రాజ్యసభ సభ్యుల పేర్లపై చర్చ.. చంద్రబాబు నివాసానికి నేతల క్యూ..

  రాజ్యసభ అభ్యర్దుల పేర్లను ఖరారు చేసేందుకు గాను రావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతలకు పిలువు నిచ్చారు. దీంతో బాబు నివాసానికి నేతలు క్యూ కట్టారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు అశోక గజపతిరాజు, సుజనా చౌదరిలతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, రాష్ట్ర మంత్రులు కాల్వ శ్రీనివాసులు, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణడు, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు వచ్చారు. మరోవైపు పెద్దల సభ రాజ్యసభలో అడుగుపెట్టాలని ఆశిస్తున్న టీడీపీ నేతల సంఖ్య పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ చంద్రబాబును కలిశారు. ఈ సందర్బంగా టీజీ తననూ రాజ్యసభను పంపిచాలని కోరినట్టు సమాచారం. దీంతో రాజ్యసభకు ఎంపిక చేయాల్సిన వారిపై ప్రధానంగా చర్చతో పాటు, ఆశావహుల పేర్లన్నీ ఓసారి పరిశీలించాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. చర్చల అనంతరం నేడు అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.   కాగా ప్రస్తుతం రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో ఏపీ కోటాలో నాలుగు సీట్లున్నాయి. వీటిలో మూడు సీట్లు టీడీపీకి, మరో సీటు వైసీపీకి దక్కనున్నాయి. వైసీపీ నుండి రాజ్యసభకు వెళ్లే అభ్యర్దిని ఇప్పటికే ఖరారు చేశారు. రేపటితో నామినేషన్ల పర్వం ముగుస్తున్నా.. టీడీపీ మాత్రం ఇప్పటివరకూ అభ్యర్దులు ఎవరో తేల్చలేదు.

సోనియాగాంధీ ఇంటి వద్ద ఉద్రిక్తత.. ఇంటిని ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు..

  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ రోజు ఉదయం బీజేపీ నేతలు సోనియా ఇంటిని ముట్టడించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాట్లా ఎన్‌కౌంటర్‌పై కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ వ్యాఖ్యలకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టారు. అయితే ముందుస్తు సమాచారం లేకుండా వందలాది మంది కార్యకర్తలు సోనియా ఇంటిముందు నిరసనకు దిగడంతో పోలీసులు ఖంగుతిన్నారు. అనంతరం.. రంగంలోకి దిగి ఆందోళన కారులపై లాఠీఛార్జ్‌ చేశారు. అంతేకాదు వాటర్ కేనన్లను రంగంలోకి దింపారు. బీజేపీ కార్యకర్తలపై వాటర్ కేనన్లు ప్రయోగించిన పోలీసులు ఎట్టకేలకు వారిని సోనియా నివాసం సమీపంలోకి రాకుండా అడ్డుకోగలిగారు.

తెలంగాణలో ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మె... పెట్రోల్ దొరికేది రెండు రోజులే..

  తమపై విధిస్తున్న 14.5 శాతం విలువ ఆధారిత పన్నును తక్షణం తొలగించాలని తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల యజమానులు అర్ధ్ర రాత్రి నుండి సమ్మెకు దిగారు. దీంతో రాష్ట్రంలోని వందలాది పెట్రోల్ బంకులకు పెట్రోలు, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం ఉన్న పెట్రోల్ రెండు రోజుల వరకూ సరిపోతుంది.. అప్పటి వరకూ సమ్మె విరమించకుంటే పెట్రోలు కొరత ఏర్పడుతుందని బంకు యజమానులు ఆరోపిస్తున్నారు. ఆయిల్ ట్యాంకర్ల యజమానుల సమ్మె గురించి తెలుసుకున్న వాహనదారులు పెట్రోలు కోసం బంకుల వద్ద క్యూ కడుతున్నారు. మరోవైపు, తెలంగాణలోని ట్యాంకర్ల సమ్మెకు పూర్తి మద్దతు పలుకుతున్నామని ఏపీ ట్యాంకర్ల సంఘం ప్రకటించింది. తెలంగాణ బంకులకు తాము పెట్రోలు సరఫరా చేయబోమని స్పష్టం చేసింది.

లోకేశ్ చెప్పింది నిజమే.. చంద్రబాబు

  ఏపీ కోటాలో రాజ్యసభకు నాలుగు సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నాలుగు సీట్లలో మూడు టీడీపీకి.. ఒకటి వైసీపీకి దక్కే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ-టీడీపీ మిత్రపక్షం కావడంతో ఒక స్థానం బీజేపీకి వెళ్తుందా అనే సందేహాలు కూడా లేకపోలేదు. అయితే ఈ విషయంలో బీజేపీ నేతలు తమను సంప్రదించలేదని ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్సి నారా లోకశ్ చెప్పారు. కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం ఏపీ కోటాలోని ఓ సీటును ఇవ్వాలని తాము టీడీపీని అడిగామని, ఈ దిశగా ఇరుపార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని విరుద్దంగా ప్రకటించారు. ఇక దీనిపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించి.. తన కుమారుడు నారా లోకేశ్ చెప్పింది నిజమేనని.. సీటివ్వాలని బీజేపీ నుంచి తమకు ఎలాంటి అభ్యర్థన రాలేదని చెప్పారు. దీంతో అమిత్ షా ప్రకటన తప్పని తేల్చేశారు. మరి దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. తెలంగాణ డిప్యూటీ సీఎం

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ.. ఏపీ నేతలు, ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీ ప్రజలే కాదు తెలంగాణకు సంబంధించిన వారు కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ నెల్లూరు జిల్లా ఏఎస్ పేటలోని ఖాజా నాయబ్ రసూల్ దర్గాను దర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ తెలంగాణకు పెద్దన్నయ్య లాంటిది.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని అన్నారు. అంతేకాదు ఏపీతో పాటు తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని అన్నారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనించాలని ప్రార్థించినట్టు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి ఏఎస్ పేట దర్గా అభివృద్ధికి కొన్ని నిధులను మంజూరు చేయిస్తామని వివరించారు.

వెంకయ్య ప్లేస్ మారింది.. కర్ణాటక నుంచి కాదు...!

కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో ఆయనను తిరిగి ఏ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపుతారా.? అంటూ దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. ఏపీ నుంచి పంపుతారని..కాదు కాదు కర్ణాటక నుంచే మళ్లీ ఆయన రాజ్యసభకు వెళతారు అంటూ ప్రచారం జరిగింది. అయితే వీటన్నింటికి తెరదించింది బీజేపీ అధినాయకత్వం. రాజ్యసభ స్థానాలకు పార్టీ అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. దీనిలో రాజస్థాన్ నుంచి వెంకయ్యనాయుడు, ఓం ప్రకాశ్ మాథుర్, హర్షవర్థన్ సింగ్, రాంకుమార్ వర్మ, కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్, హర్యానా నుంచి చౌదరి బీరేంద్ర సింగ్, మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయెల్, జార్ఖండ్ నుంచి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, గుజరాత్ నుంచి పురుషోత్తం రూపాలా, మధ్యప్రదేశ్ నుంచి అనిల్ మాధవ్ దవే, బీహార్ నుంచి గోపాల్ నారాయణ్ సింగ్, ఛత్తీస్‌గఢ్ నుంచి రాం విచార్ నేతంలను రాజ్యసభకు ఖరారు చేసింది.

కుటుంబం కన్నా పార్టీయే ముఖ్యం: చంద్రబాబు

కుటుంబం కన్నా తనకు పార్టీయే ముఖ్యమన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తిరుపతిలో జరుగుతున్న 35వ మహానాడు సందర్భంగా ఆయన ముగింపు సందేశం ఇస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మహానాడులో అందరూ అద్భుతంగా భాగస్వాములయ్యారని అభినందించారు. టీడీపీ కోసం త్యాగాలు చేసిన కార్యకర్తలు, నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.  కార్యకర్తల వల్ల తనకు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చిందన్నారు. స్వచ్ఛందంగా 851 మంది రక్తదానంలో భాగస్వాములయ్యారని, స్మార్ట్ విలేజ్‌లో 300 మంది కార్యకర్తలు భాగస్వాములమవుతామని తెలపారని చెప్పారు. 3 రోజుల్లో మొత్తంగా 380 మంది భారీగా విరాళాలు అందజేశారని, మొత్తం 11 కోట్ల 55 లక్షల 8వేల 59 రూపాయలు విరాళాలుగా అందాయని బాబు ప్రకటించారు.

క్రికెట్ లవర్స్‌కు షాక్..ఐపీఎల్ ఫైనల్‌కు వానగండం..!

క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ తుది సమరానికి రెడీ అయ్యింది. లీగ్ దశలో అన్ని జట్లను చిత్తు చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో విజయం ఏ జట్టును వరిస్తుందా అని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. గార్డెన్‌సిటీ గత రెండు రోజులుగా వర్షంతో తడిసి ముద్దవుతోంది. ఈ పరిస్థితుల్లో ఈరోజు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపింది. దీనిని బట్టి మ్యాచ్ జరగడంపై అనుమానాలు కలుగుతున్నాయి. వర్షం కారణంగా ఈ రోజు మ్యాచ్ నిర్వహించడానికి సాధ్యంకాకపోతే బీసీసీఐ నిబంధనల ప్రకారం రేపు రిజర్వ్ డే ఉంది.

కర్ణాటకలో ఓలా, ఉబెర్‌లపై నిషేధం...

ఓలా, ఉబెర్‌ సంస్థలకు కర్ణాటకలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ రెండు సంస్థలు మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. క్యాబ్ డ్రైవర్లు నిబంధనలను అతిక్రమిస్తున్నారని 300కు పైగా ఫిర్యాదులు రావడంతో వారిపై ఉక్కుపాదం మోపగా,డ్రైవర్లు రోడ్డెక్కారు. క్యాబ్‌లను నడుపుతున్న వారిలో ఎంతోమందికి లైసెన్స్‌లు లేవని గుర్తించామని, లైసెన్స్‌లు లేనివారికి తమ సంస్థ బ్రాండ్‌ను ఉబెర్, ఓలాలు ఇచ్చి వ్యాపారం జరుపుకుంటున్నాయని రవాణాశాఖ అధికారులు వ్యాఖ్యానించారు. అందువల్లే మొత్తం సేవలను ఆపివేయాలని ఆదేశించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

తప్పిపోయిన పిల్లల కోసం బెల్జియం గొప్ప నిర్ణయం..

తప్పిపోయిన పిల్లల కోసం వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు పడే మానసిక క్షోభకు బెల్జియం ప్రభుత్వం సైతం కరిగిపోయింది. వారి కంటివెలుగులను ఎలాగైనా వారి దగ్గరికి చేర్చాలనే లక్ష్యంతో ఏ దేశ ప్రభుత్వం తీసుకొని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తప్పిపోయిన చిన్నారుల ఫోటోలను అథికారిక కరెన్సీ నాణేలపై ముద్రించేందుకు సిద్ధమవుతోంది. ఆ దేశంలోని చైల్డ్ ఫోకస్ అనే స్వచ్చంధ సంస్థ తప్పిపోయిన చిన్నారులు, లైంగిక వేధింపులకు గురైన చిన్నారులకు మద్ధతుగా నిలుస్తోంది. చిన్నారులను ఎలాగైనా వారి కుటుంబాలతో కలపాలనుకున్న ఈ సంస్థ ప్రభుత్వంతో చర్చించి కాయిన్స్ ఆఫ్ హోప్ కార్యక్రమానికి నాంది పలికింది. ఈ సందర్భంగా ఇరవై ఏళ్ల క్రితం తప్పిపోయిన లియమ్ వాండెన్ అనే చిన్నారి ఫోటో ఉన్న నాణేన్ని విడుదల చేసింది.

ఐపీఎల్‌లో పెందెంగా భార్య...ఓడిపోయాడు..!

ప్రజంట్ దేశం మొత్తం ఐపీఎల్ ఫీవర్‌లో ఊగిపోతోంది..అందరూ మ్యాచ్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తుండగా, అదే స్థాయిలో బెట్టింగ్ కూడా జోరుగా సాగుతోంది. బెట్టింగ్ కోసం డబ్బు, నగలు, భూములు పందెంగా కాయడం మనం చూస్తుంటాం. అయితే ఒక ప్రబుద్ధుడు మహాభారతం నుంచి స్పూర్తి పోందాడో ఏమో ధర్మరాజు జూదంలో ద్రౌపదిని పందెంగా కాసినట్టు, ఇతడు కూడా తన భార్యను పందెంగా కాసాడు. చివరికి బెట్టింగ్‌లో భార్యను ఓడిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా గోవింద్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఐపీఎల్‌లో బెట్టింగ్ కాయడం అలవాటు. ఈ నేపథ్యంలో చేతిలో డబ్బులు లేకపోవడంతో భార్యను పెట్టి పందెం కాశాడు. అతను ఎంచుకున్న జట్టు ఓడిపోవడంతో భార్యను కోల్పోయాడు. పందెం గెలిచిన జూదరులు ఇంటికి రావడం, ఫోన్ చేసి అతని భార్యను వేధించడం మొదలుపెట్టారు. దీంతో విసిగిపోయిన బాధితురాలు సామాజిక కార్యకర్తల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. 

ట్రంప్ ర్యాలీలో ఆగని ఘర్షణలు..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రంప్‌కు ఎంత మద్ధతు లభిస్తున్నా..అదే స్థాయిలో నిరసనలు తప్పడం లేదు. ఆయన ప్రచార ర్యాలీల్లో చాలాసార్లు నిరసనకారులు నానా హంగామా సృష్టించారు. తాజాగా కాలిఫోర్నియాలోని శాండియాగోలో ట్రంప్ మద్ధతుదారులు, వ్యతిరేకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు పరస్పరం తిట్టుకుని, నీళ్ల సీసాలు విసురుకున్నారు. పోలీసులు వెంటనే ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపుచేశారు. ఈ సందర్భంగా 35 మందిని అరెస్ట్ చేశారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసినందుకు శాండియాగో పోలీసులకు ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు వెంటనే స్పందించారని ట్వీట్ చేశారు.

ఉగ్రవాదులపై టర్కీ ఉక్కపాదం.. 104 మంది హతం..

  ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదాలు ప్రంపచ దేశాల్ని గడగడలాడిస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే అగ్ర దేశాలు కూడా ఉగ్రవాదులపై ఉక్కపాదం మోపాయి. ఈ నేపథ్యంలోనే ఉగ్ర‌వాదుల ప‌ట్ల ట‌ర్కీ ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. దీనిలో భాగంగానే.. ఉగ్ర స్థావ‌రాల‌పై దాడులు నిర్వహించగా..104 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ట‌ర్కీ మిల‌ట‌రీ హ‌త‌మార్చిన‌ ఉగ్ర‌వాదుల సంఖ్య 104గా భావిస్తున్నామ‌ని, అయితే వారి సంఖ్యపై క‌చ్చిత‌మైన వివ‌రాలు చెప్ప‌లేమ‌ని, దానిపై త‌మ వ‌ద్ద‌ స్ప‌ష్ట‌త లేద‌ని ట‌ర్కీ తెలిపింది. వైమానికి దాడుల‌తో పాటు ఇత‌ర మార్గాల్లోనూ ఉగ్ర‌వాదుల‌ను అంత‌మొందిస్తున్న‌ట్లు చెప్పింది.

16 ఏళ్ల బాలిక‌పై 33 మంది అత్యాచారం.. కదిలిన బ్రెజిల్ ప్రభుత్వం..

  బ్రెజిల్ లో ఒక యువతిపై ఒకరు కాదు..ఇద్దరు కాదు ఏకంగా 33 మంది అత్యాచారం చేసిన ఘటన ఆ దేశాన్నే కాదు.. యావత్ ప్రంపంచాన్నే దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక దీనిపై బ్రెజిల్ ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించి ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసింది. ఇంకా దోషులను పట్టుకొని వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వ అధికారులు తెలిపారు.   కాగా బ్రెజిల్ లోని రియో డీజెనీరోలో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ ఇంటికి బాధితురాలు వెళ్లింది. అయితే అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు కాని.. మరుసటి రోజు తాను లేచి చూసేసరికి నగ్నంగా ఉన్నానని.. తన చుట్టూ కొందరు తుపాకులు పట్టుకుని ఉన్నారని పోలీసులకు చెప్పింది. నీరసించిపోయిన బాధితురాలు మగవాళ్ల దుస్తులు ధరించి ఇంటికి తిరిగివచ్చిందని, ఏం జరిగిందన్న విషయాన్ని చెప్పలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే రెండు రోజుల తరువాత ఆమెకు సంబంధించి 40 సెకన్ల వీడియో ట్విట్టర్లో పోస్ట్ అయింది. దీంతో అసలు విషయం బయటపడింది. ట్విట్టర్ యాజమాన్యం ఈ ఫొటోలను తొలగించే లోపే 500 లైక్లు వచ్చాయి. ఈ దారుణ ఘటనపై బ్రెజిల్లో దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. మహిళలపై దాడులు, అత్యాచార సంస్కృతి పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.