నన్నూ అరెస్ట్ చేయండి.. ముద్రగడ ఆందోళన

  తుని ఘటనకు సంబంధించి పది మంది నిందితులను పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వారి అరెస్ట్ పై స్పందించిన కాపు నేత ముద్రగడ పద్మనాభం అరెస్టులకు నిరసన తెలుపుతూ అమలాపురంలో ఆందోళనకు దిగారు. అమలాపురం పోలీస్‌ స్టేషన్‌ ముందు ధర్న చేస్తూ.. తనను కూడా అరెస్ట్‌ చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు భారీ ఎత్తున కాపు నేతలు అమలాపురం చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలు మొహరించాయి. ఈ నేపథ్యంలో అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.   కాగా కాపు ఐక్య గర్జన ఉద్యమం రోజున రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలును దహనం చేసిన కేసులో పది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో రౌడి షీటర్ దూడల ఫణిని కూడా ఉన్నాడని.. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు దహనంలో దూడల ఫణి ప్రమేయం స్పష్టంగా ఉందని, మిగతా నిందితులు ఎక్కడివారో ఫణిని విచారిస్తే తెలుస్తుందని సీఐడీ వర్గాలు వెల్లడించాయి. ఇతని అరెస్టుతో కేసు దర్యాఫ్తు మరింత ముమ్మరం అవడంతోపాటు తుని ఘటన వెనుకున్న అసలు నిందితులు బయటకు వస్తారని పోలీసులు తెలిపారు.

కోదండరాంపై టీఆర్ఎస్ మూకుమ్మడి దాడి..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిపాలనపై ఉద్యమానికి రెడీ అయిన టీజేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను టీఆర్ఎస్ టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలో కోదండరాంపై టీఆర్ఎస్ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.   ప్రపంచమంతా కేసీఆర్‌ను కీర్తిస్తుంటే కోదండరాం మాత్రం తప్పుబడుతున్నారు. కోదండరాం కుబుసం వీడిచిన పాము, కాంగ్రెస్ ఏజెంట్.  -బాల్కసుమన్, ఎంపీ   తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఉనికిలోనే లేదు, మరి కోదండరాం దేనికి ఛైర్మన్. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. జేఏసీ ముసుగులో ప్రభుత్వంపై దాడి చేయాలనుకుంటున్నారు - జగదీశ్ రెడ్డి ( తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి)   మిషన్ కాకతీయ బాగుందని గతంలో చెప్పిన కోదండరాం..ఇప్పుడు బాగా లేదనడంలో అర్థమేంటి.? కోదండరాం విమర్శల వెనుక కుట్రలు, కుతంత్రాలు దాగి ఉన్నాయి -ఈటెల రాజేందర్ ( ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి)

మథుర అల్లర్లు.. సుప్రీంలో రేపు విచారణ..

  మథుర అల్లర్లలో ఎస్పీ సహా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలసిందే. గత రెండు రోజుల నుండి మథురలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దీనిపై విచారణ విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఇప్పుడు దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు రేపు విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. కాగా హింసాకాండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని దీనిపై సీబీఐ చేత విచారణ జరిపించాలని ఓ న్యాయవాది అత్యున్నత ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పిటిషన్ ను స్పీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది.

షీనా బోరా హత్యకేసు:అప్రూవర్‌గా మారనున్న డ్రైవర్

దేశవ్యాప్తంగా సంచలం సృష్టించిన షీనా బోరా హత్యకేసులో అరెస్టయిన ఇంద్రాణీ ముఖర్జీయా డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్ అప్రూవర్‌గా మారనున్నాడు. ఈ విషయాన్ని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో నిందితుల్లో ఒకరైనా షీనాబోరా డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్ తాను అప్రూవర్‌గా మారుతానని కోర్టుకు రెండు పేజీల లేఖను రాశాడు. ఈ లేఖను సీబీఐ అధికారులు న్యాయస్థానానికి అందజేశారు. అప్రూవర్‌గా మారే నిర్ణయం తనదేనని, ఎవరూ తనపై ఒత్తిళ్లు తేవడం లేదని, జరిగిన విషయం మొత్తాన్ని కోర్టుకు తెలుపుతానని తనకు క్షమాభిక్ష పెట్టాలని లేఖలో కోరాడు.

పగ తీర్చుకున్న చైనా... ట్రంప్ పేరుతో టాయిలెట్ పేపర్లు

  అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కామనే. అమెరికన్ల ఉద్యోగాలను ఇండియా, చైనీయులు లాక్కుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మొదట ట్రంప్ వ్యాఖ్యలను పొగడ్తలుగా తీసుకున్న చైనా ఇప్పుడు ఆయనపై పగ తీర్చుకున్నట్టు కనిపిస్తోంది. ఏకంగా ఆయన పేరుతో టాయిలెట్ పేపర్ ను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేసింది.  'డంప్ విత్ ట్రంప్' అన్న స్లోగన్ తో చైనా తయారీ సంస్థలు టాయిలెట్ పేపర్ ను తయారు చేసి అమెరికా మార్కెట్లో అమ్మకానికి ఉంచగా, ప్రజలు వేలంవెర్రిగా కొనుక్కుపోతున్నారని చైనా ప్రభుత్వ అధీనంలోని క్సిన్హువా న్యూస్ ఏజన్సీ తెలిపింది. అంతేకాదు 5000 రోల్స్ తో కూడిన ఆర్డర్లు తమకు 50కి పైగా వచ్చాయని, వీటిల్లో అత్యధికం అమెరికా నుంచి వచ్చాయని తెలిపారు. మరి ఈ వార్త ట్రంప్ కు తెలిసిందో లేదో.. తెలిస్తే ఎలా స్పందించాడో చూడాలి.

గుల్బర్గ్ సొసైటీ కేసు తీర్పు జూన్ 9న..

2002 గుల్బర్గ్ సొసైటీ మారణహోమం కేసులో 24 మంది దోషులకు శిక్ష ఖరారుపై విచారణను ప్రత్యేక సిట్ న్యాయస్థానం జూన్ 9కి వాయిదా వేసింది. ఈ నెల 2న ఈ కేసుకు సంబంధించి 66 మంది నిందితుల్లో 24 మందిని దోషులుగా..మిగిలిన 36 మందిని నిర్దోషులుగా తేల్చింది ప్రత్యేక కోర్టు. మిగిలిన నిందితుల్లో ఐదుగురు మరణించగా ఒకరి ఆచూకీ లేకుండా పోయింది. వీరందరికి శిక్షలను 6వ తేది ప్రకటిస్తామని న్యాయస్థానం వెల్లడించింది. దోషుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని, మరణదండన కాకుండా యావజ్జీవ శిక్ష వేయాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అభ్యర్ధించడంతో తీర్పును జూన్ 9కి వాయిదా వేసింది.

గుండెపోటుతో కలెక్టర్ కన్నుమూత..

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లా కలెక్టర్ అక్షత్ గుప్తా గుండెపోటుతో కన్నుమూశారు. నోయిడాలోని ఓ మాల్‌లో నిన్న ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడి నుంచి ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. 39 సంవత్సరాల అక్షత్ గుప్తా 2006 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన తల్లిదండ్రులు నోయిడాలోనే ఉంటారు. అక్షత్ భార్య రిధిమ్ అగర్వాల్ రుద్రాపూర్‌లో ప్రొవిన్షియల్ ఆర్మ్‌డ్ కాన్‌స్టేబులరీ 31వ బెటాలియన్ కమాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన మరణం పట్ల ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్, గవర్నర్ కెకె పాల్ తదితరులు సంతాపం తెలిపారు.

అమరావతి లగ్జరీ బస్సులు.. సీటుకో టీవీ.. దానికో రిమోట్

  సాధారణంగా దూర ప్రయాణాలు చేసే బస్సులో ప్రయాణికులకు బోర్ కొట్టకుండా ఉండటానికి ఓ టీవీ ఏర్పాటు చేసి ఉంటుంది. కానీ అది డ్రైవర్ ఆధీనంలోనో.. కండక్టర్ ఆధీనంలోనో ఉంటుంది. కానీ ఇప్పుడు ఏపీఎస్ ఆర్టీసీ మరో సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఉచిత వైఫై అందుబాటులోకి తెచ్చిన ఆర్టీసీ ఇప్పుడు సీటుకో టీవీ... దానికో రిమోట్ సౌకర్యం కల్పిస్తూ అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునిక లగ్జరీ బస్సులైన అమరావతి బస్సుల్లో ఈ సౌకర్యాన్ని ఏర్పాటుచేశారు అధికారులు. ప్రతి సీటు వెనకాల టీవీ ఏర్పాటు చేసి మనకు నచ్చిన ఛానెల్‌ చూసేందుకు రిమోట్‌ కూడా ఇస్తున్నారు. ఈ సౌకర్యాన్ని 80 అమరావతి బస్సుల్లో సోమవారం నుంచి అందుబాటులోకి తెచ్చారు. దీనిని విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఇది రవాణా రంగంలో సరికొత్త ప్రయోగమని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు   అంతేకాదు ఇంకా చంద్రబాబునాయుడు దేశంలోనే తొలిసారిగా విజయవాడ నెహ్రూ బస్టాండ్‌లో మ‌ల్టీ ఫ్లెక్స్‌ థియేటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన టికెట్‌ కొనుగోలు చేసి కొద్దిసేపు సినిమా చూశారు. ప్రయాణికులకు వినోదం పంచే ఉద్దేశ్యంతో బస్టాండ్‌లో సినిమా థియేటర్లను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు.

ఎట్టకేలకు దిగొచ్చిన ఆర్ట్ ఆఫ్ లివింగ్.. జరిమానా మొత్తం చెల్లింపు

  ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఎట్టకేలకు తమపై విధించిన జరిమానా చెల్లించింది. ఆర్ట్ అఫ్ లివింగ్ ఆధ్వర్యంలో యమునా నదీ తీరాన ఉత్సవాలు నిర్వహిస్తుందన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది కూడా మార్చిలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించింది. కానీ ఈ ఉత్సవాల వల్ల అక్కడి  ప‌రిస‌రాలు కాలుష్యం అవుతున్నాయని గ్రీన్ ట్రైబ్యున‌ల్ పైన 5కోట్ల జరిమానా విధించింది. అయితే మొదట కట్టడానికి నిరాకరించిన సంస్థ ఆ తరువాత కట్టడానికి అంగీకరించింది. రూ.25 లక్షల పరిహారం చెల్లించి, మిగ‌తా జ‌రిమానాను త‌రువాత చెల్లిస్తామ‌ని.. అయితే, ఆ త‌రువాత మాట మార్చేసి జ‌రిమానాను ఎగ్గొట్ట‌డానికి కోర్టుల చుట్టూ తిరిగింది. కానీ గ్రీన్ ట్రైబ్యునల్ గట్టిగా హెచ్చరించడంతో పూర్తి జ‌రిమానాను చెల్లించింది.

తుని ఘటన.. 10 మంది అరెస్ట్.. రౌడీషీటర్ దూడల ఫణి కూడా

కాపు నేత ముద్రగడ పద్మనాభం కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తునిలో కాపు ఐక్య గర్జన ఉద్యమం చేపట్టిన సంగతి తెలసిందే. అయితే ఆయన చేపట్టిన ఉద్యమంలో హింసాత్మక ఘటనలు చెలరేగిన సంగతి కూడా విదితమే. ఆ రోజు కొందరు రైలుకు నిప్పటించి ఘర్షణలు రేపారు. అయితే ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి విధ్వంసానికి సంబంధించిన పలు వీడియోలను పరిశీలించిన అనంతరం, 10 మంది నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. వీరిలో రౌడీషీటర్ దూడల ఫణిని నేడు అదుపులోకి తీసుకున్నారు. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు దహనంలో దూడల ఫణి ప్రమేయం స్పష్టంగా ఉందని, మిగతా నిందితులు ఎక్కడివారో ఫణిని విచారిస్తే తెలుస్తుందని సీఐడీ వర్గాలు వెల్లడించాయి. ఇతని అరెస్టుతో కేసు దర్యాఫ్తు మరింత ముమ్మరం అవడంతోపాటు తుని ఘటన వెనుకున్న అసలు నిందితులు బయటకు వస్తారని పోలీసులు తెలిపారు. త్వరలోనే మరికొంత మంది నిందుతులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

నా అనుభవం అంత లేదు జగన్ వయసు.. అదే సమస్య..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు చంద్రబాబు స్పందించి ఆయనపై మండిపడ్డారు. అమరావతిలో జరుగుతన్న తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించడానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ.. ‘‘సీఎం పదవిలో ఉన్న వ్యక్తికే జగన్ సవాల్ విసురుతాడా? తన రాజకీయానుభవంలో ఎంతో మంది నేతలను చూశాను.. వైఎస్ లాంటి వాళ్లను చూశాను.. కానీ జగన్ లాంటి వాళ్లను చూడలేదు..  కాని జగన్ కారణంగా ఎదురవుతున్న సమస్యలు నాకు ఎప్పుడు ఎదురు కాలేదు’’ అని చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా అనుభవం అంత లేదు జగన్ వయసు.. అదే పెద్ద సమస్యగా మారింది అని అన్నారు.

ఆధార్ కార్డ్ తో దొంగ మొగుడి గుట్టు రట్టు..

  ఏదైనా ఫ్రూఫ్ కావాలంటే ఈమధ్య ఆధార్ కార్డ్ తప్పని సరైపోయింది. అయితే ఈ ఆధార్ కార్డ్ వల్లే ఓ దొంగ మొగుడి వ్యవహారం బయటపడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా, ములకలచెరువుకు చెందిన ఓ యువతి రేషన్ కోసం వెళ్లగా ఆమెకు ఐదు కిలోల బియ్యం తగ్గాయి. అయితే కార్డులో తన భర్త పేరు కనిపించకపోవడంతో.. పేరుంటేనే బియ్యం ఇస్తానని డీలర్ చెప్పాడు. దీంతో భర్త ఆధార్ నంబరును ఆన్ లైన్లో చూడగా అసలు నిజం తెలిసింది. అతను ఇంకో యువతి పేరిట ఉన్న రేషన్ కార్డులో నమోదైనట్టు తెలిసింది. ఒకే ఆధార్ సంఖ్య రెండు రేషన్ కార్డుల్లో ఉండకూడదు కాబట్టి మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. డబ్బు సంపాదన కోసం బెంగళూరు వెళ్తానని చెబుతూ, రెండో పెళ్లి చేసుకున్నాడని ఆ యువతి బావురుమంది.

భారత్ పై దాడికి పాకిస్తాన్‌ సిద్ధంగా ఉంది..

  26/11 ముంబై దాడుల సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దవా అధినేత హఫీజ్‌ సయీద్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ పై భారత్ పాకిస్తాన్‌పై భారత్‌ శత్రుత్వ ధోరణి కనబరిచి దూకుడుగా వ్యవహరించినా, తక్షణమే తిరిగి దాడి చేయడానికి పాకిస్తాన్‌ సిద్ధంగా ఉందని.. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా భారత్‌ భూభాగంనుంచి ఎలాంటి డ్రోన్‌ దాడి జరిగినా, మొత్తం భారత్‌ను తుడిచివేసేందుకు అవసరమైన డ్రోన్‌లు తమ వద్ద ఉన్నాయని సయీద్‌ హెచ్చరించాడు. ఈ ఏడాది ఆరంభంలో భారత్‌ వ్యతిరేక ప్రణాళికలను అమలుపర్చడానికి అవసరమైన నియామకాలు చేపట్టాడు. సయీద్‌కు పాకిస్తాన్‌ ఆర్మీ, ఐఎస్‌ఐల ప్రోద్బలం ఉంది. మరి ఈ వ్యాఖ్యలపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఢిల్లీలో దారుణం... తల్లీ, ఇద్దరు కూతుళ్ల గొంతు కోసి హత్య

  ఢిల్లీలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి, ఇద్దరు కూతుళ్లను దారుణంగా పొడిచి చంపేసిన ఘటన కలకలం రేపింది. వివరాల ప్రకారం..ఢిల్లీలోని బ్రహ్మపుర ప్రాంతంలో 50 ఏళ్ల సైరా అనే మహిళ, ఆమె కూతుళ్లు మెహరున్నీసా(19), షబ్నం (9) ముగ్గురు ఉంటున్నారు. అయితే తాళం వేసి ఉన్న వారి ఇంటి నుండి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళం పగలగొట్టి చూడగా ముగ్గురూ ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉండడం గమనించారు. దుండగులు వారి గొంతును దారుణంగా కోసేసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాదు దుండగులు మూడు రోజుల క్రితమే వీరిని హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సుబ్రహ్మణ్యస్వామి నా హీరో.. ఉమాభారతి ఆసక్తికర వ్యాఖ్య

  సుబ్రహ్మణ్యస్వామి నా హీరో.. ఈ మాటలు ఎవరన్నారనుకుంటున్నారా.. బీజేపీ సీనియర్ నేత. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి స్వయంగా చేసిన వ్యాఖ్యలు. కాంగ్రెస్ పార్టీపై తమ ప్రతాపం చూపించే  బీజేపీ కీలక నేత సుబ్రహ్మణ్యస్వామి.. ఇటీవలే రాజ్యసభ అభ్యర్ధిగా సభలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. పైవిధంగా వ్యాఖ్యనించారు. సుబ్రహ్మణ్యస్వామి నా హీరో.. అందుకే ఆయన ఏం చెబితే దానిని నేను విశ్వసిస్తాను అని ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. ఇంకా ఆయోధ్యలో రామమందిర నిర్మాణం గురించి మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరికల్లా అయోధ్య నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్న ఆయన మాటలను నమ్ముతున్నాను.. దశాబ్దాలుగా పరిష్కారం కాకుండా ఉన్న ఈ వివాదం చర్చల ద్వారానే పరిష్కారం అవుతుంది.. అయోధ్యలో అత్యద్భుత రామాలయాన్ని నిర్మిస్తాం’’ అని ఉమా భారతి పేర్కొన్నారు.