తెలంగాణలో టీడీపీకి మరో షాక్..కారెక్కిన మాజీ మంత్రి
posted on Apr 21, 2016 @ 4:55PM
తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు పి.రాములు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఉదయం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన ఆయన కాసేపటికి టీడీపీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. పార్టీ కండువా కప్పి సీఎం ఆయన్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటకు చెందిన ఆయన తెలుగుదేశంలో కీలకనేతగా ఎదిగారు. అక్కడి నుంచి 1994, 1999, 2009 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో గెలుపోందారు. చంద్రబాబు మంత్రివర్గంలో 2002 నుంచి 2004 వరకు క్రీడా శాఖ మంత్రిగా రాములు పనిచేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు చేతిలో ఓటమిపాలయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా అవతరించడంతో ఆయన జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన చేరికతో మహబూబ్‌నగర్ జిల్లా టీడీపీ పెద్ద దిక్కును కోల్పోయింది.