హెచ్సీయూ కొత్త వివాదం... రోహిత్, అంబేద్కర్ ఫొటోలు తొలగింపు

  వివాదాలకు అడ్డాగా మారిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరో వివాదం రేగింది. ఇప్పటికే వర్శిటీ ప్రాంగణంలో మొన్నటికి మొన్న రాత్రే శివుని విగ్రహం, నంది, నాగదేవత విగ్రహాలు పెట్టడంపై పలువురు విద్యార్ధులు నిరసన తెలుపుతుంటే ఇప్పుడు మరో వివాదం మొదలైంది. ఆత్మ‌హ‌త్య చేసుకున్న విద్యార్థి రోహిత్ వేముల ఫోటోలను ఒక వర్గం విద్యార్థులు కొన్ని రోజుల క్రితం వర్సిటీలో పెట్టారు. అయితే నిన్న రాత్రి ఆ ఫోటోలను వ‌ర్సిటీ సిబ్బంది తొల‌గించారు. రోహిత్ వేముల ఫోటోల‌తో పాటు అక్క‌డి అంబేద్క‌ర్ ఫోటోల‌ను కూడా తీసేశారు. దీంతో విష‌యాన్ని గ‌మ‌నించిన విద్యార్థులు ఈరోజు ఆందోళ‌న‌కు దిగారు. వ‌ర్సిటీ ప్ర‌ధాన గేటు వద్ద నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ద‌ళిత విద్యార్థుల ప‌ట్ల వివ‌క్ష చూపుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో యూనివర్శిటీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

జాతీయగీతం వేళ ఫోన్ మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి.. ఆఖరికి క్షమాపణలు..

  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణం స్వీకారం చేసేశారు. ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన ఓ మాజీ ముఖ్యమంత్రిగారు మాత్రం అడ్డంగా బుక్కయ్యారు. అసలు సంగతేంటంటే.. జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా కూడా దీదీ ప్రమాణ స్వీకారానికి వచ్చారు. ఆసమయంలో జాతీయ గీతాలాపన సమయంలో ఫోన్ లో మాట్లాడారు. అంతే ఇది కాస్త కెమెరా కంటికి చిక్కింది. దీంతో ఆయన వ్యవహరించిన తీరుపై వివాదం రేగుతోంది. ఇక ఆఖరికి అబ్దుల్లా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఆసమయంలో ఎమర్జెన్సీ కాల్ వచ్చింది అందుకే మాట్లాడానని..  జాతీయ గీతం సమయంలో ఎలా వ్యవహరించాలో తనకు తెలుసని, తాను నిలబడే ఉన్నానని, అయితే తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వచ్చిందని, తాను అలా చేయడం వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని ఆయన కోరారు.

ముద్రగడకు పెరుగుతున్న మద్ధతు.. చిరంజీవి, దాసరి కూడా

  కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ముద్రగడ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ నేపథ్యంలో ఈరోజు ముద్రగడ పలు కీలక నేతలతో భేటీ అయ్యారు. నిన్న రాత్రికే హైదరాబాదు చేరుకున్న ముద్రగడ... నేటి ఉదయం పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, ప్రముఖ నటుడు, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవిలను కలిసిన ముద్రగడ... కొద్దిసేపటి క్రితం దర్శకరత్న దాసరి నారాయణరావుతో భేటీ అయ్యారు.   భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన దాసరి... ముద్రగడ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని దాసరి డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎన్నికల సందర్భంగా చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. కాపుల ఉద్యమానికి తాను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు.   మరోవైపు చిరంజీవి కూడా తమ మద్దతు ముద్రగడ పద్మనాభంకు ఉంటుందని తెలిపారు. కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమించిన ముద్రగడ వెనుక తాము నిలబడతామని అన్నారు. కాపులకు రిజర్వేషన్ పై ముద్రగడ చేస్తున్న ఉద్యమం ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ కార్యాచరణను ముద్రగడ తనకు వివరించారని, ఆయనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, ఆయన సాధించాలనుకున్నది సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్దులు వీరే..

రాజ్యసభలో మొత్తం 57 సభ్యులకు పదవీకాలం ముగియడంతో ఖాళీలు ఏర్పడనున్న సంగతి తెలిసిందే. ఈ 57 స్థానాల్లో రెండు స్థానాలు తెలంగాణకు, నాలుగు స్థానాలు ఏపీకి వచ్చాయి. ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన అభ్యర్ధులు ఖరారైపోయారు. ఇక ఏపీనుండి మూడు స్థానాలు టీడీపీకి, వైసీపీ ఒక స్థానం దక్కనున్నట్టు తెలుస్తోంది. అయితే అభ్యర్ధులు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యసభకు తమ అభ్యర్థులుగా కాంగ్రెస్‌ పార్టీ ఆరుగురి పేర్లను ప్రకటించింది. పి. చిదంబరం, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌, జైరాం రమేశ్‌, అంబికా సోనీ, వివేక్‌ టంకా, కపిల్‌ సిబాల్‌, ఛాయావర్మలను తమ పార్టీ తరఫున రాజ్యసభకు అభ్యర్థులుగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది.

మరోసారి కోర్టు మెట్లు ఎక్కిన రోజా.. తప్పని కష్టాలు

  వైసీపీ  ఎమ్మెల్యే రోజా ఏదో ఒక కారణంతో కోర్టు మెట్లు మాత్రం ఎక్కాల్సి వస్తుంది. మొన్నటి వరకూ అసెంబ్లీ సస్పెన్షన్ నేపథ్యంలో కోర్టుల చుట్టూ తిరిగిన రోజా ఇప్పుడు ఎన్నిక నేపథ్యంలో మరోసారి కోర్టుకి వెళ్లారు. రోజా ఎన్నికను సవాల్ చేస్తూ, హైకోర్టులో పిటిషన్ దాఖలవడంతో కోర్టు రోజాకి నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై స్పందించిన రోజా పిటిషన్ ను కొట్టివేయాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు ఈ రెండు పిటిషన్లను విచారణకు స్వీకరించింది. అయితే రెండు వాదనలను ఒకేసారి వింటామని ప్రకటించింది. దీంతో రోజా.. రెండు వాదనలు ఒకేసారి ఎలా వింటారని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు రోజా పిటిషన్ ను విచారణకు స్వీకరించి వచ్చే నెల చివరి వారంలో దీనిపై విచారణ చేపట్టనుంది.

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలి..

  టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం నందమూరి తారకరామారావు పేరును ఆయన సొంత జిల్లా కృష్ణా జిల్లాకు పెట్టాలని ఆ పార్టీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యుడు మాగంటి మురళీమోహన్ డిమాండ్ చేశారు. తిరుపతిలోని మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పైవిధంగా డిమాండ్ చేశారు. ఆయన డిమాండుకు వేడుకలకు హాజరైన పార్టీ నేతల నుంచి మంచి మద్దతే లభించింది. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని మురళీమోహన్ అనగానే పార్టీ నేతలు హర్షాతిరేకం వ్యక్తం చేస్తూ మద్దతు పలికారు.     ఇంకా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే తెలుగుదేశం పార్టీ ప్రధాన ఎజెండా అని అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నో సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచారని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరూ పాటుపడాలని కోరారు. ఐదున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదాను కేంద్రం ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

రాహుల్‌గాంధీ కనిపించడం లేదు.. ఆప్ మంత్రి

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ వాసులు విద్యుత్ కోత‌లు, తాగునీటి స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారని.. ఆ సమస్యలను ప‌రిష్కారం చేయాలంటూ కాగ‌డాల ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్ట‌నున్నారు. ఈ ర్యాలీలో పెద్దఎత్తున ఢిల్లీ కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన‌నున్నారు. అయితే ఈ ర్యాలీ సందర్భంగా ఆప్ మంత్రి కపిల్ మిశ్రా రాహుల్ గాంధీపై వ్యంగ్యంగా ట్విట్టర్ లో రీ ట్వీట్ చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు రాహుల్‌గాంధీ ఎన్నో రోజుల నుంచి కనిపించడం లేడని, ఈ ర్యాలీ తోనైనా వారు రాహుల్ గాంధీని క‌లుస్తార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. మరి దీనిపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఆగ‌ష్ట్ వరకూ డెడ్‌లైన్.. మరో ఉద్యమానికి ముద్రగడ

  కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కాపు నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ విషయంలో ఉద్యమం చేసిన సంగతి తెలిసిందే. అది అయిపోయిన తరువాత మళ్లీ ఇటీవల.. ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచిపోయింది అంటూ మరోసారి దీక్ష చేస్తామని ప్రకటించారు. కానీ ఆ తరువాత చేయలేదు. అయితే ఇప్పుడు మరోసారి  ఉద్య‌మానికి సిద్ధ‌మ‌వుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉద‌యం హైద‌రాబాద్‌లో ఏపీసీసీ అధ‌్యక్షుడు ర‌ఘువీరా రెడ్డితో ఆయ‌న భేటీ అయ్యారు. ఇంకా కాంగ్రెస్ నేత, సినీన‌టుడు చిరంజీవిని కూడా ఆయ‌న క‌లిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్ర‌బాబు నాయుడు ఆగ‌స్టులోగా మంజునాథ క‌మిష‌న్ నివేదికను తెప్పిస్తామ‌ని హామీ ఇచ్చార‌ని, ఇచ్చిన హామీకి కట్టుబడి ఆగ‌స్టులోపు కాపుల‌ను బీసీల్లో చేర్చాల‌ని డెడ్‌లైన్ విధించారు. లేకపోతే ఉద్య‌మానికి సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించారు. కాగా ఆయన దాసరి నారాయణరావును, బొత్స సత్యనారాయణను కూడా విడివిడిగా క‌ల‌వ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఎన్టీఆర్ న‌టించ‌లేదు.. భారత రత్న ఇవ్వాలి..

  తిరుపతిలో టీడీపీ మహానాడు కార్యక్రమం రెండో రోజు ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి.. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ప్రసంగం ప్రారంభించారు. ఆంధ్రుల ఆరాధ్య దైవంగా తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనియాడారు. ఉన్నతమైన ఆశయాల కోసం జీవించిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు వెళ్తే సాధించలేనిది ఏది లేదని.. ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డ్ ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది అన్న క్యాంటీన్లను ప్రారంభిచనున్నామని తెలిపారు. సినిమాల్లో ఎంత‌గా గౌర‌వం సంపాదిస్తారో మ‌ళ్లీ అంత‌గా రాజ‌కీయాల్లో సంపాదించే అవ‌కాశం ఉండ‌దు.. కానీ, ఆ ఘ‌న‌త‌ను ఎన్టీఆర్ సాధించార‌’ని అన్నారు. ‘ఎన్టీఆర్ సినిమా పాత్ర‌ల్లో న‌టించ‌లేదు జీవించారు’ అని చంద్ర‌బాబు అన్నారు. ఏ వేష‌మేసినా ఆ పాత్ర‌కి న్యాయం చేశారని ఆయ‌న అన్నారు. శ్రీ కృష్ణుడ్ని మ‌న క‌ళ్ల‌కు చూపించారని వ్యాఖ్యానించారు.   ఈ సందర్బంగా చంద్రబాబు మరో కీలక ప్రకటన చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో 115.5 అడుగుల ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య.. విద్యారంగంపై ప్రత్యేక దృష్టి

  తెలంగాణ మంత్రి హరీశ్ రావు మెదక్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామని తెలిపారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా 250 ఇంగ్లీష్‌ మీడియం రెసిడెన్షియల్‌ స్కూళ్లు మంజూరు చేశామని.. బీసీలకు కళ్యాణలక్ష్మీ పథకం వర్తింపజేస్తున్నామని వివరించారు. రైతులు పత్తిపంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలు పండించాలని అన్నారు.     మరోవైపు విద్యార్దులకు నాణ్యమైన విద్యను అందించడమే కేసీఆర్ లక్ష్యమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. నిజాం కాలేజ్ గ్రౌండ్ లో తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ హ్యాట్రిక్ 2016ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందు ఈ ఫెయిర్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

అస్ట్రేలియాలో వివాహిత అనుమానాస్పద మృతి.. భర్త పరారు..

  హైదరాబాద్ కు చెందిన రమ్యకృష్ణ అనే వివాహిత అస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మూడు నెలల క్రితం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో ఉంటున్న మహంత్‌తో హైదరాబాద్‌ కూకట్‌పల్లి వాసి రమ్యకృష్ణ వివాహం జరిగింది. వివాహం అనంతరం వారు ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. అయితే ఏమైందో ఏమో రమ్యకృష్ణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈవిషయం మహంత్.. రమ్యకృష్ణ తల్లిదండ్రులకు చెప్పి ఆమె మృతదేహంతో హైదరాబాద్ వచ్చాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. భార్య మృతదేహాన్ని తీసుకొచ్చిన మహంత్.. ఆ మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు.   దీంతో తన కూతురు చనిపోవడానికి మహంతే కారణమని.. రమ్యకృష్ణ తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. రమ్యకృష్ణది హత్యే అని.. మహంత్ ను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు. దీంతో  పోలీసులు రంగంలోకి దిగి మహంత్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఎన్టీఆర్ జయంతి.. ఘనంగా నివాళులు

టీడీపీ మహానాడు రెండో రోజు ప్రారంభమైంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అప్పుడే ప్రాంగణానికి చేరుకున్నారు.  పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని వేదిక మీదే ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, బాలయ్య, పార్టీ నేతలు నివాళి అర్పించారు.   మరోవైపు నేటి ఉదయం ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ, కల్యాణ్ రాం, తారకరత్న, లక్ష్మీపార్వతి హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి వేర్వేరుగా ఆయనకు నివాళి అర్పించారు. బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి తండ్రికి నివాళి అర్పించారు.

తప్పుడు ప్రచారాలు చేయోద్దు.. రాం దేవ్ బాబాకు ఝలక్..

ప్రముఖ యోగా గురువు రాం దేవ్ బాబాకు ఓ ఝలక్ తగలింది. ఆ ఝలక్ ఇచ్చింది ఎవరో కాదు ప్రకటనల ప్రమాణాల మండలి (ఏఎస్సీఐ). గతంలో పతంజలి ఆయుర్వేద సంస్థ కోల్డ్‌ ప్రాసెస్డ్  టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే ఆవ నూనె రుచి బాగుండదని ప్రచారం చేసిన నేపథ్యంలో వంట నూనెల ఉత్పత్తిదారుల సంఘం (ఎస్‌ఈ), ఆహార భద్రతా ప్రమాణాల భారతీయ సంస్థ  (ఎఫ్ఎస్ఎస్ఐ) ప్రకటనల ప్రమాణాల మండలి ఫిర్యాదు చేసింది. తప్పుడు ప్రచారం ద్వారా పతంజలి ఆయుర్వేద వినియోగదారుల్ని ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. పతంజలి సంస్థ మాత్రం తాము ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేయలేదని అంటుంది. దీంతో దీనిపై విచారించిన ప్రమాణాల భారతీయ మండలి పతంజలి ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ఉద్దేశించిన ప్రకటనల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తోందని ద ఎడ్వర్టైజింగ్ స్టాండర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా  వ్యాఖ్యానించింది. తప్పుడు ప్రకటనలతో వినియోగదారులను తప్పుదోవ పట్టింస్తోందంటూ మొట్టికాయలేసింది.  తనకు అందిన సుమారు 156  ఫిర్యాదులపై విచారించి ఈ ప్రకటన విడుదల చేసింది. మరి దీనిపై ఇప్పుడు పతంజలి సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఉప్పల్ స్టేడియం పేరు మారిస్తే ఊరుకోం.. వీహెచ్

  ఈ మధ్య నెహ్రూ-గాంధీ కుటుంబాల పేర్లు పలు కట్టడాలకు, రోడ్లకు పెట్టడంపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు బీజేపీ తీరుపై మండిపడ్డారు. హైదరాబాద్లో ఉన్న ఉప్పల్ స్టేడియం పేరు మార్చాలన్న ఆలోచన విరమించుకోవాలని.. ఉప్పల్ స్టేడియం పేరు మారిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రెండేళ్ల బీజేపీ పాలనలో మాటలు తప్ప చేతలు లేవని విమర్శించారు. నెహ్రూ కుటుంబంపై బీజేపీ ప్రభుత్వం కక్ష కట్టిందని ఆయన ఆరోపించారు. రాజ్యసభకు పోటీ చేయాలా? వద్దా? అన్న దానిపై రేపటి కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం తరువాత ఓ స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు.

వాటివల్ల మీకే ముప్పు.. పాక్ కు అమెరికా హెచ్చరిక..

  పాకిస్థాన్ లో ఉన్న ఉగ్రవాదుల వల్ల ఆ దేశానికి నష్టమని అమెరికా హెచ్చరించింది. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థల వివరాలు వెల్లడించాలని అమెరికా కోరింది. అంతేకాదు తాలిబన్ ఉగ్రవాద సంస్థలతో అక్కడ ఉగ్రచర్యలకు పాల్పడుతున్న ఇతర సంస్థలవల్లే పాకిస్థాన్ కే ముప్పు అని  అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ మార్క్ టోనర్ హెచ్చరించారు. ఇంకా ఆయన.. నాడు జరిగిన ముంబై దాడి కేసులో.. భారత్ కు సహకరించాలని.. భారత అధికారులకు ముంబై దాడుల విచారణలో పూర్తి స్థాయిలో సహకరించాలని సూచించామని తెలిపారు.