మరో వివాదంలో సిద్ద రామయ్య... 1.3కోట్ల ముడుపులు..

  కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమి కాదు. ఇప్పటికే చాలా వివాదాల్లో చిక్కుకున్న సిద్ద రామయ్య.. ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. బెంగళూరు టర్ఫ్ క్లబ్ (బీటీసీ)కు స్టివార్డ్‌గా వివేకానంద అనే వ్యక్తిని సిద్దరామయ్య ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు ఆయన ఎంపికపై సిద్దరామయ్యకు ముడుపులు అందాయని ఆరోపణలు వస్తున్నాయి. ఎస్.భాస్కరన్ అనే సామాజిక కార్యకర్త  స్టివార్డ్‌గా నామినేషన్ వేసిన ఎల్.వివేకానందతో సిద్ధరామ‌య్యకు లావాదేవీలు జ‌రిగాయ‌ని.. స్టివార్డ్‌గా  నామినేట్ అయిన కొద్ది రోజుల‌కే సిద్ధరామయ్య ఆయ‌న నుంచి రూ.1.3కోట్ల రుణం తీసుకున్నార‌ని ఆధారాలను సంపాదించి స్పందించారు. కర్ణాటక గవర్నర్ ఈ వ్య‌వ‌హారంపై జోక్యం చేసుకోవాల‌ని ఎస్.భాస్కరన్ కోరారు. మరోవైపు ఈ విష‌య‌మై వివేకానంద స్పందిస్తూ.. సీఎంతో ఎటువంటి లావాదేవీలు జ‌ర‌గ‌లేద‌ని, త‌మ‌పై వ‌స్తోన్న ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని అన్నారు.

ఒబామా ప్రసంగిస్తుండగా..కూలిన విమానం

అమెరికా అధ్యక్షుడు ఒక చోట ఉన్నాడంటే అక్కడ సెక్యూరిటీ ఓ రేంజ్‌లో ఉంటుంది. డ్రోన్‌లు, యుద్ధ విమానాలు, సైన్యంతో కంటికి రెప్పలా తమ అధ్యక్షుణ్ని కాపలా కాస్తుంటాయి. అలాంటిది ఆయన ప్రసంగిస్తుండగా పేలుడు సంభవించిందంటే ఇంకేమైనా ఉందా. నిన్న అమెరికాలోని కొలరాడోలో ఒబామా ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తుండగా ఓ యుద్ధ విమానం ఆయన ఉన్న వేదిక మీద నుంచి ఎగురుతూ వెళ్లింది. ఆ కొద్ది సేపటికే అందరూ చూస్తుంగానే ఆ విమానం కూలిపోయింది. అంతే భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. పీటర్సన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు చెందిన ఆ యుద్ధ విమానం అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ గ్రాడ్యుయేషన్ సామర్థ్యాన్ని తెలిపేలా ప్రదర్శనలు ఇస్తుండగా కూలిపోయింది. అయితే అందులోని పైలెట్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇలాంటి సమయంలో ఏ అధ్యక్షుడైనా తన సభను ముగించుకుని తిరుగు ప్రయాణమవుతాడు. కాని ఒబామా మాత్రం ఆ పైలెట్‌ను పరామర్శించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తారు.

నన్ను ఆంధ్రా పంపించవద్దు ప్లీజ్.. ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యా యత్నం..

  ఒక పక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్లో ఉన్న ఏపీ ఉద్యోగులందరూ జూన్ 27 నాటికి ఏపీ రావాలని చెబుతున్నారు. మరోపక్క ఉద్యోగులు మాత్రం ఏపీకి రావడానికి అంతగా ఆసక్తి చూపించడంలేదు. కొంతమంది ఉద్యోగులైతే .. స్వచ్చంద పదవీ విరమణ చేద్దామని కూడా నిర్ణయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏకంగా ఆంధ్రాకు వెళ్లి తాను ఉద్యోగం చేయలేనని, తెలంగాణలోనే ఉంటానంటూ ఒక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ లోని అగ్రికల్చరల్ కమిషనర్ కార్యాలయం ఎదుట సదరు ఉద్యోగి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ ఉద్యోగిని పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. తనను ఆంధ్రాకు పంపవద్దని ఆ ఉద్యోగి విజ్ఞప్తి చేశాడు. మరి దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఓటుకు నోటులో మత్తయ్యకు ఊరట..!

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న జెరూసలేం మత్తయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మత్తయ్యపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. దీనిని కొట్టివేయాలని మత్తయ్య తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం మత్తయ్యపై నమోదైన ఆరోపణలను కొట్టివేసింది. తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ఆంగ్లో-ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.5 కోట్లు లంచం ఇస్తూ టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలను తెలంగాణ ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ కేసులో మత్తయ్య ఎ4 నిందితుడిగా ఉన్నారు.  

స్పెల్లింగ్ సరిగా రాయడం రాదు.. డిగ్గీ పై కేటీఆర్

  తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు నిన్నఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈవేడుకల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ కేసీఆర్ పై విమర్శలు చేసిన సంగతి కూడా విదితమే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. కేసీఆర్‌ ఉత్సవాలను జరిపిస్తున్నారు. ఓవైపు రాష్ట్రంలో పేద ప్రజలు చనిపోతుంటే.. మరోవైపు వేడుకలు చేసుకుంటున్నారు. ఇది చాలా సిగ్గుచేటు’ అని దిగ్విజయ్‌ ట్వీట్‌ చేశారు.   అయితే ఇప్పుడు డిగ్గీ చేసిన ట్వీట్లకు తెలంగాణ మంత్రి, కేసీఆర్ తనయుడు కేటీఆర్ స్పందించి చురకలు అంటించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ స్పెల్లింగ్‌ రాయటం కూడా తెలియదు. ఆయన కేసీఆర్‌ను విమర్శిస్తారు!’ అంటూ విమర్శించారు.  

కొత్తగా పెళ్లైన బీఎస్‌ఎఫ్ సైనికులకు శుభవార్త..!

త్యాగాలకు..పోరాటానికి మారుపేరు భారత సైన్యం..ఎన్ని కష్టాలొచ్చినా దేశభద్రతే పరమావధిగా బతుకుతారు మన సైన్యం. ఆఖరికి ఉదయం పెళ్లైయితే సాయంత్రం విధుల్లో చేరేందుకు కూడా మన జవాన్లు ఏ మాత్రం బాధపడరు. కానీ పెళ్లైన గంటకే తమ భర్తలు దేశ సరిహద్దులకు పయనమవ్వడాన్ని వారి భార్యలు జీర్ణించుకోలేకపోతున్నారు. అటు సైనికులు కూడా కాపలా కాస్తున్నప్పటికి మనసంతా వారి భార్యలపైనే ఉంటోంది. వీరి పరిస్థితిని గమనించిన బీఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు దీనికి ఒక ఉపాయం ఆలోచించారు. ఇకపై కొత్తగా పెళ్లైన బీఎస్‌ఎఫ్ జవాన్లు దేశ సరిహద్దులో విధులు నిర్వహిస్తూ భార్యతో కలిసి ఉండవచ్చు. ఈ మేరకు కొత్తగా వివాహం జరిగిన సైనికుల నుంచి బీఎస్ఎఫ్ దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే ఎవరు ముందుగా దరఖాస్తు చేస్తే వారికే అవకాశం. అది కూడా జైసల్మేర్ ఉత్తర, దక్షిణ సెక్టార్‌లో విధులు నిర్వహించే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. రానున్న రోజుల్లో ఈ సదుపాయాన్ని దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే జవాన్లకు కూడా కల్పించాలని బీఎస్ఎఫ్ యోచిస్తోంది.

యాపిల్ బ్రాండ్ అంబాసిడర్‌గా షారుఖ్..!

  బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ను యాపిల్ భారత రాయబారిగా నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది యాపిల్ సంస్థ కొత్త మోడళ్లను విడుదల చేయనున్న నేపథ్యంలో షారుఖ్ ను భారత రాయబారిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అంతేకాదు.. భారత పర్యటనకు వచ్చిన యాపిల్ సంస్థ సీఈవో టీమ్ కుక్.. షారుఖ్ ఇచ్చిన డిన్నర్ పార్టీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పుడే దీనిపై చర్చించినట్టు తెలుస్తోంది. కాగా ప్రముఖ బ్రెజీలియన్‌ సాకర్‌ క్రీడాకారుడు నేమార్‌, అమెరికాకు చెందిన బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడు స్టీఫ్‌ కర్రీ ఇలా చాలా మంది యాపిల్‌కి రాయబారులుగా నియమితులయ్యారు.

కిడ్నీ రాకెట్ కలకలం.. ఆరుగురు అరెస్ట్.. ఇద్దరు అపోలో సిబ్బంది..

  దేశ రాజధాని ఢిల్లిలో కిడ్నీ రాకెట్ కలకలం రేపుతోంది. ఈ కిడ్నీ రాకెట్ ముఠాకు సంబంధించిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి తనకు ఉన్న ఆర్ధిక ఇబ్బందుల నిమిత్తం.. కిడ్నీ విక్రయించాడు. అయితే కిడ్నీ అమ్మగా వచ్చిన డబ్బు విషయంలో భార్య భర్తల మధ్య వివాదం రావడంతో అది కాస్త పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. దీంతో అసలు విషయం బయటపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. కిడ్నీ రాకెట్ ను నిర్వహిస్తున్న ఆరుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు అపోలో ఆస్పత్రి సిబ్బందిగా పోలీసులు గుర్తించగా.. కిడ్నీ దాతలకు మధ్యవర్తులుగా వ్యవహరించిన ముగ్గురు వ్యక్తులతో పాటు.. కిడ్నీ దాతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇప్పటికే వీరు నాలుగు కిడ్నీలు అమ్మేసినట్టు తెలుస్తోంది.

మహిళా జడ్జిని వేధించిన క్యాబ్ డ్రైవర్ అరెస్ట్..

మహిళా న్యాయమూర్తిని వేధించిన క్యాబ్ డ్రైవర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కోర్టుకు చెందిన మహిళా జడ్జి షాపింగ్‌కు వెళ్లడానికి ఓలా క్యాబ్‌లో ఎక్కగా డ్రైవర్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి వేధించాడు. దీంతో ఆమె తీస్‌హజారీలోని కోర్టు అదనపు సెషన్స్‌ జడ్జి ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు సందీప్‌ను గుడ్‌గావ్‌లో అరెస్ట్‌ చేశారు.     షాపింగ్‌కు వెళ్లడానికి మే 28న ఓలా క్యాబ్‌ బుక్‌ చేసుకున్నానని.. దారిలో ఓ షాప్‌కు వెళ్లివస్తానని కొంచెంసేపు వేచి ఉండమని డ్రైవర్‌కు చెప్పి లోపలికి వెళ్లానని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే రెండు నిమిషాలు దాటగానే డ్రైవర్‌ చాలా అసభ్యంగా తిడుతూ తన బ్యాగ్‌ రోడ్డుపై పడేశాడని తెలిపారు.

విజయసాయిరెడ్డికి నాన్ బెయిలబుల్ వారెంట్లు..

  ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న కేసులో విజయసాయిరెడ్డి రెండో నిందితుడన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డిపై సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుపై ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టు విచారణ చేపడుతున్న నేపథ్యంలో  విజయసాయిరెడ్డి మాత్రం కోర్టుకు హాజరవడం లేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు నేటి విచారణ సందర్భంగా ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.   విజయసాయిరెడ్డి పరిస్థితిని ముందుగానే గమనించి.. అనారోగ్యం కారణం వల్లనే కోర్టుకు హాజరుకాలేక పోతున్నానని చెప్పి పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు మాత్రం ఆ పిటిషన్ ను కొట్టివేసి.. కేసు విచారణకు హాజరుకు మినహా ఇతర కార్యకలాపాల్లో చురుకుగానే పాలుపంచుకుంటున్నారని మండిపడుతూ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లను జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు.

రూ.5 కోట్లిస్తే ఓటేస్తాం.. అడ్డంగా బుక్కయిన ఎమ్మెల్యేలు

  రాజ్యసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగుస్తున్నాయి అనుకున్న నేపథ్యంలో ఇప్పుడొక ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. ఎన్నికల్లో ఓటర్లను కొనడానికి నేతలు డబ్బులతో వల విసురుతుంటారు.. అయితే ఇప్పుడు కర్ణాటక ఎమ్మెల్యేలు మాత్రం ఓటు వేయాలంటే తమకు డబ్బులివ్వాలని తేల్చిచెబుతున్నారు. అలా ఓ నలుగురు ఎమ్మెల్యేలు అడ్డంగాబుక్కయ్యారు. అసలు సంగతేంటంటే.. కర్ణాటక రాజ్యసభ స్థానాలకు ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో అక్కడ పోలింగ్ తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్ధులు విపక్షాల నేతలను తమవైపు తిప్పుకునేందుకు ముడుపులు చెల్లించడానికి సిద్దపడుతున్నారు. ఇక దీన్ని అవకాశంగా తీసుకున్న విపక్ష నేతలు ‘రూ.5 కోట్లిస్తామంటే చెప్పండి, మా ఓటు మీకే’’ అంటూ ఆయా పార్టీల తరఫున బరిలోకి దిగిన రాజ్యసభ అభ్యర్థులకు తేల్చిచెబుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించగా.. రూ.5 కోట్లిస్తే పార్టీలతో సంబంధం లేకుండా ఓటేయడానికి తాము సిద్ధమేనంటూ కామెరా కంటికి చిక్కారు. ఈ నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు జేడీఎస్  కు చెందిన వారు కాగా, కేజీపీకి చెందిన మరో ఎమ్మెల్యే, స్వతంత్ర శాసనసభ్యుడు ఉన్నారు.

జగన్ ను చెప్పులతో కొట్టిస్తానన్న జేసీ ప్రభాకర్ రెడ్డి..

  అనంతపురం జిల్లా యాడికిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈరోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో రైతు భరోసా యాత్ర చేపట్టారు. జగన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో జగన్ రైతు భరోసా యాత్రను అడ్డుకునేందుకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి 50 కార్లతో బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను అనుకుంటే ఈ క్షణమే నిన్ను చెప్పులతో కొట్టించి తాడిపత్రి నుంచి తరిమేయగలనని, తాడిపత్రిలో రైతు భరోసా యాత్ర పేరిట పర్యటిస్తున్న నిన్ను పది నిమిషాల్లోనే ప్రజల చేత చెప్పులతో కొట్టిస్తే ఏం చేస్తావని, ముఖ్యమంత్రిని కాదు ప్రజలు నిన్ను చెప్పులతో కొట్టి ఊరేగించే కాలం ఆసన్నమైందని ధ్వజమెత్తారు. చంద్రబాబును విమర్శిస్తే ఊరుకునేది లేదని అన్నారు. దీంతో ఓ వైపు వైసీపీ కార్యకర్తలు... టీడీపీ శ్రేణులు... మధ్యలో భారీ సంఖ్యలో పోలీసులతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా వడుగూరులో నిన్న మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని చెప్పులతో కొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

జగన్ కు దెబ్బ మీద దెబ్బ.. మరో వైసీపీ ఎమ్మెల్యే జంప్

  వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. రెండు రోజుల క్రితమే గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి టీడీపీలో చేరారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా జగన్ కు షాకిచ్చాడు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పోతుల రామారావు కూడా టీడీపీ లో చేరారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పోతుల రామారావు, ఆయన అనుచరులు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోతుల రామారావు మాట్లాడుతూ.. నవ నిర్మాణ దీక్ష రోజునే టిడిపిలో చేరడం ఆనందంగా ఉందని అన్నారు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నందునే తెలుగుదేశం పార్టీలో చేరానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శిద్ధా రాఘవరావు, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా ఇప్పటికి 18 మంది ఎమ్మెల్యేలు టీడీపీ లో చేరారు.

రేవంత్ రెడ్డిపై కేసు నమోదు..

  తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ఓయూ జన జాతరలో పాల్గొన్న ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన జన జాతర కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన కుటుంబ సభ్యులకు గంటల్లో రాజకీయ ఉద్యోగాలు కల్పించిన కేసీఆర్ విద్యార్థులకు ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేసేందుకు మాత్రం కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే లక్ష ఉద్యోగాలకు నోటీఫికేషన్లు జారీ చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఓయుకు హెలికాప్టర్లో వచ్చిన కేసీఆర్‌కు విద్యార్థులు చెప్పులు చూపినందుకు కక్ష కట్టారన్నారు. ఓ వైపు ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయకుండా, మరోవైపు వర్సిటీకి వైస్ ఛాన్సులర్‌ను నియమించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు.   ఈ నేపథ్యంలో రాజకీయ సభలకు హాజరుకాకూడదని కోర్టు ఆదేశించినా... హైకోర్టు ఆదేశాల ధిక్కరణ కింద రేవంత్‌రెడ్డిపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా సభలో పాల్గొనేందుకు వస్తున్న తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి శ్రీధర్ బాబు, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ యాదవ్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఎంపీ కోసం స్పెషల్ ట్రైన్..ప్రయాణీకుల పాట్లు..!

సాధారణ ప్రయాణీకులు చాలి చాలని రైళ్లతో నానా అవస్థలు పడుతూ మాకు రైళ్లు పెంచండి బాబూ అని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని రైల్వేశాఖ ఒకరి కోసం ప్రత్యేకంగా రైలునే నడిపింది. మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హాకు సంబంధించిన ఓ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంది. ముంబైలో జరిగే ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్‌లోని బినా జిల్లాలో ఉన్న పూనమ్ భోపాల్ చేరుకుని అక్కడి నుంచి విమానంలో వెళ్లాల్సి ఉంది. పూనమ్ ఆలస్యంగా రావడంతో ఆమె భోపాల్ వెళ్లాల్సిన రైలు వెళ్లిపోయింది. దీంతో రైల్వేశాఖ అధికారులు ఆమె కోసం ప్రత్యేకంగా రెండు బోగీలతో స్పెషల్ రైలును ఏర్పాటు చేశారు. అంతేనా ఆ రైలు భోపాల్ చేరేంత వరకు మార్గమధ్యంలో వెళుతున్న రైళ్లను నిలిపివేశారు. ఆమె భోపాల్ చేరుకుని వెంటనే విమానాశ్రయానికి వెళ్లి ముంబయి విమానాన్ని అందుకున్నారు. కేవలం ఒక ఎంపీ సరైన సమయానికి విమానం అందుకోవడం కోసం సాధారణ ప్రయాణికుల రైళ్లను నిలిపివేయడంతో జనం నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఈ విషయం వివాదాస్పదంగా మారింది. 

పనిపిల్లపై కరుణ లేని రేణుకా చౌదరి..

కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి రేణుకా చౌదరీ చిక్కుల్లో పడ్డారు. తన కుటుంబంతో కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన రేణుకా చౌదరీ తన ఇంట్లోని ఓ చిన్నపాపను చూసుకునే అమ్మాయికి కనీసం విలువ ఇవ్వకుండా భోజనం చేశారు. ఆ అమ్మాయిని కుర్చీలో కూర్చోమని కూడా చెప్పకుండా అలాగే నిలబెట్టారు. రిషి బగ్రీ అనే వ్యక్తి ఆ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో నెటిజన్లు రేణుకపై విరుచుకుపడుతున్నారు. ప్రియమైన రేణుకా చౌదరీ గారూ..మీ చిన్నారిని చూసుకునే అమ్మాయికి భోజనం పెట్టించలేనప్పుడు ఆ అమ్మాయిని అసలు రెస్టారెంట్‌కు ఎందుకు తీసుకువెళ్లారని..పెద్ద వాళ్ల ఇళ్లలో వెలి ఇంకా కొనసాగుతుందని చెప్పడానికి రేణుకా గారి చర్యలే ప్రత్యక్ష ఉదాహరణ అని కొంతమంది ట్వీట్ చేశారు. గతంలో మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి అయ్యి ఉండి మహిళ పట్ల ఇలా చేస్తారా అని మరికొందరు ప్రశ్నించారు.