ఫ్యాన్సీ నంబర్‌ కోసం 33 కోట్లు..

కార్ల నెంబర్ ప్లేట్లు కానీ..మొబైల్ ఫోన్ నంబర్లు కానీయండి ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న క్రేజే వేరు. ఖరీదైన కార్లు కొని వాటికి తమ హోదా కనిపించేలా నంబర్ ప్లేట్‌ మీద ఫ్యాన్సీ నంబర్ ఉండాలనుకుంటారు సంపన్నులు. రాజకీయనాయకులు, సినీతారలు, సంపన్నులు   ఫ్యాన్సీ నెంబర్లు కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడటం లేదు.  మొన్నామధ్య టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తాను కొత్తగా కొన్న బీఎండబ్ల్యూ కారు కోసం 10 లక్షలు ఖర్చుపెట్టారంటే నోరెళ్లబెట్టాం. కానీ ఒక వ్యక్తి ఫ్యాన్సీ నంబర్ కోసం ఏకంగా 33 కోట్లు ఖర్చుపెట్టాడంటే నమ్ముతారా.? యూఏఈలోని షార్జాలో ఫ్యాన్సీ నంబర్‌ను వేలం వేయగా, ఆరిఫ్ అహ్మద్ అల్ జరౌనీ అనే వ్యాపారవేత్త నలభై తొమ్మిది లక్షల డాలర్లు ( మన కరెన్సీలో రూ.33 కోట్లు)కు బిడ్ వేసి నం.1 నంబర్‌ను దక్కించుకున్నాడు. ఈ మొత్తం నిర్ణయించిన ధర కంటే 18 రెట్టు ఎక్కువ. అయితే ఇక్కడ ఇదేం పెద్ద గొప్ప కాదు. 2008లో జరిగిన బిడ్డింగ్‌లో యూఏఈలోనే అత్యంత సంపన్న ఎమిరేట్ అయిన అబుదాబీలో నం.1 నంబర్‌ను ఒక వ్యక్తి 1.42 కోట్లకు దక్కించుకున్నాడు.

అమేజాన్ ను కష్టాల్లోకి నెట్టిన డోర్ మ్యాట్లు...

  ఆన్ లైన్ షాపింగ్ లో మంచి పేరు తెచ్చుకున్న అమేజాన్ కు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఈ-కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేసుకోవాలని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇంతకీ అంత పని అమేజాన్ సంస్థ ఏం చేసిందనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే.. వివిధ మతాలకు చెందిన దేవుళ్ల చిత్రాలతో కూడిన డోర్ మ్యాట్లను ఆన్ లైన్ లో విక్రయించడమే ఇందుకు కారణం. లక్ష్మీ దేవి, వినాయకుడు, శివుడు తదితర దేవతామూర్తుల చిత్రాలతో పలు దేవాలయాల ఫోటోలు, ఖురాన్, ఏసుక్రీసులను సైతం డోర్ మ్యాట్లపై ముద్రించి అమేజాన్ విక్రయించింది. ఇక అంతే అమేజాన్ చేసిన ఈపనికి పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు 'బాయ్ కాట్ అమేజాన్' పేరిట ప్రచారం మొదలు పెట్టగా, అదిప్పుడు వైరల్ అయింది. దీంతో జరిగిన తప్పును తెలుసుకున్న అమేజాన్ ఆఖరికి క్షమాపణలు చెప్పింది. అయితే ఎంత క్షమాపణలు చెప్పినా కానీ.. సంస్థకు వ్యతిరేకంగా ఇంకా విమర్శలు వస్తూనే ఉన్నాయి.

కన్నయ్యపై దాడి చేసిన వ్యక్తి.. అమిత్ షాతో సెల్ఫీలు

జేఎన్యూ విద్యార్ధి కన్నయ్య కుమార్ ఇటీవల విమానంలో ప్రయాణిస్తుండగా.. అతనిపై మనాస్ డేక అనే వ్యక్తి హత్య చేసేందుకు ప్రయత్నించాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత పోలీసులు కన్నయ్య ఆరోపణలు తప్పని తేల్చేసింది. ఇప్పుడు మనాస్ డేక బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో కలిసి తీసుకున్న సెల్ఫీలు సంచలనం సృష్టిస్తున్నాయి. పుణెలో జరిగిన ప్రమోద్ మహాజన్ స్కిల్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మిషన్ అనే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మనాస్ కూడా పొల్గొని అమిత్ షాతో సెల్ఫీలు దిగి.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే వీటిని చూసిన పలువురు షాకవుతున్నారు. ఇక ఈ ఫొటోలపై స్పందించిన కన్నయ్య కుమార్.. అతనో బలమైన బీజేపీ మద్దతుదారని ఈ ఫొటోల ద్వారా అర్ధమవుతోందని అన్నాడు.

చంద్రబాబుకు వ్యతిరేకంగా అశోక్ బాబు సంచలన వ్యాఖ్యలు..

ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో వసతులు కల్పించకుండా రమ్మంటున్నారు..అక్కడ వసతులు లేకుండా మేం వచ్చి ఏం చేస్తాం అని అన్నారు. అంతేకాదు.. ఉద్యోగుల తరలింపుపై ప్రభుత్వానికి స్పష్టత లేదుట.. జూన్ 27నాటికి సచివాలయం పూర్తవుతుందన్న నమ్మకం లేదు.. ఉద్యోగుల్లో అపనమ్మకం ఏర్పడింది.. ఉద్యోగుల పట్ల ఉదాసీదంగా వ్యవహరించవద్దు.. అన్ని వసతులు కల్పించిన తరువాతే వస్తాం అని తేల్చి చెప్పారు.   మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జూన్ 27 నాటికల్లా హైదరాబాద్లో ఉన్న ఏపీ ఉద్యోగులందరూ అమరావతి వచ్చి తీరాల్సిందే అని ఆదేశించారు. మరి ఇప్పుడు అశోక్ బాబు ఇలాంచి వ్యాఖ్యలు చేశారు. దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో  చూడాలి.

మాల్యా విషయంలో ఈడీ మరోసారి ఝలక్...

  బ్యాంకులకు వేలాది కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన మాల్యా విషయంలో ఈడీకి అప్పుడప్పుడు ఝలక్కులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి మాల్యా వ్యవహారంలో ఈడీకి ఎదురుదెబ్బ తగిలింది. మాల్యాకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఈడీ ఇంటర్ పోల్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు లేఖను పరిశీలించిన ఇంటర్ పోల్.. వెంటనే మాల్యాకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయలేం.. అలా చేయాలంటే తమకు మరింత సమాచారం కావాలని ఈడీకి ఓ లేఖ రాసింది. ఇక దీనిపై స్పందించిన ఈడీ.. పలు కేసుల్లో ఇంటర్ పోల్ ఇలాంటి సమగ్ర సమాచారం కావాలని కోరడం సాధారణమే.. ఇదేమి ఎదురుదెబ్బ కాదు.. ఇంటర్ పోల్ లేఖకు త్వరలోనే సమాధానం ఇవ్వనున్నామని, ఆ తర్వాత మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అవుతాయని ధీమా వ్యక్తం చేసింది.

అనంతలో ఆగని టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు అనంతలో అగ్గి రాజేశాయి. ఈ వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎంకు జగన్ క్షమాపణ చెప్పాలంటూ అనంత నగరంలోని సప్తగిరి సర్కిల్‌లో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ద్విచక్రవాహనాలతో ర్యాలీగా వచ్చారు. అసలే కోపంతో ఊగిపోతున్న టీడీపీ కార్యకర్తల ముందు వారు జగన్‌కు జిందాబాద్‌లు కొట్టడంతో తెలుగుదేశం శ్రేణులకు చిర్రెత్తుకువచ్చింది. దీంతో వైసీపీ కార్యకర్తలతో వాగ్వివాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగి, పరస్పర దాడులు జరిగాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

శుక్రవారం మహ్మద్ ఆలీ అంత్యక్రియలు

అనారోగ్యంతో కన్నుమూసిన బాక్సింగ్ లెజెండ్ మహ్మద్ అంత్యక్రియలు వచ్చే శుక్రవారం జరుగుతాయని కుటుంబసభ్యులు ప్రకటించారు. ఆలీ స్వగ్రామం కెంటకీలోని లూయిస్‌విల్లేలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు, హాలీవుడ్ నటులు తదితరులు అంత్యక్రియలకు హాజరుకానున్నారు. ఆలీ పార్థివదేహన్ని లూయిస్‌విల్లే వీధుల్లో అంతిమయాత్ర సాగనుంది. అనంతరం సంతాపసభ నిర్వహించనున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ ఆలీ సంతాపసభలో ప్రసంగించనున్నారు. ఆయనతో పాటు ప్రముఖ కమెడియన్ బిల్లీ క్రిస్టల్, స్పోర్ట్స్ జర్నలిస్ట్ బ్రయాంట్ గంబెల్ కూడా ఆలీకి తమ సంతాపం తెలపనున్నారు.

గెట్ అవుట్ అన్నందుకు..బాస్‌ను మట్టిలో పాతేశాడు..

తనను గెట్ అవుట్ అన్నందుకు ఓ బాస్‌పై ఓ ఉద్యోగి దారుణంగా పగతీర్చుకున్నాడు. ఫ్లోరిడాలో ఓ నిర్మాణం వద్ద ఎరిక్ కాక్స్‌ అనే వ్యక్తి రోలర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆ సైట్‌లో మట్టి తీస్తూ ఉంటాడు. ఆ సమయంలో తన సూపర్‌వైజర్ వచ్చి ప్రశ్నించడంతో పాటు చేయి కూడా చేసుకోవడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. అంతే తన రోలర్‌తో గుద్దించడమే కాకుండా ఐరన్ రాడ్‌తో అతని తలపై కొట్టి స్పృహలేకుండా పడిపోయాడు. అయినా కోపం తగ్గని ఎరిక్ అతడిని నడుము వరకు మట్టిలో పాతేశాడు. దూరం నుంచి మనోడి పిచ్చి చేష్టలు చూస్తున్న ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఎరిక్స్‌ను అరెస్ట్ చేసి బాస్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే తనను కారణంగా లేకుండా దూషించాడమే కాకుండా  గెట్ అవుట్ అన్నాడని, అనంతరం చేయి చేసుకుని తల నరికేస్తానని బెదిరించాడని పోలీసులకు చెప్పాడు. ఆ సమయంలో తాను రోలర్ నడుపుతుండటంతో ప్రమాదవశాత్తూ దాని కింద పడ్డాడని అన్నాడు

అలనాటి బాలీవుడ్ నటి శులభ దేశ్‌పాండే కన్నుమూత

అలనాటి బాలీవుడ్ నాటి శులభ దేశ్‌పాండే కన్నుమూశారు. ఆమె వయసు 79 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శులభ నిన్న మరణించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె పలు మరాఠీ, హిందీ సినిమాలతో పాటు పలు సీరియళ్లలో నటించారు. హిందీలో విజయవంతమైన భూమిక, అరవింద్ దేశాయ్ కీ అజీబ్ దస్తాన్, గమన్ సినిమాలతో పాటు ఇటీవల ఇంగ్లీష్-వింగ్లీష్ సినిమాలో నటించారు. మరాఠీలో రంగస్థల సంస్థ రంగయాన్‌తో కలిసి పనిచేశారు. భర్త అరవింద్ దేశ్‌పాండే‌తో కలిసి 1971లో ఆవిష్కార్ అనే థియేటర్ గ్రూపును స్థాపించారు. శులభ మరణం పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం..17 మంది దుర్మరణం

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముంబై-పుణే జాతీయ రహదారిపై ఓ లగ్జరీ బస్సు వేగంగా వెళుతున్న బస్సు అదుపుతప్పి రెండు కార్లను ఢీకొని 20 అడుగుల లోతు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులోని 17 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా..కార్లలో ఉన్న పలువురు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్సనందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.

పాక్ తో సంబంధాలు మూసుకుపోతున్నాయి.. పారికర్

  మనోహర్ పారికర్ పాక్-భారత్ ల మధ్య చర్చల గురించి ప్రస్తావించారు. సింగపూర్లోని ఒక సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఊతం ఇస్తుందని.. ఉగ్రవాదాన్ని అంతమొందించే విషయంలో పాకిస్థాన్ చిత్తశుద్ధిపై ఇంకా సందేహాలు కొనసాగుతున్నాయని.. అందువల్ల ఆదేశంలో స్నేహ పూర్వక సంబంధాలకు భారత్ తెరిచిన తలుపులు మూసుకుపోతున్నాయని మనోహర్ పారికర్ అన్నారు. స్నేహ, సౌహార్ధ సంబంధాలకు భారత్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదని అన్నారు. మనోహర్ పారికర్ తో పాటు ఈ సదస్సులో పాల్గొన్న బీజేపీ అధికార ప్రతినిధి రాం మాధవ్ కూడా పారికర్ మాటలను సమర్ధించారు.

ట్విట్టర్, యాహూలో విలీనం..?

ట్విట్టర్, యాహూలో విలీనం కానుందా? అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ట్విట్టర్ సీఈవో, యాహూ సీఈవో ఇద్దరు ఈ విషయంపై గంటలపాటు జరిపి ఈనిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వెబ్ ఆధారిత సేవలు అందించడంలో ముందున్న యాహూనుంచి సేవలందుకునేందుకు ట్విట్టర్ ఆసక్తి చూపుతోందని సమాచారం. అంతేకాదు ప్రస్తుతం ఫేస్ బుక్ ప్రపంచ వ్యాప్తంగా దూసుకుపోతున్న నేపథ్యంలో  ట్విట్టర్, యాహూలో విలీనం కావడం రెండు సంస్థలకు లాభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి రెండు సంస్థలు ఇప్పటివరకూ ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. చట్టప్రకారం విలీనం పూర్తయ్యాక దీనిపై ప్రకటన చేస్తే మంచిదని రెండు సంస్థలు భావిస్తున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి దీనిపై రెండు సంస్థలు నోరు విప్పితే కాని అసలు విషయం తెలుస్తుంది.