టీడీపీలోకి మరో వైసీపీ ఎమ్మెల్యే..

వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరుతున్న నేపథ్యంలో.. కొద్ది రోజుల నుండి సైలెంట్ అయినట్టు కనిపించింది. అయితే ఇప్పుడు మరో ఎమ్మెల్యే టీడీపీలోకి జంప్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రకాశం జిల్లా నుండి వైసీపీ పార్టీ నుండి పలువురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరగా ఇప్పుడు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి కూడా టీడీపీ తీర్ధం పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అశోక్ రెడ్డి వైకాపాకు గుడ్ బై చెబుతారని దాదాపు నెలన్నర క్రితమే గుసగుసలు వినిపించాయి. అప్పుడు ఆయన ఆ వ్యాఖ్యలను ఖండించారు. కానీ ఇప్పుడు ఆయన పార్టీ మార్పుపై ఈరోజు రాచర్ల మండలానికి చెందిన కార్యకర్తలతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోదామా? అని ఆయన కార్యకర్తలను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

మోడీ ఇండియనా లేక ప్రవాస భారతీయుడా..? విరుచుకుపడిన శివసేన..

బీజేపీ పై ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే శివసేన ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడింది. మోడీ విదేశీ పర్యటనల గురించి నిప్పులు చెరిగింది. మోడీ ఎప్పుడు చూసిని విదేశీ పర్యటనలు చేస్తుంటారు.. ఆయన భారత పౌరుడా..? లేక ప్రవాస భారతీయుడా..? అంటూ తన అధికార పత్రిక సామ్నాలో విమర్శించింది. అంతేకాదు ఇటీవల ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగగా.. ఒక్క రాష్ట్రంలో మాత్రమే గెలుపొంది.. మిగిలిన రాష్ట్రాల్లో తీవ్ర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అలాంటిది.. ఆ విషయాన్నే మరిచిపోయి సంబరాలకు ఎలా రెడీ అవుతున్నారు అని ఎద్దేవ చేశారు. మోదీ ఎన్ని సంక్షేమ పథకాలు ప్రారంభించినా, అవి క్షేత్ర స్థాయిలో ప్రజలకు దగ్గర కావడం లేదని.. బ్లాక్ మనీని తిరిగి వెనక్కు తెప్పించడంలోనూ మోదీ సర్కారు విఫలమైందని శివసేన దుయ్యబట్టింది. మరి దీనిపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

మైనర్ బాలికపై అత్యాచారం.. కేజ్రీవాల్ పరామర్శ.. సోనియాగాంధీ కూడా..!

  ఢిల్లీలో కొద్ది రోజుల క్రితం ఓ 13 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై అత్యాచారం చేసి అనంతరం ఆమెను రైల్వే ట్రాక్ పై పడేసి పారిపోయాడు. అయితే ప్రస్తుతం ఆ బాలిక ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ నేపథ్యంలో ఆమెను ఈరోజు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో నేరాలు బాగా పెరిగిపోయానని.. అవి అదుపులోకి రావాలంటే ప్రజలు, న్యాయాధికార సంస్థలు కలిసి పనిచేయాలని.. దానికి తగిన విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అంతేకాదు ఢిల్లీలో పూర్తిస్థాయి శాంతి భద్రతల అంశం ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండాలని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గంధీ కూడా బాలికను పరామర్శించడానికి ఎయిమ్స్ కు వెళ్లనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సంఘటన పట్ల స్థానిక మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేప‌ట్టాయి.

బైక్‌కు ఏసీ ఉంటే..!

ఎండలో బైక్‌పై వెళ్లాలంటే ఎంత మంటగా ఉంటుందో కదా..? ఆ టైంలో ఏసీ కార్లలా..ఏసీ బైకులు కూడా ఉంటే బాగుంటుదనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి వారి ఆశలు నెరవేరే రోజులు ఎంతో దూరం లేదు. జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్స్ సంస్థ హోండా ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే బైకులకు ఏసీ యూనిట్‌‌ను అమర్చే విధానంపై హోండా పేటెంట్ పొందింది. పేటెంట్‌ కోసం చేసిన దరఖాస్తులో వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏసీ యూనిట్, ఓ చిన్న లగేజ్ బ్యాగ్ అంత ఉంటుంది. ఓ చిన్న బ్లోయర్ యూనిట్, రీచార్జబుల్ బ్యాటరీ ఇందులో ఉంటాయి. ఇందులోంచి గాలి వేగంగా బయటకు వచ్చి సరాసరి శరీరాన్ని , మెడను తాకుతూ, హెల్మెట్ లోపలి నుంచి ముఖానికి అందుతుంది. ఇది చాలా సింపుల్‌గా ఉన్న ఎయిర్‌ కండిషనింగ్ విధానమని నిపుణులు వ్యాఖ్యానించారు.  మరింత చల్లదనం కోసం ఇందులో ఐస్ క్యూబులు వేసుకునే సదుపాయం కూడా ఉంది. అయితే, 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లేటప్పుడు మాత్రం ఏసీ యూనిట్ పనితీరుపై కొంత కసరత్తు చేయాల్సి ఉంది. ఈ ప్రయోగంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

మహానాడు ఏర్పాట్లపై లోకేశ్ ఫైర్.. ఇవేం ఏర్పాట్లు?

  టీడీపీ పార్టీ అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ 'మహానాడు' రేపటి నుండి మూడు రోజుల పాటు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తిరుపతి వేడుకైంది. ఈ సందర్భంగా రేపు జరగబోయే కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చూసేందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొద్దసేపటి క్రితం తిరుపతికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మహానాడు కార్యక్రమ ఏర్పాట్లు చూసిన నారా లోకేశ్ ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ‘‘ఇవేం ఏర్పాట్లు? ఇలాగైతే ఈ వేడుకను సంతోషంగా ముగిస్తామా? వెంటనే మార్పులు చేయండి. సాయంత్రంలోగా పటిష్ట ఏర్పాట్లు పూర్తి కావాలి’’ అంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పార్టీ నేతలు అయోమయంలో పడ్డారట. దీంతో పార్టీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు వెనువెంటనే రంగంలోకి దిగిపోయి లోకేశ్ చెప్పిన మేరకు ఏర్పాట్లలో మార్పులు చేర్పులు చేసేందుకు చర్యలు చేపట్టారు.

మాజీ ముఖ్యమంత్రి కాన్యాయ్ పై దాడి.. కారుకు నిప్పు

  బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ కాన్యాయ్ పై గుర్తు తెలియని దుండగలు దాడి చేశారు. ఈ ఘటన బీహార్ లోని దుమారియాలో జరిగింది. అటుగా వెళ్తున్న మాంఝీ కాన్వాయ్ పై దుండగలు రాళ్లతో దాడి చేసి.. ఆపై ఓ కారుకు నిప్పు కూడా పెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దాడి ఎవరు చేశారు అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.   కాగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ ఒకప్పుడు బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు అనుచరుడిగా ఉండేవాడు. అతని సహకారంతోనే.. ఆ రాష్ట్రానికి సీఎం అయ్యారు. అయితే సీఎం అయిన తరువాత నితీశ్ కు వ్యతిరేకంగా మారిపోయారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మాంఝీ సొంత కూటమి పెట్టుకుని బీజేపీ మద్దతుతో పోటీ చేసినా కనీసం తాను ఒక్కరు కూడా గెలవలేకపోయారు.

రైల్లో బెర్త్ దొరకలేదా.. అయితే విమానంలో వెళ్లొచ్చు..

  ఇప్పటికే రైలు టికెట్లు రద్దు.. బుకింగ్ విషయంలో పలు కీలక మార్పులు చేసిన రైల్వేశాఖ ఇప్పుడు మరో శుభవార్తను రైలు ప్రయాణీకుల ముందుకు తీసుకొచ్చింది. రైలు టికెట్ బుక్ చేసుకొని.. ఒక వేళ బెర్త్ దొరకని నేపథ్యంలో.. సదరు ప్రయాణికులు విమానంలో ప్రయాణించే అవకాశం దక్కింది. ఈ రకమైన ఒప్పందం ఎయిర్ ఇండియా, ఐఆర్సీసీటీల మధ్య కుదిరింది. రైలులో బెర్త్ దొరకని వ్యక్తులు విమానంలో ప్రయాణించవచ్చు.. అయితే దానికి ఇంకొంచం ఖర్చు పెట్టాల్సి ఉంటుందని చెబుతున్నారు అధికారులు. రైలులో మొదటి తరగతి ప్రయాణీకులు విమాన యానానికి ఏమీ అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎసి-2 టైర్‌ ప్రయాణీకులు మాత్రం 2 వేల రూపాయిలను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. రెండు మూడు రోజుల్లో ఈ సౌక‌ర్యం అందుబాటులోకి రానున్న‌ది.

రాష్ట్ర ప్రభుత్వాల ఆటలకు కేంద్రం అడ్డుకట్ట..

  ఇకపై ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ విభాగాల్లో పనిచేసే అధికారుల విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు కేంద్రం అడ్డుకట్ట వేసినట్టు తెలుస్తోంది. తమ మాట వినని అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించే తీరు.. వారిని బదిలీలు, సస్పెన్షన్లు అంటూ వేధిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక నుండి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ విభాగాల్లోని అధికారులను సస్పెండ్ చేయాల్సి వస్తే, రాష్ట్ర ప్రభుత్వం గరిష్ఠంగా నెల రోజుల పాటు మాత్రమే విధుల నుంచి పక్కన పెట్టగలుగుతుంది. అది కూడా సస్పెండ్ చేసిన 48 గంటల్లోగా కేంద్రానికి తెలియజేయాల్సి వుంటుంది. ఇక కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాల్సి వస్తే, ప్రధాని అనుమతి తప్పనిసరి. ఈ మేరకు రాష్ట్రాల అధికారాలకు కోత విధిస్తూ, కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

ఒక్క రోజు ఛైర్మన్ ఛాన్స్.. 46 అంశాలకు ఆమెదం

  ఒక్క రోజు సీఎం.. ఒక్క రోజు కమిషనర్ తరహాలో ఒక్క రోజు ఛైర్మన్ ఛాన్స్ కెట్టేసి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 46 అంశాలకు ఆమెదం పలికి  అందరిని ఆశ్యర్యపరిచాడు ఓ కౌన్సిల్. ఇంతకీ ఎవరతను అనుకుంటున్నారా.. వైకాపా కౌన్సిల్ బొద్దులూరు ధర్మయ్య. అసలు సంగతేంటంటే.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మునిసిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించింది. అయితే శ్రీకాళహస్తి మునిసిపాలిటీలో 35 కౌన్సిలర్లు ఉండగా.. వారిలో టీడీపీ నుండి 21 మంది, వైకాపా నుండి 11 మంది, బీజేపీ నుండి ముగ్గురు కౌన్సిలర్లు ఉన్నారు. అయితే ఈ కార్యక్రమానికి టీడీపీ కౌన్సిలర్లలో ఒక్కరు కూడా హాజరు కాలేదు. వైసీపీ నుండి 11 మందీ హాజరయ్యారు. ఇక బీజేపీ నుండి ఇద్దరు వచ్చారు. అయితే టీడీపీ కౌన్సిలర్లు ఒక్కరు కూడా రాకపోవడంతో సమావేశం నిర్వహించేందుకు మునిసిపల్ కమిషనర్ శ్రీరామశర్మ నిరాకరించారు. దీంతో ఆగ్రహం చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు అసలు ఎందుకు సమావేశం ఏర్పాటుచేశారని వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు అక్కడికి చేరి పరిస్థితిని సమీక్షించారు. ఇక తప్పనిసరి పరిస్థితిలో కమిషనర్ సభ జరిపేందుకు నిర్ణయించి.. ఆపై డెలిగేట్ చైర్మన్ గా ధర్మయ్యను ఎన్నుకున్నారు. దీంతో అజెండాలో ఉన్న 46 అంశాలకూ వైకాపా ఆమోదం పలకడం జరిగిపోయింది. ఈ తరహా ఘటన జరగడం శ్రీకాళహస్తి మునిసిపల్ చరిత్రలో తొలిసారని తెలుస్తోంది.

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల.. తెలంగాణ 4, ఏపీ 6

తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రాష్ట్ర సచివాలయంలో ఎంసెట్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంసెట్‌లో 77.88 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. జూన్‌ 6వ తేదీ నుంచి ర్యాంక్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. కాగా ఈ ఫలితాల్లో టాప్‌ టెన్‌ ర్యాంకుల్లో తొలి నాలుగు స్థానాలు తెలంగాణ విద్యార్థులు కైవసం చేసుకోగా, ఆ తర్వాత ఆరు స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు నిలిచారు. తొలి నాలుగు స్థానాల్లో తెలంగాణకు చెందిన తాళ్లూరి సాయితేజ 160/160 మార్కులతో ప్రథమ స్థానం పొందగా.. దిగుమర్తి చేతన్‌సాయి 159 మార్కులతో రెండో స్థానం, నిఖిల్‌ సామ్రాట్‌ 158 మార్కులతో మూడో స్థానంలో, విఘ్నేష్‌రెడ్డి నాలుగో స్థానంలో నిలిచారు.   ఇక ఏపీ నుండి రాహుల్‌(గుంటూరు), సాయిగణేష్‌(గుంటూరు), కొండేటి తన్మయి(విజయనగరం), గంటా గౌతమ్‌(ఏలూరు), జయకృష్ణసాయి వినయ్‌(మంగళగిరి), సత్యవంశీ కృష్ణారెడ్డి(విశాఖ) ఐదు నుంచి పది ర్యాంకులను కైవసం చేసుకున్నారు. www.tseamcet.in వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.

చంద్రబాబుకు తలనొప్పిగా ఏపీ ఉద్యోగులు.. లాంగ్ లీవ్.. స్వచ్ఛందంగా పదవీ విరమణ

  ఈ ఏడాది జూన్ కల్లా హైదరాబాద్ లో ఉన్న ఏపీ ఉద్యోగులందరూ నవ్యాంధ్రకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మొదట ఆసక్తి చూపించిన ఉద్యోగులు మాత్రం ఆ తరువాత అంత ఆసక్తి చూపించడంలేదు. అద్దెలు, మౌలిక వసతుల కొరతలను సాకుగా చూపుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు అక్కడికి రావడానికి వచ్చే ఏడాది మార్చి వరకూ గడువు ఇమ్మని కూడా కోరారు. అయితే విషయాన్ని గమనించిన చంద్రబాబు కూడా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీకి రావాల్సిందే.. కొన్ని త్యాగాలు తప్పవు.. అన్ని శాఖలు ఒక దగ్గర ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది అని తేల్చి చెప్పేశారు. కానీ చంద్రబాబు ఎంత త్వరగా ఉద్యోగులను ఇక్కడికి తరలించాలని ప్రయత్నిస్తున్నా.. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి.   ఇదిలా ఉండగా ఏపీకి వచ్చే ఉద్యోగులు.. విజయవాడ. గుంటూరు వెళ్లి తమ ప్రభుత్వ కార్యక్రమాలను స్వయంగా వెతుక్కోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతే అసలే రావడానికి ఇష్టపడని ఉద్యోగులు ఇలాంటి పనులు చేస్తారా.. అందుకే ఏకంగా లాంగ్ లీవ్ పెట్టి ఈ వెతుకులాట సమస్య నుండి బయటపడాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. వీలైతే కొంతమంది స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి హైదరాబాద్ లోనే ఉండిపోవాలని కూడా భావిస్తున్నారట. మరోవైపు ఉద్యోగులు ఇక్కడికి రావడానికి సరిగ్గా నెల రోజులు టైం మాత్రమే ఉంది. నవ్యాంధ్రలో చూస్తే ఇప్పటివరకూ ఒక్క భవంతి కూడా నిర్మించలేదు. మరి ఉద్యోగులు వస్తారో.. రారో.. తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

ఇకపై మరింత సులభంగా రైలు టికెట్లు రద్దు..

  భారత రైల్వే శాఖ రైలు టికెట్ల విషయంలో పలు మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తత్కాల్ టికెట్ల విషయంలో కొన్ని మార్పులు చేసిన రైల్వేశాఖ ఇప్పుడు మరింత సులభంగా రైలు టికెట్లు రద్దు చేసుకునే విధంగా కొన్ని మార్పులు చేయనుంది. దీనిలో భాగంగానే రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా టికెట్ క్యాన్సిల్ చేసుకునే సదుపాయం ఉండేది. అయితే అది కేవలం రైలు కదిలే మూడు నాలుగు గంటల ముందులోపే చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇకపై టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉన్నా, ఆర్ఏసీ లో ఉన్నా139 నంబరుకు ఫోన్ చేసి.. ఫోన్ ద్వారా లేదా ఆన్ లైన్ ద్వారా రైలు కదిలే అరంగంట ముందు వరకూ టికెట్లను రద్దు చేసుకునేలా మార్పు చేశారు. అంతేకాదు టికెట్ కౌంటర్ లో టికెట్ కొన్నా కానీ  ఫోన్ ద్వారా కూడా తమ టికెట్ ను రద్దు చేసుకోవచ్చు. ఇక టికెట్ రద్దు అయిన తరువాత వివరాలనుబట్టి నగదు చేతికి అందుతుంది.

హైదరాబాదీలపై మళ్లీ "వరుణ" కరుణ..!

హైదరాబాదీలపై వరుణుడు మళ్లీ కరుణ చూపించాడు. ఉష్ణోగ్రతలు పెరిగి జనం అల్లాడుతున్న ప్రతీసారి వరుణుడు భాగ్యనగరంపై కుంభవృష్టి కురిపిస్తూనే ఉన్నాడు. తాజాగా సాయంత్రం నగరంలో భారీ వర్షం కురిసంది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. సికింద్రాబాద్, బేగంపేట, బోయిన్‌పల్లి, సనత్‌నగర్, ఎస్‌ఆర్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.  అయితే కొద్ది రోజుల క్రితం ఈదురుగాలులతో విరుచుకుపడినట్టు వరుణుడు మరోసారి కన్నెర్ర చేస్తాడేమోనని ప్రజలు కాస్త భయాందోళనలకు గురయ్యారు. మొత్తం మీద రెండు రోజులుగా ఎండవేడిమిని ఎదుర్కొన్న నగరవాసులు ఈ వర్షంతో కాస్త ఉపశమనం పొందారు.

ముద్రగడ ఓ కీలుబొమ్మ.. స్ర్కిప్టు సాక్షి కార్యాల‌యంలో తయారవుతుంది..

కాపు నేత ముద్రగడ పద్మనాభంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కాపునేతలకు కట్టే భవనాలకు చంద్రన్న పేరు పెట్టడంపై ముద్రగడ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన గంటా శ్రీనివాసరావు ముద్రగడపై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి ఎన్ని సమస్యలున్నా కాపు రిజర్వేషన్లపై మంజునాథ కమిటీని వేశాం.. కాపు సమస్యలపై పరిశీలను చేస్తున్నాం.. ఇలాంటి సమయంలో మిగ‌తా వ‌ర్గాల‌ను రెచ్చ‌గొట్టేలా మాట్లాడొద్దని సూచించారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి కాపుల ఓట్లు భారీగా ప‌డ్డాయని, వారి రుణం తీర్చుకుంటామ‌ని గంటా అన్నారు. ‘మీరొక కీలు బొమ్మ.. మిమ్మ‌ల్ని కొంద‌రు వ్య‌క్తులు ఆడిస్తున్నారు’ అని గంటా ముద్రగడని విమర్శించారు. ‘కాపుల‌కు న‌ష్టం క‌లిగించేలా ముద్ర‌గ‌డ‌ ఇటువంటి లెట‌ర్లు రాయ‌కూడ‌దు’ అని అన్నారు.   ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పందిస్తూ ముద్రగడపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ‌కీయ ఉనికి కోస‌మే ముద్ర‌గ‌డ ప్ర‌య‌త్నం చేస్తున్నారని ఆరోపించారు. ‘మొన్న ఒక లేఖ, ఈరోజు మ‌రో లేఖ రాసి ముద్ర‌గ‌డ రాజ‌కీయాలు చేస్తున్నార‌’ని ఆయ‌న విమ‌ర్శించారు. ముద్ర‌గ‌డ రాసే లేఖ‌ల‌కు స్క్రిప్టు సాక్షి కార్యాల‌యంలో త‌యారవుతోందని చిన‌రాజ‌ప్ప ఆగ్రహం వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ మాట‌ల‌నే ముద్ర‌గ‌డ లేఖ‌ రూపంలో పంపుతున్నారని ఆయన ఆరోపించారు. ‘ముద్ర‌గ‌డ వెన‌కున్నది ఎవరో అంద‌రికీ తెలుసు’ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. చంద్రబాబు కాపుల‌కు ఇచ్చిన హామీల‌న్నీ అమ‌లు చేయాల‌ని చూస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. కాపుల‌కు న్యాయం చేయ‌డం ముద్ర‌గ‌డ‌కు ఇష్టం లేదని ఆయ‌న అన్నారు.

ఉత్తరాఖండ్‌లో తెలుగు యాత్రికుల ఇక్కట్లు..

ఉత్తరాఖండ్‌లో తెలుగు యాత్రికులకు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ట్రావెల్స్ నిర్వాహకులు మోసం చేయడంతో తెలుగువారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరకాశీ నుంచి కేదార్‌నాథ్‌కు ఒక్కొక్కరి నుంచి హరిద్వార్‌కు చెందిన జీకే ట్రావెల్స్ రూ.8,300 వసూలు చేశారు. నిన్న సాయంత్రమే డబ్బులు చెల్లించినా ఇంతవరకు వారి నుంచి ఎలాంటి స్పందనా లేదని యాత్రికులు ఆరోపిస్తున్నారు. నిర్వాహకులపై రుద్రప్రయాగలోని ఉత్తర కాశీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యాత్రికుల్లో గుంటూరు జిల్లాకు చెందిన 54 మంది, నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో 54 మంది తెలుగువారు ఉన్నారు. వీరంతా ట్రావెల్స్ వారి కోసం రుద్రప్రయాగ పోలీస్ స్టేషన్ వద్ద పడిగాపులు కాస్తున్నారు.