కలెక్టర్ ను హీరోయిన్ లా ఉన్నారన్న ఎమ్మెల్యే.. కేసు నమోదు..

రాజకీయ నేతలు అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బుక్కవుతుంటారు. ఇప్పుడు ఓ ఎమ్మెల్యే మహిళా కలెక్టర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బుక్కయ్యాడు. అసలు సంగతేంటంటే.. ఛత్తీస్ గఢ్ లో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా.. సీతాపూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆ పార్టీ ఎమ్మెల్యే అమర్ జీత్ భగత్ మాట్లాడుతూ.. సర్‌గుజా జిల్లా కలెక్టర్ రితూ సేన్‌ను చూసి, ఆమె చాలా అందంగా ఉందని, హీరోయిన్‌లా ఉందిగానీ ఆమె నటించడం తానెప్పుడూ చూడలేదని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అక్కడితో ఆగకుండా..  తన 48 ఏళ్ల జీవితంలో విద్యాశాఖ మంత్రి కేదార్ కశ్యప్ లాంటి పిచ్చివాడిని చూడలేదని అన్నారు. ఇక అంతే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధి హోదాలో ఉన్న ఆయన ఒక మహిళపట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడుతున్నారు. ఇక బేజేపీ నేతలు కూడా భగత్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సదరు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.

ఏపీ రాజ్యసభ అభ్యర్దిగా సురేష్ ప్రభు నామినేషన్..

  ఏపీ కోటా నుండి బీజేపీ తరపున రాజ్యసభ అభ్యర్దిగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభుకి టికెట్ ఖాయం అయిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన రాజ్యసభకు నామినేషన్ వేయడానికి హైదరాబాద్ వచ్చారు. ఈ ఉదయం హైదరాబాద్ వచ్చిన ఆయన పలువురు తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ అయ్యారు. టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తో భేటీ అయిన సురేష్ ప్రభు, పార్టీ పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు. పార్టీ నేతలు కిషన్ రెడ్డి, దత్తాత్రేయలతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆయన బస చేసిన ప్రాంతానికి తరలిరావడంతో ఈ ప్రాంతమంతా సందడి నెలకొంది. మరికాసేపట్లో నామినేషన్ వేసేందుకు వెళ్లనున్న సురేష్ ప్రభు వెంట అసెంబ్లీకి విష్ణుకుమార్ రాజు, కావూరీ తదితర బీజేపీ నేతలు తోడు వెళ్తారని తెలుస్తోంది. కాగా ఏపీ కోటాలో టీడీపీకి మూడు రాజ్యసభ స్థానాలు దక్కగా అందులో మిత్రపక్షమైన బీజేపీకి ఒక స్థానం ఇచ్చింది. ఇక మిగిలిన రెండు స్థానాల్లో సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ లకు అవకాశం దక్కింది.

పల్గాన్‌లో అగ్నిప్రమాదం.. 18 మంది జవాన్లు, ఇద్దరు అధికారులు మృతి

  మహారాష్ట్ర పల్గాన్ లోని ఆయుధ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం 20 మంది మృతి చెందగా.. 19 మందికి తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది. చనిపోయిన 20 మందిలో 18 మంది జవాన్లు ఉండగా ఇద్దరు అధికారులు ఉన్నట్టు గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. అంతేకాదు మంటలు భారీగా ఎగసిపడుతుండడంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.   మరోవైపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ హుటాహుటిన మహారాష్ట్రలోని పల్గాన్‌కు బయలుదేరి వెళ్లారు. ఆర్మీఆయుధ కార్మాగారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో విషయం తెలుసుకున్న పారికర్‌ సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు.

కంప్లయింట్ తీసుకోవాలంటే..షూ పాలిష్ చెయ్..!

తమకొచ్చిన కష్టం తీర్చమంటూ పోలీస్ ‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తుంటారు మనలో చాలా మంది. అయితే పోలీస్ డిపార్ట్‌మెంట్ సిగ్గుపడేలా ఉత్తరప్రదే‌శ్‌లోని ముజఫర్‌నగర్ పోలీసులు వ్యవహరించారు. ముజఫర్‌నగర్ సమీపంలోని హైబత్పూర్ అనే గ్రామానికి చెందిన సిత్తు ఓ చమారీ అనే వ్యక్తి చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తున్నాడు. అయితే అతని సెల్‌ఫోన్‌ని ఎవరో కొట్టేశారు. దీనిపై పోలీస్‌‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలనుకున్నాడు. అయితే సిత్తు చెప్పులు కుట్టేవాడని తెలిసిన పోలీసులు..స్టేషన్‌లో ఉన్న అందరి బూట్లూ పాలిష్ చేస్తేనే కంప్లయింట్ తీసుకుంటామని బెదిరించారు. దాంతో సిత్తు తన గ్రామం వెళ్లి సామాగ్రి తెచ్చి వారందరి బూట్లూ పాలిష్ చేశాడు. పోలీసుల తీరుపై అతని తోటివారు భగ్గుమన్నారు..అంతటితో ఆగకుండా అతని చేత జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయించారు. సదరు పోలీసులపై చర్య తీసుకుంటానని జిల్లా ఎస్సీ సంతోష్ కుమార్ హామీ ఇచ్చారు.

ఆలయ ఈవోపై పెట్రోల్ దాడి..

  ఓ ఆలయ ఈవో పై పెట్రోల్ దాడి జరిగిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో జరిగింది. కర్నూల్ జిల్లాలోని యాగంటి ఆలయ ఈవో ఆదిశేషునాయుడుపై దాడి చేసి పెట్రోల్ పోసి అంటించి హతమార్చేందుకు విఫలయత్నం జరిగింది. ఈ దాడికి పాల్పడింది జూనియర్ అసిస్టెంట్ కృష్ణారెడ్డి. వివరాల ప్రకారం.. కృష్ణారెడ్డి గత కొద్ది రోజులుగా విధులకు గైర్హాజరు అవుతున్నారు. దీంతో ఈవో ఆయన జీతాన్ని నిలిపివేశారు. ఆ కోపంతో కృష్ణారెడ్డి.. ఆదిశేషునాయుడుపై పెట్రోల్ పోసి దాడి చేశారు. దీంతో వెంటనే సిబ్బంది తేరుకొని ఆయన్ని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటన నేపథ్యంలో ఆదిశేషునాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కన్న ప్రేమను చూపించిన లాలూ...!

కట్టుకున్న భార్యకన్నా కొడుకులు, కూతుళ్లు అంటేనే చాలా మంది భర్తలకి  ఇష్టం. సామాన్యుల నుంచి అసామాన్యుల దాకా ఎందరి విషయంలోనో...ఎన్నో సందర్భాల్లోనో ఈ విషయం నిరూపించబడింది. తాజాగా రైల్వేశాఖ మాజీ మంత్రి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేతి లాలూ ప్రసాద్ యాదవ్ ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు. దేశవ్యాప్తంగా ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు వివిధ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. అలాగే ఆర్జేడీ నుంచి లాలూప్రసాద్ యాదవ్ వంతుకు వస్తే. రాజ్యసభ నోటిఫికేషన్ వెలువడటానికి ముందు నుంచే ఆయన భార్య రబ్రీదేవి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ..భార్య రబ్రీదేవిని కాదని కూతురు మీసాభారతికి సీటు ఇచ్చారు. దీనిపై ఉదయం వరకు సస్పెన్స్ నడిచింది. కాని చివరకు కూతురివైపే ఆయన మొగ్గుచూపారు. 

ఆఖరికి పుదుచ్చేరిలో ప్ర‌భుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్..

  ఐదు రాష్ట్రాల్లో ఎన్నికుల జరిగిపోయాయి. ఫలితాలు వచ్చేశాయి. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం కూడా ఏర్పాటైపోయింది. ఒక్క పుదుచ్చేరిలో తప్ప. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికలు జరుగగా అందులో 17 స్థానాలు కాంగ్రెస్ గెలిచి అధికారం కైవసం చేసుకుంది. అయితే  పార్టీలో అంత‌ర్గ‌త విభేదాలతో ఇప్పటివరకూ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయలేదు. అయితే పార్టీ అధిష్ఠానం  సీనియ‌ర్ నేత‌, మాజీ కేంద్ర మంత్రి వీ.నారాయ‌ణస్వామిని ముఖ్య‌మంత్రిగా నియ‌మించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో ఎట్టకేలకు పుదుచ్చేరిలో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ కదిలినట్టు తెలుస్తోంది. మరోవైపు పుదుచ్చేరి గ‌వ‌ర్నర్ కిర‌ణ్ బేడీతో వీ.నారాయ‌ణ స్వామి ఈరోజు భేటీ అయ్యారు. పుదుచ్చేరిలో ప్ర‌భుత్వ ఏర్పాటు చేయ‌వల్సిందిగా కోరారు.

తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ కు షాకు.. గులాబీ గూటికి నేతలు..

  తెలంగాణ కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ తగలనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీనుండి పలువురు నేతలు టీఆర్ఎస్ గూటికి చేరగా ఇప్పుడు కోమటి రెడ్డి బ్రదర్స్ కూడా గులాబీ గూటికి చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డిలు టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. జూన్‌ మొదటి వారంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా వేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.     ఇక తెలంగాణ టీడీపీ కి కూడా షాక్ తగలనున్నట్టు సమాచారం. ఒక పక్క ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీలోకి వైసీపీ నేతలు జంప్ అవుతుంటే.. తెలంగాణలో మాత్రం దానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు టీఆర్ఎస్లోకి చేరుతున్నారు. ఈనేపథ్యంలోనే మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్టు వినిపిస్తోంది. ఇప్పటికే మల్లారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌ వారివారి అనుచరులతో మంతనాలు జరిపారు. నల్గొండలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో వీరు టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం.

హర్యానాలో మళ్లీ రాజుకున్న జాట్ల సెగ..

రిజర్వేషన్లు కల్పించాలంటూ హర్యానాలో రెండు నెలల క్రితం జాట్లు చేసిన ఆందోళనతో దేశం మొత్తం కంపించింది. ఎలాగో అప్పుడు బిల్లు పెడతామని ఉద్యమాన్ని సైలెంట్ చేశారు. దీంతో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ నేతృత్వంలోని ఆ రాష్ట్ర కేబినెట్ జాట్‌లతో పాటు మరో ఐదు కులాలను ఓబీసీలో చేర్చింది. అయితే ఈ చట్టం అమలుపై పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు రెండు రోజుల క్రితం స్టే ఇచ్చింది. ఈ నిర్ణయం జాట్‌ కులస్తులకు ఆగ్రహన్ని కలిగించడంతో వారు మరోసారి ఉద్యమానికి పిలుపునిచ్చారు. జూన్ 5 నుంచి హిసార్ జిల్లా మాయర్ గ్రామం నుంచి దీనిని మొదలుపెట్టాలని జాట్ సంఘర్ష్ సమితి నేతలు రొహ్‌తహ్ జిల్లా బసంతపూర్‌లో జరిగన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే వందల సంఖ్యలో కేంద్ర పారామిలటరీ బలగాలను రంగంలోకి దించాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఈ నిషేధం మే 28 నుంచి జులై 27 వరకు అమల్లో ఉంటుందని హర్యానా ప్రభుత్వం తెలిపింది.

చైనాలో ట్రంప్ కు పెరుగుతున్న డిమాండ్.. అత్యధికంగా మాస్కులు

  అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ చైనాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. చైనా వాళ్లు తమ ఉద్యోగాలు లాక్కుంటున్నారని.. చైనా తమ దేశాన్ని రేప్ చేసిందంటూ.. తమ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయినా కూడా ట్రంప్ వ్యాఖ్యలను చైనా పొగడ్తలుగానే తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు చైనాలో ట్రంప్ కు ఆదరణ కూడా బాగా పెరిగిపోతుంది. చైనాలోని మాస్కులు తయారు చేసే కంపెనీ యజమాని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడం ఖాయమని ఆయన మాస్కులను తయారు చేయిస్తున్నాడు. ఒక్క ట్రంప్ మాస్కులే కాదు.. హిల్లరీ క్లింటన్, సాండర్స్ మాస్కులు కూడా తయారు చేయిస్తున్నాడు. అయితే ట్రంప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆయన మాస్కులు కాస్త ఎక్కువగానే తయారు చేయిస్తున్నాడు.

కేసీఆర్‌కు సూసైడ్ లెటర్ రాసి చనిపోయింది..

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నోములలో ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థిని ఝూన్సీ కేసు కీలక మలుపు తిరిగింది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సూసైడ్ లెటర్ రాసింది. ఆ లేఖను ఏకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపింది. ఆ లేఖలో తన ఆవేదనను సీఎంకు వివరించింది. తనను వ్యభిచారంలోకి దింపేందుకు భర్తతో పాటు తల్లి ప్రయత్నించారని పేర్కింది. సీఎంతో పాటు డీజీపీ అనురాగ్‌శర్మ, నల్గొండ జిల్లా ఎస్పీ, నకిరేకల్ పోలీసులకు చనిపోయే ముందు ఈ లేటర్‌ను ఝూన్సీ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపింది. ఉన్నతాధికారుల ఆదేశంతో ఆమె మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు ఝూన్సీ భర్త, తల్లి పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

బీజేపీ రాజ్యసభ అభ్యర్ధులు.. ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాలు ఇవే..

  బీజేపీ తరపున రాజ్యసభకు వెళ్లే అభ్యర్ధులను పార్టీ పెద్దలు ఇప్పటికే ప్రకటించారు. దాదాపు 12 మంది అభ్యర్ధుల పేర్లను బీజేపీ ప్రకటించింది. రేపటితో నామినేషన్ గడువు పూర్తవుతున్న సందర్భంగా మరిన్ని పేర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. బీజేపీ కి ఉన్న సంఖ్యా బలం దృష్ట్యా ఇంకా 18 నుండి 19 మంది సభ్యులను రాజ్యసభకు పంపే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. కాగా ప్రస్తుతం బీజేపీ ప్రకటించిన అభ్యర్దుల పేర్లు వారు ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాల వివరాలు 1. వెంకయ్య నాయుడు - రాజస్థాన్ 2. నిర్మలా సీతారామన్‌ - కర్ణాటక 3. ఓం ప్రకాశ్‌ మాథుర్‌ - రాజస్థాన్ 4. హర్షవర్ధన్ సింగ్ - రాజస్థాన్ 5. రాంకుమార్ వర్మ - రాజస్థాన్ 6. పియూష్‌ గోయెల్‌ - మహారాష్ట్ర 7. ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ - ఝార్ఖండ్ 8. బీరేంద్ర సింగ్ - హరియాణా 9. పురుషోత్తం రూపాల - గుజరాత్ 10. గోపాల్‌ నారాయణ్‌ సింగ్‌ - బీహార్ 11. అనిల్ మాధవ్ దవే - మధ్యప్రదేశ్ 12. రాంవిచార్ నేతం - ఛత్తీస్ గఢ్

కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్ నామినేషన్‌..

  రాజ్యసభ సభ్యురాలిగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పదవికాలం కూడా పూర్తవుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఏపీ కోటా నుండి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న నిర్మలా సీతారామన్ ఈసారి కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీ ఆదేశాల మేరకే తాను కర్ణాటక నుండి రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేస్తున్నానని.. తనను ఏపీ నుండి కొనసాగించకపోవడానికి గల కారణాలు ఏంటో తనకు తెలియవని.. పార్టీ నిర్ణయాన్ని శిరసాహించడమే తన కర్తవ్యమని స్పష్టం చేశారు. ఈరోజు కర్ణాటక వెళ్లి రేపు నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు ఆమె తెలిపారు.   కాగా ఏపీ కోటానుండి రాజ్యసభకు నాలుగు సీట్లు ఉండగా.. అందులో మూడు టీడీపీకి దక్కనున్నాయి. ఇక బీజేపీ-టీడీపీ మిత్రపక్షం కాబట్టి అందులో బీజేపీకి ఒక స్థానం దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా ఏపీ నుండి నిర్మలా సీతారామన్నే రాజ్యసభకు పంపించాలని చూశారు. కానీ పరిస్థితులు అనుకూలించక ఆమెను కర్ణాటక నుండి రాజ్యసభకు పంపిస్తున్నారు. మరోవైపు ఏపీ నుండి రాజ్యసభకు పంపే అభ్యర్ధులపై చర్చ జరుగుతుంది. ఈ రోజు సాయంత్రంలోపు అభ్యర్ధులు ఎవరో తెలిసిపోయే అవకాశం ఉంది. 

ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు... టీడీపీ నేతల ఆగ్రహం..

  టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతి రెంజు రోజుల క్రితమే జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆయన జయంతి అలా జరిగిందో లేదో మరుసటి రోజే.. ఆయన విగ్రహానికి  గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి నిప్పు పెట్టారు. ఈ ఘటన తెలంగాణలోని ఆదిలాబాదు జిల్లా ఖానాపూర్ మండలం సూర్జాపూర్ గ్రామంలో జరిగింది. దీంతో జిల్లా టీడీపీ నేతలు జరిగిన ఘటనపై ఆగ్రహం వ్యక్తే చేస్తున్నారు. ఎన్టీఆర్ కు అవమానం జరిగిందని.. విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వారు గ్రామంలో ధర్నాకు దిగారు. ఈ ఘటనలో ఎన్టీఆర్ విగ్రహానికి స్వల్పంగా నష్టం వాటిల్లింది.