భావితరాలకోసం బలమైన పునాది-కేసీఆర్

కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి బలమైన పునాది వేస్తేనే భావితరాలు బాగుంటాయన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ముఖ్యఅతిధిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు బలగాల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడిన సీఎం..నిధులు, నీళ్లు, నియామకాల కోసమే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని..ప్రత్యేక రాష్ట్రం వల్లే మన నిధులు మరో ప్రాంతానికి తరలింపు కాలేదని గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా రెండేళ్ల పాలన సాగిందని ఆయన అన్నారు. పేదింటి యువతుల కోసం కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. త్వరలో బీసీలకూ కళ్యాణ లక్ష్మీ పథకం అమలు చేయనున్నట్లు చెప్పారు. కళాశాలల్లోనూ సన్నబియ్యం పథకం అమలు చేస్తామని తెలిపారు. 598 మంది అమరవీరుల కుటుంబీకులకు నియామక పత్రాలు అందజేశామని పేర్కొన్నారు.  

పెట్రోల్ పోయను అన్నందుకు చంపేశారు...!

హైదరాబాద్ కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. పెట్రోల్ పోయను అన్నందుకు ఒక వ్యక్తిని హత్య చేశారు. కూకట్‌పల్లి సుమిత్రానగర్‌లోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌కు నిన్న అర్థరాత్రి సమయంలో ఆరుగురు వ్యక్తులు బైకులపై వచ్చారు. పెట్రోల్ పోయమని అడిగారు..అయితే సమయం మించిపోయిందని ఇప్పుడు పోయడం కుదరదని అక్కడి సిబ్బంది చెప్పారు. దీంతో వారు సిబ్బందితో గొడవకు దిగారు. అనంతరం పెట్రోల్ బంక్ నుంచి  తిరిగి వెళ్లి మళ్లీ వచ్చి కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన మూసాపేట జింకలవాడకు చెందిన క్యాషియర్ సంగమేశ్వర్ అక్కడికక్కడే మరణించగా..మరో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. బాధితులను కేపీహెచ్‌బీలోని ఓ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇటలీ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఏపీని బజారుకిడ్చారు

ఇటలీ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆంధ్రప్రదేశ్‌ను రోడ్డున పడేశారన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. విజయవాడ బెంజిసర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్షలో ఆయన పాల్గొని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు రోడ్లపైకి వచ్చి ఉద్యమించారని కాని విభజనా మాత్రం ఆపలేకపోయామన్నారు. విభజన చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని కోరా..రెండు ప్రాంతాలకు న్యాయం చేసి ముందుకెళ్లాలంటే నాటి పాలకులు లెక్కచేయలేదన్నారు. జనాభా ప్రకారం అప్పులు పంచారు, ఆదాయం మాత్రం ఎక్కడిది అక్కడే అన్నారు. విభజన తర్వాత ఆస్తులు రాలేదు..అప్పులు మాత్రమే మిగిలాయన్నారు. నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు ఎన్ని కష్టాలొచ్చినా భయపడేది లేదని చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్పీకర్ కోడెల, సీఎస్ టక్కర్, మంత్రులు దేవినేని, కామినేని, కొల్లు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

మూడు కెమెరాలతో స్మార్ట్ ఫోన్..

  రోజుకో సరికొత్త మొబైల్ మార్కెట్లోకి వస్తుంది. ఇప్పుడు ఎల్జీ కూడా ఓ సరికొత్త మొబైల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సాధారణంగా స్మార్ట్ ఫోన్లకి ఫ్రంట్ కెమెరా.. బ్యాక్ కెమెరా ఉంటాయి. అయితే మూడు కెమెరాలతో ఉండే సరికొత్త హైఎండ్ స్మార్ట్ ఫోన్ ను ఎల్జీ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 52,990 అని, ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని ఎల్జీ వివరించింది. ఫోన్ ఫీచర్లు.. * 5.3 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ క్వాంటమ్ డిస్ ప్లే * ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్ * 4 జీబీ ర్యామ్, * 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 2 టెర్రాబైట్ల వరకూ విస్తరించుకునే సామర్థ్యం ఉన్నాయి. * బ్యాంక్ 16, 8 ఎంపీ కెమెరాలుండగా, ఫ్రంట్ 8 ఎంపీ కెమెరా ముందు భాగంలో ఉంది. * 2,800 ఎంఏహెచ్ బ్యాటరీ

'చంద్రన్న బీమా' ప్రారంభం.. వివరాలు ఇవే..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 'చంద్రన్న బీమా' పథకాన్ని ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం ఈ పథకానికి ఆమోదం తెలిపింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వివరాలను మంత్రి పల్లె రఘునాథరెడ్డి వివరించారు. ఆ వివరాలు...   * ఈ పథకం ద్వారా ప్రమాదంలో మరణించినా, అంగవైకల్యం ఏర్పడినా రూ. 5 లక్షల వరకూ డబ్బు అందుతుంది. * సహజ మరణం సంభవిస్తే రూ. 30 వేలు * 18 నుంచి 70 సంవత్సరాలున్న వారికి, నెలకు రూ. 15 వేల కన్నా తక్కువగా ఆదాయం పొందుతున్న వారికి ఇది వర్తిస్తుందని ఆయన అన్నారు. * ఏడాదికి రూ. 170 బీమా ప్రీమియంగా చెల్లించాల్సి వుంటుందని, అందులో రూ. 150 ప్రభుత్వమే భరిస్తుందని, లబ్దిదారు నుంచి నామమాత్రపు రుసుమునే వసూలు చేస్తామని పల్లె వివరించారు.

జూన్ 27 నాటికి ఉద్యోగులు ఏపీ రావాల్సిందే..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఆయన పలు విషయాలు చర్చించి  నిర్ణయం తీసుకున్నట్టు తెలస్తోంది. దీనిలో భాగంగానే ఈనెల 8న మహాసంకల్పం పేరుతో ఒంగోలులో బహిరంగసభను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు హైదరాబాద్లో ఉన్న ఏపీ ఉద్యోగులు బదిలీ గురించి కూడా ఆయన చర్చించినట్టు తెలుస్తోంది. ఈనెల 10 నుండి 20 వరకూ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని.. జూన్ 27 నాటికి ఉద్యోగులు హైదరాబాద్ నుండి ఏపీకి రావాల్సిందేనని.. వారికి చేయాల్సిన ఏర్పాట్లు బాధ్యత సీఆర్డీఏదే అని తేల్చిచెప్పారు. ఇంకా రేపు జరిగే నవ నిర్మాణ దీక్షలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని, అలాగే జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు దీక్షలో పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. మరి ఏపీకి రావడానికి ఆసక్తి చూపించని ఉద్యోగులు బాబు ఆదేశం మేరకు ఎంతవరకూ వస్తారో చూడాలి.

ప్రత్తిపాటి పుల్లారావుకు నాన్ బెయిలబుల్ వారెంట్..

  ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు రైల్వే కోర్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో సమైఖ్యాంధ్ర ఉద్యమం సందర్భంగా 2014లో రైల్ రోకో నిర్వహించారు. అప్పుడు దీనిపై పలువురు నేతలపై కేసు నమోదైంది. ఈ కేసులో మంత్రి పుల్లారావుతో పాటు ఎమ్మెల్యే ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్యేలు జియావుద్దీన్, లింగంశెట్టి ఈశ్వర్రావు, వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి నిందితులుగా ఉన్నారు. అయితే దీనిపై విచారించిన కోర్టు పలుమార్లు కోర్టుకు హాజరుకావాలని సూచించింది. అయినా  కోర్టు వాయిదాలకు హాజరుకాని కారణంతో వీరందరికీ నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది.

సెల్ఫీ తీసుకుందామని.. భార్యను చంపేసిన భర్త..

  సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు మరణించినవారు చాలామందే ఉన్నారు. అయితే అదే సెల్ఫీ పేరుతో తన భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు ఓ వ్యక్తి. ఈ దారుణమైన ఘటన యూపీలో చోటుచేసుకుంది. యూపీలోని మీరట్లో ఆప్తాబ్ అనే వ్యక్తి తన భార్య ఆయేషాతో సెల్ఫీ తీసుకుందాం అని చెప్పి గంగాన‌ది వ‌ద్ద‌కు తీసుకెళ్లి న‌దిలో తోసేశాడు. అనంతరం.. త‌న ఎనిమిది నెల‌ల కొడుకుతో పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి కొంద‌రు దుండ‌గులు త‌మ‌పై దాడి చేశార‌ని, ఆ గొడ‌వ‌లో త‌న భార్య‌ను గంగా న‌దిలో తోసేశార‌ని పోలీసుల‌కి ఫిర్యాదు చేశారు. అయితే అప్తాబ్ పై అనుమానం వచ్చిన పోలీసులు అతనిని విచారించగా అసలు నిజం బయటపడింది. అద‌న‌పు క‌ట్నం కోసం భార్య ఆయేషాతో త‌రుచూ త‌గాదాలు పెట్టుకుంటోన్న ఆఫ్తాబ్ ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

వంగవీటి రాధా అరెస్ట్..

  వైసీపీ నేత వంగవీటి అరెస్ట్ తో విజయవాడలో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. సింగ్ నగర్ కు చెందిన పేదల ఇళ్ల రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనకు వంగవీటి రాధా నేతృత్వ వహించారు. అయితే దీనికి పోలీసుల అనుమతి లేదంటూ.. దర్నా విరమించాలని పోలీసులు చెప్పినా వినకపోవడంతో వంగవీటిని పోలీసులు అరెస్ట్ చేశారు. జీపులోకి ఎక్కించి అక్కడికి సమీపంలోని పాయకాపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వంగవీటి అరెస్ట్ పై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.

చిరంజీవి, నాగార్జున, సచిన్ లు కలసిన రహస్యం ఇదే..

  టాలీవుడ్ స్టార్లు చిరంజీవి, నాగార్జున క్రికెటర్ సచిన్ ఒకేసారి తిరుమల దర్శనం చేసుకున్నారు. అయితే వీరు ముగ్గురు యాదృశ్చికంగా కలిశారు అని అనుకున్నారు కానీ.. ఓ పనిమీదే కలిశారన్న విషయం చాలా లేట్ గా అర్దమైంది. తిరుమల తిరుపతి వెంకన్న దర్శనం అనంతరం.. వీరు ముగ్గురు నేరుగా కేరళ సీఎం పినరాయి విజయన్ ను కలిశారు. కేరళలో ఫుట్ బాల్ అకాడమీని నెలకొల్పాలని పక్కా ప్లాన్ వేసుకున్న ముగ్గురూ ..దీనిపై మాట్లాడటానికి సీఎం పినరాయి విజయన్ అపాయింట్ మెంట్ ముందే తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ముందు తిరపతిలో దర్శనం కొరకు వచ్చి.. అక్కడి నుండి కేరళ వెళ్లి ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.   ఇక వీరికి స్వాగతం పలికిన విజయన్ అకాడమీ ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా, చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్ లు కేరళా బ్లాస్టర్స్ ఫుట్ బాల్ జట్టుకు యజమానులుగా ఉన్న సంగతి తెలిసిందే. వీరితో పాటు అల్లు అరవింద్ కూడా ఉన్నారు.

కర్ణాటక కానిస్టేబుళ్ల సామూహిక సెలవు.. ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించిన సీఎం

  తక్కువ జీతాలు ఇస్తూ.. పనిభారం పెరిగిపోయిన కర్ణాటక కానిస్టేబుళ్లు ఓ నిర్ణయం తీసుకున్నారు. తమ పిల్లలకు స్కాలర్‌షిప్‌లు, విద్యాసౌకర్యాలు కల్పించకపోవడం వంటి పలు సమస్యలకు నిరసనగా సుమారు 60 వేల మంది కానిస్టేబుళ్లు ఈ నెల 4వ తేదీన సామూహికంగా సెలవు తీసుకోనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు దీనిపై ఆరాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందిస్తూ.. కానిస్టేబుళ్లు కనుక ఈ కార్యక్రమం చేపడితే వారిపై ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించారు. అంతేకాదు నిరసనలో పాల్గొన్న కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఉద్యోగాలనుంచి తొలగిస్తామని డైరెక్టర్‌ జనరల్‌ అండ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఓం ప్రకాశ్‌ ఒక సర్క్యులర్‌ కూడా జారీ చేశారు. కానిస్టేబుళ్లకు ఎవరికీ ఆ రోజు అనారోగ్యంతో ఉన్నారని మెడికల్‌ సర్టిఫికెట్లు ఇవ్వరాదంటూ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వాసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ నేపథ్యంలో కానిస్టేబుళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మీడియాకు నిజాయితీ లేదు.. నిప్పులు చెరిగిన ట్రంప్

  అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ ఏదో ఒక విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. అయితే ఈసారి ఆయన మీడియాను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. అందుకే మీడియాపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. న్యూయార్క్ లో ఓ సమావేశంలో పాల్గొన్న ఆయనను.. తాను సేకరించిన 6 మిలియన్‌ డాలర్ల నిధులపై ప్రశ్నించారు. అంతే ఇక కోపం కట్టలు తెంచుకొచ్చిన ట్రంప్ మీడియాపై నిప్పులు చెరిగారు. మీడియాకు నిజాయితీ లేదని..  పత్రికల్లో, టీవీల్లో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని విమర్శించారు. అవన్నీ అసత్యాలని ప్రజలకు తెలుసన్నారు. అంతేకాదు ఏబీసీ న్యూస్‌ జర్నలిస్ట్‌ టామ్‌ లలామస్‌పై కూడా మండిపడ్డారు. అతనిది అనైతిక ప్రవర్తన అని.. అతడికి నిజానిజాలు బాగా తెలుసని ట్రంప్‌ మండిపడ్డారు. కాగా ఛారిటీల కోసం జనవరిలో ట్రంప్‌ నిధుల సేకరణ కార్యక్రమానికి విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే.

ఆ రాజ్యసభ అభ్యర్దిపై 28 క్రిమిన‌ల్ కేసులు..

బీజేపీ రాజ్యసభ అభ్యర్ధులుగా ప్రకటించిన వారిలో గోపాల్ నారాయణ్ సింగ్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. బీహార్ రాష్ట్రం నుండి ఈయన రాజ్యసభకు ప్రాతినిద్యం వహించనున్నారు. అయితే బీజేపీ నారాయణ సింగ్ ను ఎన్నుకోవడంపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర అధికార పార్టీ జ‌న‌తాద‌ళ్ యునైటెడ్ పలు విమర్శలు గుప్పిస్తోంది. ఆయ‌న‌పై ఇప్ప‌టి వ‌ర‌కు 28 సీరియ‌స్ క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయ‌ని..  పేర్కొంది. జేపీలో ఎంతో మంది అర్హులైన నేత‌లుండ‌గా గోపాల్ నారాయ‌ణ్ సింగ్ నే త‌మ రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింద‌ని, దీంతో ఆ పార్టీ దారులు ఎటుగా ఉన్నాయో.. వారి దృక్ప‌థం ఎలాగుందో తెలుస్తోంద‌ని అంటున్నారు.