రాజ్యసభ సభ్యుల పేర్లపై చర్చ.. చంద్రబాబు నివాసానికి నేతల క్యూ..
posted on May 30, 2016 @ 12:45PM
రాజ్యసభ అభ్యర్దుల పేర్లను ఖరారు చేసేందుకు గాను రావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతలకు పిలువు నిచ్చారు. దీంతో బాబు నివాసానికి నేతలు క్యూ కట్టారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు అశోక గజపతిరాజు, సుజనా చౌదరిలతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, రాష్ట్ర మంత్రులు కాల్వ శ్రీనివాసులు, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణడు, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు వచ్చారు. మరోవైపు పెద్దల సభ రాజ్యసభలో అడుగుపెట్టాలని ఆశిస్తున్న టీడీపీ నేతల సంఖ్య పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ చంద్రబాబును కలిశారు. ఈ సందర్బంగా టీజీ తననూ రాజ్యసభను పంపిచాలని కోరినట్టు సమాచారం. దీంతో రాజ్యసభకు ఎంపిక చేయాల్సిన వారిపై ప్రధానంగా చర్చతో పాటు, ఆశావహుల పేర్లన్నీ ఓసారి పరిశీలించాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. చర్చల అనంతరం నేడు అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా ప్రస్తుతం రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో ఏపీ కోటాలో నాలుగు సీట్లున్నాయి. వీటిలో మూడు సీట్లు టీడీపీకి, మరో సీటు వైసీపీకి దక్కనున్నాయి. వైసీపీ నుండి రాజ్యసభకు వెళ్లే అభ్యర్దిని ఇప్పటికే ఖరారు చేశారు. రేపటితో నామినేషన్ల పర్వం ముగుస్తున్నా.. టీడీపీ మాత్రం ఇప్పటివరకూ అభ్యర్దులు ఎవరో తేల్చలేదు.