రైన్‌లో బెర్త్ ఇవ్వలేదని ఎమ్మెల్యే రచ్చరచ్చ

ట్రైన్‌లో బెర్త్ ఇవ్వలేదని ఒక ఎమ్మెల్యే రచ్చ రచ్చ చేశాడు. నాందేడ్‌కు చెందిన శివసేన ఎమ్మెల్యే హేమంత్ పాటిల్ ముంబై నుంచి తన సొంతఊరు వెళ్లేందుకు ఛత్రపతి శివాజీ టెర్మినల్‌కు చేరుకున్నాడు. దేవగిరి ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో ఆయనకు సైడ్ బెర్త్ కేటాయించారు. అయితే తనకు సైడ్ బెర్త్ వద్దని వేరే చోట బెర్త్ ఇవ్వాలని టీసీతో వాగ్వివాదానికి దిగాడు. అలా సాధ్యం కాదని టీసీ చెప్పడంతో ఆయనలో ఆవేశం కట్టలు తెంచుకుంది అంతే కార్యకర్తలతో కలిసి నానా గందరగోళం చేశాడు. రైలు కదిలే సమయానికి చైన్ లాగి దాన్ని ఆపించాడు. ఆయన నిర్వాకం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేవగిరి ఎక్స్‌ప్రెస్‌తో పాటు మంగళూరు, సిద్దేశ్వర్ ఎక్స్‌ప్రెస్‌లు 20 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. వీఐపీల నుంచి ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు గానూ వివిధ రైళ్లకు అదనంగా వీఐపీ కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర  ఫడ్నవీస్‌ను, అసెంబ్లీ స్పీకర్‌ను కోరారు సెంట్రల్ రైల్వే అధికారులు.  

మహారాష్ట్ర నీటి కరువు.. ఒక‌ టోకెన్‌కు ఒకే బింద నీళ్లు

  మహారాష్ట్రలో తీవ్రమైన నీటి కరువు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నీటి కరువు వల్లే అక్కడ ఈసారి ఐపిఎల్ మ్యాచ్ లు కూడా జరగడానికి హైకోర్టు అనుమతి ఇవ్వడంలేదు. ఇదిలా ఉండగా ఇప్పుడు అక్కడి బీడ్ గ్రామంలో టోకెన్ సర్వీసును పెట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే.. నీటి కరువు వల్ల బీడ్ గ్రామంలోని ప్రజలు ఓ దిగుడుబావి నుండి నీళ్లు తెచ్చుకుంటున్నారు. అయితే బావి నుండి నీళ్లు తెచ్చుకునే క్రమంలో.. అధికంగా నీళ్లు తీసుకునే ప్ర‌య‌త్నంలో ఆ దిగుడుబావిలో రాళ్లు, దుమ్ము ప‌డుతోందట. దీంతో పరిస్థితిని గమనించిన గ్రామస్థులు దానిని నివారించేందుకు బావి ద‌గ్గ‌ర టోక‌న్ సిస్ట‌మ్ ప్ర‌వేశ‌పెట్టారు. దీని ప్ర‌కారం ఆ దిగుడు బావి నుంచి ఒక‌ టోకెన్‌కు ఒకే బింద నీళ్లు తీసుకునే నిబంధన విధించారు. దీన్ని ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్పవ‌ని హెచ్చ‌రించారు.

అంబేద్కర్ జయంతి.. విగ్రహ రాజకీయం..

  అంబేద్కర్ 125వ జయంతి సందర్బంగా పలు చోట్ల ఆయన వేడుకలు నిర్వహించారు. అయితే ఈ వేడుకలను రాజకీయం చేశారు నేతలు. అనంతపురం జిల్లా హిందూపురంలో అంబేద్కర్ జయంతి సందర్బంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాల వేయడానికి వచ్చిన  వైపీసీ నియోజక వర్గ ఇంఛార్జి నవీన్ నిశ్చల్‌ను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. తన నియోజక వర్గ ఎమ్మెల్యే బాలకృష్ణ వచ్చేంత వరకు ఎవరూ పూలమాల వేయడానికి కుదరదంటూ అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతల తీరుపై నవీన్ నిశ్చల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితి గమనించిన పోలీసులు వెంటనే జోక్యం చేసుకొని నవీన్ నిశ్చల్‌ను పూలమాల వేయనివ్వడంతో గొడవ సద్దుమణిగింది.

సోదరుడి టీఆర్ఎస్ చేరికపై డీకే అరుణ ఫైర్.. కుటుంబంలో చిచ్చుపెట్టడానికే..

  మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తన సోదరుడు టీఆర్ఎస్ లో చేరడంపై గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ తన కుటుంబంలో చిచ్చుపెట్టడానికే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. అంతేకాదు.. పార్టీ మారేవాళ్లందరూ రాజీనామా చేసి పార్టీ మారాలని.. అది నా సోదరుడైనా కానీ ఎవరైనా కానీ రాజీనామా చేసి పార్టీ మారాల్సిందే అని ఆమె మండిపడ్డారు. చిట్టెం రామ్మోహన్ రెడ్డి నిర్వాహకంతో తన తండ్రి ఆత్మ క్షోభిస్తోందన్నారు.

సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర కూడా టీడీపీలోకి..?

వైసీపీ నేతలు ఒక్కోక్కరుగా టీడీపీలోకి జంప్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బొబ్బిలి ఎమ్మెల్యే వెంకట సుజయ కృష్ణ రంగారావు టీడీపీలోకి చేరుతున్నారు అని తెలుస్తోంది. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అది ఎవరో కాదు సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర. అయితే పార్టీ మార్పుపై సుజయతో మాట్లాడటానికి విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి, ధర్మాన, పెద్దిరెడ్డి అతనితో మాట్లాడటానికి బొబ్బిలి వెళ్లగా.. సుజయ మాత్రం వారితో మాట్లాడటానికి అంగీకరించలేదు. దీంతో వారు నేరుగా రాజన్న దగ్గరికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. టీడీపీ పెట్టే ప్రలోభాలకు లొంగొద్దని.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ అధినేత జగన్ తో మాట్లాడాలని చెప్పగా..దీనికి రాజన్న తాను పార్టీ మారాలనుకోవడం లేదని చెప్పినట్టు సమాచారం.

ఇండియాలో పాగా వేశాం.. ఎప్పుడైనా దాడి చేయోచ్చు... ఐసిస్

ఉగ్రవాదుల ఆగడాలు రోజు రోజుకు పేట్రేగిపోతున్నాయి. ఇప్పటికే వారి ఆకృత్యాల వల్ల ఎంతో మంది ప్రాణాలు బలిగొన్నారు. అయితే ఇప్పుడు ఐసిస్ ఇండియాపై దాడులు చేసేందుకు సిద్దంగా ఉన్నామని బహిరంగంగానే సంచలనమైన ప్రకటన చేసింది. 'దబీక్' అనే ఆన్ లైన్ పత్రికకు.. షేక్ అబూ ఇబ్రహీం అల్-హనీఫ్ అనే ఉగ్రవాది ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ రకమైన సంచలన వ్యాఖ్యలు చేయడం అందరినీ భయానికి గురిచేస్తుంది. ఇండియాలో ఇప్పటికే తాము పాగా వేశామని.. బంగ్లాదేశ్, పాకిస్థాన్ ప్రాంతాల్లోని ఉగ్రవాద సంస్థల సహకారంతో దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని..విలాయత్ ఖురాసన్ (ఆఫ్గనిస్థాన్, పాక్ కేంద్రాలుగా పనిచేస్తున్న ఇస్లామిక్ మిలిటెంట్ విభాగం) సాయం తీసుకునే భారత ముజాహిద్దీన్ లు దాడులకు దిగుతారని చెప్పాడు. మరి ఉగ్రవాదులు ఇంత బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందో చూడాలి.

అంబేద్కర్ జయంతి.. రోహిత్ తల్లి, సోదరుడు బౌద్ధ మత స్వీకరణ..

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ స్కాలర్, దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. జాతి వివక్షత వల్లే రోహిత్ చనిపోయాడని అతని తల్లిదండ్రులు..విద్యార్ధులు..పలువురు నేతలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అయితే ఈ రోజు అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా రోహిత్ తల్లి, అతని సోదరుడు రాజా ముంబైలో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. వివ‌క్ష‌కు తావులేని బౌద్ధమతాన్ని తాము స్వీక‌రించామ‌న్నాడు. అంబేద్క‌ర్ కూడా ఈ ఉద్దేశంతోనే త‌న జీవిత చివ‌రి కాలంలో బౌద్ధ మతాన్ని స్వీకరించారని అన్నాడు.